బీరపొట్టుతో బండ పచ్చడీ - "పెసర కట్టు" అనబడే ఓ రకం చారూ....
ఇక పచ్చడి ఎలా చెయ్యాలో చెప్తా, పన్లో పనిగా బీరకాయ కూర కూడా చెప్పేస్తానేం సింపుల్గా........
- ముందు బాగా లేతగా పీచు పట్టకుండా ఉన్న బీరకాయలు తీసుకోండి...అదెలా తెలుస్తుందంటారా..విరిచి చూస్తే చక్కగా విరిగిపోతుంది,మొరాయించకుండా....కొంచెం మొరాయించినా పీచు పట్టేసినట్టే.....కాయల్ని బాగా కడగాలి....కడిగాక మొదలు,చివర్లు కోసేసి ఎత్తుగా ఉన్న రిడ్జెస్ ని ముందు స్క్రాపర్ తో గీకెయ్యండి.ఎందుకంటే అది పడితే పచ్చడి మరీ గరుగ్గా తగిలిద్ది తినేప్పుడు.......తర్వాత చెక్కు మొత్తం తీసెయ్యండి...ఇలా అన్ని కాయల చెక్కు తీశాక దాన్ని వేరేగా తీసి, బాగా కడగండి.....చెక్కు తీసిన కాయల్ని కూడా బాగా కడిగి మోయనమైన సైజుల్లో ముక్కలు కోసుకోండి, తర్వాత కూర చేసుకుందాం.....:)
- ఇక ఈ చెక్కుని బాండీలో తీసుకుని, కాసిన్ని పచ్చి మిరగాయలు,ధనియాలు,జీలకఱ్ఱ వేసి ఒక చిన్నగెంటెడు నూనె వేసి,పొయ్యి మీద పెట్టి బాగా వాడ్చండి.....పచ్చి మిరగాయలు కోసి వేయించొద్దు,కోరొచ్చిద్ది.....పచ్చిమిరగాయల మీద తెల్లగా మచ్చలు వచ్చే వరకు వేయించండి....(అరకేజీ బీరకాయల పొట్టుకు నాలుగైదు మిరగాయలు సరిపోతై.తినేవాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవచ్చు.కాని ఉల్లిపాయలు వేస్తే పచ్చడి నిలవుండదు.వెయ్యకపోతే ఫ్రిజ్జులో పెట్టకపోయినా నాలుగురోజులుంటుంది)..
- ఇప్పుడు పైన వేయించినవన్నీ రోట్టో వేసి తొక్కుకోవాలి...తొక్కేప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలూ,కాస్త చింతపండూ,సరిపడా ఉప్పూ,కాస్త కొతిమీరా వేసి కచ్చాపచ్చాగా తొక్కుకోవాలి.రోలు లేకపోతే మిక్సీలో ఒక తిప్పు తిప్పి వదిలెయ్యండి.....మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే రుచి అంతగా ఉండకపోగా గరుగ్గా తగుల్తూ ఉంటుంది.....ఇలా తొక్కుకున్న పచ్చడిని అలానే తినెయ్యొచ్చు.లేకపోతే కొంచెం నూనె వేసి ఇంగువ తిరగమాత పెడితే బాగా రుచొస్తుంది,నిలవుంటుంది.
ఇక బీరకాయ కూర కూడా సింపుల్గా చెప్పేస్తానేం.....
- పైన చక్కగా ముక్కలు తరిగిపెట్టుకున్నారు కదా, వాటికి తోడు రెండు లేత ములక్కాయల్ని కూడా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి.బీరకాయకి ములక్కాయ కాంబినేషన్ అదిరిపోతుంది.తినాలనుకునేవాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు...
- తర్వాత పొయ్యి మీద కూరగిన్నె పెట్టి దాంట్లో తాలింపు పెట్టండి....ఆ తాలింపులో ముక్కల్ని వెయ్యండి.తర్వాత ఉప్పూ,కారం వేసి కాసిన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఉడకనివ్వండి.(స్టీలు గిన్నెగాని,కాపర్ బాటమ్ గిన్నె కాని ఐతే సిమ్ లో ఉడికించండి. లేకపోతే నీళ్ళున్నా బీరకాయ కూర ఊరకనే మాడిపోద్ది). కారం సంబారుకారమైతే బాగా రుచొస్తుంది....
- ఇక ముక్క బాగా ఉడికి, నీళ్ళన్నీ ఇగిరిపోతున్నాయనుకోగానే ఒక 100ml కాచిన పాలు పోసి ఒక్క నిమిషం మగ్గనిచ్చి దించెయ్యండి...బీరకాయకి పాలు వేస్తేనే రుచి...ఎన్ని పోస్తే అంత గుజ్జుగా,కమ్మగా ఉంటుంది కూర.....
- ముందు పెసరపప్పుని మరికాసిన్ని నీళ్ళుపోసి ఉడికించాలి...(ఒకటికి మూడు పోశాన్నేను)....కుక్కర్ మూడు విజిల్స్ రాగానే దించి పప్పుని బాగా పప్పుగుత్తితో మెత్తగా ఎనిపాను....
- ఈ పప్పుని వేరే గిన్నెలో తీసుకుని ఎక్కువనీళ్ళు(అరగ్లాసు పప్పుకి అరలీటరు పైన) పోసి, దాంటో పచ్చిమిరగాయలు రెండు(నిలువుగా చీల్చి), ఒక టమాటా ముక్కలు చేసి వేశా...ఇక బాగా మరిగించడమే....మరిగేప్పుడు సరిపడా ఉప్పు కాస్త అల్లం,వెల్లుల్లి,కొతిమీర వేశా......రెండు మిరియాలు,రెండు ధనియాలు వేయించి పొడి కొట్టి వేశా.....ఓ చిటికెడు పసుపు కూడా వేసి కొంచెం చిక్క బడే వరకూ మరిగించా...దించి మాంచి ఇంగువపోపు పెట్టి ఈ చారులోకి తిప్పెయ్యడమే.....చారు కొంచెం వేడి తగ్గాక కాస్తంత నిమ్మరసం పిండాను....అంతే "పెసరకట్టు" అనబడే పప్పుచారు రెడీ.... ;)
11:21 PM | లేబుళ్లు: చారులు, తెలుగింటి కూర, బండ పచ్చళ్ళు | 4 Comments
దోసకాయ ఇగురూ - మిరియాల చారూ
పైగా నిన్న ఒక అజ్ఞాతగారు స్టార్టింగ్ కిట్ కావాలన్నారు...కాబట్టి మనం మామూలుగా వండే కూరలు కూడా రాసేస్తే పోలా అనిపించింది, దానికి రావుగారి ప్రోత్సాహం కూడా......అసలు నా బ్లాగు మొదలెట్టిందే అందుకనుకోండి, కాని మరీ మామూలుగా వండుకున్నే కూరలు వీడు చెప్పేదేంటి అనుకుంటారని,దానికితోడు ఆ మధ్య జరిగిన చిన్న రగడవల్ల ఆ రకాలు కాస్త పక్కకి పెట్టా....కాని అవి కావల్సినవాళ్ళు చాలా మందే ఉన్నారనిపిస్తోంది, అందుకే రాసేస్తున్నా...:)..
మొదట దోసకాయ ఇగురెల్లా చెయ్యాలో చెప్తా.......
కొన్ని జీవాలుంటాయ్, దోసకాయంటే ఆమడదూరం పరిగెడతారు...అడిగితే మాకు దాని వాసన పడదు(చేపల కంపు మాత్రం హాయిగా పీల్చుకుంటారు..:)...) అంటారు....సరిగ్గా వండిన దోసకాయ ఎప్పుడూ తిని ఉండరు..వాళ్ళ దురదృష్టానికి నాకు జాలేస్తుంటుంది......నాకు తెలిసి దోసకాయంత ప్రియంగా,హాయిగా గొంతు దిగే కూర మరోటి ఉండదేమో...అందునా ఈ ఎండాకాలంలో దోసకాయకూర లోపలికెళ్తుంటే ప్రాణానికి ఎంతహాయిగా ఉంటదో....అసలు దోసకాయ ఎన్ని రకాలుగా వండుకోవచ్చో...పప్పులో పెట్టుకోవచ్చు,పులుసు పెట్టుకోవచ్చు,పాలేసి ఇగురొండుకోవచ్చు, పచ్చి ముక్కల పచ్చడి రకరకాలుగా తొక్కుకోవచ్చు,ఒరుగులు పెట్టుకోవచ్చు....ఏంటో! పాపం ఆ జనాలు ఇన్ని రుచులూ మిస్సయినట్టేకదా...:).....సర్లెండి మనం నేర్చుకుందాం,వండుకుందాం,తిని ఎంజాయ్ చేద్దాం....:)
- మొదట మంచి కండ పట్టి ఉన్న దోసకాయలు తీసుకోండి, అరకేజీ నలుగురికి సుష్టుగా సరిపోతుంది......కాయ మరీ పండి మగ్గితే ఇగురుకి పనికిరాదు, పులుసు పెట్టుకోవాల్సిందే....కాబట్టి మరీ పచ్చి,పండు కాకుండా దోరగా,గట్టిగా,నిగనిగలాడే పసుపు రంగులో ఉన్న కాయలైతే బాగుంటాయ్......ఇప్పుడు ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి,చెక్కు తియ్యండి.....ప్రతి కాయనీ సగానికి కోసి మధ్యలో విత్తనాలున్న గుజ్జుని కాస్త నోట్టో వేసుకు చూడండి,చేదుగా ఉంటే విత్తనాలు తీసి పడెయ్యండి.అప్పుడు కండ కూడా కాస్త గిల్లితిని చూడాలి,అదీ చేదుగా ఉంటే పడెయ్యటమే....:).....{కొంత మంది విత్తనాలు వేసుకోడానికి ఇష్టపడరు...కాని ఇగురు కూరలో విత్తనాలు తగుల్తుంటే చాలా రుచిగాఉంటుంది....ఒకవేళ విత్తనాలు తీసేసేట్టైతే వాటిని పడెయ్యకుండా ఎండబెట్టుకుని, చింతకాయపచ్చడి తొక్కేప్పుడు వేయించి కలిపి తొక్కితే పచ్చడి ఘుమఘుమలాడిపోద్ది......}..ఇక కాయల్ని సన్నగా సమానమైన సైజుల్లో ముక్కలుకొయ్యాలి...ఎక్కువాతక్కువగా కోస్తే కూర సరిగ్గా ఉడకదు.....నేనైతే పైన ఫొటోలో ఉన్నట్టుగా మోయనమైన సైజులో కోస్తాను,అప్పుడు ముక్క పంటికింద తగుల్తూ బాగుంటుంది....మా అక్కవాళ్ళు సన్నగా తరిగేస్తారు,అప్పుడు కూర గుజ్జుగా ఐపోద్ది..అదోరుచి...:)
- తర్వాత కావాలంటే ఒక టమాటా, రెండు పచ్చిమిరపకాయలు,కాసిన్ని ఉల్లిపాయలు తరిగివేసుకోవచ్చు...నేను ఉల్లిపాయలు వాడను..దోసకాయలో ఉన్న సాధుత్వం పోతుంది.....ఇలా తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకోండి...
- ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి దాంటో ఓ చిన్నగెంటెడు నూనేస్కోవాలి...అది కొంచెంకాగిందనగానే ఒక ఎండు మిరగాయ తుంచి వెయ్యండి...తర్వాత ఆవాలు,తాలింపుగింజలూ(మినప్పప్పూ,పచ్చనగపప్పూ),కాస్త జీలకఱ్ఱా,కొంచెం ఇంగువ,కాస్త కరివేపాకు వేసుకోవాలి...ఇవన్నీ వేగి చిటపటలాడాయనుకోగానే,పైన కోసి పెట్టుకున్న ముక్కలన్నీ ఆ తాలింపులో వేసెయ్యండి.....తాలింపు వేగినంత సేపూ పొయ్యి సిమ్ లోనే ఉంచుకోండి..తాలింపు మాడకుండా ఉండటానికి ఇది సేఫ్టీ మెజర్...:)
- ఇప్పుడు ఓ గ్లాసెడు నీళ్ళు పోసి, మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి....తర్వాత మూత తీసి సరిపడా ఉప్పూ,కారం వేసుకోవాలి....ఎంత వెయ్యాలీ? అంటే నేను ఖచ్చితంగా కొలతలు చెప్పలేను..నేను చేత్తో తీసుకుని ఉరామరిగ్గా వేసేస్తా...:)..మీరు వేసుకు సరి చూసుకుని మళ్ళా కలుపుకోండి....కాని దోసకాయకి కొంచెం ఎక్కువే పడతాయ్ ఉప్పూ,కారాలు....మా సంబారుకారమేశారనుకోండి, అది వెయ్యగానే కూర ఉడుకుతుంటే వచ్చే వాసనకే మీకు పొట్టనిండిపోద్ది మరి...:)
- ఇక మూతపెట్టి ఉడకనివ్వండి...మధ్య,మధ్యలో మూత తీసి చూసి కలపెడుతూ ఉండాలి,లేకపోతే అడుగు మాడిపోద్ది...ముక్క ఉడక్కుండానే అడుగు మాడుతుందని అనుమానమొస్తే ఇంకాసిని నీళ్ళు పోసి ఉడికించండి....ఎగరెయ్యటం చేతైతే ఎగరెయ్యొచ్చు, ఎందుకంటే కలిపితే ముక్క చెదిరిపోద్ది..:)
- చివరగా ముక్క బాగా ఉడికింది అనుకోగానే ఒక 100ml కాచినపాలు పోసి కలపండి.పాలుపోస్తే కూర బాగా గుజ్జుగా వస్తుంది,రంగుకూడా వస్తుంది...రంగు బాగా పసుపుగా కావాలంటే ఓ చిటికెడు పసుపు మొదట ముక్కలు తాలింపులో వెయ్యగానే వేసుకోవాలి.....ఇప్పుడు రుచికి కాస్త అల్లం,వెల్లుల్లి తొక్కి వేసుకోవాలి,కాసిన్ని కొతిమీరాకులు కూడా....:)
- అవి వేశాక ఒక నిమిషం పొయ్యి మీద ఉంచి దించెయ్యండి...అంతే ఘుమఘుమలాడె దోసకాయ ఇగురు తయారు....చాలా వీజీగా ఉంది కదా....
ఇక మిరియాల చారెలా పెట్టాలో గబగబా నేర్చేసుకుందాం...ఇది అరవోళ్ళ రసం అవునో కాదో నాకు మాత్రం తెలీదు..మా ఇళ్ళల్లో మాత్రం దీన్ని మిరియాలచారనే అంటాం..:)....కొన్ని చోట్ల మరుగుచారని కూడా అంటారు.....బాగా అలిసిపోయి బడలికగా ఉన్నప్పుడు, జొరమొచ్చి నోరు చవి చెడిఉన్నప్పుడూ,కొంచెం ఆజీర్తిగా ఉన్నప్పుడూ ఘాటుగా ఈ చారు కనక పెట్టుకు తింటే భలే హాయిగా ఉంటది....చెయ్యటం చాలా వీజీ...:)
- ముందర కాసిన్ని మిరియాలూ,ధనియాలూ తీసుకోవాలి...మిరియాలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఘాటుగా.....నాలుగు మెంతులూ,కాస్త జీలకఱ్ఱా కూడా తీసుకోవాలి....కొంతమంది కంది పప్పు కూడా వేస్తారు.....ఇవన్నీ తీసుకుని బాండీలో వేసి పొయ్యిమీద పెట్టి రెండు నిమిషాలు వేయించాలి....అవి వేగగానే తీసి అన్నీ కలిపి రోట్లో పొడికొట్టుకోవాలి..మిక్సీలో వేస్తే అంత రుచి రాదు..ఉన్న సువాసనకాస్తా పోతుంది..రోలు లేకపోయినా మసాలా నూరుకునే గిన్నె ఉంటదికదా దాంటొ అయినా మెత్తగా నూరుకోవాలి.....
- ఇప్పుడు ఒక లీటరు నీళ్ళు తీసుకుని దాంట్లో ఒక చిన్నముద్ద చింతపండు వెయ్యాలి...కావాలనుకుంటే రెండు టమాటాలు సన్నగా ముక్కలుకోసి వేసుకోవచ్చు...ఇప్పుడు పైన నూరిపెట్టుకున్న మిరియాలపొడి దీంటొ వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి....లీటరు సగం అయ్యేవరకు మరిగించొచ్చు...కొంతమంది చిక్కగా రావాలంటే పప్పు కలపాలేమో అనుకుంటారు..అవసరమే లేదు...ఎంత బాగా మరిగిస్తే అంత చిక్కగా వస్తుంది...
- దించబోయే రెండు నిమిషాల ముందు అల్లం, వెల్లుల్లి తొక్కి వెయ్యాలి,మరికాస్త కొత్తిమీర,సరిపడా ఉప్పు కూడా వేసి మరగనివ్వాలి.....ఇక దించబోయే ముందు రెండు యాలక్కాయలు కొట్టి వెయ్యండి...వాసన అదిరిపోద్ది....పక్క ఇళ్ళవాళ్ళు కూడా ముక్కులు ఎగబీల్చేసుకుంటారు...:)
- తర్వాత దీంటోకి మామూలుగా పెట్టుకునే తాలింపు తిప్పి వెయ్యడమే....ఆయితే తాలింపులో మరికాస్త కరివేపాకు,జీలకఱ్ఱ్ర వేస్తే అదిరిపోతుంది...
3:42 PM | లేబుళ్లు: చారులు, తెలుగింటి కూర, భోజనం కథలు | 22 Comments
సొరకాయ పాయసం - ఇదో "శాకపాయసం"
"అనగనగా, ఒకానొక తెలుగుబ్లాగుదేశంలో ఆడవాళ్ళు మాత్రమే వంటల గురించి రాయగలరని,వాళ్ళకి తెలిసినవే వంటలని వాళ్ళు ఫీలవుతున్న రోజులు..అప్పుడు ,ఆ స్త్రీజాత్యహంకారధోరణికి గొడ్డలిపెట్టుగా మా బెమ్మీల తరపునుంచి మా నాగా "మీరేం చేస్తారు? మేం రైస్ కుక్కర్లో చపాతీలు కూడా బహువీజీగా చేసెయ్యగలం" అని చేసి చూపించాడు..బెమ్మీనా మజాకా!.;)..అప్పుడు అది చూసి తెగ కుళ్ళేసుకున్న ఈ ఆడలేడీసు పాపం మా నాగ మీద పొలోమని దండెత్తేశారన్నమాట! సమయానికి మంచుగారు కూడా అందుబాటులో లేరు..సో, నేనొక్కణ్ణే నా రైసుకుక్కర్ వంటల్ని అమ్ములపొదిలో పెట్టేసుకుని మా నాగాకి సపోర్టుగా కామెంట్ల యుద్ధంలోకి దిగేశాను....
నా ఒక్కో అస్త్రం సంధిస్తుంటే, అప్పుడు నేస్తం గారు యుద్ధభూమిలోకి ఎంటర్ అయిపోయి నా "సొరకాయ పాయసం" అనే అస్త్రాన్ని,లేడీసుకి సహజమైన వంటాహంకారంతో(దీంటో కాస్తంత గోదారి అభిజాత్యం కూడా ఉందనుకోండి..:)...) అదసలు అస్త్రమే(వంటకమే) కాదు అని తేల్చేశారు....దాంతో తీవ్రంగా హర్టయిన నేను ఆ స్త్రీజాత్యహంకారధోరణికి నిరసనగా కొత్త బ్లాగు మొదలెట్టేశానన్నమాట!"
అదీ "పాకవేదం" పుట్టుక వెనక ఉన్న అసలు హిస్టరీ....తర్వాత విషయాలు మీకు తెలిసినవే...:)
నేస్తం గారూ! ఉన్నారా! ఉంటే, "సొరకాయ తో పాయసం కూడా చేస్తారా.." అన్నారుగా..ఎలా చెయ్యాలో ఇవ్వాళ చెప్పేస్తున్నా...మీరు ప్రయత్నించి ఎలా ఉందో చెప్పాలన్నమాట..:)...
అసలు పాయసం అంటే ఏంటి? "పయః" అంటే పాలు అని అర్థం... ఆ పాలతో వండిన పదార్థం కాబట్టి "పాయసం" అయింది....దీన్ని రకరకాలుగా పిలుస్తార్లే...పాయసం,క్షీరాన్నం,పరమాన్నం,పరవాణ్ణం..ఇలా బోల్డు రకాలుగా పిలుస్తార్లే....మా ఊళ్ళల్లో ఐతే "పాసెం","సిరాన్నం" అంటారు.....నాకీ "పాసెం" అంటే అర్థమయ్యేదికాని, ఈ "సిరాన్నమే" బొత్తిగా అర్థమయ్యేది కాదు,అమ్మమ్మ అంటుండేదలా....."సిరాపోసి వండుతారా ఏంటి ఖర్మ!" అనుకున్నే వాణ్ణి....కాని ఆలోచిస్తే టక్కున లైటు వెలిగిందోసారి..."ఓహో! ఇది క్షీరాన్నానికి వికృతన్నమాట" అని....అబ్బ! చూడండి నాకు ఎంత తెలివో! పక్కన ఎవరూ లేకపోటంతో, నా తెలివికి సెబాస్ అని నేనే జబ్బ చరిచేసుకున్నానన్నమాట!....:)..
ఇక ఆ పాయసాన్ని కూరగాయలేసి వండితే దాన్నే" శాకపాయసం " అంటారు....ఇది నాన్నగారు కనిపెట్టిన పదంలెండి....మనకి నో క్రెడిట్స్.:)...అమ్మ రకరకాల శాకపాయసాలు వండేది....వంకాయ పాయసం,బీరకాయ పాయసం, ములక్కాడల పాయసం,బూడిదగుమ్మడి పాయసం, అరటికాయ పాయసం, చివరికి "ఉల్లిపాయసం" కూడా...:)...ఎన్ని రకాలుగా వండినా సూపర్గా ఉండేది, మా ఊళ్ళల్లో పిచ్చ ఫేమస్ "సొరకాయ పాయసమే".....మిగతా వాటికి అంత రుచి రాదు...
సంక్రాంతి నెలలో తెగ కాస్తాయేమో సొరకాయలు, మా ఊళ్ళో రోజుకొకళ్ళేనా వండుకుంటారు.....మా ఇంట్లో ఇప్పటికీ విరక్కాస్తాయి సొరపాదులు...బజారంతా పంచుతుంది అమ్మ, కాయలు..ఇక ఆ సీజన్లో మా ఇంట్లో ఒకటే సొరకాయ వంటకాలు..... పాలేసి కూర,వేపుడు,పులుసు, రోటి పచ్చడి...ఆఖరికి ఓ జాడీడు ఊర పచ్చడి కూడా పెట్టేస్తుంది అమ్మ.......ఇక పాయసమైతే కనీసం వారానికోసారన్నా వండాల్సిందే, పేద్ద తపేళాకి.....ఇక ఆ రోజు అన్నంలేదు....కూరలు కూడా దాంటో కలుపుకు తినడమే.....పేద్ద గురుగు చేసి, దాన్నిండా నెయ్యి పోసుకుని, పక్కన సాధుమసాలా దట్టించిన వంకాయ కూర, రోటి పచ్చడి వేసుకుని నంజుకుంటూ తింటుంటే ఉంటదీ..అబ్బబ్బా....స్వర్గానికి బెత్తెడెత్తున కాదు, దాటి పైపైనే.......:)...
ఇక కొంతమంది మామూలుగా బియ్యంతో వండే పొంగలన్నంలో కాస్త సొరకాయ తురుము వేసి అదే సొరకాయ పాయసం అని ఫీల్ అయిపోతుంటారు,దాన్ని మళ్ళా హిందీలో "కద్దూ కా ఖీర్"అని పిల్చేసి తెగ పోషు ఫీలింగూ...మా క్లాసుమేటు ఒకమ్మాయి అలా చేసి తెగ గొప్ప ఫీల్ అయ్యేది...కాని తర్వాత నా "సొరకాయ పాయసం"తిన్నాక తను వండటమే మానేసింది, (మా ఫ్రెండ్సు చావగొట్టేశారు మరి..:)..).....బై డెఫినిషన్ కరెక్టవ్వొచ్చేమోగాని, రుచివార చూస్తే దానికీ, మా ఇళ్ళల్లో చేసుకునేదానికీ చాంతాడంత డిఫరెన్సు......అసలు ఆ విధానమే వేరు...మరి అది ఎల్లాగో చూద్దామా.....
- ముందు ఒక మంచి సొరకాయ తీసుకోవాలి.మంచి అంటే ఎలా అనుకుంటున్నారా! ఏం లేదండి...మరీ లేతగా కాకుండా బాగా కండ పట్టి ఉండాలి...అలా అని మరీ ముదరకూడదు....దీన్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసి,విత్తనాలు కూడా తీసేసి, కండవరకు మోయనమైన సైజులో ముక్కలు కొయ్యండి....తురుముగా చెయ్యొద్దు..ముక్కగా తగుల్తుంటేనే రుచి....
- ఇప్పుడు కొంచెం లోతుగా,వెడల్పుగా ఉండే మందపాటి గిన్నె తీసుకుని,దాంట్లో పైన కోసిపెట్టుకున్న ముక్కల్ని వేసి, సరిపడా ఉప్పు,నీళ్ళు వేసి పొయ్యిమీద పెట్టి ఉడికించండి....
- తర్వాత కావల్సిన ముఖ్యమైన పదార్థం బియ్యప్పిండి....తాజాగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న పిండి అయితేనే బాగుంటుంది...పాయసం చెయ్యాలనుకుంటే పొద్దున్నే బియ్యంనానబోసి, ఓ రెండు గంటలు నాననివ్వాలి...రాత్రి నానబెడితే మరీ మంచిది...తర్వాత ఆ బియ్యాన్ని కడిగి వడెయ్యాలి..నీళ్ళన్నీ వడిచాక పిండి కొట్టుకోవాలి..రోట్లో కొడితే చాలా బాగా వచ్చిద్ది..కుదరకపోతే మిక్సీ పట్టుకోవచ్చు...{తడిపిండి మాత్రమే వాడాలి..పొడిపిండి పనికిరాదు}
- మీడియం సైజులో ఉండే కాయకి, ఒక సోలెడు పిండి(సుమారుగా అరకేజీ బియ్యం), ఒక అరకేజీ బెల్లం పడతాయి.....కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు...అప్పుడు ముక్కలు ఎక్కువ తగుల్తాయి....
- బెల్లాన్ని ఓపిక ఉంటే తురుముకోవచ్చు.లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా నలగ్గొట్టి బియ్యప్పిండిలో వేసి నీళ్ళుపోసి బాగా జారుగా కలుపుకోవాలి.....బాగా నీళ్ళు,నీళ్ళుగా(గరిటజారుకంటే ఇంకొంచెం పల్చగా) కలుపుకోవాలి...ఉండలు కట్టకుండా చూసుకోవాలి.....ఈ మిశ్రమంలోనే ఎండుకొబ్బరి తురుము ఒక కప్పుడు వేసి కలిపెయ్యాలి....
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పైన ముక్కలు ఉడికాయనుకోగానే వాటిలో పోసి మెల్లగా తిప్పుతూ ఉండాలి...పోసేప్పుడు ఒక్కసారిగా గుమ్మరించొద్దు...మెల్లగా పోస్తూ, గరిటతో తిప్పుతూ ఉండాలి.లేకపోతే ఉండలు కడుతుంది....పిండి బాగా ఉడికి దగ్గరకి అయ్యేవరకు మెల్లగా తిప్పుతూనే ఉండాలి..మరీ స్పీడుగా తిప్పొద్దు,ముక్క చెదిరిపోతుంది....ఉండకట్టకుండా చూసుకుంటే చాలు....
- పిండి బాగా ఉడికింది, దగ్గరకి అయిందనగానే పాలు పొయ్యాలి...సుమారు అరలీటరు పొయ్యాలి..ఎక్కువ పోసినా రుచొస్తుంది.....పాలు పోసి సన్నసెగ మీద ఉడికించాలి. బాగా దగ్గరకి అవ్వగానే నెయ్యి,యాలకులపొడి,పచ్చకర్పూరం వేసి దించెయ్యాలి...డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు.....నేను వెయ్యను..ఎందుకో నాకు నచ్చదు...:)
- పైన చెప్పిన విధానం మా ఇంట్లో వండేది...మా అమ్మవాళ్ళ నాయనమ్మ అలా కాకుండా, ముక్కలు,పిండి,పాలు,బెల్లం అన్నీ నీళ్ళుపోసి కలిపేసి పొయ్యి మీద (కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చేమో!)పెట్టి తిప్పుతూ ఉడికించేదట! నేనెప్పుడూ అలా ప్రయత్నించలా....కావాలంటే మీరు ట్రై చెయ్యండి..:)....నాకు మట్టుక్కు పైలాగానే ఇష్టం...
ఇక ఇలా వండిన పాయసం వేడిగా తిన్నా బాగుంటుంది, బాగా చల్లారాక సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది.....కాని తినేప్పుడు పెద్ద గురుగు చేసుకుని, దాన్నిండా కమ్మటి నెయ్యి పోసుకుని, పక్కన వంకాయకూర, రోటి పచ్చడి పెట్టుకుని నంజుకుంటూ తింటం మాత్రం మర్చిపోవద్దేం........
4:02 PM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 16 Comments
కోరి భుజింతును, 'కొత్తిమీర పచ్చడి'
అసలు నాకు మట్టుక్కు నాకనిపించేదేంటంటే, ఎవరికన్నా "వంట చెయ్యటం బాగా వచ్చు" అన్న సర్టిఫికెట్టు ఇవ్వాలంటే వాళ్ళు అద్భుతంగా ఊరగాయలు పెట్టగలగాలి, అదీ రకరకాలుగా.....{మా అమ్మగారైతే పచ్చళ్ళ సీజనొస్తే ఓ ఇరవై, ముప్ఫై రకాలు పెట్టేస్తారు.(అలా అని పెద్ద వంటొచ్చని కాదులెండి, అన్నీ ఆమ్మ దగ్గరకెళ్ళి పెట్టుకొస్తుంది...:)...).....}ఊరికే పెట్టటం కాదండీ, పెట్టిన పచ్చడి సంవత్సరం తిరిగొచ్చినా పాడవకూడదు, రుచి అస్సలు మాఱకూడదు....
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా పెద్దమ్మ పచ్చళ్ళు అద్భుతంగా పెడుతుంది..ఇప్పటికీ మా పది ఫ్యామిలీలకీ పెద్దమ్మే ఆవకాయ,మాగాయ పెడుతుంది...అంత పచ్చడీ ఒక్కతే పెడుతుంది.....ఆవాలు పదికొట్లు తిఱిగి మరీ సెలెక్ట్ చేస్తుంది....కనీసం ముక్కలు కొయ్యడానిక్కూడా ఎవర్నీ గదిలోకి రానివ్వదు......అయితే పోయినేడు నేనేదో అన్నానని మా అక్కలందరికీ ఆవేశమొచ్చి," ఆ పాటి ఆవకాయ మేం పెట్టలేమా" అని అందరూ కలిసి పెట్టారు....చూస్తే పది రోజులకే ముక్క మెత్తబడింది, పచ్చడి రంగుమారింది......:)....అదన్నమాట సంగతి.
ఇక మనం వెరైటీ ప్రియులం కదా! మామూలు ఆవకాయ,మాగాయలు; కొరివికారం,టమాటా పచ్చళ్ళు ఎంతగా ఇష్టమున్నా....బాగా ఇష్టమైనవి కొత్తిమీర పచ్చడి, పులిహోర గోంగూర, సొరకాయ ఊరగాయ, వంకాయ ఊరగాయ......మొదటి రెండూ అద్భుతమైన రుచి..వాటి దుంపతెగ ఎంత బాగుంటాయో వేడివేడన్నంలో కలుపుకుతింటే....నెయ్యికూడా అవసరంలేదు.......
మొన్న నాన్నొచ్చేప్పుడు తిందామనిపించి అమ్మని అడిగా," అమ్మా! తేనెతొనల్తో పాటు కొత్తిమీర పచ్చడి కాస్త పెట్టి పంపు" అని....
అమ్మ"నావల్లకాదు ఫో! ఈ యేడు పొలంలో కొత్తిమీర వెయ్యలా...ఇంటి ముందు వేసిన నాలుగాకులూ తుంచితే మాకు కూరల్లోకి చాలవు..నాకు కొని పెట్టాలంటే ప్రాణమొప్పదు....అయినా ఆ పచ్చడి పెట్టానంటే నాన్న నాలుగురోజుల్లో ఖాళీ చేస్తారు.(నాన్నకి బీపీ ఉందిలెండి)...." అంది...
నాకావేశమొచ్చి," నువ్వు పంపకపోతే నే పెట్టుకోలేనా! నేనే పెట్టుకుంటా ఒక కట్ట కొత్తిమీర కొనుక్కొచ్చుకుని" అన్నా....
అమ్మ,"ఎలా పెట్టాలో నేను చెప్పనుగా! ఎలా పెడతావ్..." అని ఉడికించింది.....
మనమేమన్నా తక్కువతిన్నామా, తగ్గే ప్రశ్నేలేదుగా..." అయినా ఆ పచ్చడేంటో నువ్వే కనిపెట్టినట్టు బడాయి..ఆమ్మ దగ్గర నేర్చుకుందేగా....నేను ఆమ్మతోనే చెప్పించుకుంటా..." అని, వెంటనే ఆమ్మకి ఫోను కొట్టి అడిగా...ఆమ్మ ఓపిగ్గా అంతా చెప్పింది...కాని కొలతలన్నీ గిద్ద, అరసోల, శేరు లెక్కల్లో చెప్పింది.....:(
" ఆమ్మా! నా దగ్గర గిద్దలు,అరసోలలు లేవే!" అంటే," చిన్నబ్బాయ్! నాకు ఆ గ్రాముల లెక్కలు తెలీవబ్బాయ్" అంది.....సర్లే నా తిప్పలేవో నే పడతాలే అని ఫోను పెట్టేసి సరంజామా అంతా కూర్చుకుని పచ్చడి పెట్టేశా,మా పక్కింటోళ్ళ చిన్న రోలు అరువుకు తెచ్చుకు మరీ.....:)..అద్భుతంగా వచ్చిందిలెండి....ఇవ్వాళ కాస్త డ్రైగా అనిపిస్తే కాస్త ఇంగువనూనె కాచిపోసి మరీ పుటో తీసిపెట్టా ఇక్కడ...:).....
మరి మా పెద్దమ్మ చెప్పిన విధానం మీకూ చెప్పనా....
- ఇవ్వాళ మొదట కొలతలు చెప్పేస్తా,ఎందుకంటే పచ్చళ్ళు నిలవుండాలంటే కొలతలే బహు ఇంపార్టెంటు కదా మరి!...ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఓ వంద గ్రాములు చింతపండు, గిద్దెడు ఉప్పు, గిద్దెడు కారం... ;)...సారీ వందగ్రాములకన్నా కాస్త ఎక్కువ.....:).. , ఓ రెండుస్పూనులు ఆవపిండి,రెండు స్పూనులు మెంతి పిండి, సరిపడా నూనె, తిరగమాత సామాన్లు.....ఇవండీ! రెడీ చేసుకున్నారా! ఇక మొదలెట్టేద్దాం..భలే సింపులులే....:)
- కొతిమీర బాగా ఆకు పెద్దగా ఉన్న కట్టలు చూసి తెచ్చుకోండి....బాగా కడిగి వేర్ల భాగం వరికి కోసి పక్కన పడెయ్యండి.....మిగతా కట్టని మోయనమైన సైజులో తరగండి...మరీ చిన్నగా తరగొద్దు..పచ్చడిలో ఆకులుగా తగులుతుంటేనే బాగుంటుంది.....ఆకులు విడిగా పీకొద్దు..అలా కట్ట,కట్ట తరిగెయ్యండి...
- ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టేసి, కాస్తంత నూనేసి, ఈ తరిగిన కొత్తిమీరని వేయించండి...ఆకు బాగా దగ్గరకయ్యి, ముద్దలా అవ్వగానే దించెయ్యండి.
- ముందు తీసి పెట్టుకున్న చింతపండుని విత్తనాలు, పీచులు ఉంటే ఏరేసి, ఓ గిన్నెలో తీసుకుని, మరికాసిన్ని నీళ్ళుపోసి పొయ్యి మీద పెట్టెయ్యండి......బాగా కుతకుతా ఉడకనివ్వండి.బాగా ఉడికింతర్వాత దించి పులుసు పిసికెయ్యండి.పిప్పి వస్తే తీసి పడెయ్యండి..(బాగా ఉడికేసరికి నాకు పిప్పి అసలు రాలా...:) అలానే వేసి రోట్లో, తొక్కేశా..కలిసిపోయింది...)...ముందు పులుసు పిసికి దాన్నైనా ఉడికించొచ్చు.....
- ఇప్పుడు పైన వేయించిపెట్టుకున్న కొత్తిమీరని రోట్లో వేసి ఈ పులుసుపోసి కలిపి రుబ్బండి....రుబ్బేప్పుడు మధ్యలో పైన రెడీగా పెట్టుకున్న ఉప్పు, కారం పోసి రుబ్బెయ్యటమే...చివర్లో ఆవపిండి, మెంతిపిండి వేసి కాసేపు తిప్పటమే.ఈ రెండూ రుచికోసమన్నమాట...రోళ్ళు లేకపోతే మిక్సీలో అన్నీ వేసి ఒక తిప్పు తిప్పడమే....మరీ లేహ్యంలా వద్దు...కాస్త ఆకులుగా ఉంటేనే తింటానికి బావుంటుంది....
- ఉప్పు కల్లుప్పైతే మంచి రుచొస్తుంది, నిలవుంటుంది కూడా...రోళ్ళు లేకుండా మిక్సీల్లో రుబ్బాలనుకున్నే వాళ్ళు ఈ ఉప్పుని ముందే మెత్తగా మిక్సీ పట్టుకునుంటే మంచిది.....కారం మంచి ఎర్రగా ఉండే పచ్చడికారం సెలక్ట్ చేసుకోండి....మా గుంటూరు కారమైతే బెస్టు...:)
- ఇక ఈ రుబ్బిన దాన్ని తాలింపెట్టుకోటమే.....నూనె మామూలు తాలింపులంత వేస్తే పచ్చడి నిలవుండదు.కాస్త ఎక్కువే వేసుకోవాలి..... పచ్చడికి పట్టేంత నూనె బాండీలో వేసి కాగిందనిపించగానే తాలింపుగింజలేస్కోవాలి,నాలుగు వెల్లుల్లి రెబ్బలు నొక్కి వెయ్యాలి...మరికాస్త ఇంగువ....ఈ తాలింపుని దించి కొంచెం వేడి తగ్గాక పైన రుబ్బి పెట్టుకున్న పచ్చట్లో కలుపుకోవాలి.....
- మరికాస్త ఇంగువేసి పోపెడితే పచ్చడి ఎంత కమ్మటి వాసనొచ్చిద్దో.....
- పచ్చడి బాగా చల్లారాక జాడీలోకో, సీసాలోకో ఎత్తి పెట్టుకోవాలి..గాలి ఎక్కువగా తగలకుండా జాడీకైతే వాసెన కట్టండి,..సీసాకైతే గట్టిగా మూతపెట్టండి...
- అన్నిటికంటే గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన జాగ్రత్త,(ఇది ఏ ఊరగాయకైనా ఇంపార్టెంటే)....తడి అస్సలు తగలనివ్వద్దు....తడి చేతులు, తడిగా ఉన్న సీసాలు తగిలితే రెండ్రోజులు కూడా నిలవుండదు ఈ పచ్చడి....
- ఇలా పెట్టుకున్న పచ్చడి ప్రిజ్ లో పెట్టకపోయినా రెండు,మూణ్ణెల్లు నిలవుంటుంది......
12:49 AM | లేబుళ్లు: కుండ పచ్చళ్ళు | 25 Comments
ఇవాళ్టి నా భోజనం...."కొబ్బరికూర" తో.....
పచ్చళ్ళైతే రెండు,మూడున్నాయి, మరిప్పుడు కూర ఎలాగబ్బా అని ఆలోచిస్తుంటే, ఓ బ్రహ్మాండమైన అవిడియా తట్టింది......ఏం! పచ్చికొబ్బరితో పచ్చడే చెయ్యాలా, ఇంకేం చెయ్యకూడదా అనిపించింది....మీక్కూడా అప్పుడప్పుడు అలానే అనిపించుంటది కదూ!
ఎలాగంటే,.............,
- ముందు కొబ్బరిని అలా చిప్పల పళంగా పచ్చికొబ్బరి తురిమే దాంతో సన్నగా తురిమేశా.... (మీ దగ్గర అది లేదనుకోండి, మామూలు ఎండుకొబ్బరి తురిమే దాంతో అయినా తురుముకోవచ్చు,కాకపోతే కొంచెం కష్టపడాలి. అదీ లేకపోతే చాకుతో బాగా సన్నగా తరగండి. మిక్సీలో వెయ్యొద్దు,బాగా రాకపోవచ్చు.పెద్ద ముక్కలు పడనివ్వొద్దు,సరిగ్గా ఉడకవు.).
- తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ఓ రెండు గెంటెలు నూనేశా....అది కొంచెం కాగిందనంగానే కాసిన్ని ఆవాలు,జీలకఱ్ఱ వేసేశా....మినప్పప్పు,పచ్చెనగపప్పు కాసిన్ని ఎక్కువేశా.(ఎందుకంటే ఇవి ఎక్కువ పడితే అవి తినేప్పుడు మధ్యలో తగులుతుంటే సూపర్గా ఉంటది)....ఒక ఎండు మిరగాయ తుంచి వేశా....ఒక వెల్లుల్లి రెబ్బ నొక్కి వేసి, ఆనక ఓ చిటికెడు ఇంగువ పడేశా....
- ఈ తిరగమాత గింజలన్నీ వేగి చిటపటలాడ్గానే, ముందే రెడీగా పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేశా...
- కొంచెం గెంటెతో అలా అలా కలిపేసి, ఓ పెద్ద గ్లాసుడు నీళ్ళు పోసేసి ఉడకనిచ్చా....నీళ్ళన్నీ ఇట్టే ఇగిరిపొయ్యాయ్....మళ్ళా కాసిన్ని నీళ్ళు పోసి, పొయ్యి వత్తి తగ్గించా.....
- కాస్తంత ఉప్పు, ఘుమఘుమలాడిపోయే మా సంబారుకారం మరికాస్తంత వేసి వేగించటం మొదలెట్టా.....ఆట్టా సంబారుకారం పడగానే ఘుమఘుమా వాసనొచ్చేసి నోట్లో నీళ్ళూరిపోయాయంటే నమ్మరు....
- ఇక అలా వేగిస్తూ బాగా ఉడికిందనిపించగానే(ఉడక్కపోతే ఇంకాసిని నీళ్ళుపోసి ఇంకొద్దిసేపు వేగించొచ్చు) బాండీ దింపేసి మూతపెట్టి కాసేపు మగ్గనిచ్చా.....
- అంతే! ఘుమాయిస్తున్న "కొబ్బరికూర" రెడీ అయిపోయింది...
మీరుకూడా ఓపాలి ట్రై చెయ్యండి....:)
12:24 AM | లేబుళ్లు: తెలుగింటి కూర, భోజనం కథలు | 19 Comments
తియ్యతియ్యని "తేనెతొనలు"
రెండ్రోజుల క్రితం, పొద్దున పొద్దున్నే అమ్మ ఫోను.."చిన్నీ! ఎల్లుండి నాన్నొస్తున్నారు నీ దగ్గరకి. ఏం పంపమంటావ్?" అని.
నేను,"ఏముంది మామూలుగానే కూరలు, పెరుగు పంపు"అన్నా...
దానికి అమ్మ,"మొన్న చిన్నత్త నేతరిసెలు పంపింది. ఓ పాతిక దాకా ఉన్నాయి.చక్కలు కూడా చేశా.అవి పంపుతున్నా...ఇంకా ఏమన్నా కావాలా?బూంది మిఠాయికాని,రవ్వలడ్డుకాని......".....
అంతే! నా గొంతు హైపిచ్ లోకెళ్ళిపోయింది..:)......"ఎప్పుడూ చక్కలు,కారప్పూస,రవ్వలడ్డు....విసుకొస్తోందమ్మా! ఏవఁన్నా కొత్తరకం పంపరాదూ..."అన్నా..
అమ్మ అంతకంటే హైలోకెళ్ళిపోయి,"నాకవే వచ్చు.తింటే తిను.లేకపోతే మానుకో" అనేసింది......
ఇంకేముంది? మనం కాళ్ళబేఱానికి...:)....."అమ్మా! ఓ కొత్త వంటకం ఉంది. "తేనెతొనలు" అని. నాకు తినాలనుంది.చెయ్యవాఆఆఅ.....ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అన్నా..
అమ్మ ఒక్కమెట్టుదిగి,"నాకలాంటివి చెప్పకు.నాకు కుదరవు.అయినా కొత్త కొత్త రకాలు ఎక్కడో చదువుతావు,నా ప్రాణం తీస్తావు." అంది.
అమ్మకొంచెం చల్లపడిందిగా, ఇక మనం అల్లుకుపోయాం...."అమ్మా! ఇది కొత్తరకం కాదే! "హంసవింశతి" కావ్యంలో "ఇడ్డెనలు తేనెతొనలు బుడుకులు నేలకికాయలు" అని చెప్పాడు....అంటే ఎంతో పాతవి, ప్రాచీనమైనవి అన్నమాట! ఎలా చెయ్యాలో నే చెప్తా, అలా ఫాలో అయిపోయి చేసెయ్యి..అవిల్రెడీ నేనొకసారి చేసి సూపర్ హిట్టు కొట్టా కూడా....ఇప్పుడు చేసుకున్నే ఓపికలేక అడుగుతున్నా..ప్లీజ్...".
ఇంకేముంది, అమ్మ పూర్తిగా ఐసయిపోయి,"సరే చెప్పు...మళ్ళా బాగా రాకపోతే నన్ను వేళాకోళమాడగూడదు మరి మీరిద్దరూ కలిసి...".
"వాకే" అనేసి, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పా... కాని దానికి అమ్మ కొంత సొంత తెలివి జోడించింది...ఫలితం, పైన ఫొటొలా ఒక షేపూ,పాడూ లేకుండా వచ్చాయి, నా దగ్గరకొచ్చేపాటికి...బాగా మెత్తగాఉండి ట్రాన్సుపోర్టులో విరిగిపోయాయి...:(.......కాని టేస్టు మాత్రం తేడా రాలేదులే.....:)....
అసలు నాకు "తేనె" అన్న మాట వింటేనే నోరంతా తియ్యగా అయిద్ది..చిన్నప్పట్నుంచీ, పిచ్చిపిచ్చి కంపెనీ తేనెలు కాకుండా మంచి కొండతేనె, పుట్టతేనె అలవాటయ్యి ఉండటం మూలాన్నేమో!
అసలు తేనె అంటేనే నాకు మొదట గుర్తొచ్చేది, మా భజనలో ఆరగింపు పాట.. మా ఊరిగుళ్ళో రాత్రి పూట భజన చివర్లో నైవేద్యం పెడుతూ, రాములవారి ఆరగింపు పాట పాడేవాళ్ళు..." ఆరగింపు చేసేమయ్యా! మీరారగించండి రామయ్యా" అని...ఆ పాటలో రకరకాల నైవేద్యాలు చెప్తూ మధ్యలో, "తేనెతో మాగినా తియ్య మామిడి పళ్ళ రసమూ" అని వస్తుంది....అదివిని రాములవారికి,ఆయన పరివారానికి ఏమోగాని నాకు మాత్రం తెగ నోరూరిపోయేది...:)...ఇక మామిడిపళ్ళ సీజను రాగానే మా తోటలోంచి మంచి రసాలు కోసుకొచ్చి అమ్మని చావగొట్టేసేవాణ్ణి," ఇప్పుడివి తేనెలో మాగపెట్టి రసం తీసి ఇస్తావా, లేదా" అని..అమ్మ మాడు మీద ఒక్కటి పీకి "నోరుమూసుకో" అనేది....నా ఆ కోరిక ఇప్పటికీ తీరకుండా అలానే ఉండిపోయింది..ప్చ్..ఏం చేస్తాం...
ఇక మన "తేనెతొనల" దగ్గరికొస్తే పేరుకు తగ్గట్టు "మధురం"గా ఉంటై....చెయ్యటం చాలా వీజీ....నేను మొదట చదివి ప్రయోగం చేసినట్టే చెప్తున్నా..మీకు ఇంకా ఏవన్నా కొత్త ఉపాయాలు తడితే, అలాకూడా ప్రయత్నించండి...
- మొదట కావల్సిన పదార్థం గోధుమపిండి....ఆటా కాని, మైదాకాని ఏదైనా వాడుకోవచ్చు...దేని రుచి దానిదే....మైదాతో ఐతే కాస్త మెత్తగా వస్తాయి.....వరిపిండి కూడా వాడుకోవచ్చు...కాని వేయించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి....ఈ పిండిని బాగా జల్లించుకోవాలి, బరకలేకుండా....
- ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బెల్లం వేసి తొక్కాలి....తీపి ఎక్కువ తిందామనుకునేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు.....కాని మొదట చేసేప్పుడు, రెండూ తక్కువ మోతాదులోనే ప్రయత్నించండి...ఒక వందగ్రాముల పిండి, యాభై గ్రాముల బెల్లం అలా....తర్వాత కావాలనుకుంటే పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చు.
- ఇలా తొక్కినపిండిలో కాస్తంత నెయ్యి, సరిపడా నీళ్ళూ వేసి చపాతీ పిండిలా బాగా కలపండి....బాగా మర్దించాలి....ఇక్కడ నెయ్యి ఎక్కువ వెయ్యొద్దు...వేస్తే వేయించటానికి కుదరదు...
- ఇక ఈ పిండిని, చిన్న నిమ్మ లేదా కమలా తొనల ఆకారంలో అంటే నెలవంక చంద్రుళ్ళా బిళ్ళలుగా తయారు చేసుకోవాలి...ఎలా చెయ్యాలనేది మీ ఇష్టమండీ! చేత్తో అయినా, అచ్చుతో అయినా......తొనల ఆకారమే కాదండీ, అంత మందంగా కూడా వత్తుకోవాలి....
- ఇలా వత్తుకున్న బిళ్ళల్ని నేతిలో గాని, మంచి నూనెలోగాని వేయించుకోవాలి......(పిండి లో ఎక్కువ నెయ్యి వేసి కలిపేట్టైతే వేయించొద్దు..ఓవెన్ లో గాని, కేకు చేసే గిన్నెలో గాని బేక్ చేసుకోవచ్చు..).
- ఇక ఈ తొనల్ని మంచి తేనె ,మునిగేట్టుగా పోసి ఊరించటమే! ఒక రోజు పాటు ఊరనివ్వాలి......
- అంతే! నోరూరించే "తేనెతొనలు" తయార్.ఇట్టా నోట్టో వేసుకుంటే అట్టా కరిగిపోతాయ్...
- పిల్లలకి ఇంతకన్నా మంచి తినుబండారాలు ఏముంటాయి చెప్పండి....డయాబెటిక్స్ బెల్లం వెయ్యకుండా వట్టి తేనేతో తడుపుకుని తినొచ్చు.(మితంగా)....:)
తు.చ. :-
రెసిపీ: ఓ పాత పుస్తకంలో చదివిన దానికి నా మాడిఫికేషన్...
శ్రమ పడి చేసినవారు: శ్రీమతి సుగాత్రీ నరసింహారావు గారు....అదేనండీ మా అమ్మగారు..:).
అవిడియా, పుటో, టపా మాత్రం నావేనండీ...:)
2:39 AM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 2 Comments
కమ్మకమ్మగా...."క్యారెట్ హల్వా"
అసలు నాకు చిన్నప్పటినుంచి హల్వాలంటే స్వీటుషాపులవాళ్ళు మాత్రమే చెయ్యగలరని, మనింట్లో చేసుకోటం అస్సలవ్వదని అనుకునేవాణ్ణి....కాని అన్నిటికన్నా బహువీజీగా చేసుకోగల స్వీటులు హల్వాలని నేను గరిట పట్టుకోటం మొదలెట్టాక అర్థమైంది....ఇంకేముంది! వారానికో రకం హల్వా చేసి పడేసి మా వాళ్ళమీదికి వదిలేవాణ్ణి...ఎలా చేసినా బ్రహ్మాండంగా కుదిరేవి...మా వాళ్ళు లొట్టలేసుకుంటూ లాగించేవాళ్ళు.....అసలీ హల్వాలు చెయ్యటానిక్కావలసిందల్లా ముఖ్యంగా ఓపిగ్గా ఓ రెండుగంటలు పొయ్యి ముందు కూచోడమే!
- అన్ని పదార్థాలూ సమపాళ్ళల్లో తీసుకోవాలి.....అంటే కేజీ క్యారెట్లకి, లీటరు పాలు, అటూ ఇటూగా కేజీ పంచదార(నేను ముప్పాతిక కేజీ వేస్తాను.తీపి తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు).....
- క్యారెట్లు మంచివి ఎంచుకోవాలి. బాగా ఎర్రగా, పెద్దగా ఉన్నవి తీసుకోండి...చిన్నవి, వడలిపోయినట్టుండే వాటితో అంత రుచి రాదు...ఎక్కడా కుళ్ళు డాగులు, రంగుమార్పులు లేనివి చూసి తీసుకోండి...గాజరగడ్డలంటారే, వాటితో అంతబాగా కుదరదు........ఇలా ఎంచుకు తెచ్చుకున్న క్యారెట్లని శుభ్రంగా కడిగాలి.....చివర మొనలు కత్తిరించి, ఆవేపు నుంచి తురుముకోవాలి(అంటే నిలువుగా పెట్టి తురమాలి)...అడ్డంగా తురిమితే అంతా ముద్దలా వచ్చేస్తుంది,బాగా ఉడకదు......గడ్డ మొత్తం తురిమాక చివర్లో తొడిమ దగ్గర పచ్చగా వస్తుంది ఒక్కోసారి.అది వదిలేయండి.......ఈ తురుముని ఒక మందపాటి,లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి....(ఈ తురుముని కొందరు కొంచెం నెయ్యివేసి వేయిస్తారు, తొందరగా ఉడుకుతుందని...అలా చేస్తే అంత రుచిరాక పోగా నిలవుండదు)
- ఇప్పుడు పాలు తీసుకుని పైన రెడీగా పెట్టుకున్న తురుములో పొయ్యండి.....పాలు ఎంత చిక్కగా ఉంటే అంత రుచి వస్తుంది...గేదె పాలు డైరెక్టుగా దొరకని వాళ్ళు హోల్ మిల్క్ వాడండి...టోన్డ్ మిల్క్ వాడితే అంత రుచి ఉండదు....కేజీకి లీటరు పాలు, అరకేజీకి అరలీటరు...అదీ కొలత....
- ఇప్పుడు ఒక రెండు గుప్పిళ్ళు పంచదార తీసుకుని పైన పాలు, తురుము మిశ్రమం లో కలపాలి...ఇలా తయారైన మిశ్రమాన్ని మూతపెట్టి ఒక పావుగంట నాననివ్వండి....ఇలా చెయ్యడంవలన ఉడికేప్పుడు తొందరగా ఉడకడమే కాకుండా మంచిరుచొస్తుంది.
- ఇప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళి పొయ్యిమీద పెట్టాలి...పొయ్యి వత్తి తక్కువలో ఉండాలి..సెగ సన్నగా గిన్నెంతా సమానంగా తగలాలి.....ఏ హల్వా అయినా ఇదే ముఖ్యం...సెగ సమానంగా తగలాలి...అందుకని నేను రైస్ కుక్కర్ వాడతా...రైస్ కుక్కర్ తో ఇంకో ఎడ్వాంటేజీ....పొయ్యి ముందు గంటలసేపు నిలబడి సెగ తగిలించుకోడాన్ని తప్పించుకోవచ్చు..చక్కగా ఏ సినిమానో చూస్తూ లాగించెయ్యొచ్చు....:)
- ఇక ఏముంది? పాలు కొంచెం కాగబట్టినయ్యనగానే తిప్పడం మొదలెట్టాలి....అలా తిప్పుతూ, తిప్పుతూ ఊఊఊఊఊఊఊఊఊనే ఉండాలి....ఊరకే తిప్పడం కాదు...కిందనుంచి మీదకి కలేసి తిప్పాలి...మీరు ఎంత బాగా తిప్పితే అంత రుచన్నమాట!
- కొంచెం ఉడుకుపట్టగానే మిగతా పంచదారని కూడా వేసి కలతిప్పండి....పంచదార మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు...తీపి సరి చూసుకుని మధ్యలో అయినా కలుపుకోవచ్చు...
- ఇప్పుడు ఉడుకుతుండగానే జీడిపప్పు ఓ గుప్పెడు తీసుకుని వేసి కలబెట్టి ఉడకబెట్టెయ్యండి...జీడిపప్పుతో కలిసి ఉడికితే మంచి రుచొస్తుంది...ఓపికుంటే జీడిపప్పుని పొడి చేసి కూడా కలుపుకోవచ్చు....
- ఇక అసలు హల్వాలన్నిటికీ ముఖ్యమైన అమృతంలాంటి పదార్థం....లాంటేమిటీ! అమృతమే!..అదేనండీ బాబూ "నెయ్యి"....కేజీ క్యారెట్లకి అరకేజీ నెయ్యి..అదీలెక్క....కనీసం నాలుగోవంతన్నా వెయ్యాలి....లేకపోతే అసలు హల్వా వండటం వృథా....."హమ్మో! అంత నెయ్యా! మా హార్టేం కావాలి? మా గ్లామరేం కావాలి" అంటారేమో! ఎప్పుడొ ఆర్నెల్లకోసారి వండి, ఓ చిన్నకప్పుడు తినేటప్పుడు ఇల్లాంటివన్నీ ఆలోచించకూడదు...హార్టు కాదు కదా, దాని మీదుండే కవరుకి కూడా ఏం కాదు, నాదీ పూచీ! నెయ్యి మాత్రం మంచి క్వాలిటీది వాడండి...ఇంట్లో తాజాగా వెన్నకాచిన నెయ్యైతే శ్రేష్ఠం....బాగా ఎఱ్ఱగా కాగిన ముదురుకాపునెయ్యైతే ఘుమఘుమలాడి పోద్ది...డాల్డాల్లాంటివి దయచేసి వాడొద్దు..వాడితే అంతా రసాభాసమే!....వెగటేస్తది అని నెయ్యి దగ్గర కాంప్రమైజ్ కావొద్దు...కావాలంటే కాస్త తీపి తగ్గించుకోండి, సరిపోద్ది...
- పంచదార వేశాక, కొంచెం దగ్గరకి అవుతుంది అనుకోగానే కొంచెం కొంచెం నెయ్యి వేసి ఉడకనివ్వాలి...ఇలా నేతిలో ఉడికితే రుచికి రుచీ, మృదుత్వానికి మృదుత్వమూ......
- బాగా దగ్గరకి అవ్వగానే ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష, చిటికెడు యాలక్కాయల పొడి వెయ్యాలి.....
- ఇక అంచులు విడిపడతన్నై అనుకోగానే మిగతా నెయ్యి పోసేసి తిప్పండి...(ఇక్కడ తిప్పడంలో కాస్త ఏమరారా అంతేసంగతి! రుచిమాట దేవుడెరుగు, మాడిపోద్ది.)
- "మర్దనం రుచి వర్ధనం" అన్నారు...మొదటి నుంచి చివర వరకూ తిప్పుతూనే ఉండాలి, అప్పుడే రుచి...ముందే చెప్పాకదా! పొయ్యి ముందు కనీసం ఓ గంటైనా కూర్చునే ఓపికుండాలి.....
- ఇక చివర్లో గోరంత పచ్చ కర్పూరం వేసి, ఒక్క నిమిషం ఉంచి దింపెయ్యాలి....పైన మీకు అలంకరణకి కావాలంటే నేతిలో వేయించిన జీడిపప్పు,బాదంపప్పు వేసుకోవచ్చు....
- పచ్చికోవాలు,ఎండుకోవాల్లాంటివి వేసుకుని రుచి చెడగొట్టుకోవద్దు...
- అంతే! కమ్మకమ్మని క్యారెట్ హల్వా తయార్! ఇలా చేసింది వేడిగా ఐనా తినొచ్చు... చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది....ఫ్రిజ్‍లో పెట్టకపోయినా నాలుగైదురోజులు నిలవుంటుంది....
తు.చ. :- పైన పుటో బాగా రాలేదు, (మన పొటోగ్రపీ స్కిల్సు అలా ఉన్నై మరి)...కాని నెయ్యి మాత్రం అలా తేలుతూ కనపడాలి...:)
5:41 PM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 13 Comments