తియ్యతియ్యని "తేనెతొనలు"



రెండ్రోజుల క్రితం, పొద్దున పొద్దున్నే అమ్మ ఫోను.."చిన్నీ! ఎల్లుండి నాన్నొస్తున్నారు నీ దగ్గరకి. ఏం పంపమంటావ్?" అని.
నేను,"ఏముంది మామూలుగానే కూరలు, పెరుగు పంపు"అన్నా...
దానికి అమ్మ,"మొన్న చిన్నత్త నేతరిసెలు పంపింది. ఓ పాతిక దాకా ఉన్నాయి.చక్కలు కూడా చేశా.అవి పంపుతున్నా...ఇంకా ఏమన్నా కావాలా?బూంది మిఠాయికాని,రవ్వలడ్డుకాని......".....
అంతే! నా గొంతు హైపిచ్ లోకెళ్ళిపోయింది..:)......"ఎప్పుడూ చక్కలు,కారప్పూస,రవ్వలడ్డు....విసుకొస్తోందమ్మా! ఏవఁన్నా కొత్తరకం పంపరాదూ..."అన్నా..
అమ్మ అంతకంటే హైలోకెళ్ళిపోయి,"నాకవే వచ్చు.తింటే తిను.లేకపోతే మానుకో" అనేసింది......
ఇంకేముంది? మనం కాళ్ళబేఱానికి...:)....."అమ్మా! ఓ కొత్త వంటకం ఉంది. "
తేనెతొనలు" అని. నాకు తినాలనుంది.చెయ్యవాఆఆఅ.....ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అన్నా..
అమ్మ ఒక్కమెట్టుదిగి,"నాకలాంటివి చెప్పకు.నాకు కుదరవు.అయినా కొత్త కొత్త రకాలు ఎక్కడో చదువుతావు,నా ప్రాణం తీస్తావు." అంది.

అమ్మకొంచెం చల్లపడిందిగా, ఇక మనం అల్లుకుపోయాం...."అమ్మా! ఇది
కొత్తరకం కాదే! "హంసవింశతి" కావ్యంలో "ఇడ్డెనలు తేనెతొనలు బుడుకులు నేలకికాయలు" అని చెప్పాడు....అంటే ఎంతో పాతవి, ప్రాచీనమైనవి అన్నమాట! ఎలా చెయ్యాలో నే చెప్తా, అలా ఫాలో అయిపోయి చేసెయ్యి..అవిల్రెడీ నేనొకసారి చేసి సూపర్ హిట్టు కొట్టా కూడా....ఇప్పుడు చేసుకున్నే ఓపికలేక అడుగుతున్నా..ప్లీజ్...".

ఇంకేముంది, అమ్మ పూర్తిగా ఐసయిపోయి,"సరే చెప్పు...మళ్ళా బాగా రాకపోతే నన్ను వేళాకోళమాడగూడదు మరి మీరిద్దరూ కలిసి...".

"వాకే" అనేసి, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పా... కాని దానికి అమ్మ కొంత సొంత తెలివి జోడించింది...ఫలితం, పైన ఫొటొలా ఒక షేపూ,పాడూ లేకుండా వచ్చాయి, నా దగ్గరకొచ్చేపాటికి...బాగా మెత్తగాఉండి ట్రాన్సుపోర్టులో విరిగిపోయాయి...:(.......కాని టేస్టు మాత్రం తేడా రాలేదులే.....:)....

అసలు నాకు "
తేనె" అన్న మాట వింటేనే నోరంతా తియ్యగా అయిద్ది..చిన్నప్పట్నుంచీ, పిచ్చిపిచ్చి కంపెనీ తేనెలు కాకుండా మంచి కొండతేనె, పుట్టతేనె అలవాటయ్యి ఉండటం మూలాన్నేమో!

అసలు తేనె అంటేనే నాకు మొదట గుర్తొచ్చేది, మా భజనలో
ఆరగింపు పాట.. మా ఊరిగుళ్ళో రాత్రి పూట భజన చివర్లో నైవేద్యం పెడుతూ, రాములవారి ఆరగింపు పాట పాడేవాళ్ళు..." ఆరగింపు చేసేమయ్యా! మీరారగించండి రామయ్యా" అని...ఆ పాటలో రకరకాల నైవేద్యాలు చెప్తూ మధ్యలో, "తేనెతో మాగినా తియ్య మామిడి పళ్ళ రసమూ" అని వస్తుంది....అదివిని రాములవారికి,ఆయన పరివారానికి ఏమోగాని నాకు మాత్రం తెగ నోరూరిపోయేది...:)...ఇక మామిడిపళ్ళ సీజను రాగానే మా తోటలోంచి మంచి రసాలు కోసుకొచ్చి అమ్మని చావగొట్టేసేవాణ్ణి," ఇప్పుడివి తేనెలో మాగపెట్టి రసం తీసి ఇస్తావా, లేదా" అని..అమ్మ మాడు మీద ఒక్కటి పీకి "నోరుమూసుకో" అనేది....నా ఆ కోరిక ఇప్పటికీ తీరకుండా అలానే ఉండిపోయింది..ప్చ్..ఏం చేస్తాం...

ఇక మన "తేనెతొనల" దగ్గరికొస్తే పేరుకు తగ్గట్టు "మధురం"గా ఉంటై....చెయ్యటం చాలా వీజీ....నేను మొదట చదివి ప్రయోగం చేసినట్టే చెప్తున్నా..మీకు ఇంకా ఏవన్నా కొత్త ఉపాయాలు తడితే, అలాకూడా ప్రయత్నించండి...

  • మొదట కావల్సిన పదార్థం గోధుమపిండి....ఆటా కాని, మైదాకాని ఏదైనా వాడుకోవచ్చు...దేని రుచి దానిదే....మైదాతో ఐతే కాస్త మెత్తగా వస్తాయి.....వరిపిండి కూడా వాడుకోవచ్చు...కాని వేయించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి....ఈ పిండిని బాగా జల్లించుకోవాలి, బరకలేకుండా....
  • ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బెల్లం వేసి తొక్కాలి....తీపి ఎక్కువ తిందామనుకునేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు.....కాని మొదట చేసేప్పుడు, రెండూ తక్కువ మోతాదులోనే ప్రయత్నించండి...ఒక వందగ్రాముల పిండి, యాభై గ్రాముల బెల్లం అలా....తర్వాత కావాలనుకుంటే పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చు.
  • ఇలా తొక్కినపిండిలో కాస్తంత నెయ్యి, సరిపడా నీళ్ళూ వేసి చపాతీ పిండిలా బాగా కలపండి....బాగా మర్దించాలి....ఇక్కడ నెయ్యి ఎక్కువ వెయ్యొద్దు...వేస్తే వేయించటానికి కుదరదు...
  • ఇక ఈ పిండిని, చిన్న నిమ్మ లేదా కమలా తొనల ఆకారంలో అంటే నెలవంక చంద్రుళ్ళా బిళ్ళలుగా తయారు చేసుకోవాలి...ఎలా చెయ్యాలనేది మీ ఇష్టమండీ! చేత్తో అయినా, అచ్చుతో అయినా......తొనల ఆకారమే కాదండీ, అంత మందంగా కూడా వత్తుకోవాలి....
  • ఇలా వత్తుకున్న బిళ్ళల్ని నేతిలో గాని, మంచి నూనెలోగాని వేయించుకోవాలి......(పిండి లో ఎక్కువ నెయ్యి వేసి కలిపేట్టైతే వేయించొద్దు..ఓవెన్ లో గాని, కేకు చేసే గిన్నెలో గాని బేక్ చేసుకోవచ్చు..).
  • ఇక ఈ తొనల్ని మంచి తేనె ,మునిగేట్టుగా పోసి ఊరించటమే! ఒక రోజు పాటు ఊరనివ్వాలి......
  • అంతే! నోరూరించే "తేనెతొనలు" తయార్.ఇట్టా నోట్టో వేసుకుంటే అట్టా కరిగిపోతాయ్...
  • పిల్లలకి ఇంతకన్నా మంచి తినుబండారాలు ఏముంటాయి చెప్పండి....డయాబెటిక్స్ బెల్లం వెయ్యకుండా వట్టి తేనేతో తడుపుకుని తినొచ్చు.(మితంగా)....:)

తు.చ. :-
రెసిపీ: ఓ పాత పుస్తకంలో చదివిన దానికి నా మాడిఫికేషన్...
శ్రమ పడి చేసినవారు: శ్రీమతి సుగాత్రీ నరసింహారావు గారు....అదేనండీ మా అమ్మగారు..:).
అవిడియా, పుటో, టపా మాత్రం నావేనండీ...:)

2 కామెంట్‌లు:

రవిచంద్ర చెప్పారు...

మా అమ్మ రోజూ దేవుడికి ప్రసాదం సమర్పించేటపుడు ఇలా పాడుతుంటుంది.... ఈ టపా చూడగానే అది గుర్తొచ్చింది.

"ఆరగింపూ చేసేమయ్యా... శ్రీ వేంకటేశ్వరా చేకొనుమయ్యా..
పానకము వడ పప్పు కొబ్బరి పాలు మీగడ పంచదారయు, తేనెతో మాగిన అరటి, తీయ మామిడి పండ్ల రసమూ"

Ennela చెప్పారు...

// శ్రీమతి సుగాత్రీ నరసింహారావు గారు....అదేనండీ మా అమ్మగారు..:)//....బంగారు తల్లి....
మీరు వెరీ బ్యాడ్ బోయ్ ..అంత చక్కగా చేసి పంపితే ఇంకా వంకలు కూడానా? హన్నా!

Blogger ఆధారితం.