కోరి భుజింతును, 'కొత్తిమీర పచ్చడి'



టైటిల్ చూడగానే అర్థమైపోయుండాలి మీకు, మనకి కొత్తిమీర పచ్చడంటే ఎంతిష్టమో!...:)....ఇది అందరూ దోశల్లోకో, అన్నంలోకో అప్పటికప్పుడు చేసుకున్నే బండపచ్చడి కాదండోయ్! చక్కటి "కుండపచ్చడి ", అదేనండీ ఊరగాయ..ఊరుగాయ..మీ ఇళ్ళల్లో ఎలా పిలుచుకుంటే అది.....

అసలు నాకు మట్టుక్కు నాకనిపించేదేంటంటే, ఎవరికన్నా "వంట చెయ్యటం బాగా వచ్చు" అన్న సర్టిఫికెట్టు ఇవ్వాలంటే వాళ్ళు అద్భుతంగా ఊరగాయలు పెట్టగలగాలి, అదీ రకరకాలుగా.....{మా అమ్మగారైతే పచ్చళ్ళ సీజనొస్తే ఓ ఇరవై, ముప్ఫై రకాలు పెట్టేస్తారు.(అలా అని పెద్ద వంటొచ్చని కాదులెండి, అన్నీ ఆమ్మ దగ్గరకెళ్ళి పెట్టుకొస్తుంది...:)...).....}ఊరికే పెట్టటం కాదండీ, పెట్టిన పచ్చడి సంవత్సరం తిరిగొచ్చినా పాడవకూడదు, రుచి అస్సలు మాఱకూడదు....

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా పెద్దమ్మ పచ్చళ్ళు అద్భుతంగా పెడుతుంది..ఇప్పటికీ మా పది ఫ్యామిలీలకీ పెద్దమ్మే ఆవకాయ,మాగాయ పెడుతుంది...అంత పచ్చడీ ఒక్కతే పెడుతుంది.....ఆవాలు పదికొట్లు తిఱిగి మరీ సెలెక్ట్ చేస్తుంది....కనీసం ముక్కలు కొయ్యడానిక్కూడా ఎవర్నీ గదిలోకి రానివ్వదు......అయితే పోయినేడు నేనేదో అన్నానని మా అక్కలందరికీ ఆవేశమొచ్చి," ఆ పాటి ఆవకాయ మేం పెట్టలేమా" అని అందరూ కలిసి పెట్టారు....చూస్తే పది రోజులకే ముక్క మెత్తబడింది, పచ్చడి రంగుమారింది......:)....అదన్నమాట సంగతి.

ఇక మనం వెరైటీ ప్రియులం కదా! మామూలు ఆవకాయ,మాగాయలు; కొరివికారం,టమాటా పచ్చళ్ళు ఎంతగా ఇష్టమున్నా....బాగా ఇష్టమైనవి కొత్తిమీర పచ్చడి, పులిహోర గోంగూర, సొరకాయ ఊరగాయ, వంకాయ ఊరగాయ......మొదటి రెండూ అద్భుతమైన రుచి..వాటి దుంపతెగ ఎంత బాగుంటాయో వేడివేడన్నంలో కలుపుకుతింటే....నెయ్యికూడా అవసరంలేదు.......

మొన్న నాన్నొచ్చేప్పుడు తిందామనిపించి అమ్మని అడిగా," అమ్మా! తేనెతొనల్తో పాటు కొత్తిమీర పచ్చడి కాస్త పెట్టి పంపు" అని....
అమ్మ"నావల్లకాదు ఫో! ఈ యేడు పొలంలో కొత్తిమీర వెయ్యలా...ఇంటి ముందు వేసిన నాలుగాకులూ తుంచితే మాకు కూరల్లోకి చాలవు..
నాకు కొని పెట్టాలంటే ప్రాణమొప్పదు....అయినా ఆ పచ్చడి పెట్టానంటే నాన్న నాలుగురోజుల్లో ఖాళీ చేస్తారు.(నాన్నకి బీపీ ఉందిలెండి)...." అంది...

నాకావేశమొచ్చి," నువ్వు పంపకపోతే నే పెట్టుకోలేనా! నేనే పెట్టుకుంటా ఒక కట్ట కొత్తిమీర కొనుక్కొచ్చుకుని" అన్నా....

అమ్మ,"ఎలా పెట్టాలో నేను చెప్పనుగా! ఎలా పెడతావ్..." అని ఉడికించింది.....

మనమేమన్నా తక్కువతిన్నామా, తగ్గే ప్రశ్నేలేదుగా..." అయినా ఆ పచ్చడేంటో నువ్వే కనిపెట్టినట్టు బడాయి..ఆమ్మ దగ్గర నేర్చుకుందేగా....నేను ఆమ్మతోనే చెప్పించుకుంటా..." అని, వెంటనే ఆమ్మకి ఫోను కొట్టి అడిగా...ఆమ్మ ఓపిగ్గా అంతా చెప్పింది...కాని కొలతలన్నీ గిద్ద, అరసోల, శేరు లెక్కల్లో చెప్పింది.....:(

" ఆమ్మా! నా దగ్గర గిద్దలు,అరసోలలు లేవే!" అంటే," చిన్నబ్బాయ్! నాకు ఆ గ్రాముల లెక్కలు తెలీవబ్బాయ్" అంది.....సర్లే నా తిప్పలేవో నే పడతాలే అని ఫోను పెట్టేసి సరంజామా అంతా కూర్చుకుని పచ్చడి పెట్టేశా,మా పక్కింటోళ్ళ చిన్న రోలు అరువుకు తెచ్చుకు మరీ.....:)..అద్భుతంగా వచ్చిందిలెండి....ఇవ్వాళ కాస్త డ్రైగా అనిపిస్తే కాస్త ఇంగువనూనె కాచిపోసి మరీ పుటో తీసిపెట్టా ఇక్కడ...:).....

మరి మా పెద్దమ్మ చెప్పిన విధానం మీకూ చెప్పనా....

  • ఇవ్వాళ మొదట కొలతలు చెప్పేస్తా,ఎందుకంటే పచ్చళ్ళు నిలవుండాలంటే కొలతలే బహు ఇంపార్టెంటు కదా మరి!...ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఓ వంద గ్రాములు చింతపండు, గిద్దెడు ఉప్పు, గిద్దెడు కారం... ;)...సారీ వందగ్రాములకన్నా కాస్త ఎక్కువ.....:).. , ఓ రెండుస్పూనులు ఆవపిండి,రెండు స్పూనులు మెంతి పిండి, సరిపడా నూనె, తిరగమాత సామాన్లు.....ఇవండీ! రెడీ చేసుకున్నారా! ఇక మొదలెట్టేద్దాం..భలే సింపులులే....:)
  • కొతిమీర బాగా ఆకు పెద్దగా ఉన్న కట్టలు చూసి తెచ్చుకోండి....బాగా కడిగి వేర్ల భాగం వరికి కోసి పక్కన పడెయ్యండి.....మిగతా కట్టని మోయనమైన సైజులో తరగండి...మరీ చిన్నగా తరగొద్దు..పచ్చడిలో ఆకులుగా తగులుతుంటేనే బాగుంటుంది.....ఆకులు విడిగా పీకొద్దు..అలా కట్ట,కట్ట తరిగెయ్యండి...
  • ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టేసి, కాస్తంత నూనేసి, ఈ తరిగిన కొత్తిమీరని వేయించండి...ఆకు బాగా దగ్గరకయ్యి, ముద్దలా అవ్వగానే దించెయ్యండి.
  • ముందు తీసి పెట్టుకున్న చింతపండుని విత్తనాలు, పీచులు ఉంటే ఏరేసి, ఓ గిన్నెలో తీసుకుని, మరికాసిన్ని నీళ్ళుపోసి పొయ్యి మీద పెట్టెయ్యండి......బాగా కుతకుతా ఉడకనివ్వండి.బాగా ఉడికింతర్వాత దించి పులుసు పిసికెయ్యండి.పిప్పి వస్తే తీసి పడెయ్యండి..(బాగా ఉడికేసరికి నాకు పిప్పి అసలు రాలా...:) అలానే వేసి రోట్లో, తొక్కేశా..కలిసిపోయింది...)...ముందు పులుసు పిసికి దాన్నైనా ఉడికించొచ్చు.....
  • ఇప్పుడు పైన వేయించిపెట్టుకున్న కొత్తిమీరని రోట్లో వేసి ఈ పులుసుపోసి కలిపి రుబ్బండి....రుబ్బేప్పుడు మధ్యలో పైన రెడీగా పెట్టుకున్న ఉప్పు, కారం పోసి రుబ్బెయ్యటమే...చివర్లో ఆవపిండి, మెంతిపిండి వేసి కాసేపు తిప్పటమే.ఈ రెండూ రుచికోసమన్నమాట...రోళ్ళు లేకపోతే మిక్సీలో అన్నీ వేసి ఒక తిప్పు తిప్పడమే....మరీ లేహ్యంలా వద్దు...కాస్త ఆకులుగా ఉంటేనే తింటానికి బావుంటుంది....
  • ఉప్పు కల్లుప్పైతే మంచి రుచొస్తుంది, నిలవుంటుంది కూడా...రోళ్ళు లేకుండా మిక్సీల్లో రుబ్బాలనుకున్నే వాళ్ళు ఈ ఉప్పుని ముందే మెత్తగా మిక్సీ పట్టుకునుంటే మంచిది.....కారం మంచి ఎర్రగా ఉండే పచ్చడికారం సెలక్ట్ చేసుకోండి....మా గుంటూరు కారమైతే బెస్టు...:)
  • ఇక ఈ రుబ్బిన దాన్ని తాలింపెట్టుకోటమే.....నూనె మామూలు తాలింపులంత వేస్తే పచ్చడి నిలవుండదు.కాస్త ఎక్కువే వేసుకోవాలి..... పచ్చడికి పట్టేంత నూనె బాండీలో వేసి కాగిందనిపించగానే తాలింపుగింజలేస్కోవాలి,నాలుగు వెల్లుల్లి రెబ్బలు నొక్కి వెయ్యాలి...మరికాస్త ఇంగువ....ఈ తాలింపుని దించి కొంచెం వేడి తగ్గాక పైన రుబ్బి పెట్టుకున్న పచ్చట్లో కలుపుకోవాలి.....
  • మరికాస్త ఇంగువేసి పోపెడితే పచ్చడి ఎంత కమ్మటి వాసనొచ్చిద్దో.....
  • పచ్చడి బాగా చల్లారాక జాడీలోకో, సీసాలోకో ఎత్తి పెట్టుకోవాలి..గాలి ఎక్కువగా తగలకుండా జాడీకైతే వాసెన కట్టండి,..సీసాకైతే గట్టిగా మూతపెట్టండి...
  • అన్నిటికంటే గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన జాగ్రత్త,(ఇది ఏ ఊరగాయకైనా ఇంపార్టెంటే)....తడి అస్సలు తగలనివ్వద్దు....తడి చేతులు, తడిగా ఉన్న సీసాలు తగిలితే రెండ్రోజులు కూడా నిలవుండదు ఈ పచ్చడి....
  • ఇలా పెట్టుకున్న పచ్చడి ప్రిజ్ లో పెట్టకపోయినా రెండు,మూణ్ణెల్లు నిలవుంటుంది......
అదండీ! చాలా ఈజీగా ఉందికదా! ఇంకెందుకాలస్యం అర్జెంటుగా పెట్టెయ్యండి....రోజూ రెండో కూర ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించాల్సిన పనుండదు....
రుచ్చూశాక నాకు చెప్పటం మర్చిపోకండేఁ............. :)

25 కామెంట్‌లు:

Krishna K చెప్పారు...

పెద్దమ్మ బదులు ఆమ్మ అలాగే గిద్ద, సోల, శేరు మాటలు విని ఎన్ని రోజులయ్యిందో, ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చారు.

పచ్చడి ఎలా ఉన్నా, పచ్చడి పెడతానికి ముందు వ్రాసిన స్టోరీ మాత్రం బాగుంది.

నాగేస్రావ్ చెప్పారు...

చాలా తేలిగ్గా ఉంది. చేసిచూసి మళ్ళీ రాస్తాను.
మరి "మోయనమైన సైజు" అంటే ఏవిటో?

Ennela చెప్పారు...

తృష్ణ గారు యూ ఆర్ వాంటెడ్ హియర్...
ఊరగాయలు పెట్టడమొచ్చిన అబ్బాయిల గురించి ఒక టపా ఆర్డరులో ఉందండీ...ఆలసించిన ఆశా భంగము..రండి టపా వ్రాసేయండీ....
అజ్జజ్జజ్జా...కౌటిల్య గారూ ,మీరు ఇలా ఊరగాయలతో సహా నేర్చేసుకుంటే ఎలా అండీ...!!!

కృష్ణప్రియ చెప్పారు...

:) ఇప్పుడే లాప్ టాప్ మూసి ఇంటికెళ్ళి తయారు చేసి తినాలనుంది..

అజ్ఞాత చెప్పారు...

కౌటిల్య గారు బాగుంది మీ కొత్తిమీర పచ్చడి
నేను ట్రై చెసి ఎలా ఉందో చెప్తా :)


నాగేస్రావ్ గారు

మోయనం గా అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం గా అని

కౌటిల్య చెప్పారు...

కృష్ణ గారు,
మా ఇళ్ళల్లో ఇవే కొలతలండీ ఇంకా! స్పెషల్ గా దేనికవి ఇనపవి ఉంటాయి...ః)...నా టపా నచ్చినందుకు మంగిడీలు..ః)

నాగేస్రావ్ గారూ!
చేశాక చెప్పండి, మీ కామెంటు కోసం ఎదురు చూస్తుంటా...

ఇకపోతే మోయనంగా అంటే, పైన "ఆహ్లాద" గారు చెప్పినట్టు మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా అన్నమాట!..ఓ అంగుళం,అంగుళఁన్నర అనుకోవచ్చు...ః)

కౌటిల్య చెప్పారు...

ఎన్నెల గారూ!
ఏంటండీ! ఆహాఁ ఏంటీ అంట! ఏం అబ్బాయిలు ఊరగాయలు పెట్టటం నేర్చుకోకూడదా..ఆయ్..
ఈ స్త్రీ జాత్యహంకారధోరణిని నేను నిరసిస్తున్నాను,ఖండిస్తున్నాను,వగైరా వగైరా.....ః)

రాయమని చెప్పండి తృష్ణ గారిని....తృష్ణ గారూ! రాయండి..అక్కడ మీ బ్లాగులో తేల్చుకుందాం.....:D..:)..;)

కృష్ణప్రియ గారూ,
మరీ అంతలా ఊరించానా! అఫ్ కోర్సు నా బ్లాగు ముఖ్య ఉద్దేశమే అదనుకోండి...మీకు నోరూరిపోయి, ఆపుకోలేక ఇంటికెళ్ళి చేసుకు తిని తెలుగురుచుల్ని ఎంజాయ్ చెయ్యాలన్నమాట!...ః)

ఆహ్లాద గారూ!
చేసి చెప్పండి మరి ఎలా వచ్చిందో!..ః)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అయ్యా మీ అడ్రెస్ చెపుతారా. అటువచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చేస్తాం భోజనానికి.

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

బాబూ కౌటిల్యా! నా కళ్ళలో ఆనందభాష్పాలు! నలుడూ, పురూరవుడూ, భీముడూ తరవాత చరిత్రలో ఏదో మాయ జరిగి వంట గదిని ఆడ జాతి జయించి మగ జాతికి తీరని ద్రోహం చేసింది.. నీ గురించి తెలిస్తే ఆ న.., పు.., భీ.. ల ఆత్మ శాంతిస్తుంది... నీ అభిమాన సంఘం పెట్టేసి దానికి అధ్యక్షుడిని అయిపోయాను... కౌటిల్యుడు వర్ధిల్లాలి! కొత్తిమీర పచ్చడి నిలవుండాలి!

Unknown చెప్పారు...

నేను ట్రై చేసి చెపుతాను ఎలా వచ్చిందో :-) . మీకో తమాషా విషయం చెప్పనా!, నేను నిన్ననే అనుకొన్నాను, కొత్తిమీర పచ్చడి చెయ్యాలి, ఒక సారి కౌటిల్య గారి బ్లాగ్ చెక్ చెయ్యాలి అని(బిజీ గా ఉండి మీ బ్లాగ్ ని one week నుంచి చూడడం కుదరలేదు). ఈ రోజు అనుకోకుండా కొత్తిమీర పచ్చడి గురుంచి చదివి బలే సరదా గా అనిపించింది. మీరు వ్రాసే విధానం బాగుంది. నేను బోజనప్రియురాలినే! కొత్తగా సింపుల్ గా చేసేవంటే ఇష్టం.
శ్రీదేవి.

కౌటిల్య చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ,
అయ్యో! అంతకన్నా భాగ్యమా! నాకు నేను వండుకోవాలంటే మహా బద్దకం కాని, ఎవరికన్నా వండి పెట్టాలంటే మహదానందం...

మాది గుంటూరండీ! మీరు గుంటూరు స్టేషన్లో రైలు దిగి, బైటకొచ్చి ఎదురుగ్గా చూస్తే మా హాస్పటల్ కనపడిద్ది..అక్కణ్ణుంచి పడమరకి నాలుగడుగులేస్తే మా కాలేజీ కనపడిద్ది...అక్కడికొచ్చి "కౌటిల్యా" అని పెద్దగా ఓ పొలికేక పెట్టారనుకోండి(ఫోన్లో లెండి..ః)..)...ఆ పక్కనే మా ఇల్లు..వచ్చి మిమ్మల్ని స్వాగత సత్కారాలతో తీసుకెళ్ళి,కాళ్ళకి నీళ్ళిచ్చి, పీటేసి,ఆకేసి,పప్పేసి,ఆయేసి, కొత్తిమీర పచ్చడేసి కొసరి కొసరి భోజనం వడ్డిస్తా..మీరు తిని గఱున తేనిస్తే తెగ ఆనందపడి పోతానన్నమాట!

కౌటిల్య చెప్పారు...

దిలీపూ! నిజంగానే నీ అభిమానానికి నాక్కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తున్నయ్..ఐనా పురూరవుడు మన పాకశాస్త్రం లిస్టులో లేడుకదా! కలిపేసుకుందామంటావా..అయితే వాకే!

అవును ఈ స్త్రీజాతి మనకి చేసిన ద్రోహాన్ని అందరికీ తెలియజెప్పటమే మన పాకవేదం ముఖ్యోద్దేశం...ః)

కొత్తిమీర పచ్చడి పెట్టి ఇరవై రోజులైంది..ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది...నీ అభిమానంతో ఓ సంవత్సరం ఉంటదేమో....ః)

@ శ్రీదేవి గారూ! నిజ్జంగానా! మీరలా అనుకుంటున్నారని తెలిస్తే వారానికేం ఖర్మ! నాల్రోజులకో రకం రాసేస్తా....చేసి నిజ్జంగా చెప్పాలి మరి ఎల్లా వచ్చిందో!....ః)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కౌటిల్య గారూ సహస్ర వందనాలు. ఇంత ఆప్యాయంగా ఆదరించి భోజనం పెడతానంటే తప్పకుండా వస్తాను.

ఎప్పుడో చెప్పలేను కానీ వస్తాను.వస్తాను మాష్టారు వస్తాను. (అమ్మయ్య మూడు మాట్లు అనేశాను కదా. మూడు మాట్లు అంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారట.):)

అజ్ఞాత చెప్పారు...

వామ్మోయ్, ఖన్నా-ఖజానా కిక్కడేదో కౌటిల్య-ఖజానా తయారైపోతోంది. మీ కొత్తిమిర పచ్చడి ఫోటో, బ్లాక్ కరంట్ జామ్‌లా అనిపిస్తోందే! రెసిపి ఇచ్చారు కదా, ట్రై చేస్తాం. మెచ్చాను.. నే మెచ్చాను .. అంతే! :)
జీవితంలో ఓకోరిక .. నే పోయే ముందు మీ ఆసుపత్రిలో ఓ 6నెల్ల ముందే అడ్మిట్ అయిపోయి, మస్తుగ మీచేతి వంట తిని, రెణ్ణెల్ల ముందే ఆవకాయ జాడీ తన్నేయాలని...

కౌటిల్య చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ,
మీరు పెద్దవాళ్ళు నాకు వందనాలు అనకూడదు...తథాస్తు దేవతలు దీవించేశారండీ! మీరు త్వరగా ప్రయాణం ప్లాను చెయ్యండి, చెయ్యగానే నాకు ఫోను కొట్టండి.(నేను అన్నీ ప్రిపేరు చేసుకోవాలిగా మరి..ః)...) .

@snkr గారూ,
ఆ ఖన్నా-ఖజానా అంటే ఏంటో ఇప్పుడే గూగులించా..అక్కడ చానా మంది రాస్తారులా ఉంది..ఇక్కడ మనది సింగిలు హ్యాండే కదా..ః)

"మీ కొత్తిమిర పచ్చడి ఫోటో, బ్లాక్ కరంట్ జామ్‌లా అనిపిస్తోందే!"...>..ః(
హ్మ్! అలా ఉందా అండీ!అది నిజ్జంగా కొతిమీర పచ్చడే,మీరస్సలు అనుమాన పడాల్సిన పన్లేదు..నా ఫొటోగ్రఫీ నైపుణ్యం అలా ఏడ్చింది..అయినా మెచ్చారుగా..బోల్డన్ని మంగిడీలు..ః).చేసి చూసి ఎలా ఉందో చెప్పండేం...

"జీవితంలో ఓకోరిక .. నే పోయే ముందు మీ ఆసుపత్రిలో ఓ 6నెల్ల ముందే అడ్మిట్ అయిపోయి, మస్తుగ మీచేతి వంట తిని, రెణ్ణెల్ల ముందే ఆవకాయ జాడీ తన్నేయాలని..."....>
అమ్మ బాబోయ్! ఇది చాలా పెద్ద కాంప్లిమెంటు...దీనికి ఇంకా బోల్డన్ని మంగిడీలు...కాని ఆ చివర నాలుగు మాటలే ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలా..ః)

సుజాత వేల్పూరి చెప్పారు...

కౌటిల్యా, బాల్చీలు కాక ఆవకాయ జాడీ తన్నేయాలనుకునే పేషంట్స్ తో జాగ్రత్త! పేషంట్ కాళ్ళవైపు మాత్రం ఉండొద్దు!

నిన్ననే కొత్తి మీర పచ్చడి సాంపిల్ పెట్టి చూశా, మీ చెల్లాయి ఇహ పప్పు మానేసి దాంతోనే లాగిస్తోంది బోయినాలు

కౌటిల్య చెప్పారు...

సుజాత గారూ,
ః).....అవునండీ! మీరు చెప్పిన జాగ్రత్త బానే ఉంది...కాని అసలు ఈ ఆవకాయజాడీ కాన్సెప్ట్ నాకు బొత్తిగా అర్థం కాలా..అడిగితె snkr గారు ఇంకా జవాబు చెప్పలా...ః)

ఓహ్! పెట్టేశారన్నమాట! కీర్తనకి దాన్ని ముద్దపప్పులో కలుపుకు తినమని చెప్పండి, ఇంకా బాగుంటది....ః)

అజ్ఞాత చెప్పారు...

సారీ మీ ఫాలోఅప్ వ్యాఖ్య చూడలేదు
:) దేహమనునది ఓ ఆవకాయ జాడీ లాంటిది అని ఏ దాసరి నారాయణరావు గారో (ప్రవ)చించారట, అంతే!

పోతే మన ఆసుపత్రిలో, మందులుగా జంతికలు,కాకినాడ కాజాలు, పూతరేక్స్, బూంది, అరిసెలు, చెగోడీలు, సున్నుండలు గట్రా ఇస్తారా? ఇక డ్రిప్ అనేది ఎలావుంటుందో వూహించుకుంటేనే .. నా సామిరంగ, ఎప్పుడేప్పుడు ఇన్‌పేషంటుగా ఆసుపత్రి మంచం మీద వాలిఫోయి, ఈ శేష జీవితాన్ని ఆసుపత్రిలో గడిపేద్దామా అని వువ్విళ్ళూరుతున్నానంటే అది అతిశయోక్తి కాదని మీరు నమ్మాలి. ;)

ఏంలేదు, ఏదో సరదాకన్నా. మీ అభిరుచి రుచి నచ్చింది. Khanna-Khazana అనేది ఓ ప్రముఖ పంజాబీ చెఫ్ షో Z-టివిలో వచ్చేది. ఆవన ఇపుడు మన ఆవకాయలు కూడా చేసేసి ప్రియకు పోటీగా మార్కెట్ చేసుకుంటున్నారు. అన్నట్టు ISI ప్రేరిత పాకిస్థాని ఆంధ్రా పచ్చళ్ళు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

Sesirekha Munagala చెప్పారు...

koutilya garu

chaalaa bagundi andi. Immediately i ran into kitchen to prepare kottimeera pachadi. But sadly there is no kottimeera in friz. Anyway, i will buy it and do it and will inform you how it is. Waiting for your next post. mee peddamma garini adigi ilanti manchi authentic recipes ivvandi maaku.

కౌటిల్య చెప్పారు...

snkr గారూ,
ఆవకాయ జాడీ అంటే అర్థమైంది కానీ, అది రెణ్ణెల్లముందే తన్నెయ్యడమెందుకో అర్థం కాలా....చక్కగా మా రుచుల్ని ఆస్వాదిస్తూ ఇంకో నాల్నెల్లు ఉండొచ్చుగా...ః)

మీరడిగినవన్నీ తప్పక అందించబడతాయి..పోతే డ్రిప్ అంటారా....దానికోసమే "రసాల" అని ఒక స్పెషల్ పానీయం తయారుచేస్తున్నా...ఇది సాక్షాత్తూ భీముడు కనిపెట్టిందట...ః)...మీకు ఇక నోరు తెగ ఊరిపోతోంది కదూ...;)..

ఆ ఖన్నా-ఖజానా గురించి చదివానండీ..బానే ఉంది సైటు...అది టీవీషో అని మాత్రం తెలీలేదు..ఇకపోతే అక్కడ అన్నీ "తిరామిసు" లాంటి వంటకాలేగా..ః)

@శశిరేఖ గారూ,
ధన్యవాదాలు...చేసి చెప్పండి మరి ఎలా వచ్చిందో...ః)...

SHANKAR.S చెప్పారు...

కౌటిల్యుడి అర్ధశాస్త్రం లాగ ఈ కౌటిల్యుని పాక శాస్త్రం కూడా సుప్రసిద్ధమవుగాక

నాకూ కొత్తిమీర అంటే భలే ఇష్టమండీ . అసలు తెలుగు భోజనంలో వాడే ఆకు కూరల్లో గోంగూరకు ఆంధ్ర మాత స్థానం ఇస్తే దీన్ని మరదలనచ్చేమో :)

అజ్ఞాత చెప్పారు...

డాట్టారూ, అంత రుచిగా వున్న ఆవకాయలు కోరి చేశాను కొత్తిమిరి పచ్చడంటూ .. కొసరి తినిపించే డాట్టారు దొరికితే, 4నెలల్లో 6నెలల తిండి కానిచ్చేస్తాము. 'దానా దానా పే లిఖా హోతా ఖానే వాలా కా నాం' అనేది సూఫీ సూక్తి. మన రేషన్ అయిపోంగానే జాడీ తన్నేయాల్సిందే కదండి :)
టాబ్లెట్ బదులు
కాజా-3ట్, 0-0-0
పకోడి 16ట్, 2-4-8
చెగోడి 15ట్, 5-5-5
అని ప్రిస్కిప్షన్ తలుచుకుంటేనే... డాట్టారూ ...

కౌటిల్య చెప్పారు...

@ శంకర్ గారూ,
మీ దీవెనకి బోల్డన్ని మంగిడీలు..

కొత్తిమీర మరదలా..భలే భలే..ః)

@ snkr గారు,
ఓహ్! అదన్నమాట...ఐతే వాకే!

మీరు ఊహించుకుంటున్న ప్రిస్క్రిప్షను చూస్తుంటే నాక్కూడా తెగ నోరూరిపోతోంది...డాట్టర్లంతా ఇలాంటి టేస్టీ ప్రిస్క్రిప్షన్లిస్తే భలేగా ఉంటుంది కదా, ఆ కంపుకొట్టే టాబ్లెట్లు కాకుండా.....;)..:P

జ్యోతి చెప్పారు...

కౌటిల్యా! నేను ఇవాళే ఈ కొత్తిమిర పచ్చడి చేసా కాని చిన్న మార్పులు. ఈ పచ్చళ్లలో పొడులు వేసేకంటే అప్పటికప్పుడు వేయించి పొడుం కొట్టి వేస్తే ఇంకా రుచిగా ఉంటుందని అలా చేసాను.కాసిన్ని నువ్వులు కూడా తగిలించాను. ఘాటుఘాటుగా సూపర్ గా ఉంది పచ్చడి. ఫోటో అంటే షడ్రుచులులోనే చూడాలి మరి. చూడ్డానికిన్నూ, తినడానికిన్నూ ఎలా ఉందంటే. మా ఇంట్లోవాళ్లకు నాన్ వెజ్ చేసి పెట్టి,నేను మాత్రం వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి,కూసింత నెయ్యి వేసుకుని లాగించేసా ఇప్పుడే. అదన్నమాట సంగతి..

manaurumanacchettu చెప్పారు...

👌

Blogger ఆధారితం.