పులగం - మన "భోగి" విశేష భోజ్యం
సంక్రాంతి పండగొస్తుందంటే మన తెలుగిళ్ళల్లో ఉండే సందడి అంతా ఇంతా కాదు...రాత్రిళ్ళు మేలుకుని మరీ వేసే ముగ్గులతో,హరిదాసుతో నెలముందే మొదలవుద్ది....ఒక పదిహేను రోజులు పోయాక, ఇక మొదలవుతాయి. ప్రతి ఇంటినుంచీ ముక్కుకి కమ్మగా తగిలే నేతి వాసనలు...ఎవరింట్లో ఏం చేస్తున్నారో వాసనబట్టి తెలుసుకోటం మాకు చిన్న సరదా పజిల్ లా ఉండేది....లయబధ్ధంగా వినిపించే రోళ్ళ చప్పుళ్ళు...ఇక్కడ మూడురోకళ్ళు,నాలుగురోకళ్ళతో పోటు వెయ్యటంలో పోటీలు పడేవాళ్ళు.....నాకు రెండు రోకళ్ళపోటే కష్టంగా ఉండేదనుకోండి....

పాకం పట్టిన అరిసెల పిండిని అమ్మ చూడకుండా ఎత్తుకెళ్ళడం,భలే సరదాగా ఉండేది....ఒకళ్ళింట్లో అరిసెలు చేస్తున్నారంటే, చుట్టుపక్కల పదిళ్ళవాళ్ళు చేరి కలిసి చేసేవాళ్ళు..అమ్మ ఆ పదిరోజులూ బిజీ బిజీ...ఎక్కడోచోట సరిపోయేది..."ఇవ్వాళ వాళ్ళింట్లో పాకం సరిగ్గా కుదర్లేదురా,అరిసెలు సరిగ్గా రాలా" అంటూ వచ్చేది....మా ఇంట్లో అరిసెలంటే ఓ పెద్ద ప్రహసనం....పాలేర్లు మధ్యాహ్నం పిండి కొట్టటంతో మొదలయ్యేది...సాయంత్రం పాకం పట్టేవాళ్ళు....ఇక అరిసెలు వత్తటమంటే ఓ పెద్ద ఆర్టు...మా పెద్దత్త ఒకేసారి నాలుగు,ఐదు వత్తేది...నేను కూడా ఓ చెయ్యేసేవాణ్ణి... :)....అందరూ నెయ్యి, నూనె కలిపి వండేవాళ్ళు, మా ఇంట్లో మాత్రం వట్టి నెయ్యిలో వండేవాళ్ళు..నాన్న డాల్డాలు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు... అన్నీ వరిచెత్త మీద ఆరపోసే వాళ్ళు....లెక్కపెట్టటం పిల్లల వంతన్నమాట! వెయ్యి దాకా అయ్యేవి....నేను మరీ చిన్నప్పుడు నేను నిద్ర లేచేపాటికి వంటగది నిండా అరిసెల డబ్బాలుండేవి. "తెల్లారేకల్లా ఎల్లా వచ్చాయా?" అని తెగ హాచ్చర్య పడిపోయేవాణ్ణి...అమ్మ,"నాన్న మంత్రం వేసాడు, అంతే వచ్చేశాయి" అని నవ్వుతూ చెప్పేది....ఇక పండగ మూడురోజుల్లోకీ నాకు బహు ఇష్టమైంది భోగి...ఎందుకంటే, రకరకాల విశేషాలన్నీ ఆ రోజే కదా! సంక్రాంతి రోజు ఏముంది? ఎప్పట్లా పూజ, బెల్లం పాయసం నైవేద్యం, హరిదాసుకీ, బ్రాహ్మడికీ మోయనలివ్వటం..అంతే కదా! అదే భోగి రోజునైతే వేకువఝామున్నే పోటీలు పడి వేసే భోగిమంటలు, తర్వాత అమ్మ తలకి ఆముదం,వంటికి నువ్వులనూనె రాసి రేపటగ్గిలో నుంచోపెట్టేది..తర్వాత కుంకుళ్ళెట్టి తలకలు...కొత్త బట్టలేసుకుని సాయంత్రం భోగిపళ్ళకి కావాల్సిన రేగిపళ్ళ కోసం చేల మీద పడేవాళ్ళం...,,ఊర్లోకల్లా మాదే పెద్ద రేగిచెట్టు....అన్నయ్య ఎవరూ రాకుండా కాపలా నుంచుంటే, నేను అక్కావాళ్ళం పిందెతో సహా దులిపేసేవాళ్ళం...దార్లో వచ్చేప్పుడు ఉండే చిన్న చిన్న రేగ్గుట్టల్ని కూడా వదిలేవాళ్ళం కాదు... ;)....


ఇక ఇంటికి రాగానే అమ్మ అరిటాకులేసి, కమ్మటి వాసనతో ముక్కు పుటాలు అదరగొడుతున్న వంటకం వడ్డించేది...."పులగం".....అదన్నమాట! ఇవ్వాళ పాకవేదంలో మనం రుచ్చూడబోతున్నది.....అసలు ఆ వాసనే చాలు. కడుపు నింపెయ్యటానికి....అన్నంలో పెసరపప్పు,నెయ్యి కలిపిన ఆ వాసన నాకు సంవత్సరమంతా ముక్కంటుకునే ఉండేది...మధ్యలో పేద్ద గురుగు చేసి, దాన్నిండా నెయ్యి పోసుకుని, పక్కన దొడ్లో కాసిన లేత సొరకాయల్తో నూరిన పచ్చడి, లేలేతవంకాయలు కుమ్ములో పెట్టి కాల్చి చేసిన రోటి పచ్చడి వేసుకుని తింటుంటే...."అబ్బబ్బా! ఇది కదా సంక్రాంతి సంబరమంటే!" అననిపించేది...

మరిక అలాంటి "కమ్మటి పులగం" చేసుకుని రుచ్చూద్దామా!
 • మొదట సరిపడా బియ్యం తీసుకుని రాళ్ళులేకుండా చెరిగేసి, బాగా శుభ్రంగా కడిగి, మునిగే వరకు నీళ్ళు పోసి కనీసం రెండు గంటలు నానపెట్టాలి.బియ్యం ఎంత బాగా నానితే అంత మృదువుగా వస్తుంది పులగం.....కొంత మంది కొత్తగా పండిన ధాన్యమే వాడాలని జొన్నలతో చేసేవాళ్ళు....వట్టి జొన్నలైతే కొంచెం కాయలుగా వస్తుంది, అందుకని తొక్కి రవ్వ చేసుకుని వాడుకుంటే బాగా వస్తుంది...
 • తర్వాత పైన తీసుకున్న బియ్యంలో మూడొంతులు పెసరపప్పు తీసుకోవాలి.అంటే గ్లాసు పెసరపప్పుకి మూడుగ్లాసుల బియ్యమన్నమాట! లేకపోతే మా ఊరి భాషలో "గిద్ద పప్పుకి మూడుగిద్దలు బియ్యం".....ఇవి కూడా బాగా కడిగి నానపెట్టుకోవాలి. {పెసరపప్పు బదులు కొంతమంది నల్లపెసలు వాడతారు.కందిపప్పు కూడా వాడుకోవచ్చు. కాని పెసరపప్పు రుచే వేరు..;)........అసలు ఈ పెసరపప్పు,బియ్యంల నిష్పత్తిని బట్టే దానికి పులగం,మళహోర,కట్టుపొంగలి,కిచడీ అని పేర్లు మారతాయ్.....౧) "మళహోర"లో పెసరపప్పు కి రెట్టింపు బియ్యం( అంటే బియ్యంలో సగం పెసరపప్పు) వేస్తారు...దీన్నే తమిళులు కాసింత నెయ్యి, జీడిపప్పు ఎక్కువ జోడించి "కటు పొంగలి" అంటారు. "కట్ పొంగల్", "కట్టు పొంగలి","కట్టె పొంగలి" దీని నామాంతరాలన్నమాట! తీపి వేసి, బాగా పాలు పోసి చేస్తే అది తీపి పొంగలి, తీపిలేకుండా కొంచెం కారంగా "మిరియాలు,అల్లం" వేసి చేస్తే కారంగా, కటువుగా ఉంటుంది కాబట్టి "కటు పొంగలి". ఈ కటుపొంగలి అనేది తమిళపదం, "మళహోర" మన తెలుగువాళ్ళది.కాబట్టి దీన్ని మనవాళ్ళు ఎన్నో వందలేళ్ళుగా వండుకుతింటున్నారని, ఎక్కడి నుంచీ అప్పు తెచ్చుకు తిందికాదని మనవి!........౨)ఇక "కిచిడీ" అనే "కిచ్చడి"లో బియ్యానికి, రెట్టింపు పెసరప్పు(అంటే గ్లాసు బియ్యానికి,రెండు గ్లాసుల పెసరపప్పు) కూరగాయ ముక్కలు కలిపి వండుతారు....... }.
 • అవి బాగా నానాక సరిపడా గిన్నె పెట్టి దాంట్లో తాలింపు పెట్టుకోవాలి. ఏ వంటకానికైనా తాలింపే ముఖ్యం అని చెప్పాకదా! ఎలా పెట్టాలో చూద్దాం. గిన్నెలో బాగా మరింత నెయ్యి వేసి కాగనివ్వాలి.నెయ్యి వేస్తేనే రుచి.లేకపోతే నూనెతో కూడా పెట్టుకోవచ్చు. కాగిన నేతిలో సరిపడా జీలకఱ్ఱ వెయ్యాలి. ఎక్కువైనా వేసుకోవచ్చు.ఇంక ఏ తాలింపుగింజలూ వాడొద్దు...ఇంగువకూడా వెయ్యాలి...మిరియాలు తగినన్ని ఈ తాలింపులో వేసుకోవాలి...(లేకపోతే అన్నం ఉడికేప్పుడు కూడా వేసుకోవచ్చు.మిరియాలపొడి వాడేట్టైతే అన్నం ఉడికేప్పుడే కలపాలి....)....
 • మిరియాలు వేసిన వెంటనే ఎసరు పొయ్యాలి. ఎంత పొయ్యాలి? మామూలుగా అన్నం వండేప్పుడు గ్లాసు బియ్యానికి, రెండు గ్లాసుల నీళ్ళు పోస్తాం కదా! ఇక్కడ మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి.రుచికి కావాలంటే చిన్న గ్లాసుడు పాలు కూడా పోసుకోవచ్చు.
 • ఎసరు బాగా తెర్లింతర్వాత, పైన నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. బియ్యం ఉడుకు పట్టిందనగానే పెసరపప్పు వేసి బాగా కలతిప్పి ఉడికించాలి. ఎంత బాగా తిప్పితే అంత రుచి.....రెండూ బాగా దగ్గరకయ్యాయి అనుకోగానే రుచికి తగినంత ఉప్పు, కాసిన్ని అల్లం ముక్కలు(సన్నగా తరిగినవి) కలుపుకోవాలి.మరీ గట్టిపడనివ్వొద్దు...కొంచెం మెత్తగా,లేహ్యంలా ఉంటేనే రుచి. చివర్లో దించేప్పుడు మరికాస్త నెయ్యి వేసి కలిపి దించాలి.....
 • దించాక నేతిలో వేయించిన జీడిపప్పు కలుపుకోవచ్చు......అంతే! ఘుమఘుమలాడే "పులగం" తయారన్నమాట!
 • ఎక్కడో ఒక కవి " సస్నేహా కామినీ వేయం కృశరా శిశిరే హితా" అని చక్కగా వర్ణిస్తాడు...అంటే, " ఈ పులగాన్ని కమ్మటి నెయ్యి మరికాస్త వేసుకు తింటే చలికాలంలో పడుచుపిల్లలా వెచ్చదనాన్నిస్తుందని" అర్థం...అంటే, చలికాలంలో తింటే ఆరోగ్యం అన్నమాట! నందికేశ్వర నోములో బ్రాహ్మలిళ్ళల్లో ఎక్కువగా వండుతారు దీన్ని!
 • ఇక ఆలస్యం దేనికి...చక్కగా వండుకుని, ఎత్తుకెత్తు నెయ్యి పోసుకుని, చక్కటి రోటి పచ్చడి కాని, మాంఛి దప్పళం కాని వేసుకుతిని స్వర్గ వీధుల్లో విహరించండి మరి!
చిత్రం: జ్యోతిగారి సౌజన్యంతో

ఆవమజ్జిగ....కాస్తంత రుచ్చూడండొచ్చి....హమ్మయ్య! పాకవేదంలో నా మొదటి వంటకంతో మీ ముందుకొచ్చేస్తున్నానోచ్......ముందు చెప్పినట్టుగా ఇది చాలా సింపులు వంటకమన్నమాట!కూసింత మనసెట్టి చేత్తే, తిన్నోళ్ళు మీకు కాంప్లిమెంట్లమీద కాంప్లిమెంట్లు ఊదరగొట్టేత్తారు..:)

"ఆవమజ్జిగా! ఇదేంటీ? ఆవుమజ్జిగ,గేదెమజ్జిగలా" అనుకుంటున్నారా! చిన్నప్పటినుంచి ఎవరికి చెప్పినా ఇదే కొచ్చను..అయినా తినబోతూ రుచులెందుకండీ అడగడం....నే చెప్పినట్టు ఫాలో ఐపోయి వండి, తిని,రుచ్చూసి చెప్పండి-సొర్గానికి బెత్తెడెత్తునున్నారో లేదో!...నాల్రోజుల కితం ఓ స్నేహితుడింట్లో చేస్తే, అందరూ మొదటి ముద్ద నోట్టో ఏసుకోగానే, అలా రీళ్ళు తిప్పేసుకుని సొర్గం అంచులదాకా ఎళ్ళొచ్చారంటే, దీని కమ్మదనం గురించి ఏరే చెప్పాల్నా!కాని నే చెప్పే స్టెప్పులన్నీ ఇదిగా ఫాలో అవ్వాలన్నమాట!.... అదీ, బుద్ధిమంతుల లచ్చనం....

ఓ పదిహేనేళ్ళ క్రితం అనుకుంటా! నాన్న నన్ను తీసుకుని అయ్యవార్లింటికి వెళ్ళారు...అయ్యవారంటే, బడిపంతులో, గుళ్ళో పూజారిగారో కాదండీ! పేద్ద అగ్రహారీకులు,తమిళబ్రాహ్మలు....వాళ్ళిల్లు పెద్ద రాజులకోటమల్లే ఉంటది.... దాసీలు,హడావుడి...చుట్టుపక్కల నలభై,యాభై ఊళ్ళకి గురువుగారిలాంటి వారన్నమాట!లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రోపాసకులు....రోగమొచ్చినా,ఇబ్బందొచ్చినా, పెళ్ళి ముహుర్తాలకైనా,ఇళ్ళప్లానులకైనా,గుళ్ళు కట్టాలన్నా అందరూ ఆయన దగ్గరకే వెళ్ళేవారు....ఎవరి దగ్గరా కాణీ పుచ్చుకోరు...అందరికీ ఉచిత సహాయమే....ఊళ్ళో ఏ ఆడపిల్ల పెళ్ళైనా వెళ్ళి తాళిబొట్టిచ్చి పెళ్ళి చేయించేవాళ్ళు...వాళ్ళ పొలాలు అందరూ ఊరికే చేసుకునే వాళ్ళు..... మా ఊరికి పది కిలోమీటర్లదూరంలో ఉంటుంది వాళ్ళఊరు...ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రోజుకి కనీసం ఇరవై,ముఫ్ఫైమంది వాళ్ళింట్లో ఉచితంగా భోజనం చేసేవాళ్ళు...అందరికీ చిన్నయ్యవార్ల భార్య చక్కగా మడి కట్టుకుని, కొసరి కొసరి వడ్డించేవాళ్ళు......

నాన్నగారికి,అయ్యవార్లకీ బాగా స్నేహితం...అమ్మగార్లకి కూడా నాన్నగారు బాగా పరిచయం...నాన్న ఎంత వాస్తుపండితుడైనా సలహాకో,డిస్కషనుకో ఆయన దగ్గరకి వెళ్ళేవారు...ఒకరోజు నన్నుకూడా తీసుకెళ్ళారు...బైట వెయిట్ చేస్తూ ఉన్నాం.. మధ్యాన్నమైంది....అమ్మగారొచ్చి బైటున్నందర్నీ భోజనానికి పిలిచారు...ముందు పప్పు,కూర వడ్డించారు....అయ్యాక అమ్మగారు "ఆవమజ్జిగ" వేసుకుంటారా అనడిగారు..నేను "మజ్జిక్కాదు,కొంచెం కూరవెయ్యండి" అన్నా....ఆవిడ నవ్వుతూ ఇది కూడా కూరలాంటిదే అన్నారు...సరే వెయ్యమన్నా....ఆవిడ పెద్ద వెండిలోటాతో తెచ్చి వడ్డించారు.....మొదటి ముద్ద నోట్టో పెట్టుకున్నానో లేదో
కమ్మటి,ఘాటైన రుచి నసాళానికంటి,ముక్కులకెగదన్ని కిందుమీదయ్యాను........ఆ రుచి ఇంతవరకి నే మర్చిపోలేదు...వెంటనే ఎలా చెయ్యాలో నాన్న అమ్మగారినడిగి కనుక్కున్నారు..ఇక నేను,నాన్న ఇంటికొచ్చిన తర్వాత అమ్మని పోరు పెట్టి చేయించాం....కాని ఆ రుచిలో వందోవంతుకూడా వచ్చేదికాదు......ఎందుకా అని ఆలోచిస్తే అమ్మ ఎజ్జాట్టుగా అమ్మగారు చెప్పినట్టు చేసేదికాదు...సొంత తెలివి జోడించేది....సో, మనకి నచ్చేదికాదు....ఇక్కడ మీకు ఆ ఎజ్జాట్టు రెసిపీ చెప్పబోతున్నా అన్నమాట!

హమ్మయ్య! ఇప్పటికి సోది ఆపాడురా బాబూ ఆనుకుంటున్నారా! మరి ఇలాంటి గొప్ప రెసిపీలు నేర్చుకున్నే ముందు వాటి హిస్టరీలు కూడా కూసింత తెలుసుకోవాలి మరి.....ఇక రెసిపీలోకి ఎంటరైపోదాం.....
 • ముందుగా ఏం కావాలి? - మీరు ఎంత తిందామనుకుంటున్నారో అన్ని మజ్జిగ.....ఈ మజ్జిగ ఎలా ఉండాలి? ఎలా ఉంటే మంచిరుచొస్తుంది?- బాగా గట్టిగా తోడుకున్న తియ్యటి గేదే పెరుగైతే మంచి రుచొస్తది....మజ్జిగ అన్చెప్పి మళ్ళా పెరుగంటాడేవిఁట్రా అనుకుంటున్నారా? అల్లాంటి పెరుగునుంచి చేసిన మజ్జిగ ఐతే సూపరన్నమాట!.....మజ్జిగ చిక్కగా ఉండాలి, ఎంత చిక్కగా ఉంటే అంత రుచి......కొంచెం పుల్లగా అయ్యేవరకు ఉంచాలి....అంటే సుమారు మూణ్ణాలుగ్గంటలన్నమాట! పొద్దున్నే వంట చెయ్యాలనుకుంటే, రాత్రిటి పెరుగుని కాస్త తీసి పక్కనపెట్టుకుని పొద్దున్నేలేచి,చిలికేసి ఒక గంటాగాక చేస్తే సరిపోద్ది...మరీ పుల్లగా అయినా రుచి మారిపోద్ది......ఇంకో మాట! వెన్న తియ్యొద్దు,అలానే ఉంచెయ్యండి....కాని పైన తేలకుండా, కరిగిపొయ్యేట్టు చూసుకోవాలి.....
 • తర్వాత కావల్సిన ముఖ్యమైన పదార్థం- ఆవాలు......చక్కగా,నల్లగా గుండులా ఉండేవైతే బాగుంటాయి....రాళ్ళు లేకుండా చూసుకోవాలి...ఒక అరలీటరు మజ్జిగకి, గుప్పెడు ఆవాలు సరిపోతయ్.ఇప్పుడు ఈ పచ్చి ఆవాల్ని మెత్తగా పొడికొట్టాలి....(వేయించొద్దు,అస్సలు) మిక్సీ కన్నా బండమీద గుండ్రాయెట్టి నూరితేనే మంచిది..గుండ్రాయి లేకపోతే బరువైన చిన్నగిన్నెకూడా వాడుకోవచ్చు....రోలైతే మరీ మంచిది.....బరక,బరగ్గా ఉన్న ఆ పొడిని పల్చటి గుడ్డలోక్కాని, టీ నెట్ లోక్కాని ఎత్తుకోవాలి......అందులో నీళ్ళు కొద్ది కొద్ది చుక్కలుగా వేసి ఈ పొడినుంచొచ్చే రసాన్ని,పైన రెడీ గా ఉంచుకున్న మజ్జిగలోకి పిండుకోవాలి(వడకట్టాలన్నమాట)...ఎంత రసం వస్తే అంత రుచి......పిప్పి మజ్జిగలో పడకుండా జాగ్రత్త పడాలి, పడితే తినేప్పుడు చెత్తచెత్తగా అనిపిస్తుంది...(ఈ వడకట్టటం,రసం తియ్యడం ఎందుకులే అనుకుంటే, పొడి బాగా మెత్తగా నూరుకుని, నాలుగు చుక్కలు నీళ్ళు వేసి పేస్టులా చేసి,అప్పుడు మజ్జిగలో కలపాలి....పొడి డవిరెక్టుగా మాత్రం కలపొద్దేం)......
 • తర్వాత చిటికెడు పసుపు కలపాలి....(స్పూనుల లెక్కలు మనకు తెలవదు..చేత్తో తీసుకుని ఉరామరిగ్గా వేసెయ్యటమే...).. ఆనక, మీరు ఎంత తింటారో అంత ఉప్పు,కాసింత ఎండుకారం కలుపుకోవాలి(మసాలా కారాలు,కొబ్బరికారాలు వాడొద్దు)...
 • టమాటా ముక్కలు,ఉల్లిపాయలు లాంటి చెత్త మాత్రం అస్సలు కలపొద్దు...కలిపితే అసలు టేస్టు హుష్ కాకీ!అల్లం కూడా వద్దు, సాధుత్వం పోతుంది. అంతగా వెయ్యాలనుకుంటే డైరెక్టుగా ముక్కలు వెయ్యొద్దు..కాస్తంత రసం తీసి వేసుకోవచ్చు.....పచ్చి మిర్చి మాత్రం మీ ఇష్టం....ఒకటి,రెండు కాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు....
 • ఇలా కావలసినవన్నీ వేసి బాగా కలుపుకోవాలి...
 • ఇప్పుడు తిరగమాతెట్టుకోవాలి. అదేనండీ మీ భాషల్లో తాలింపు,పోపు వగైరా వగైరా.....
 • నా మట్టుక్కు నాకు ఏ కూర రుచైనా తిరగమాత మీదే ఆధారపడుంటది....ఒక్కో కూరకి ఒక్కోరకం తాలింపు....ఇక్కడెలా పెట్టాలి? తొందరెందుకూ, చెప్తా కదా! మొదట్లో నాకైతే తిరగమాత మాడకుండా సూస్కోటమే పేద్ద నల్భీమపాకంలా అన్పించేది మరి!
 • పొయ్యి మీద బాండీ పెట్టెయ్యండి..బాండీ వేడెక్కగానే, దాంటో ఓ గెంటెడు నూనేస్కోవాలి..ఏ నూనె? అది మీ ఇష్టం...నాకు మట్టుక్కూ నాకు, నెయ్యిగాని,వేరుశనగనూనె గాని కావాలి....వాటి దుంపదెగ! అవెట్టి పోపెడితే ఎంత కమ్మగా ఉంటయ్యో కూరలు.....ఇదిగో హెల్తెవేర్నెస్సు పిల్లలూ! నామీదకి దండెత్తెయ్యకండేం!.... నూనె కొంచెం కాగిందనంగానే కాసిన్ని ఆవాలూ, మరి కాసింత జీలకఱ్రా ఎయ్యాలి..అవి చిటపటలాడగానే కాసిన్ని ఎండు మిరగాయలు(తుంచి వెయ్యాలి),మాంఛి నవ నవలాడే కరేపాకు గుప్పెడు వేసెయ్యండి...అసలు ఆవమజ్జిక్కి రుచల్లా ఈ రెండే....మధ్యలో పొయ్యి వత్తి తగ్గించి పెట్టుకోండి, లేకపోతే తిరగమాత మాడిపోద్ది....మినప్పప్పూ,పచ్చనగపప్పూ వెయ్యాల్సిన పన్లేదు...వేసినా ఇబ్బందిలేదు...ఇవి వేగేలోపే, ఒక వెల్లుల్లిరెబ్బ గరిటతోగాని, పప్పుగుత్తితోగాని నొక్కి వెయ్యండి..ఆ చేత్తోటే కాసింత ఇంగువ.....అన్నీ మోయనంగా వేగాక బాండీ దించెయ్యండి...
 • ఇప్పుడు ఈ తిరగమాతని, ముందు అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్న మజ్జిగలోకి వేసి తిప్పెయ్యండి...అంతే ఘుమఘుమలాడే "ఆవమజ్జిగ" రెడీ...పైన అలంకరణకి కావాలంటే కూసిన్ని కొతిమీరాకులు జల్లుకోవచ్చు....
 • ఇక దీన్ని వేడివేడి సన్నన్నంలో గాని, జొన్న సంకటిలోగాని కలుపుకు తింటే ఉంటది...ఆహా! సొర్గానికి నిజంగా బెత్తెడెత్తునే....అదేదో ఇంగిలీసులో అంటారే ఫింగర్‍లికింగ్ అని, అలా ఎవరూ చూడకుండా వేళ్ళు కూడా నాకేస్కోవాలని తెగ అనిపించేత్తది మరి.....ఇంకోమాట చెప్పటం మర్చిపొయ్యా. ఎండు మిరగాయలు,కరేపాకు ఏరెయ్యకండేం....నూనెలో వేగి,తర్వాత మజ్జిగలో నానిన వాటి రుచే వేరు.....
 • ఇందులో ఆరోగ్యం,క్యాలరీలు,తొక్కు,తోలుగుడ్డూ అని ఏం ఆలోచించకుండా చక్కగా రుచిని ఆస్వాదించండేం.... చేసేప్పుడు ఏమన్నా డవుట్లొస్తే ఎంటనే కామెంటెట్టెయ్యండి.....
 • మళ్ళా ఓ మాంఛి వంటకంతో కలుసుకుందాం....ఉంటానేం....

Blogger ఆధారితం.