అవును మరి!...నిఝంగా వేదమే!


పాకశాసనుడైన ఆ ఇంద్రుడికి ఓ దణ్ణవెట్టుకోండి ముందు....అద్గదీ!ఇక మన టాపిక్కులోకొచ్చేద్దాం....

"పాకవేదం"...శ్రీరమణగారు చెప్పినట్టు నాక్కూడా ఇది అచ్చు అల్లానే అనిపిస్తుంటుంది.....మరి కాకపోతే! ఎప్పుడు ఖచ్చితంగా మొదలైందో,అసలెవరు చెప్పారో ఎవరన్నా కనీసం ఉరామరిగ్గా ఐనా చెప్పగలరా! లేదుకదా! అందుకే ఆ పేరు నేను ఖాయం చేసేసుకున్నా...:).....

ఇంకోమాట! ఈ టైటిల్ ని ఎజ్జాట్టుగా కాపీకొట్టటం ఎందుకు జరిగిందనగా, అది మనకు అంతలా నచ్చేయటం ఓ రీజనైతే, ఇంకోటి దీనిమీద రమణగారు పేటెంటు హక్కులు,గట్రా ప్రకటించకపోవటం అన్నమాట! అదిగో, అవిల్రెడీ వంటల బ్లాగులు సూపరు హిట్టుగా నడిపేస్తున్న ఆడలేడీసు తెగకుళ్ళేసుకుంటున్నట్టున్నారు....మరి, పెన్ను పట్టినా,గరిట పట్టినా మాదే కియేటివిటీ మరి..:))...

ఇకపోతే, రమణగారు చెప్పినట్టు ఇది "అపౌరుషేయం" అన్నమాట! అపౌరుషేయం అంటే ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండీ! పురుషుడితో చెయ్యబడే పనిని "పౌరుషేయం" అంటారు.....అపౌరుషేయం అంటే, దానికి ఎజ్జాట్టుగా ఆపోజిట్టన్నమాట! ఆ..ఆ..ఆ...ఆడలేడీసూ.....మరీ అంత సంబరపడిపోకండి....ఇది మీరనుకుంటున్న అర్థం కాదు....అందుకే మరీ ఆవేశపడకుండా కూసింత బుఱ్ఱెట్టి ఆలోసించమనేది......ఇక్కడ ఆపోజిట్టంటే, ఆపోజిట్టు జెండరని కాదు......"పురుషులతో చెయ్యబడనిది, చెప్పబడనిది" అని అర్థమన్నమాట! ఇక్కడ పురుషుడంటే, "మనిషి" అనర్థం...మగాడా,ఆడదా అనే లింగభేదం లేదన్నమాట! మరి దేవతలు చెప్పారా?వాళ్ళల్లో ఆడ,మగ లేరా? అని కొచ్చన్సెయ్యొద్దేం.......నాకు తెలవదన్నమాట!

కాబట్టి, వేదంలో లానే ఇక్కడ కూడా ఉదాత్త,అనుదాత్తాలు పాటించాలన్నమాట! అదే ఈ మధ్యకాలంలో అస్సలు జరగట్లేదు. ఈ స్త్రీలు మాదగ్గరనుంచి లాగేసుకుని ఇలాంటి నియమాలేవీ పాటించకుండా, మా పురుషజాతిని నానా ఇబ్బందులకీ గురి చేస్తున్నారు.....పైగా "నలభీమపాకం" అన్నారుగానీ, ఎక్కడా "ద్రౌపదీపాకం","దమయంతీపాకం" అన్లేదు కదా!కాబట్టి,మాకు తెలిసిందే రెసిపీ, మేం చేసిందే వంట అనే ఈ స్త్రీజాత్యహంకార ధోరణికి నిరసనగా మొదలైందే ఈ "పాకవేదం".....(మరీ ఆవేశంలో భారీ డవిలాగులు కొట్టేసినట్టున్నాను....తూచ్..తూచ్...ఎవరూ ఏమనుకోకండేం....నాకు తెలుసు, మీరు "క్షమయా ధరిత్రు" లని..:)....)....

కాబట్టి, కామ్రేడ్స్! (ఊఁహూఁ! ఈ పిలుపు బొత్తిగా బాలేదు...మన టైటిల్ కి అస్సలు సూటవ్వట్లా! మరేమందాం? డవిరెక్టుగా పిలిచేద్దాం).....అయ్యలారా! అమ్మలారా! ఇన్నాళ్ళూ రుచీ,పచీ లేని వంట తిని బాధపడుతున్నా పురుషపుంగవులారా(బెమ్మీల్లారా!..:)..)! రుచిగా వండాలని ప్రయత్నించి విఫలమవుతున్న స్త్రీ మూర్తులారా! వచ్చెయ్యండి! మా ఈ బ్లాగు పాఠశాల్లో, "పాకవేదం" ఆభ్యసించి, చప్పబడ్డ మీ జిహ్వలకి కూసింత ఊరటనివ్వండి....

ఇక్కడ అందర్లా, "కావల్సిన పదార్థాలు" అని ఓ లిస్టు చెప్పి, తర్వాత "తయారు చేయు విధానం" అని, వాటన్నిటినీ కిందా మీదా పడేసి,కలేసి కుర్మా చెయ్యటంలా చెప్పటం జరగదు......"నేను అక్కడ రెసిపీలోలానే చేశాను, కాని మా అమ్మ చేసిన రుచో లేకపోతే ఫలానా వోటేలోడి కమ్మదనమో రావట్లేదు" అనుకున్నే వాళ్ళకి ఆ "కమ్మదనా"నికి మీరు ఫాలో అవ్వాల్సిన కిటుకులన్నీ చెప్పబడతాయన్నమాట!....ఓకే నా మరి!...ఇంకో మాట! ఇక్కడ ఎవ్వరికీ తెలియని, ఎవరూ నోట్టో పెట్టుకో అలివికాని వంటకాలు మాత్రం ఉండవన్నమాట! అదిగో! అక్కడెవరో ఊపిరి పీల్చుకుంటున్నారు..:).....అలాంటి వాళ్ళకోసమే మరి! మామూలుగా వండే పప్పులు,వీజీగా అయ్యే కూరలు కమ్మగా ఎలా వండుకోవాలో చెప్తామన్నమాట! ఓకే నా.......ఓకే!ఓకే! రేపు ఓ మాంఛి వంటకంతో కలుసుకుందామేం.....బై బై...

Blogger ఆధారితం.