తొలేకాశి - అసలిది " పేలపిండి" పండగ
"అసలీ పండగేంటి? దానికా పేరు ఎందుకొచ్చింది? సంవత్సరంలో ఇన్ని ఏకాదశులుండగా, ఈ ఏకాదశినే పెద్ద పండగలా చేసుకోటం ఏంటీ! అందునా సంవత్సరం మధ్యలో వచ్చే ఏకాదశిని "తొలి" ఏకాదశి అనటమేంటీ! ఈ పెద్దోళ్ళకి ఒక ఆలోచనా,బుఱ్ఱా పాడూ ఉండదు, నేనైతే "మధ్య ఏకాదశి" అనో,లేకపోతే "రాములోరి ఏకాదశి"(మూణ్ణెల్ల ముందు శ్రీరామ"నవమి" వెళ్ళిందికదా, అందుకని. పైగా, మా ఊరిగుళ్ళో ప్రతి సంవత్సరం ఈ పండక్కి "రామాయణం" నాటకం వేసేవాళ్ళు లెండి) అనో పెట్టేవాణ్ణి. అసలదంతా ఎందుకు చక్కగా "పేలపిండి పండగ" అని పిల్చుకుంటే పోలా!" .....ఈ విధంగా మన బుల్లప్పుడు బుఱ్ఱ్ర, పెదపేద్ద ఆలోచనలు చేసేసి, నిర్ణయాలు తీసేసుకుని, జంకూగొంకూ లేకుండా వెళ్ళి అమ్మమ్మ దగ్గర డబడబా వాగేసేది...దానికి అమ్మమ్మ,"నీ మాత్రం తెలివి లేకనుకున్నావా! ఉగాదితో పండగలు ఊడ్చుకుపోతయ్యి, తొలేకాశితో తొలకరిస్తయ్యి.అందుకని దీన్ని తొలేకాశి అంటారు చిన్నయ్యా!"అని చెప్పేది...ఊఁహూఁ! నాకస్సలు నచ్చలా ఆ సమాధానం...పైగా దానివల్ల ఇంకా బోలెడు అనుమానాలు..ఇక ఆగలేక నాన్నని అడిగేద్దామనుకుని డిసైడైపోయా.....
మళ్ళా నాన్న దగ్గర మాత్రం అల్లా కాదండోయ్!మన అతి తెలివి ప్రదర్శించామనుకోండి, వీపు పేలిపోద్ది....అందుకని అతితెలివి కన్నా ఇంకా కొంచెం తెలివిగా నాన్న దగ్గరకెళ్ళి, అమాయకంగా,గోముగా, మన జ్ఞానపిపాస అంతా మొహంలో కనిపిచ్చేట్టు," నాన్నీసూ! ఈ పండగకి "తొలి ఏకాదశి" అనే పేరు ఎలా వచ్చిందీ తెలుసుకోవాలనుంది" అని అడిగేవాళ్ళమన్నమాట....మన జ్ఞానతృష్ణకి నాన్న మహదానందపడిపోయి, బొజ్జమీద కూర్చోబెట్టుకుని,
" ఏం లేదు చిన్నీసూ! వెరీ సింపులు. మనకి తొలకరి వర్షాలు పడేది ఎప్పుడు?".
"ఆషాఢమాసంలో".
"కదా! మనం వ్యవసాయదారులం. తొలకరి అంటే మనకి పెద్ద పండగ. అందుకని ఆషాఢ శుద్ధఏకాదశిని "తొలి ఏకాదశి" పండగ్గా చేసుకుంటామన్నమాట!"....
హ్మ్! అయినా మనం సమాధాన పడలా.....
"మరి ఆషాఢ శుధ్ధపాడ్యమిని "తొలిపాడ్యమి" అనీ, విదియని " తొలివిదియ" అనీ ఇలా ఎందుకు చేసుకోము..పైగా, వర్షాలసలు ఒక్కోసారి జ్యేష్ఠంలోనే మొదలవుతాయి కదా..."అని, తెగ ఆలోచిస్తుంటే, మన కొశ్చన్ మార్క్ మొహం చూసి నాన్న నవ్వేసి, " తృప్తి కలగలేదా! సరే అసలు కారణం చెప్తానుండు.....చాతుర్మాస్య వ్రతం అని ఒక వ్రతం ఉంది....అది ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలయ్యి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రపోతాడు.అందుకని ఆ రోజుని "శయనైకాదశి" అనీ, "తొలి ఏకాదశి" అనీ పిలుస్తారు. కార్తీకశుద్ధ ఏకాదశినాడు మళ్ళా నిద్రలేస్తాడు,కాబట్టి దాన్ని "ఉత్థాన ఏకాదశి" అనీ, " చిల్కు ఏకాదశి" అనీ పిలుస్తారు. ఈ నాలుగు నెలలూ యోగులు,సన్యాసులు ఎక్కడికీ కదలకుండా ఒక్కచోటనే ఉండి, ఆ విష్ణువుని అర్చిస్తారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు.కాబట్టి మనం ఆషాఢ శుద్ధఏకాదశిని పండగలా చేసుకుంటాం" అని చెప్పారు....
మన మొహంలో ఇంకా పావువంతు కొశ్చనుమార్కు ఎక్స్ ప్రెషను....:)
అది చూసి నాన్న నవ్వుతూ," పైగా పిన్ని వాళ్ళు సంవత్సరమంతా ఏకాదాశి ఉపవాసాలుంటారు తెలుసు కదా! ఆ ఉపవాసాలని ఇవ్వాళ మొదలెడతారన్నమాట! ఇవ్వాళ మొదలెట్టి ఇరవైనాలుగేకాదశులూ చేస్తారు....కాబట్టి దీన్ని "తొలి ఏకాదశి" అన్నారు..." అని ముగించారు.....హమ్మయ్య! మనసు అప్పటికి తేలికపడింది....
అద్దండీ! అసలు "తొలేకాశి" పండగ వెనకున్న కథ.....
ఇక పండగ రోజు ఎన్ని సంబరాలో!పొద్దున్నే లేవడం, తలకలు,కొత్తబట్టలు,పూజ మామూలే.... పబ్లిక్ హాలిడే కాదు కాబట్టి స్కూలుకెళ్ళాల్సిందే...వెళ్ళి హెడ్మాస్టరు గారిమీద మా టీచర్లందరిచేతా గాట్టి వత్తిడి తెప్పించి, హాఫ్ డే ఆప్షనల్ సెలవిప్పించుకుని పుస్తకాల సంచి గిరగిరా తిప్పుకుంటూ ఇంటికి పరిగేత్తుకొచ్చేసేవాళ్ళం..వచ్చేపాటికి, పొయ్యి మీద మంగలం పెట్టి అమ్మమ్మ పేలాలు వేపుతూ ఉండేది...ఇక గొంతు, గుళ్ళో మోగుతున్న మైకుకి పోటీగా పెంచి అమ్మమ్మని అరిచేసేవాణ్ణి..."పక్కింటి గోవిందమ్మ నాయనమ్మా, కాంతమ్మమ్మమ్మా వాళ్ళ రోళ్ళు అప్పుడే మోగుతున్నయ్యి. నువ్వింకా పేలాలు వేపుతూనే ఉన్నావ్....ఎప్పుడు వేపుతావ్, పిండెప్పుడు కొడతావ్..వాళ్ళది ఐపోగానే శ్రీనూ, శివా గిన్నెలనిండా పోసుకొచ్చుకొని తింటూ, నాకు ఊరిస్తూ గొప్పలు పోతారు...నువ్వేమో ప్రతిసంవత్సరం ఇంతే, నా ఫరువు తీసేస్తున్నావ్.." అని తెగ ఆయాసపడి పోయేవాణ్ణి....
అమ్మమ్మ" చిన్నయ్యా! గోవిందమ్మవాళ్ళది వట్టి పిండే...కొబ్బరుండదు,దోసిత్తనాలుండవు...కాంతమ్మ వాళ్ళది వట్టి చిమ్మిలి.....పైగా, ఇద్దరిదీ నోటికి చుట్టకొచ్చేట్టు పొడి పిండి...నీకు నిండా మెఱుగేసి పెడతాగా...అప్పుడుదాకా, గుళ్ళోకిపోయి సంబరం చూసిరా" అనేది.....సరేలెమ్మని పొంగలన్నంలో వంకాయకూరేసుకుని నిండా లాగించి, గుడికి ఒక్క దౌడు తీసేవాణ్ణి...అన్నయ్య అప్పటికే గుడి దగ్గర వీరవిహారం చేస్తుండేవాడులెండి......
మా చెన్నకేశవ స్వామి గుళ్ళో తొలేకాశికి ఏకాహం చేస్తార్లెండి...గుడి ఆవరణంతా పందిళ్ళు, భజనలు, ఫెళఫెళగా ఉండేది...రామనామం సాగుతూనే ఉండేది...ఊర్లోకెల్లా బుధ్ధిమంతుణ్ణి కదా..;)....దేవుడికి దణ్ణవెఁట్టుకుని, కాసేపు భజన చేసి తర్వాత ఆటల్లో పడేవాళ్ళం.....అబ్బో ఎన్ని ఆటలో....ముఖ్యంగా కళ్యాణమండపం స్తంభాలు పట్టుకుని ఆడే "నాలుగు స్తంభాలాట"...ఎంత ఇష్టమో నాకు.....తెగ ఆడీ ఆడీ, నాలుగింటికల్లా ఇల్లు చేరేవాణ్ణి.( నాన్న ఆఫీసునుంచి వచ్చేస్తారుగా అందుకని..;)..)....అప్పటికి ఘుమఘుమలాడిపోతున్న "పేలపిండి" రెడీగా ఉండేది...ఎత్తుకెత్తు నెయ్యి పోసుకుని శుభ్రంగా లాగించేవాణ్ణి..ఇక సాయంత్రం అమ్మా నాన్నలతో కలిసి గుడికెళ్ళేవాళ్ళం...ఎందుకో మరి, అమ్మ ప్రతి తొలేకాశికి గుడికెళ్తూ వాళ్ళ పెళ్ళిచీర కట్టునేది......వక్కరంగు వెండిజరీ చీరలో, గుళ్ళో వేసిన రంగురంగుల ట్యూబులైట్ల కాంతిలో మెరిసిపోతుండేది అమ్మ.......
అర్చన చేయించుకుని, కాసేపు భజన దగ్గర కూర్చుని వచ్చేసేవాళ్ళం.ఇక రాత్రికి "రామాయణం" నాటకం చూడాలని గబగబా తినేసి అమ్మమ్మని లాక్కుని వెళ్ళేవాళ్ళం.....కాని వాళ్ళు మొదలెట్టేపాటికి పదో,పదకొండో అయ్యేది...మనం ఆపాటికి చక్కగా అమ్మమ్మ వళ్ళో బజ్జుండేవాళ్ళం.....కళ్యాణమప్పుడూ, చివర పట్టాభిషేకమప్పుడూ లేపి చూపించేది...ఒక్క సంవత్సరం కాబోలు నాన్న తీసుకెళ్ళి మొత్తం నాటకం చూపించారు...తర్వాత రోజు స్కూల్లో ఆ డిస్కషన్లతో గడిచిపోయేది..కొంత మంది "పేలపిండి" పొట్లాలు కట్టుకు తెచ్చుకునేవాళ్ళు....;).....తిరిగొస్తూ గుడికెళ్ళి, ఏకాహం ముగించి ఊరేగటానికి బైల్దేరుతున్న మా స్వామితో ఊరంతా ఒక రౌండేసి వచ్చేవాళ్ళం...చివర్లో పెట్టే "పంచ కజ్జాయం" నాకు ఎంత ఇష్టమో........అల్లా ముగిసేవి మా తొలేకాశి సంబరాలు......
బాగా రెండు మూడు పెద్ద డబ్బాలకి కొట్టి పెట్టేది అమ్మమ్మ....ఆ పది పదిహేను రోజులూ నెయ్యి పోసుకుని తెగలాగించేవాళ్ళం.అసలా రుచే వేరు.పండగరోజు సాయంత్రం చాకలి సుబ్బన్న వచ్చేవాడు. అమ్మమ్మ గిన్నెలో పొంగలన్నం పెట్టి, పేలపిండి కాగితంలో చుట్టిచ్చేది.వాడది తీసుకుని "కాస్త మెఱుగుబొట్టు వెయ్యి కాపమ్మా,లేకపోతే నోరు చుట్టకొచ్చిద్ది" అనేవాడు.అమ్మమ్మ నవ్వుతూ, పెద్దగిన్నె నిండా నెయ్యి పోసిచ్చేది.
ఈ సంవత్సరం నేను కొత్తరోలు కొన్నాగా..కాబట్టి పేలపిండి కొడదామనుకున్నా..అమ్మకి చెప్తే,"ఇప్పుడు మన ఊర్లో కూడా ఎవరూ కొట్టట్లేదు చిన్నీ. రిస్కు ఎక్కడ పడతావ్.కాస్త చిమ్మిలి చేసుకో.త్వరగా ఐపోద్ది అంది...." ఆయ్! సమస్యేలేదు. పేలపిండి చెయ్యాల్సిందే.తినాల్సిందే" అని,అన్ని సంభారాలూ తెచ్చుకుని కొట్టాను...భలేగా కుదిరింది లెండి...నెయ్యి పోసుకు తింటుంటే ఎంత కమ్మగా ఉందో! పన్లోపని మీకు కూడా చెప్తే మీరూ చేసుకుంటారుగా! చెయ్యటం చాలా వీజీ!
- మొదట మాంఛి జొన్నలు తీసుకోండి. పచ్చజొన్నల కన్నా తెల్లజొన్నలు బెటర్...ఎన్ని?...మీ ఇష్టమండీ బాబూ! నేనైతే పావుకేజీ తెచ్చుకున్నా....నా ఒక్కపొట్టే కదా... ఆ జొన్నల్ని రాళ్ళు లేకుండా ఏరేసుకోండి. బాగా వెడల్పాటి బాండీ పొయ్యి మీద పెట్టుకోండి.....ఆ బాండీలో ఈ జొన్నలు పోసి,వెడల్పాటి అట్లకాడతో కదుపుతూ జాగ్రత్తగా వేయించాలి.....సన్నసెగ మీద వేయించుకోవాలి....లేకపోతే ఊరికే మాడిపోతయ్.....కుంపట్లో ఐతే బెటర్...బాగా పొట్లాలు విచ్చుకుని, పేలాలయ్యాక దించెయ్యండి......కాని ఈ పేలాలు వేయించడం మాత్రం పెద్ద బ్రహ్మవిద్యే.....అన్నీ చక్కగా పువ్వుల్లా రావాలంటే చాలా కష్టం.....కొంతమందికే జొన్నపేలాలు వేగుతాయ్ అంటారు..చేతుల మహిమ...:)
- ఇప్పుడు అదే బాండీలో పేలాలు తీసేసి ఓ చుక్క నెయ్యి వేసి దోసవిత్తనాలు వేయించుకోవాలి...ఈ దోసిత్తనాలు చేత్తో అలా తీసుకుని ఉజ్జాయింపుగా వేసుకోడమే......మీరు తయారు చేసుకున్న విత్తనాలైనా పర్లేదు.లేకపోతే పచారీ కొట్లో దొరుకుతాయి...బాగా పప్పు పట్టినవి చూసి తీసుకోండి...చిటపటలాడి ఎగిరిపోతయ్,కాస్త జాగ్రత్తగా మూత అడ్డం ఉంచుకుని చిన్నవత్తి మీద వేయించండి....ఇవి కొంచెం ముదురు రంగు తిరగ్గానే దించెయ్యాలి..వేయిస్తుంటే ఎంత కమ్మటి వాసన వస్తాయో....
- ఇక పేలాల్ని రోట్లో వేసి దంచాలి.(రోలు లేకపోతే మిక్సీ..రుచి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను..:)...)..కొద్దిగా బరగ్గా పిండయ్యాయి అనుకున్నాక దోస విత్తనాలు వేసి తొక్కాలి...బాగా మెదగ్గానే, మీకు ఎంత తీపి కావాలనుకుంటే అంత బెల్లం వేసుకోవాలి..నేను పావుకేజీ జొన్నలకి,పావుకేజీ బెల్లం వేశాను....బెల్లం పిండిలో బాగా కలిసేట్టు తొక్కాలి.....
- రోట్లోంచి వెడల్పు గిన్నెలోకి ఎత్తుకుని, యాలకులపొడి కలపాలి....కావాలనుకున్నవాళ్ళు ఎండుకొబ్బరి తురుము కూడా కలుపుకోవచ్చు...
- ఇక గాలిపోకుండా డబ్బాలో పెట్టుకుని, రోజూ కాస్త లాగించడమే! ఎత్తుకెత్తు మెఱుగు మాత్రం మర్చిపోవద్దేం! అదేనండీ, కమ్మటి నెయ్యి..:)
8:52 PM | లేబుళ్లు: తియ్యతియ్యగా, పండగల విశేష భోజ్యాలు | 10 Comments
సొరకాయ పాయసం - ఇదో "శాకపాయసం"
"అనగనగా, ఒకానొక తెలుగుబ్లాగుదేశంలో ఆడవాళ్ళు మాత్రమే వంటల గురించి రాయగలరని,వాళ్ళకి తెలిసినవే వంటలని వాళ్ళు ఫీలవుతున్న రోజులు..అప్పుడు ,ఆ స్త్రీజాత్యహంకారధోరణికి గొడ్డలిపెట్టుగా మా బెమ్మీల తరపునుంచి మా నాగా "మీరేం చేస్తారు? మేం రైస్ కుక్కర్లో చపాతీలు కూడా బహువీజీగా చేసెయ్యగలం" అని చేసి చూపించాడు..బెమ్మీనా మజాకా!.;)..అప్పుడు అది చూసి తెగ కుళ్ళేసుకున్న ఈ ఆడలేడీసు పాపం మా నాగ మీద పొలోమని దండెత్తేశారన్నమాట! సమయానికి మంచుగారు కూడా అందుబాటులో లేరు..సో, నేనొక్కణ్ణే నా రైసుకుక్కర్ వంటల్ని అమ్ములపొదిలో పెట్టేసుకుని మా నాగాకి సపోర్టుగా కామెంట్ల యుద్ధంలోకి దిగేశాను....
నా ఒక్కో అస్త్రం సంధిస్తుంటే, అప్పుడు నేస్తం గారు యుద్ధభూమిలోకి ఎంటర్ అయిపోయి నా "సొరకాయ పాయసం" అనే అస్త్రాన్ని,లేడీసుకి సహజమైన వంటాహంకారంతో(దీంటో కాస్తంత గోదారి అభిజాత్యం కూడా ఉందనుకోండి..:)...) అదసలు అస్త్రమే(వంటకమే) కాదు అని తేల్చేశారు....దాంతో తీవ్రంగా హర్టయిన నేను ఆ స్త్రీజాత్యహంకారధోరణికి నిరసనగా కొత్త బ్లాగు మొదలెట్టేశానన్నమాట!"
అదీ "పాకవేదం" పుట్టుక వెనక ఉన్న అసలు హిస్టరీ....తర్వాత విషయాలు మీకు తెలిసినవే...:)
నేస్తం గారూ! ఉన్నారా! ఉంటే, "సొరకాయ తో పాయసం కూడా చేస్తారా.." అన్నారుగా..ఎలా చెయ్యాలో ఇవ్వాళ చెప్పేస్తున్నా...మీరు ప్రయత్నించి ఎలా ఉందో చెప్పాలన్నమాట..:)...
అసలు పాయసం అంటే ఏంటి? "పయః" అంటే పాలు అని అర్థం... ఆ పాలతో వండిన పదార్థం కాబట్టి "పాయసం" అయింది....దీన్ని రకరకాలుగా పిలుస్తార్లే...పాయసం,క్షీరాన్నం,పరమాన్నం,పరవాణ్ణం..ఇలా బోల్డు రకాలుగా పిలుస్తార్లే....మా ఊళ్ళల్లో ఐతే "పాసెం","సిరాన్నం" అంటారు.....నాకీ "పాసెం" అంటే అర్థమయ్యేదికాని, ఈ "సిరాన్నమే" బొత్తిగా అర్థమయ్యేది కాదు,అమ్మమ్మ అంటుండేదలా....."సిరాపోసి వండుతారా ఏంటి ఖర్మ!" అనుకున్నే వాణ్ణి....కాని ఆలోచిస్తే టక్కున లైటు వెలిగిందోసారి..."ఓహో! ఇది క్షీరాన్నానికి వికృతన్నమాట" అని....అబ్బ! చూడండి నాకు ఎంత తెలివో! పక్కన ఎవరూ లేకపోటంతో, నా తెలివికి సెబాస్ అని నేనే జబ్బ చరిచేసుకున్నానన్నమాట!....:)..
ఇక ఆ పాయసాన్ని కూరగాయలేసి వండితే దాన్నే" శాకపాయసం " అంటారు....ఇది నాన్నగారు కనిపెట్టిన పదంలెండి....మనకి నో క్రెడిట్స్.:)...అమ్మ రకరకాల శాకపాయసాలు వండేది....వంకాయ పాయసం,బీరకాయ పాయసం, ములక్కాడల పాయసం,బూడిదగుమ్మడి పాయసం, అరటికాయ పాయసం, చివరికి "ఉల్లిపాయసం" కూడా...:)...ఎన్ని రకాలుగా వండినా సూపర్గా ఉండేది, మా ఊళ్ళల్లో పిచ్చ ఫేమస్ "సొరకాయ పాయసమే".....మిగతా వాటికి అంత రుచి రాదు...
సంక్రాంతి నెలలో తెగ కాస్తాయేమో సొరకాయలు, మా ఊళ్ళో రోజుకొకళ్ళేనా వండుకుంటారు.....మా ఇంట్లో ఇప్పటికీ విరక్కాస్తాయి సొరపాదులు...బజారంతా పంచుతుంది అమ్మ, కాయలు..ఇక ఆ సీజన్లో మా ఇంట్లో ఒకటే సొరకాయ వంటకాలు..... పాలేసి కూర,వేపుడు,పులుసు, రోటి పచ్చడి...ఆఖరికి ఓ జాడీడు ఊర పచ్చడి కూడా పెట్టేస్తుంది అమ్మ.......ఇక పాయసమైతే కనీసం వారానికోసారన్నా వండాల్సిందే, పేద్ద తపేళాకి.....ఇక ఆ రోజు అన్నంలేదు....కూరలు కూడా దాంటో కలుపుకు తినడమే.....పేద్ద గురుగు చేసి, దాన్నిండా నెయ్యి పోసుకుని, పక్కన సాధుమసాలా దట్టించిన వంకాయ కూర, రోటి పచ్చడి వేసుకుని నంజుకుంటూ తింటుంటే ఉంటదీ..అబ్బబ్బా....స్వర్గానికి బెత్తెడెత్తున కాదు, దాటి పైపైనే.......:)...
ఇక కొంతమంది మామూలుగా బియ్యంతో వండే పొంగలన్నంలో కాస్త సొరకాయ తురుము వేసి అదే సొరకాయ పాయసం అని ఫీల్ అయిపోతుంటారు,దాన్ని మళ్ళా హిందీలో "కద్దూ కా ఖీర్"అని పిల్చేసి తెగ పోషు ఫీలింగూ...మా క్లాసుమేటు ఒకమ్మాయి అలా చేసి తెగ గొప్ప ఫీల్ అయ్యేది...కాని తర్వాత నా "సొరకాయ పాయసం"తిన్నాక తను వండటమే మానేసింది, (మా ఫ్రెండ్సు చావగొట్టేశారు మరి..:)..).....బై డెఫినిషన్ కరెక్టవ్వొచ్చేమోగాని, రుచివార చూస్తే దానికీ, మా ఇళ్ళల్లో చేసుకునేదానికీ చాంతాడంత డిఫరెన్సు......అసలు ఆ విధానమే వేరు...మరి అది ఎల్లాగో చూద్దామా.....
- ముందు ఒక మంచి సొరకాయ తీసుకోవాలి.మంచి అంటే ఎలా అనుకుంటున్నారా! ఏం లేదండి...మరీ లేతగా కాకుండా బాగా కండ పట్టి ఉండాలి...అలా అని మరీ ముదరకూడదు....దీన్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసి,విత్తనాలు కూడా తీసేసి, కండవరకు మోయనమైన సైజులో ముక్కలు కొయ్యండి....తురుముగా చెయ్యొద్దు..ముక్కగా తగుల్తుంటేనే రుచి....
- ఇప్పుడు కొంచెం లోతుగా,వెడల్పుగా ఉండే మందపాటి గిన్నె తీసుకుని,దాంట్లో పైన కోసిపెట్టుకున్న ముక్కల్ని వేసి, సరిపడా ఉప్పు,నీళ్ళు వేసి పొయ్యిమీద పెట్టి ఉడికించండి....
- తర్వాత కావల్సిన ముఖ్యమైన పదార్థం బియ్యప్పిండి....తాజాగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న పిండి అయితేనే బాగుంటుంది...పాయసం చెయ్యాలనుకుంటే పొద్దున్నే బియ్యంనానబోసి, ఓ రెండు గంటలు నాననివ్వాలి...రాత్రి నానబెడితే మరీ మంచిది...తర్వాత ఆ బియ్యాన్ని కడిగి వడెయ్యాలి..నీళ్ళన్నీ వడిచాక పిండి కొట్టుకోవాలి..రోట్లో కొడితే చాలా బాగా వచ్చిద్ది..కుదరకపోతే మిక్సీ పట్టుకోవచ్చు...{తడిపిండి మాత్రమే వాడాలి..పొడిపిండి పనికిరాదు}
- మీడియం సైజులో ఉండే కాయకి, ఒక సోలెడు పిండి(సుమారుగా అరకేజీ బియ్యం), ఒక అరకేజీ బెల్లం పడతాయి.....కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు...అప్పుడు ముక్కలు ఎక్కువ తగుల్తాయి....
- బెల్లాన్ని ఓపిక ఉంటే తురుముకోవచ్చు.లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా నలగ్గొట్టి బియ్యప్పిండిలో వేసి నీళ్ళుపోసి బాగా జారుగా కలుపుకోవాలి.....బాగా నీళ్ళు,నీళ్ళుగా(గరిటజారుకంటే ఇంకొంచెం పల్చగా) కలుపుకోవాలి...ఉండలు కట్టకుండా చూసుకోవాలి.....ఈ మిశ్రమంలోనే ఎండుకొబ్బరి తురుము ఒక కప్పుడు వేసి కలిపెయ్యాలి....
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పైన ముక్కలు ఉడికాయనుకోగానే వాటిలో పోసి మెల్లగా తిప్పుతూ ఉండాలి...పోసేప్పుడు ఒక్కసారిగా గుమ్మరించొద్దు...మెల్లగా పోస్తూ, గరిటతో తిప్పుతూ ఉండాలి.లేకపోతే ఉండలు కడుతుంది....పిండి బాగా ఉడికి దగ్గరకి అయ్యేవరకు మెల్లగా తిప్పుతూనే ఉండాలి..మరీ స్పీడుగా తిప్పొద్దు,ముక్క చెదిరిపోతుంది....ఉండకట్టకుండా చూసుకుంటే చాలు....
- పిండి బాగా ఉడికింది, దగ్గరకి అయిందనగానే పాలు పొయ్యాలి...సుమారు అరలీటరు పొయ్యాలి..ఎక్కువ పోసినా రుచొస్తుంది.....పాలు పోసి సన్నసెగ మీద ఉడికించాలి. బాగా దగ్గరకి అవ్వగానే నెయ్యి,యాలకులపొడి,పచ్చకర్పూరం వేసి దించెయ్యాలి...డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు.....నేను వెయ్యను..ఎందుకో నాకు నచ్చదు...:)
- పైన చెప్పిన విధానం మా ఇంట్లో వండేది...మా అమ్మవాళ్ళ నాయనమ్మ అలా కాకుండా, ముక్కలు,పిండి,పాలు,బెల్లం అన్నీ నీళ్ళుపోసి కలిపేసి పొయ్యి మీద (కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చేమో!)పెట్టి తిప్పుతూ ఉడికించేదట! నేనెప్పుడూ అలా ప్రయత్నించలా....కావాలంటే మీరు ట్రై చెయ్యండి..:)....నాకు మట్టుక్కు పైలాగానే ఇష్టం...
ఇక ఇలా వండిన పాయసం వేడిగా తిన్నా బాగుంటుంది, బాగా చల్లారాక సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది.....కాని తినేప్పుడు పెద్ద గురుగు చేసుకుని, దాన్నిండా కమ్మటి నెయ్యి పోసుకుని, పక్కన వంకాయకూర, రోటి పచ్చడి పెట్టుకుని నంజుకుంటూ తింటం మాత్రం మర్చిపోవద్దేం........
4:02 PM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 16 Comments
తియ్యతియ్యని "తేనెతొనలు"
రెండ్రోజుల క్రితం, పొద్దున పొద్దున్నే అమ్మ ఫోను.."చిన్నీ! ఎల్లుండి నాన్నొస్తున్నారు నీ దగ్గరకి. ఏం పంపమంటావ్?" అని.
నేను,"ఏముంది మామూలుగానే కూరలు, పెరుగు పంపు"అన్నా...
దానికి అమ్మ,"మొన్న చిన్నత్త నేతరిసెలు పంపింది. ఓ పాతిక దాకా ఉన్నాయి.చక్కలు కూడా చేశా.అవి పంపుతున్నా...ఇంకా ఏమన్నా కావాలా?బూంది మిఠాయికాని,రవ్వలడ్డుకాని......".....
అంతే! నా గొంతు హైపిచ్ లోకెళ్ళిపోయింది..:)......"ఎప్పుడూ చక్కలు,కారప్పూస,రవ్వలడ్డు....విసుకొస్తోందమ్మా! ఏవఁన్నా కొత్తరకం పంపరాదూ..."అన్నా..
అమ్మ అంతకంటే హైలోకెళ్ళిపోయి,"నాకవే వచ్చు.తింటే తిను.లేకపోతే మానుకో" అనేసింది......
ఇంకేముంది? మనం కాళ్ళబేఱానికి...:)....."అమ్మా! ఓ కొత్త వంటకం ఉంది. "తేనెతొనలు" అని. నాకు తినాలనుంది.చెయ్యవాఆఆఅ.....ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అన్నా..
అమ్మ ఒక్కమెట్టుదిగి,"నాకలాంటివి చెప్పకు.నాకు కుదరవు.అయినా కొత్త కొత్త రకాలు ఎక్కడో చదువుతావు,నా ప్రాణం తీస్తావు." అంది.
అమ్మకొంచెం చల్లపడిందిగా, ఇక మనం అల్లుకుపోయాం...."అమ్మా! ఇది కొత్తరకం కాదే! "హంసవింశతి" కావ్యంలో "ఇడ్డెనలు తేనెతొనలు బుడుకులు నేలకికాయలు" అని చెప్పాడు....అంటే ఎంతో పాతవి, ప్రాచీనమైనవి అన్నమాట! ఎలా చెయ్యాలో నే చెప్తా, అలా ఫాలో అయిపోయి చేసెయ్యి..అవిల్రెడీ నేనొకసారి చేసి సూపర్ హిట్టు కొట్టా కూడా....ఇప్పుడు చేసుకున్నే ఓపికలేక అడుగుతున్నా..ప్లీజ్...".
ఇంకేముంది, అమ్మ పూర్తిగా ఐసయిపోయి,"సరే చెప్పు...మళ్ళా బాగా రాకపోతే నన్ను వేళాకోళమాడగూడదు మరి మీరిద్దరూ కలిసి...".
"వాకే" అనేసి, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పా... కాని దానికి అమ్మ కొంత సొంత తెలివి జోడించింది...ఫలితం, పైన ఫొటొలా ఒక షేపూ,పాడూ లేకుండా వచ్చాయి, నా దగ్గరకొచ్చేపాటికి...బాగా మెత్తగాఉండి ట్రాన్సుపోర్టులో విరిగిపోయాయి...:(.......కాని టేస్టు మాత్రం తేడా రాలేదులే.....:)....
అసలు నాకు "తేనె" అన్న మాట వింటేనే నోరంతా తియ్యగా అయిద్ది..చిన్నప్పట్నుంచీ, పిచ్చిపిచ్చి కంపెనీ తేనెలు కాకుండా మంచి కొండతేనె, పుట్టతేనె అలవాటయ్యి ఉండటం మూలాన్నేమో!
అసలు తేనె అంటేనే నాకు మొదట గుర్తొచ్చేది, మా భజనలో ఆరగింపు పాట.. మా ఊరిగుళ్ళో రాత్రి పూట భజన చివర్లో నైవేద్యం పెడుతూ, రాములవారి ఆరగింపు పాట పాడేవాళ్ళు..." ఆరగింపు చేసేమయ్యా! మీరారగించండి రామయ్యా" అని...ఆ పాటలో రకరకాల నైవేద్యాలు చెప్తూ మధ్యలో, "తేనెతో మాగినా తియ్య మామిడి పళ్ళ రసమూ" అని వస్తుంది....అదివిని రాములవారికి,ఆయన పరివారానికి ఏమోగాని నాకు మాత్రం తెగ నోరూరిపోయేది...:)...ఇక మామిడిపళ్ళ సీజను రాగానే మా తోటలోంచి మంచి రసాలు కోసుకొచ్చి అమ్మని చావగొట్టేసేవాణ్ణి," ఇప్పుడివి తేనెలో మాగపెట్టి రసం తీసి ఇస్తావా, లేదా" అని..అమ్మ మాడు మీద ఒక్కటి పీకి "నోరుమూసుకో" అనేది....నా ఆ కోరిక ఇప్పటికీ తీరకుండా అలానే ఉండిపోయింది..ప్చ్..ఏం చేస్తాం...
ఇక మన "తేనెతొనల" దగ్గరికొస్తే పేరుకు తగ్గట్టు "మధురం"గా ఉంటై....చెయ్యటం చాలా వీజీ....నేను మొదట చదివి ప్రయోగం చేసినట్టే చెప్తున్నా..మీకు ఇంకా ఏవన్నా కొత్త ఉపాయాలు తడితే, అలాకూడా ప్రయత్నించండి...
- మొదట కావల్సిన పదార్థం గోధుమపిండి....ఆటా కాని, మైదాకాని ఏదైనా వాడుకోవచ్చు...దేని రుచి దానిదే....మైదాతో ఐతే కాస్త మెత్తగా వస్తాయి.....వరిపిండి కూడా వాడుకోవచ్చు...కాని వేయించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి....ఈ పిండిని బాగా జల్లించుకోవాలి, బరకలేకుండా....
- ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బెల్లం వేసి తొక్కాలి....తీపి ఎక్కువ తిందామనుకునేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు.....కాని మొదట చేసేప్పుడు, రెండూ తక్కువ మోతాదులోనే ప్రయత్నించండి...ఒక వందగ్రాముల పిండి, యాభై గ్రాముల బెల్లం అలా....తర్వాత కావాలనుకుంటే పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చు.
- ఇలా తొక్కినపిండిలో కాస్తంత నెయ్యి, సరిపడా నీళ్ళూ వేసి చపాతీ పిండిలా బాగా కలపండి....బాగా మర్దించాలి....ఇక్కడ నెయ్యి ఎక్కువ వెయ్యొద్దు...వేస్తే వేయించటానికి కుదరదు...
- ఇక ఈ పిండిని, చిన్న నిమ్మ లేదా కమలా తొనల ఆకారంలో అంటే నెలవంక చంద్రుళ్ళా బిళ్ళలుగా తయారు చేసుకోవాలి...ఎలా చెయ్యాలనేది మీ ఇష్టమండీ! చేత్తో అయినా, అచ్చుతో అయినా......తొనల ఆకారమే కాదండీ, అంత మందంగా కూడా వత్తుకోవాలి....
- ఇలా వత్తుకున్న బిళ్ళల్ని నేతిలో గాని, మంచి నూనెలోగాని వేయించుకోవాలి......(పిండి లో ఎక్కువ నెయ్యి వేసి కలిపేట్టైతే వేయించొద్దు..ఓవెన్ లో గాని, కేకు చేసే గిన్నెలో గాని బేక్ చేసుకోవచ్చు..).
- ఇక ఈ తొనల్ని మంచి తేనె ,మునిగేట్టుగా పోసి ఊరించటమే! ఒక రోజు పాటు ఊరనివ్వాలి......
- అంతే! నోరూరించే "తేనెతొనలు" తయార్.ఇట్టా నోట్టో వేసుకుంటే అట్టా కరిగిపోతాయ్...
- పిల్లలకి ఇంతకన్నా మంచి తినుబండారాలు ఏముంటాయి చెప్పండి....డయాబెటిక్స్ బెల్లం వెయ్యకుండా వట్టి తేనేతో తడుపుకుని తినొచ్చు.(మితంగా)....:)
తు.చ. :-
రెసిపీ: ఓ పాత పుస్తకంలో చదివిన దానికి నా మాడిఫికేషన్...
శ్రమ పడి చేసినవారు: శ్రీమతి సుగాత్రీ నరసింహారావు గారు....అదేనండీ మా అమ్మగారు..:).
అవిడియా, పుటో, టపా మాత్రం నావేనండీ...:)
2:39 AM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 2 Comments
కమ్మకమ్మగా...."క్యారెట్ హల్వా"
అసలు నాకు చిన్నప్పటినుంచి హల్వాలంటే స్వీటుషాపులవాళ్ళు మాత్రమే చెయ్యగలరని, మనింట్లో చేసుకోటం అస్సలవ్వదని అనుకునేవాణ్ణి....కాని అన్నిటికన్నా బహువీజీగా చేసుకోగల స్వీటులు హల్వాలని నేను గరిట పట్టుకోటం మొదలెట్టాక అర్థమైంది....ఇంకేముంది! వారానికో రకం హల్వా చేసి పడేసి మా వాళ్ళమీదికి వదిలేవాణ్ణి...ఎలా చేసినా బ్రహ్మాండంగా కుదిరేవి...మా వాళ్ళు లొట్టలేసుకుంటూ లాగించేవాళ్ళు.....అసలీ హల్వాలు చెయ్యటానిక్కావలసిందల్లా ముఖ్యంగా ఓపిగ్గా ఓ రెండుగంటలు పొయ్యి ముందు కూచోడమే!
- అన్ని పదార్థాలూ సమపాళ్ళల్లో తీసుకోవాలి.....అంటే కేజీ క్యారెట్లకి, లీటరు పాలు, అటూ ఇటూగా కేజీ పంచదార(నేను ముప్పాతిక కేజీ వేస్తాను.తీపి తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు).....
- క్యారెట్లు మంచివి ఎంచుకోవాలి. బాగా ఎర్రగా, పెద్దగా ఉన్నవి తీసుకోండి...చిన్నవి, వడలిపోయినట్టుండే వాటితో అంత రుచి రాదు...ఎక్కడా కుళ్ళు డాగులు, రంగుమార్పులు లేనివి చూసి తీసుకోండి...గాజరగడ్డలంటారే, వాటితో అంతబాగా కుదరదు........ఇలా ఎంచుకు తెచ్చుకున్న క్యారెట్లని శుభ్రంగా కడిగాలి.....చివర మొనలు కత్తిరించి, ఆవేపు నుంచి తురుముకోవాలి(అంటే నిలువుగా పెట్టి తురమాలి)...అడ్డంగా తురిమితే అంతా ముద్దలా వచ్చేస్తుంది,బాగా ఉడకదు......గడ్డ మొత్తం తురిమాక చివర్లో తొడిమ దగ్గర పచ్చగా వస్తుంది ఒక్కోసారి.అది వదిలేయండి.......ఈ తురుముని ఒక మందపాటి,లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి....(ఈ తురుముని కొందరు కొంచెం నెయ్యివేసి వేయిస్తారు, తొందరగా ఉడుకుతుందని...అలా చేస్తే అంత రుచిరాక పోగా నిలవుండదు)
- ఇప్పుడు పాలు తీసుకుని పైన రెడీగా పెట్టుకున్న తురుములో పొయ్యండి.....పాలు ఎంత చిక్కగా ఉంటే అంత రుచి వస్తుంది...గేదె పాలు డైరెక్టుగా దొరకని వాళ్ళు హోల్ మిల్క్ వాడండి...టోన్డ్ మిల్క్ వాడితే అంత రుచి ఉండదు....కేజీకి లీటరు పాలు, అరకేజీకి అరలీటరు...అదీ కొలత....
- ఇప్పుడు ఒక రెండు గుప్పిళ్ళు పంచదార తీసుకుని పైన పాలు, తురుము మిశ్రమం లో కలపాలి...ఇలా తయారైన మిశ్రమాన్ని మూతపెట్టి ఒక పావుగంట నాననివ్వండి....ఇలా చెయ్యడంవలన ఉడికేప్పుడు తొందరగా ఉడకడమే కాకుండా మంచిరుచొస్తుంది.
- ఇప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళి పొయ్యిమీద పెట్టాలి...పొయ్యి వత్తి తక్కువలో ఉండాలి..సెగ సన్నగా గిన్నెంతా సమానంగా తగలాలి.....ఏ హల్వా అయినా ఇదే ముఖ్యం...సెగ సమానంగా తగలాలి...అందుకని నేను రైస్ కుక్కర్ వాడతా...రైస్ కుక్కర్ తో ఇంకో ఎడ్వాంటేజీ....పొయ్యి ముందు గంటలసేపు నిలబడి సెగ తగిలించుకోడాన్ని తప్పించుకోవచ్చు..చక్కగా ఏ సినిమానో చూస్తూ లాగించెయ్యొచ్చు....:)
- ఇక ఏముంది? పాలు కొంచెం కాగబట్టినయ్యనగానే తిప్పడం మొదలెట్టాలి....అలా తిప్పుతూ, తిప్పుతూ ఊఊఊఊఊఊఊఊఊనే ఉండాలి....ఊరకే తిప్పడం కాదు...కిందనుంచి మీదకి కలేసి తిప్పాలి...మీరు ఎంత బాగా తిప్పితే అంత రుచన్నమాట!
- కొంచెం ఉడుకుపట్టగానే మిగతా పంచదారని కూడా వేసి కలతిప్పండి....పంచదార మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు...తీపి సరి చూసుకుని మధ్యలో అయినా కలుపుకోవచ్చు...
- ఇప్పుడు ఉడుకుతుండగానే జీడిపప్పు ఓ గుప్పెడు తీసుకుని వేసి కలబెట్టి ఉడకబెట్టెయ్యండి...జీడిపప్పుతో కలిసి ఉడికితే మంచి రుచొస్తుంది...ఓపికుంటే జీడిపప్పుని పొడి చేసి కూడా కలుపుకోవచ్చు....
- ఇక అసలు హల్వాలన్నిటికీ ముఖ్యమైన అమృతంలాంటి పదార్థం....లాంటేమిటీ! అమృతమే!..అదేనండీ బాబూ "నెయ్యి"....కేజీ క్యారెట్లకి అరకేజీ నెయ్యి..అదీలెక్క....కనీసం నాలుగోవంతన్నా వెయ్యాలి....లేకపోతే అసలు హల్వా వండటం వృథా....."హమ్మో! అంత నెయ్యా! మా హార్టేం కావాలి? మా గ్లామరేం కావాలి" అంటారేమో! ఎప్పుడొ ఆర్నెల్లకోసారి వండి, ఓ చిన్నకప్పుడు తినేటప్పుడు ఇల్లాంటివన్నీ ఆలోచించకూడదు...హార్టు కాదు కదా, దాని మీదుండే కవరుకి కూడా ఏం కాదు, నాదీ పూచీ! నెయ్యి మాత్రం మంచి క్వాలిటీది వాడండి...ఇంట్లో తాజాగా వెన్నకాచిన నెయ్యైతే శ్రేష్ఠం....బాగా ఎఱ్ఱగా కాగిన ముదురుకాపునెయ్యైతే ఘుమఘుమలాడి పోద్ది...డాల్డాల్లాంటివి దయచేసి వాడొద్దు..వాడితే అంతా రసాభాసమే!....వెగటేస్తది అని నెయ్యి దగ్గర కాంప్రమైజ్ కావొద్దు...కావాలంటే కాస్త తీపి తగ్గించుకోండి, సరిపోద్ది...
- పంచదార వేశాక, కొంచెం దగ్గరకి అవుతుంది అనుకోగానే కొంచెం కొంచెం నెయ్యి వేసి ఉడకనివ్వాలి...ఇలా నేతిలో ఉడికితే రుచికి రుచీ, మృదుత్వానికి మృదుత్వమూ......
- బాగా దగ్గరకి అవ్వగానే ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష, చిటికెడు యాలక్కాయల పొడి వెయ్యాలి.....
- ఇక అంచులు విడిపడతన్నై అనుకోగానే మిగతా నెయ్యి పోసేసి తిప్పండి...(ఇక్కడ తిప్పడంలో కాస్త ఏమరారా అంతేసంగతి! రుచిమాట దేవుడెరుగు, మాడిపోద్ది.)
- "మర్దనం రుచి వర్ధనం" అన్నారు...మొదటి నుంచి చివర వరకూ తిప్పుతూనే ఉండాలి, అప్పుడే రుచి...ముందే చెప్పాకదా! పొయ్యి ముందు కనీసం ఓ గంటైనా కూర్చునే ఓపికుండాలి.....
- ఇక చివర్లో గోరంత పచ్చ కర్పూరం వేసి, ఒక్క నిమిషం ఉంచి దింపెయ్యాలి....పైన మీకు అలంకరణకి కావాలంటే నేతిలో వేయించిన జీడిపప్పు,బాదంపప్పు వేసుకోవచ్చు....
- పచ్చికోవాలు,ఎండుకోవాల్లాంటివి వేసుకుని రుచి చెడగొట్టుకోవద్దు...
- అంతే! కమ్మకమ్మని క్యారెట్ హల్వా తయార్! ఇలా చేసింది వేడిగా ఐనా తినొచ్చు... చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది....ఫ్రిజ్‍లో పెట్టకపోయినా నాలుగైదురోజులు నిలవుంటుంది....
తు.చ. :- పైన పుటో బాగా రాలేదు, (మన పొటోగ్రపీ స్కిల్సు అలా ఉన్నై మరి)...కాని నెయ్యి మాత్రం అలా తేలుతూ కనపడాలి...:)
5:41 PM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 13 Comments