సొరకాయ పాయసం - ఇదో "శాకపాయసం"


"నేస్తం గారూ! ఈ టపా మీకోసమే ప్రత్యేకంగా...:)"
"ఏంటీ! ఈ పిల్లగాడు "నేస్తం"కి మాత్రమే చెప్తాడా ఏంటి?" అనుకుంటున్నారా! అబ్బే! అదేంలేదు..అందరికోసమూ...కాని నేస్తంగారికి ఇంకొంచెం ఎక్కువ ప్రత్యేకంగా అన్నమాట....ఎందుకంటారా...అది తెలియాలంటే బోలెడు రీళ్ళు వెనక్కు తిప్పేసుకోవాలన్నమాట!


"అనగనగా, ఒకానొక తెలుగుబ్లాగుదేశంలో ఆడవాళ్ళు మాత్రమే వంటల గురించి రాయగలరని,వాళ్ళకి తెలిసినవే వంటలని వాళ్ళు ఫీలవుతున్న రోజులు..అప్పుడు ,ఆ స్త్రీజాత్యహంకారధోరణికి గొడ్డలిపెట్టుగా మా బెమ్మీల తరపునుంచి మా నాగా "మీరేం చేస్తారు? మేం రైస్ కుక్కర్లో చపాతీలు కూడా బహువీజీగా చేసెయ్యగలం" అని చేసి చూపించాడు..బెమ్మీనా మజాకా!.;)..అప్పుడు అది చూసి తెగ కుళ్ళేసుకున్న ఈ ఆడలేడీసు పాపం మా నాగ మీద పొలోమని దండెత్తేశారన్నమాట! సమయానికి మంచుగారు కూడా అందుబాటులో లేరు..సో, నేనొక్కణ్ణే నా రైసుకుక్కర్ వంటల్ని అమ్ములపొదిలో పెట్టేసుకుని మా నాగాకి సపోర్టుగా కామెంట్ల యుద్ధంలోకి దిగేశాను....

నా ఒక్కో అస్త్రం సంధిస్తుంటే, అప్పుడు నేస్తం గారు యుద్ధభూమిలోకి ఎంటర్ అయిపోయి నా "సొరకాయ పాయసం" అనే అస్త్రాన్ని,లేడీసుకి సహజమైన వంటాహంకారంతో(దీంటో కాస్తంత గోదారి అభిజాత్యం కూడా ఉందనుకోండి..:)...) అదసలు అస్త్రమే(వంటకమే) కాదు అని తేల్చేశారు....దాంతో తీవ్రంగా హర్టయిన నేను ఆ స్త్రీజాత్యహంకారధోరణికి నిరసనగా కొత్త బ్లాగు మొదలెట్టేశానన్నమాట!"

అదీ "పాకవేదం" పుట్టుక వెనక ఉన్న అసలు హిస్టరీ....తర్వాత విషయాలు మీకు తెలిసినవే...:)

నేస్తం గారూ! ఉన్నారా! ఉంటే, "సొరకాయ తో పాయసం కూడా చేస్తారా.." అన్నారుగా..ఎలా చెయ్యాలో ఇవ్వాళ చెప్పేస్తున్నా...మీరు ప్రయత్నించి ఎలా ఉందో చెప్పాలన్నమాట..:)...

అసలు పాయసం అంటే ఏంటి? "పయః" అంటే పాలు అని అర్థం... ఆ పాలతో వండిన పదార్థం కాబట్టి "పాయసం" అయింది....దీన్ని రకరకాలుగా పిలుస్తార్లే...పాయసం,క్షీరాన్నం,పరమాన్నం,పరవాణ్ణం..ఇలా బోల్డు రకాలుగా పిలుస్తార్లే....మా ఊళ్ళల్లో ఐతే "పాసెం","సిరాన్నం" అంటారు.....నాకీ "పాసెం" అంటే అర్థమయ్యేదికాని, ఈ "సిరాన్నమే" బొత్తిగా అర్థమయ్యేది కాదు,అమ్మమ్మ అంటుండేదలా....."సిరాపోసి వండుతారా ఏంటి ఖర్మ!" అనుకున్నే వాణ్ణి....కాని ఆలోచిస్తే టక్కున లైటు వెలిగిందోసారి..."ఓహో! ఇది క్షీరాన్నానికి వికృతన్నమాట" అని....అబ్బ! చూడండి నాకు ఎంత తెలివో! పక్కన ఎవరూ లేకపోటంతో, నా తెలివికి సెబాస్ అని నేనే జబ్బ చరిచేసుకున్నానన్నమాట!....:)..

ఇక ఆ పాయసాన్ని కూరగాయలేసి వండితే దాన్నే" శాకపాయసం " అంటారు....ఇది నాన్నగారు కనిపెట్టిన పదంలెండి....మనకి నో క్రెడిట్స్.:)...అమ్మ రకరకాల శాకపాయసాలు వండేది....వంకాయ పాయసం,బీరకాయ పాయసం, ములక్కాడల పాయసం,బూడిదగుమ్మడి పాయసం, అరటికాయ పాయసం, చివరికి "ఉల్లిపాయసం" కూడా...:)...ఎన్ని రకాలుగా వండినా సూపర్గా ఉండేది, మా ఊళ్ళల్లో పిచ్చ ఫేమస్ "సొరకాయ పాయసమే".....మిగతా వాటికి అంత రుచి రాదు...

సంక్రాంతి నెలలో తెగ కాస్తాయేమో సొరకాయలు, మా ఊళ్ళో రోజుకొకళ్ళేనా వండుకుంటారు.....మా ఇంట్లో ఇప్పటికీ విరక్కాస్తాయి సొరపాదులు...బజారంతా పంచుతుంది అమ్మ, కాయలు..ఇక ఆ సీజన్లో మా ఇంట్లో ఒకటే సొరకాయ వంటకాలు..... పాలేసి కూర,వేపుడు,పులుసు, రోటి పచ్చడి...ఆఖరికి ఓ జాడీడు ఊర పచ్చడి కూడా పెట్టేస్తుంది అమ్మ.......ఇక పాయసమైతే కనీసం వారానికోసారన్నా వండాల్సిందే, పేద్ద తపేళాకి.....ఇక ఆ రోజు అన్నంలేదు....కూరలు కూడా దాంటో కలుపుకు తినడమే.....పేద్ద గురుగు చేసి, దాన్నిండా నెయ్యి పోసుకుని, పక్కన సాధుమసాలా దట్టించిన వంకాయ కూర, రోటి పచ్చడి వేసుకుని నంజుకుంటూ తింటుంటే ఉంటదీ..అబ్బబ్బా....స్వర్గానికి బెత్తెడెత్తున కాదు, దాటి పైపైనే.......:)...

ఇక కొంతమంది మామూలుగా బియ్యంతో వండే పొంగలన్నంలో కాస్త సొరకాయ తురుము వేసి అదే సొరకాయ పాయసం అని ఫీల్ అయిపోతుంటారు,దాన్ని మళ్ళా హిందీలో "కద్దూ కా ఖీర్"అని పిల్చేసి తెగ పోషు ఫీలింగూ...మా క్లాసుమేటు ఒకమ్మాయి అలా చేసి తెగ గొప్ప ఫీల్ అయ్యేది...కాని తర్వాత నా "సొరకాయ పాయసం"తిన్నాక తను వండటమే మానేసింది, (మా ఫ్రెండ్సు చావగొట్టేశారు మరి..:)..).....బై డెఫినిషన్ కరెక్టవ్వొచ్చేమోగాని, రుచివార చూస్తే దానికీ, మా ఇళ్ళల్లో చేసుకునేదానికీ చాంతాడంత డిఫరెన్సు......అసలు ఆ విధానమే వేరు...మరి అది ఎల్లాగో చూద్దామా.....

  • ముందు ఒక మంచి సొరకాయ తీసుకోవాలి.మంచి అంటే ఎలా అనుకుంటున్నారా! ఏం లేదండి...మరీ లేతగా కాకుండా బాగా కండ పట్టి ఉండాలి...అలా అని మరీ ముదరకూడదు....దీన్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసి,విత్తనాలు కూడా తీసేసి, కండవరకు మోయనమైన సైజులో ముక్కలు కొయ్యండి....తురుముగా చెయ్యొద్దు..ముక్కగా తగుల్తుంటేనే రుచి....
  • ఇప్పుడు కొంచెం లోతుగా,వెడల్పుగా ఉండే మందపాటి గిన్నె తీసుకుని,దాంట్లో పైన కోసిపెట్టుకున్న ముక్కల్ని వేసి, సరిపడా ఉప్పు,నీళ్ళు వేసి పొయ్యిమీద పెట్టి ఉడికించండి....
  • తర్వాత కావల్సిన ముఖ్యమైన పదార్థం బియ్యప్పిండి....తాజాగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న పిండి అయితేనే బాగుంటుంది...పాయసం చెయ్యాలనుకుంటే పొద్దున్నే బియ్యంనానబోసి, ఓ రెండు గంటలు నాననివ్వాలి...రాత్రి నానబెడితే మరీ మంచిది...తర్వాత ఆ బియ్యాన్ని కడిగి వడెయ్యాలి..నీళ్ళన్నీ వడిచాక పిండి కొట్టుకోవాలి..రోట్లో కొడితే చాలా బాగా వచ్చిద్ది..కుదరకపోతే మిక్సీ పట్టుకోవచ్చు...{తడిపిండి మాత్రమే వాడాలి..పొడిపిండి పనికిరాదు}
  • మీడియం సైజులో ఉండే కాయకి, ఒక సోలెడు పిండి(సుమారుగా అరకేజీ బియ్యం), ఒక అరకేజీ బెల్లం పడతాయి.....కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు...అప్పుడు ముక్కలు ఎక్కువ తగుల్తాయి....
  • బెల్లాన్ని ఓపిక ఉంటే తురుముకోవచ్చు.లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా నలగ్గొట్టి బియ్యప్పిండిలో వేసి నీళ్ళుపోసి బాగా జారుగా కలుపుకోవాలి.....బాగా నీళ్ళు,నీళ్ళుగా(గరిటజారుకంటే ఇంకొంచెం పల్చగా) కలుపుకోవాలి...ఉండలు కట్టకుండా చూసుకోవాలి.....ఈ మిశ్రమంలోనే ఎండుకొబ్బరి తురుము ఒక కప్పుడు వేసి కలిపెయ్యాలి....
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పైన ముక్కలు ఉడికాయనుకోగానే వాటిలో పోసి మెల్లగా తిప్పుతూ ఉండాలి...పోసేప్పుడు ఒక్కసారిగా గుమ్మరించొద్దు...మెల్లగా పోస్తూ, గరిటతో తిప్పుతూ ఉండాలి.లేకపోతే ఉండలు కడుతుంది....పిండి బాగా ఉడికి దగ్గరకి అయ్యేవరకు మెల్లగా తిప్పుతూనే ఉండాలి..మరీ స్పీడుగా తిప్పొద్దు,ముక్క చెదిరిపోతుంది....ఉండకట్టకుండా చూసుకుంటే చాలు....
  • పిండి బాగా ఉడికింది, దగ్గరకి అయిందనగానే పాలు పొయ్యాలి...సుమారు అరలీటరు పొయ్యాలి..ఎక్కువ పోసినా రుచొస్తుంది.....పాలు పోసి సన్నసెగ మీద ఉడికించాలి. బాగా దగ్గరకి అవ్వగానే నెయ్యి,యాలకులపొడి,పచ్చకర్పూరం వేసి దించెయ్యాలి...డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు.....నేను వెయ్యను..ఎందుకో నాకు నచ్చదు...:)
  • పైన చెప్పిన విధానం మా ఇంట్లో వండేది...మా అమ్మవాళ్ళ నాయనమ్మ అలా కాకుండా, ముక్కలు,పిండి,పాలు,బెల్లం అన్నీ నీళ్ళుపోసి కలిపేసి పొయ్యి మీద (కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చేమో!)పెట్టి తిప్పుతూ ఉడికించేదట! నేనెప్పుడూ అలా ప్రయత్నించలా....కావాలంటే మీరు ట్రై చెయ్యండి..:)....నాకు మట్టుక్కు పైలాగానే ఇష్టం...

ఇక ఇలా వండిన పాయసం వేడిగా తిన్నా బాగుంటుంది, బాగా చల్లారాక సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది.....కాని తినేప్పుడు పెద్ద గురుగు చేసుకుని, దాన్నిండా కమ్మటి నెయ్యి పోసుకుని, పక్కన వంకాయకూర, రోటి పచ్చడి పెట్టుకుని నంజుకుంటూ తింటం మాత్రం మర్చిపోవద్దేం........

16 కామెంట్‌లు:

సిరిసిరిమువ్వ చెప్పారు...

కాదేది పాయసానికి అనర్హం:)

సొరకాయ పాయసం బూడిద గుమ్మడి కాయ పాయసం తెలుసు కానీ మరీ ఈ వంకాయ పాయసం,బీరకాయ పాయసం, ములక్కాడల పాయసం,అరటికాయ పాయసం, ఉల్లిపాయసం...మతిపోతుంది కౌటిల్యా మీ ప్రావీణ్యానికి!

Sravya V చెప్పారు...

అయ్యా బాబోయ్ ఈ ఉల్లి పాయసం ఏమిటండి ? కొంపదీసి పాలు పోసి వండే కూరని పాయసం అంటున్నారా ?
ఏదైమైనా కాని మీ పాకశ్రాస్త ప్రావీణ్యానికి , అలాగే ఆ తయారీ విధానాన్ని చక్కగా రాయగలిగే ప్రతిభ కి నా అభినందనలు !

jyothi చెప్పారు...

బాబోయ్ మేం కని విని ఎరుగని వంటలన్ని చెప్తున్నారుగా? సొరకాయతో విన్నాం కాని నిజంగానే ములక్కాయ,వంకాయ పాయసాలు చేస్తారా?

Unknown చెప్పారు...

మొదటినుంచి మీ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అయిపోతున్నా. చేసి చూసారా అని అడిగి పరువు తియ్యొద్దు! .. మీరు వివరించే విధానం బహు ముచ్చటగాఉంటుంది మరి.
ఇంత ఒపిక లేదు గాని, బాబ్బాబు..అఫీసులకెళ్ళేవాళ్ళం. కాస్తంత చటుక్కున అయిపోయే వంటకాలవీ చెప్పండి.రోజు అ పలావులు బిరియానీ లూ డబ్బాల్లో మోసుకెళ్ళలేక చస్తున్నాం.

॒ మువ్వగారు...
మీరన్నది నిజమే! కాదేది పాయసానికి అనర్హం!!!
మీకింకో అప్ డేట్... ఉల్లిపాయల పాయసమే కాదు గుల్బర్గా, బిజాపూర్ వంటి ఉత్తర కన్నడ జిల్లాల్లో వెల్లుల్లి పాయసం చేస్తారు. కాని బాలెంతలకి మాత్రమే. వినగానే నేను హడలి పోయా.!

కౌటిల్య చెప్పారు...

మువ్వ గారూ, నిజమేనండీ......కాదేదీ పాయసానికనర్హం...అమ్మ అవన్నీ చేస్తుంది..

శ్రావ్య గారూ మీ అభిమానానికి మంగిడీలు...ఉల్లిపాయసం మా పెద్దమ్మ చేస్తారండీ..కొబ్బరి పాలతో..ఈ సారి చేసినప్పుడు రాస్తాను...::)

జ్యోతిగారూ, అవునండీ చేస్తారు...చెప్పానుగా మరి..అవే శాకపాయసమంటే....:)

ఆర్ గారూ,
మంగిడీలు...చటుక్కున ఐపొయేవి కూడా చెప్తాలెండి...:)

sunita చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుజాత వేల్పూరి చెప్పారు...

నాకు స్వీట్లంటే అంతగా పడదు కాబట్టి నీ పాయసానికి మార్కుల్లేవు! కానీ నీ రైటింగ్ స్టైలుంది చూశావూ.....ఇష్టం లేకపోయినా పాయసం తయారీ మొత్తం చదివేలా చేసింది. దానికి ఇస్తున్నా ఐదు నక్షత్రాలు ! భరాగో వంటొచ్చిన మగాడు రామనాధాన్ని తల దన్నేలా ఉన్నావుగా కౌటిల్యా! గుంటూరు పరువు నిలబెట్టి గోదారి అభిజాత్యాన్ని తిప్పికొట్టావు! సెభాష్ (నేస్తం, మనం ప్రైవేటుగా మాట్లాడుకుందాం లెండి) ,

sunita చెప్పారు...

కౌటిల్య గారూ,
నాకు పైన మీరు నవ్విన బెల్లం పరమాన్నంలొ సొరకాయ ముక్కలేసే పాయసమే తెలుసు . ఈ పద్ధతి తెలీదు. చేసి చూసి కామెంట్ రాద్దామని ఆగాను. పచ్చిపిండి రెడీగా లేక రెడీ గా షాప్ లొ దొరికే పిండి వాడి చేసాను. నాకు బాగా నచ్చింది. కొంచం పాలతాలికల రుచీ, రవ్వ పాయసం రుచీ తగిలింది. మాపిల్లలేమో సొరకాయ ముక్కలు పక్కన పడేసి తిన్నారు:( ఇంకా ఇన్ని రకాల కూరగాయలతో చేస్తారని తెలీదు.

కౌటిల్య చెప్పారు...

సునీత గారూ! చేసేశారా....సూపరు మీరసలు....అవునండీ కొంచెం పాలతాలికల్లానే ఉంటుంది...తడిపిండి వాడి చూడండి ఈ సారి, ఇంకా మంచి రుచి వచ్చిద్ది....

ముక్కలు ఏరేసి తిన్నారా..ప్చ్..ః(...ఇంకేముంటుందండీ...అయినా ముక్క బాగా మెత్తగా అయ్యేట్టు చేస్తే ఇక తియ్యటానికి కుదరదు...అప్పుడు తెలియకుండా తినేసి రుచి ఆస్వాదిస్తారు...ః)....మిగతా కూరగాయలతో సొరకాయకి వచ్చిన రుచి రాదు, ఏదో వెరైటీ కోసం చేసుకోడమే....కాని అరటి, ఉల్లి, ములక్కాయ ఇవి పూర్తిగా డిఫరెంటుగా చేస్తారు, అవి బాగుంటాయి...

కౌటిల్య చెప్పారు...

సుజాతగారూ! మీ పెద్ద కాంప్లిమెంటుకి బోల్డన్ని మంగిడీలు....అవును నేస్తం గారి కోసం ప్రత్యేకంగా టపా రాస్తే అసలు కనపడలేదేంటి చెప్మా...

నేస్తం చెప్పారు...

కెవ్వ్వ్.. నాకోసం రాసారా :)
ఈ మధ్య బ్లాగ్స్ చూడటం లేదు కౌటిల్యా అందుకే మిస్ అయ్యాను.మా ఇంటిలో స్వీట్స్ చెల్లవు కాని ఈ స్వీట్ ట్రై చేస్తాను ...ఆ రోజు సొరకాయ పాయసం చేస్తారా? అని అడిగిన అయిదో నిమిషానికే మెయిల్స్ రూపంలో మీకు తెలియదా అంటూ అక్షింతలు పడిపోయాయి లెండి...మీ ఆవమజ్జిగ మాత్రం సూపర్ ..ఇప్పటికి చాలా సార్లు చేసాను ..మావారికి కూడా బాగా నచ్చింది :)

అజ్ఞాత చెప్పారు...

good work! మాలాంటి beginnersకి ఎమైనా starting kit ఉంటే చెప్పగలరు :)తాలింపు వెయ్యటం లాంటివి అన్నమాట :)

కౌటిల్య చెప్పారు...

నేస్తం గారూ, ఆవమజ్జిగ అన్నిసార్లు చేశారా..హ్మ్...నేను అప్పుడు చెయ్యటమే, మళ్ళా ఎప్పుడు చేద్దామన్నా వీలుపడట్లా...

మరి, సొరకాయ పాయసం తెలీదంటే అక్షింతలు పడవూ, అయినా మీకు బోల్డన్ని థేంక్యూలు చెప్పాలి,నేను ఈ బ్లాగు మొదలెట్టేలా చేసినందుకు...ః)

అజ్ఞాత గారూ, సెపరేటుగా స్టార్టింగ్ కిట్ ఎందుకండీ, నా పోస్ట్ లు ఇదిగా ఫాలో అయిపోండి, అన్నీ వివరంగా రాస్తాను కదా, ఏ కూరకి ఎలా తాలింపు పెట్టాలో కూడా...ః)..ఐతే ఇక నుంచి ఓ పని చేస్తా,నేను మామూలుగా వండే కూరలు కూడా రాసేస్తా...ః)

Rao S Lakkaraju చెప్పారు...

ఐతే ఇక నుంచి ఓ పని చేస్తా,నేను మామూలుగా వండే కూరలు కూడా రాసేస్తా...ః)
-------
That is a very good idea.

అజ్ఞాత చెప్పారు...

dhanyavaadalu..

Ennela చెప్పారు...

ఉల్లిపాయసమా!!
మాల్దీవుల్లో, రవ్వతో కేసరి లాంటి స్వీట్ చేసుకుని ఉల్లిపాయలు వెస్తారు...అదే నాకు తెగ వింతగా ఉండేది...అప్పుడప్పుడు కొన్ని ఫిష్ ముక్కలు కూడా!!

Blogger ఆధారితం.