అసలు ఉగాదిపచ్చడి చేసుకోవలసిన విధంబెద్దియన....


ఉగాది పచ్చడి, ఇది షడ్రసోపేతం....చూడండి మాలిక ఉగాది సాహిత్యసంచిక, ఉగాదిపచ్చడి చేసుకోవలసిన అసలు విధానాన్ని నేర్చుకోండి....

చింతకాయపచ్చడీ - నేతరిసెలూఆగండాగండీ! టైటిలు చూసి ఖంగారుపడకండి... నేతరిసెలు ఎల్లా చెయ్యాలో ఇక్కడ చెప్పబోటంలేదు లెండి! మరి రెండూ ఎందుకు రాశానంటారా టైటిల్లో? ఎందుకో టపా మధ్యలోనో, చివర్లోనో కబుర్ల మధ్యలో నాకు గుర్తొచ్చినపుడు చెప్తానులెండి. మరి అలాంటప్పుడు ఇలా టైటిల్లో పెట్టటమెందుకూ, బడాయి కాకపోతే అంటారా- అవును మరి! ఆ మాత్రం బడాయి లేకపోతే ఎల్లాగుమరి! ఎంత లౌక్యం తెలీకపోయినా మాకూ కాసిని మార్కెటింగు టిప్పులు తెలుసులెండి! అందుకని ఇల్లా ఫాలో అయిపోయా. అబ్బబ్బ! శెబాసని నాకు నేనే జబ్బచరిచేసుకోవాలనిపిస్తోంది. సర్లే! ఇంక సోదాపి మ్యాటర్లోకి ఎంటరైపోతా.

ఈ మధ్యన కాస్త పనివత్తిడీ, చదువూ- "మునగానాం, తేలానాం"గా ఉంది మన పరిస్థితి. అందుకని పొయ్యి వెలిగించిందిలేదు అసలు, మెస్సుల్లో పడి తినటమే. అలా అయితే మన పాకవేదం అభిమానులు బెంగెట్టుకోరూ అనిపించింది. అందుకని ఇక నెలకొక రకమైనా మనవాళ్ళందరికీ రుచ్చూపించాలని డిసైడయ్యా. అదన్నమాట సంగతి. కాస్త ఫ్రీ అయ్యాక ఎడపెడా రాసి వడ్డిస్తాలెండి....:)

ఇక మన ఇవ్వాళ్టి ఐటంలోకి వచ్చేద్దాం. దీన్ని రోటి పచ్చళ్ళ సెక్షన్లో వేసుకుంటారో, ఊరపచ్చళ్ళ సెక్షన్లో వేసుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే, ఇది రెండూ కాబట్టి..:)

"చింతకాయ" - అసలు ఈ పేరు చెవినపడగానే నోట్లో నీళ్ళూరని నరమానవుడుండడేమో! నాకైతే ఉత్తి నీళ్ళూరడం కాదు, ఏకంగా పళ్ళు తెగ పులిసిపోతాయి..:). పుల్ల చింతకాయకి ఉప్పూకారం అద్దుకుని, అందరికీ నోళ్ళల్లో నీళ్ళూరేట్టు ఊరిస్తూ తినటం- అదో తుత్తి. అదేం మహత్యమో గాని దాని పేర్లోనేకాదు, చెట్టు-చెట్టు మొత్తం పులుపే! మన తెలుగునాట ప్రతి ఊళ్ళో దాదాపు పెద్ద పెద్ద చింతతోపులుండేవి. అవి ఊరిమొత్తం ప్రజలకి కామన్ ఆస్తి. ఆ చెట్లన కాసే పూత,చిగురు, కసరు పిందె దగ్గర్నుంచి గుల్లగా పండిన మాంఛి చింతకాయ వరకూ ప్రతిదీ అందరికీ ఉమ్మడి ఆస్తి. ఎవరిక్కావల్సింది వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. కూరకి వెతుక్కోవల్సిన అగత్యం ఎవరికీ ఉండేదికాదు. పప్పులోకో, పచ్చడిగానో, పెరుగుపోపులోకో మేమున్నాం అని అభయహస్తం ఇచ్చేవి. ఆ తోపులు పిల్లలకి ఆటవిడుపు స్థలాలు, పెద్దలకి విశ్రాంతి తీసుకోను చల్లటినీడనిచ్చే చోటులు.
జనం డబ్బు రుచి మఱిగి, కనపడ్డ ప్రతి నేలనీ, తోటనీ, తోపునీ మాగాణులు చేశారు అప్పట్లో. ఇప్పుడు వాటినే మళ్ళా వెంచర్లని పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారనుకోండి! అలా నాకు తెలిసినంతవరకు, మాగాణి జనాలు చాలామందికి అందునా నది ఒడ్డున్నే ఉన్నవాళ్ళకి చింతతోపులూ, వాటి చల్లటినీడా, అవిచ్చే పుల్లపుల్లని రుచులూ అంత ఎఱుకై ఉండకపోవచ్చు. ఆ విషయానికి నేను అదృష్టవంతుణ్ణేనేమో, మాగాణి దేశంలో పుట్టనందుకు. అప్పుడోసారి మార్కెట్టుకెడితే చింతచిగురు కనిపించింది. ఎంత ఖర్మ పట్టిందిరా దేవుడా, చింతచిగురు కూడా కొనుక్కోవాల్సొస్తోంది అనిపించింది. నోరూరుకోక రేటెంతో అడిగా...వాడు చెప్పిన రేటుకి నాకు గుండెలు నిజంగానే పగిలిపోయాయసలు, వందగ్రాములు ఇరవై రూపాయలట! కలికాలమంటే ఇదికదా అనిపించింది. హ్మ్! వెంటనే మా కాలేజికెళ్ళి చక్కా ఒక చెట్టుని గెడపెట్టి నాలుగు దులుపులు దులిపి గుప్పెడు తెచ్చుకుని పప్పులో, పెరుగు పచ్చట్లో వేసుకున్నా.


ఇక "చింతకాయ పచ్చడి"- ఈ పేరు వింటేనే ఒక ఆత్మీయమైన భావన కలిగిద్ది నాకు. ఇప్పటికీ మా వేపు బీదవాడి దగ్గర్నుంచి కోటీశ్వరుడి వరకూ తేడా లేకుండా తినే కూర ఇది. అప్పట్లో పాలేర్లు, పనివాళ్ళూ ఆసాములింట్లో కాస్తంత ముడిచింతకాయపచ్చడి ముద్ద పెట్టించుకొనెళ్ళి, రెండు ఎండుమిరగాయలేసి రోట్లో నూరుకుని వేడి సంకట్లో వేసుకుతినేవాళ్ళు. అన్ని ఊరగాయల్లా కారంలో,నూనెలో ఊరదుకాబట్టి రోజూ తిన్నా ఆరోగ్యానికి ఏం చెరుపు చేసేదికాదు, వాటిలా ఖర్చూ ఉండదు. తోపులో చింతకాయలూ, రెండురూపాయలు ఉప్పూ అంతే! పైగా ఒకసారి నూరి పెట్టుకుంటే పదిరోజుల వరకూ పాడవ్వదాయె, అందువల్ల పొలంపనులు చేసుకొచ్చి అలిసిపోయి ఏ కూర వండుకోవాలా అన్న జంజాటం ఉండేదికూడా కాదు. కూరాకు పండని రోజుల్లో ఎంత ఆపుగా ఉండేదో! అందుకే మావేపు చింతకాయపచ్చడి కుండనీ, పున్నీళ్ళ కుండనీ "మాలచ్చిమి" అని బొట్లెట్టి పూజ చేస్తారు. ఎంత కరువొచ్చినా ప్రాణాలు నిలబెట్టేవి ఆ రెండేనంట! అందుకే పొద్దున్నే మా అమ్మమ్మ ఆ కుండకి దండం పెట్టుకోకుండా మొదలెట్టేదికాదు పని. మాకు గృహప్రవేశాలప్పుడు లోపలికి తీసుకువెళ్ళే అన్ని వస్తువులలో ముడిచింతకాయపచ్చడి ముఖ్యమైన వస్తువు. ఇక బంతిభోజనాలకి తప్పనిసరి ఐటెం, రకాలకోసం వెతుక్కోవాల్సిన పనుండదు. పూర్వమేమో తెలీదుగాని, ఇప్పుడు కొన్నిప్రాంతాల్లో చాలామంది చింతకాయపచ్చడి అంటే మిగతా అన్ని ఊరగాయల్లా నూనె, ఎండుకారం పోసి పెట్టుకోటం మొదలెట్టారు. అదే అసలురకం అనుకుంటారు, అసలు చింతకాయపచ్చడిని మర్చేపోయారు.

అమ్మ ఎప్పుడన్నా "కూర ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు" అంటే, నాన్న "ఉంది గదటోయ్, ఆపద్భాందవి, అనాథరక్షకి చింతకాయపచ్చడి. నాలుగు దోసిత్తనాలు, కాసిన్ని ఎండు మిరపకాయలూ, రెండు వెల్లుల్లి రెబ్బలూ వేసి తొక్కి చిన్న గెంటెడు నూనె, చిటికెడు ఇంగువా వేసి చెయ్. కుంపట్లో పప్పు పడెయ్. పచ్చడి నూరేలోపు ఉడికిపోతుంది. కాసింత మెఱుగు బొట్టేసుకుని రెండూ విడివిడిగా నాలుగుముద్దలూ, కలిపి నాలుగుముద్దలూ తింటే పోయే! ఆత్మారాముడు బహుభేషుగ్గా శాంతిస్తాడు" అనేవాళ్ళు.

ఇక ఈ చింతకాయపచ్చడి పాతపడే కొద్దీ రుచి పెరుగుతుంటుంది. పాత చింతకాయపచ్చడి అనగానే నాకు భానుమతమ్మ డవిలాగులు గుర్తొస్తాయి. విచిత్రవివాహంలో అనుకుంటా. కూతురు, భానుమతమ్మ తెచ్చిన సంబంధం వద్దు అని ఇలా అంటుంది, "అమ్మా! పెద్దవాళ్ళు తెచ్చే పాతచింతకాయ పచ్చడి సంబంధాలు నాకఖ్ఖర్లేదు"అని. అప్పుడు భానుమతమ్మ తనదైన వెటకారం ధ్వనించే గొంతుతో,"పాత చింతకాయపచ్చడి పథ్యానికి మంచిది, వంఠికి ఆరోగ్యం. కొత్తచింతకాయ పచ్చడి జలుబు చేస్తుంది"అనంటుంది. అదన్నమాట సంగతి. ఇప్పుడు మనం ఆ కొత్త చింతకాయపచ్చడి ఎలా పెట్టుకోవాలో, దాన్ని పాతచింతకాయ పచ్చడిగా ఎలా మార్చుకోవాలో, కమ్మగా ఎలా తినాలో చెప్పుకుందాం ఇవ్వాళ...

ముందు ముడి చింతకాయపచ్చడి (దీన్నే కొన్ని ప్రాంతాల్లో చింతాకాయ తొక్కు అంటారట!) ఎలా పెట్టుకోవాలో చెప్పుకుని దాన్ని తర్వాత రకరకాలుగా, రుచులు రుచులుగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పుకుందాం.

 • దీనికి కావల్సిన మొట్టమొదటి రిక్వైర్మెంటు మాంఛిరోలు..:)... పెద్ద కుందిరోలైతే బాగా అనువుగా ఉంటుంది. రోట్లో కాకుండా ఎలా చేస్తారో నాకైతే తెలీదు. పూర్వం చింతకాయపచ్చడి సీజన్లో బజారురోళ్ళసలు ఖాళీనే ఉండేవికావట! రోజూ ఎవరో ఒకళ్ళ పచ్చడి నలుగుతూనే ఉండేదట!
 • తర్వాత బాగా ముదిరిన చింతకాయలు(గీకిచూస్తే పచ్చదనం ఉండాలి, విరిచి చూస్తే పూర్తిగా విత్తనం పట్టి ఉండకూడదు) బాగా కండపట్టి ఉన్నవి, పులుపు ఉన్నవి తెచ్చుకోవాలి. నలుగురున్న ఇంట్లో, బాగా విరివిగా వాడుకునేవాళ్ళైతే రెండు కేజీలు సరిపోతుంది సంవత్సరానికి. బాగా ముదిరిన కాయలు పండగెళ్ళాకే వస్తాయి సాధారణంగా.
 • ఇక ఆ చింతకాయల్ని కడిగి, ఆరబోసి, బాగా ఆరాక తొడాలు కోసేసి, ఓపికుంటే సగానికి కోసుకోవాలి. ఇంకా ఓపికుంటే ఇంకా ముక్కలుగా కోసుకున్నా పర్లేదు. కాని, ఎటూ తొక్కేవే కాబట్టి అంత చిన్నముక్కలుగా కొయ్యాల్సిన పన్లేదు. తొడాలు కోసేప్పుడు పట్టుకుని లాగితే కొంత పీచు వచ్చేసిద్ది.
 • ఇక ఈ కాయల్ని రోట్లో వేసి, ఉప్పు, పసుపు వేసి ముక్క బాగా నలిగేవరకు తొక్కడమే. రెండు రోకళ్ళపోటు వెయ్యగలిగితే త్వరగా మెదుగుతుంది. ఉప్పు కొలత, కట్టుకాయలకి సోలాగిద్ద. కట్టంటే కాస్త అటూ ఇటూగా రెండుకేజీల తూకం. అంటే కేజీ కాయలకి అరసోల(షుమారు రెండొందలగ్రాములు). కళ్ళుప్పే బాగుంటుంది. పసుపు చిటికెడు చాలు.
 • ఇలా కచ్చాపచ్చాగా తొక్కిన పచ్చడిని జాడీలోకి తీసుకుని పదిహేను రోజులు ఊరనివ్వాలి. చింతకాయల్లో ఉండే నీరు, ఉప్పు కలిసి బాగా ఊరతాయి.
 • పదిహేను రోజుల తర్వాత ఈ ఊరిన పచ్చడిని తీసి మళ్ళా రోట్లోవేసి మెత్తగా అయ్యేవరకు తొక్కాలి. రెండు స్పూన్లు మెంతిపిండి, చిటికెడు పసుపు వెయ్యాలి తొక్కేప్పుడు. దీన్ని తిరగతొక్కడం అంటాం. ఇలా రెండుసార్లు తొక్కటం ఎందుకంటే, కచ్చాపచ్చాగా తొక్కిన పచ్చడి ఉప్పులో ఊరి ఈసారి తేలిగ్గా మెదుగుతుంది. మొదటిసారి మెత్తగా తొక్కటానికి అవ్వదు.
 • తిరగతొక్కేప్పుడు చింతకాయల్లో పీచు చూసి వేరేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువ వెయ్యకూడదు, చేదొస్తుంది. రంగురావడానికి సరిపడా వేసుకుంటే చాలు.
 • ఇక ఇలా మెత్తగా తొక్కుకున్న ముడి చింతకాయపచ్చడిని జాడీలో ఎత్తి పెట్టుకోవాలి. జాడీలోకి తీసుకునేముందు అడుగున, మొత్తం పెట్టాక పైన నాలుగు స్పూన్లు మంచి వంటాముదం వెయ్యాలి. ఆముదం పచ్చడి నల్లబడకుండా చేస్తుంది. కొంతమంది తిరగతొక్కేప్పుడే పచ్చట్లో రెండుగెంటెలు ఆముదంపోసి తొక్కుతారు.
 • ఇది ఒక నెల అయ్యాక అవసరమైనప్పుడు కొంచెంకొంచెం తీసుకుని తినాలి. కొత్తల్లో అంతమంచిదికాదు.
 • కొన్ని రోజులు బైట ఉంచినా ఏంకాదు. గట్టిగా అయిపోయినా కాస్తనీళ్ళబొట్టు వేసుకుని నూరుకుంటే సరిపోతుంది.
 • ఇలా పెట్టుకున్న ముడిపచ్చడి రెండేళ్ళైనా అలానే ఉంటుంది.

హమ్మయ్య! మొదటి భాగం పూర్తయ్యింది. ఇక అసలు భాగం. ఈ ముడిచింతకాయ పచ్చడిని రుచులురుచులుగా ఎలా తయారు చేసుకోవాలి,ఇంకా వేటివేటిల్లో వాడుకోవచ్చు అనేది. ఈ ముడి చింతకాయపచ్చడిని చింతపండు బదులుగా అన్ని రోటిపచ్చళ్ళల్లో వాడుకోవచ్చు. టమాటాపచ్చడి, దొండకాయ, కొబ్బరిపచ్చడి, దోసకాయ పచ్చిముక్కలపచ్చడి......ఇలా అన్నిట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ముడి చింతకాయపచ్చడితో పులిహోర కలిపితే అద్భుతంగా ఉంటుంది, ఏ పులిహోరా దీనికి సాటిరాదు. చెయ్యటం రెండు నిమిషాల పని.

ఈ ముడిపచ్చడిని తినాలకున్నప్పుడు నాలుగైదు రకాలుగా(వాటిలో వేసే పదార్థాలను మార్చి) చేసుకుంటారు. ఒక్కోదానిది ఒక్కోరుచి, ఏదీ తక్కువకాదు. నేను ఎక్కువగా చేసుకునే రకం ఇక్కడ వివరంగా చెప్తా. మిగతావి చివర్లో క్లుప్తంగా చెప్తా.
 • మొదట చారెడు వేరుశనగపప్పు వేయించి పొట్టుతీసి పెట్టుకోవాలి. తర్వాత రెండు స్పూన్లు దోసిత్తనాలు, కాసిన్ని ధనియాలు, నాలుగు మెంతులూ వేయించాలి. దోసిత్తనాలు చిటపటలాడే వరకు వేయిస్తే చాలు.
 • గుప్పెడు ఎండు మిరపకాయలు(తినాలనుకున్న కారాన్నిబట్టి) తీసుకుని చెంచాడు నూనెవేసి, దోరగా ఘాటు వచ్చేవరకు వేయించాలి. మరీ నల్లగా అయ్యేవరకు అవసరంలేదు. కొంతమంది అసలు వేయించకుండానే వాడేసుకుంటారు.
 • ఇక పైన తయారుచేసుకు పెట్టుకున్న దినుసులన్నీ రోట్లోకి మార్చుకుని మెత్తగా దంచాలి. అప్పుడు కావలసినంత ముడి పచ్చడిని తీసుకుని ఆ దంచినపొడిలో వేసి బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు తొక్కడమే. తొక్కేప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలూ, చిటికెడు జీలకఱ్ఱా వేస్తే సరి! నూరేప్పుడు మెదగటానికి కాసిని నీళ్ళు వేసుకోవచ్చు.
 • ఉప్పు ముడిపచ్చడిలోనే ఉంటుంది కాబట్టి అవసరంలేదు.
 • ఇలా నూరిన పచ్చడి తీసుకుని మంచి పప్పునూనెతో తిరగమాత పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపు పెట్టకపోయినా పర్లేదు, అదోరుచి..:)
 • ఇలా నూరిన చింతకాయపచ్చడి పదిహేను రోజులైనా పాడవదు.

ఇక వేరే రకాల్లో ముఖ్యమైంది, పచ్చిమిరపకాయలతో చేసుకునేది. అందులో వేరుశనగపప్పు, దోసిత్తనాలు పన్లేదు. మిగతావన్నీ వేసుకోవాలి. అయితే అన్నీ(పచ్చిమిరపకాయలూ, ధనియాలు, మెంతులూ) నూనెలో వాడ్చి ముడిపచ్చడితో కలిపి తొక్కుకోవాలి. చివర్లో వెల్లుల్లీ, జీలకఱ్ఱా కామన్. వీటితోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వాడ్చి వేసి తొక్కితే అదో డిఫరెంటు రుచి. ఉల్లిపాయలు పూర్తిగా మెదగకుండా పంటికి తగులుతుంటే బాగుంటుంది. ఎటూ అన్నీ నూనెలోవాడుస్తాం కాబట్టి, తాలింపు పన్లేదు. వేసుకున్నా బానే ఉంటుంది. అయితే ఇలా నూరిన పచ్చడి ఎక్కువరోజులు నిలవుండదు.

పచ్చిమిరపకాయలు వాడ్చకుండా కూడా చేసుకుంటారు కొంతమంది. నాకు అది అంతగా నచ్చదు. ఎండు మిరపకాయలు వేసి చేసుకునేప్పుడు వట్టి వేరుశనగపప్పు గాని, వట్టి దోసిత్తనాలుగాని(రెండవది లేకుండా) వేసి చేసుకున్నా బాగుంటుంది. వేసుకోవాలనిపించినవాళ్ళు, తొక్కేప్పుడు ఏ రకంలో అయినా పచ్చికొబ్బరిగాని, ఎండుకొబ్బరిగాని వేసుకోవచ్చు ,మంచి రుచొస్తుంది. కొత్తిమీర , పచ్చిమిరపకాయలు వేసి చేసుకునే దాంట్లో వేస్తే బాగుంటుంది....అబ్బో ఇలా బోలెడు రకాలు.... :)..

ఇక ఈ పచ్చడి అసలు రుచి ఆస్వాదించాలంటే అప్పుడే పొయ్యిమీద నుంచి తీసి, పొగలు కక్కుతున్న అన్నంలో కమ్మటి నెయ్యి పోసుకుని తింటుంటే ఉంటుందీ...అబ్బబ్బ! స్వర్గానికో, వైకుంఠానికో బెత్తెడెత్తున కాదు, నిఝంగా ఆపైన ఏదన్నా ఉంటే అదే!జ్వరపడి లేచి, పథ్యం చేసి చవిచెడిఉన్న నోర్లకి ఈ పచ్చడి ఇచ్చేటంత హాయి ఇంకేదీ ఇవ్వలేదు.

ఇక మారు ముద్దలోకి ముద్దపప్పులో నెయ్యివేసుకు కలుపుకుతింటే ఆహాహా! చెప్పడానికి వెయ్యినోళ్ళున్న సామికి కూడా వల్లకాదు. అందునా తిన్న తర్వాత వచ్చిన గుజ్జు కంచం అంచుకు తీసి, అలా వేలిమీది వేసుకుని నాలిక్కి రాసుకుని చప్పరిస్తే....... ఊహూఁ! చెప్పటంకాదు తిని చూడాల్సిందే!

ఇక జొన్నసంకట్లో, పొంగలన్నంలో దీని కాంబినేషన్ అదుర్స్!
అదన్నమాట సంగతి... ఎవరికన్నా ముడిపచ్చడి పెట్టుకునే ఓపిక లేదంటే, మా ఇంటికొచ్చెయ్యండి...:)హా! మర్చేపోయా, అసలు సంగతి! టైటిల్లో చెప్పానుగా.... ఇది నా నాలుకవాడు చేసిన మహా వెరైటీ ప్రయోగం. నేతరిసెల్లో కొంతమంది పెసరపప్పో, కందిపప్పో పెట్టుకుని నెయ్యి పోసుకుని తింటారు. కొంతమంది మధ్యలో ఏ కారప్పూసో, చక్కలో, జంతికలో నముల్తారు. నాకు బాగా వెగటేసినప్పుడు పైన చెప్పిన వేరుశనగపప్పు, దోసిత్తనాలు వేసి నూరిన చింతకాయపచ్చడి నంజుకు తింటుంటా. అదిరిపోతుందసలు. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి, అరిసెలు తినీ తినీ వెగటనిపించినప్పుడు...;)

తు.చ :- ఇక్కడ అరిసెల పుటో పెట్టలేదు, ఎందుకనగా తీద్దామంటే, పండక్కి అమ్మ చేసిన నేతరిసెలన్నీ అవ్వగొట్టేశా...:)

పులిహోర గోంగూరా - బోల్డన్ని క్షమాపణలూ

అందరికీ ముందుగా బోల్డన్ని క్షమాపణలు! ఎందుకంటారా! ఏం లేదండీ, తర్వాత టపా చూస్తే మీరు అగ్గిమీద గుగ్గిలమైపోతారు మరి! నామీద విరుచుకుపడకుండా ముందస్తు జాగ్రత్తగా చెప్పేస్తున్నానన్నమాట!..:)

ఇక విషయమేంటంటే, అప్పుడెప్పుడో "మాలిక పత్రిక" శ్రావణపౌర్ణమి సంచికలో ఒకపోటీ, దానికైన గెస్సులూ, హడావుడీ గుర్తున్నాయా! అదన్నమాట సంగతి!..:)... అందులో ఆ "గోంగూరకథ" రాసింది నేనేనని తర్వాత అనౌన్సు కూడా చేశామనుకోండి! ఇప్పుడెందుకు ఆ విషయం మళ్ళా చెప్తున్నాననుకుంటున్నారా! మరి, అప్పుడు పోటీ కోసమని అందర్నీ బాగా తికమక పెట్టాను కదా, పైగా బోల్డన్ని అబద్ధాలుకూడా ఆడేశాను మరి, అందర్నీ కన్ఫ్యూజ్ చెయ్యటానికి! అందుగ్గాను ఇలా నా బ్లాగుముఖంగా పేద్ద "సారీ" చెప్దామని ఈ టపా అన్నమాట!(పన్లోపని, మన రెసిపీ నా బ్లాగులో ఉంటుందీ, మరిన్ని హిట్టులూ వస్తాయ్!..;)...)

ముఖ్యంగా నేను ఎక్కువ మిస్ లీడ్ చేసిన వ్యక్తులు కొందరున్నారు. శంకర్ గారు, రాజ్, వేణూ శ్రీకాంత్! వీళ్ళకి బోల్డన్ని సారీలన్నమాట! గుంజీలు తియ్యమన్నా తియ్యాల్సిందే! అంతగా నటించానన్నమాట..;)..ఏం చేద్దాం! పోటీ అంటే పోటీ ఏ కదా, అన్ని రకాలుగా ప్రయత్నించాలి...:)

మిక్సీ, ఫొటోలో ఉల్లి ( పోస్ట్ లో ఎక్కడా చెప్పలేదు, ఎవరన్నా ఆ పాయింటు కనిపెడతారేమో అని చూశా! ఇంకా, ఆ ఫొటో నాది కాదన్నమాట!..:)...), ఉల్స్ కుమ్మడం...ఇలా కొన్ని కావాలనే మిస్ లీడ్ చెయ్యటానికి రాశానన్నమాట!.. కాని నా గురించి అంతబాగా గుర్తు పెట్టుకుని ఆ విషయాల్లో, నేను కాదని వేణూఅన్నాయ్, వరూధినిగారు వాదిస్తుంటే, భలే ఆనందమేసింది, "ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో! " అని..:)..అందుకని వాళ్ళకి థేంక్యూలూ, సారీలూ....

సుజాత గారు చాలా దగ్గరకు వచ్చారు కాని, చిన్నపాయింట్లలో చెప్పలేకపోయారు.... ఇక నా శైలిని ( అసలు పోటీ ఇదే కదా!) ఖచ్చితంగా గుర్తుపట్టి చెప్పినవాళ్ళు సుధగారు, సునీతగారు, ఎన్నెలగారు, బులుసు గారు...(వీళ్ళు కూడా తర్వాత మిస్ లీడ్ అయ్యారనుకోండి)...;).. వీళ్ళందరికీ చాలా బోలెడు థేంక్యూలు.....

ఇక ఆ టపా మళ్ళా మన పాకవేదం అభిమానుల కోసం...:)నేనూ "వంటలు" రాశానోచ్


మన బ్లాగ్లోకంలో వంటలు రాసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అదేంటీ, వంటలు వండుతారుగాని, రాయటమేమిటీ అంటారా! ఏమో మరి వాళ్ళంతా రాస్తుంటారు(నిజంగా వండుతారో లేదో తెలీదుగాని..;)..). ఒకాయన "బ్లాగునలుడూ", ఇంకొకాయన "బ్లాగుభీముడూ"...... ఒకావిడ ఆరో,పదారో,నూటయాభైయ్యారో "రుచులు"తెగ రాసేస్తుంటుంది. మరొకావిడ "రుచులు" అని చెప్పి తెగ టెంప్ట్ చేసేస్తుంటుంది.....:). మరి వాళ్ళందరూ రాయగాలేంది నేను రాస్తే తప్పేవిఁట్టా! ఆహాఁ ఏంటీ తప్పు అనడుగుతున్నా! అందుకని వాళ్ళకన్నా గొప్పగా వండలేకపోయినా, సారీ! రాయలేకపోయినా, వాళ్ళల్లో ఒకళ్ళగానన్నా కాకపోతానా అనుకుని రాసేద్దామని డిసైడైపోయా....

ఇక వాళ్ళలా కాకుండా కాస్త సిన్సియర్గా వండిమరీ రాద్దామని బాగా ఇదిగా అనేసుకున్నా. కాని ఎక్కడ రాయాలి???..... గోడలమీదా,గొబ్బెలమీదా రాస్తే ఎవరు చూస్తారు? పైగా మా ఇంటిఓనరు పట్టుకు తంతాడు. బ్లాగొకటి తెరిచి రాద్దామా అనుకుంటే మనం మహావీర బద్దకస్తులం కదా!"ఉన్న మూణ్ణాలుగు బ్లాగులే సరిగ్గా మెయింటైన్ చెయ్యట్లా, ఇప్పుడు కొత్తగా మరోటి మొదలెట్టి, అదికూడా గాలికొదిలేస్తే, బ్లాగ్లోకంలో ఇప్పుడున్న కాస్తపరువు కూడా పోతుంద"ని మా --.బ్లా.స. మిత్రులు హెచ్చరించారు. ఏ పత్రిక్కో పంపిద్దామా అంటే మనవాళ్ళు చూసే పత్రికలేం ఉంటాయ్, పైగా ఆ పత్రికలవాళ్ళు మన వంటకం వేస్తారని గ్యారంటీ ఏం లేదుకదా అని తెగ ఆలోచించేస్తుంటే ఓ అవిడియా తట్టింది.....
మన "మాలిక పత్రిక" వాళ్ళు, కొత్తవాళ్ళని, వాళ్ళ టాలెంటుని ఎంకరేజ్ చేస్తారని, విభిన్నమైన అంశాలకి ప్రాముఖ్యతనిస్తారని తెలుసు కదా! సో వాళ్ళని డవిరెక్టుగా కాంటాక్టు చేశా. వాళ్ళదసలే విశాల హృదయం. నా విషయం చెప్పగానే, "మీకెందుకు, మీరు రాసి పంపండి.వేసేస్తాం.."అని నాకు అభయహస్తం ప్రకటించేశారు. అద్గదీ ఇంకేముంది! హాయిగా ఊపిరి పీల్చుకుని రాయటానికి ప్రిపేరై పోయా.......

హ్మ్! రాయాలంటే మరి వండాలికదా! "ఆ! మరీ చెప్తావ్! రాయాలంటే నిజంగానే వండాలా ఏంటీ, ఏదో ఒకటి రాసేస్తే పోలా, చదివే వాళ్ళంతా నిజంగా చూడొచ్చారా పెట్టారా?"అన్నారు మా --.బ్లా.స. మిత్రులు. ఊఁహూఁ! నే ఒప్పుకోలా, మరి నేను చాలా సిన్సియర్ కదా! అందుకని నిజంగా వండాక రాద్దాం అనుకున్నా. ఐతే ఇంతకీ ఏం వండాలి? అని తెగ ఆలోచించా......

ఇంతలో మా బికీలీక్స్ బృందం ఓ మాంఛి ఇన్పర్మేషన్ తెచ్చారు. ఆ సదరు బ్లాగుభీముడుగారు ఒక వెరైటీవంటకం చేసి మరొకాయనకి పార్సెలు ఇచ్చారంట. అది ఇంకా ఆయన బ్లాగులో పెట్టలా, ఇప్పుడప్పుడే పెట్టే ఆలోచన కూడా లేనట్టుంది. ఇంతకీ ఆ వంటకం ఏంటనుకున్నారు, "పులిహోరగోంగూర పచ్చడి". ఓస్! అదే కదా అనిపించింది. ఆయనేనా చేసేది,రాసేది! మేం చెయ్యలేమా,రాయలేమా అనుకున్నా! పైగా మొదలెట్టటమే "ఊరగాయలతో", అదీగాక నాకు అత్యంత ప్రాణప్రదమైన మన "ఆంధ్రమాత" గోంగూరతో మొదలెడితే మనకీర్తి దశదిశలా వ్యాపిస్తుంది కదా అనిపించి ఉబ్బితబ్బిబ్బై ,"శభాష్" అని నా జబ్బ నేనే చరిచేసుకున్నా.......:)......


ఇక పచ్చడి ఎలా పెట్టాలి, ఏమేం సంభారాలు కావాలి అని ఆలోచించా. మా అమ్మ,పెద్దమ్మ కలిసి పెట్టేవాళ్ళు ఆ పచ్చడి. వాళ్ళు పెట్టిన పచ్చడి సప్తసముద్రాలవతలక్కూడా ప్రయాణం చేసొచ్చేది. అమ్మకో ఫోనుకొట్టి ఎలా పెట్టాలో, ఎంతెంత కొలతలో కనుక్కున్నా. పైగా వాళ్ళు పెడుతుంటే ఏళ్ళ తరబడి చూసిన అనుభవంకూడా బోలెడుంది కదా! ఇంకేముంది అన్నీ తెచ్చుకుని రంగంలో దూకేశా.....

ఏమేం తెచ్చుకున్నానంటే :-

 1. మాంఛి ముదురుగోంగూర - ఒక కేజీ
 2. చింతపండు - నూటాయాభై గ్రాములు
 3. ఎండు మిరపకాయలు - రెండొందల గ్రాములు
 4. ధనియాలు - చారెడు
 5. మెంతులు - రుచికి సరిపడా (అంటే ఒక రెండు స్పూనులనుకోండి)
 6. నూనె - అరకేజీ
 7. వెల్లుల్లి పాయలు - వలిచిన రెబ్బలు ఒక చారెడు
 8. ఉప్పు - పావుకేజీ
 9. ఇంకా తాలింపుకి ఇంగువ, తాలింపు గింజలు

ఎలా చేశానంటే :-
 • ముందు గోంగూరని శుభ్రంగా కడిగేసి ఆరనిచ్చి బాండీలో సరిపడా నూనె వేసి వేయించాను.
 • గోంగూర వేగుతుండగానే, ముందే బాగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు బాగా పిసికి పులుసు తీసి పొయ్యిమీద పెట్టి పులిహోర పులుసులా కుతకుతా ఉడికించా. ఉడికాక దించి పక్కన పెట్టా. వేగిన గోంగూరని కూడా...
 • ఇప్పుడు ఎండు మిరపకాయలు మరికాస్త నూనెవేసి బాగా వేయించా. అవి బాగా వేగేప్పుడు చివర్లో ధనియాలు,మెంతులు వేసి అన్నీ బాగా వేగగానే దించేశా....
 • ఇప్పుడు ఈ మిరపకాయలు,ధనియాలు,మెంతులు,ఉప్పు కలిపి మిక్సీలో వేసి, బాగా మెత్తగా అయ్యేలా చేసి ఆ "కారం" పక్కన పెట్టుకున్నా...
 • ఇక పైన వేయించి పెట్టుకున్న గోంగూర, ఉడకబెట్టిన చింతపండు పులుసు, కొట్టిపెట్టుకున్న కారం అన్నీ కలిపి గ్రైండర్లో వేసి రుబ్బాను.
 • వెడల్పాటిబాండీ పొయ్యిమీద పెట్టుకుని మిగిలిన నూనె అంతాపోసి బాగా కాగనిచ్చి తాలింపు గింజలు,ఇంగువ వేసి చిటపటలాడగానే దించి ఈ నూనె ముందు రుబ్బిపెట్టుకున్న పచ్చడికి కలిపాను.
 • చివర్లో ఆ చారెడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి ఆరాకా తీసి బుల్లిజాడీకి పెట్టాను.
 • అంతే! ఘుమ్మని వాసనలు కొడ్తున్న "పులిహోర గోంగూర" తయారైపోయింది.

ఈ పచ్చడి ఎలా తినాలంటే :-

కంచంలో వేడివేడన్నం పెట్టుకుని, ఈ పచ్చడేసుకుని్, మాంఛి వెన్నపూసేసుకు తింటుంటే ఉందీ నా సామిరంగా! అబ్బబ్బ!యమాగా ఉందిలే! ఇది జొన్నసంకట్లోగాని, రాగిసంగట్లో గాని ఏసుకుతింటూ మజ్జెన ఉల్స్ కుమ్ముతూ ఉంటే ఇంకా యిరగదీసేస్తదంతే.....;)

మీరు చేసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :-

ఏం లేదండీ, ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే పచ్చడి రుచీ అదిరిపోద్ది, ఎక్కువనాళ్ళూ ఉంటది.
 • మొదట గోంగూర బాగా ముదురాకు తీసుకోవాలి. ఎందుకంటే లేతాకు వేయించగానే లేహ్యంలా ఐపోతుంది. ముదురాకైతేనే తాళ్ళుతాళ్ళుగా ఉండి బాగుంటుంది. ఇక లేతాకే దొరుకుతుందనుకోండి ఎక్కువ రుబ్బాల్సిన పన్లేదు. బాగా కలిపినా సరిపోతుంది. ఏ ఆకైనా మిక్సీలు,గ్రైండర్ల కంటే రోట్లో రుబ్బితేనే బాగుంటది.
 • ఆకు కేజీ అంటే వలిచిన ఆకు, కట్టలతో కాదు...:)..... ఆకుని ఎక్కువగా కడగొద్దు, ఒక్కసారి నీళ్ళల్లో ముంచి దులిపి తీసెయ్యండి. ట్యాపుల కింద ఎక్కువసేపు పెట్టి కడగొద్దు. అలా చేస్తే ఆకుకి ఉన్న పులుసు కారిపోతుంది. అప్పుడు రుచీ పచీ ఉండదు.నిలవకూడా ఉండదు.
 • ఇక పై కొలతలన్నీ నేను ఉజ్జాయింపుగా చెప్పినవే. ఎందుకంటే అమ్మ అన్నీ కట్లు,అరసోలల లెక్కన చెప్పింది...:)
 • చింతపండు పులుసు పిసకక పోయినా, బాగా ఉడికించి అది మిక్సీ పట్టేస్తే తొక్కంతా కూడా కలిసిపోతుంది. పులుసుకూడా చిక్కగా ఉంటుంది.
 • ఇక కారం! పైన నేను చెప్పినట్టు అప్పటికప్పుడు కొట్టుకున్నా సరే లేకపోతే మామూలు పచ్చళ్ళకారమైనా వాడుకోవచ్చు. అప్పుడు కారం కొలత - అరసోల, అంటే షుమారు ౩౦౦మిలీ గ్లాసుతో కొలిస్తే ఎంత వచ్చిద్దో అంత, ఉప్పు కూడా అంతే. ఆ కారానికి ధనియాలు,మెంతులూ సరిపడా కలిపి కొట్టుకోవాలి. కాని వేయించికొట్టిన కారమే రుచి. ఉప్పుకూడా కళ్ళుప్పైతేనే బాగుంటుంది.
 • నూనె కూడా చూసుకుని కలుపుకోవాలి. ఆకుని బట్టి మారుతుంది కలుపుకోవాల్సిన కొలత. వేరుశనగనూనె ఐతేనే కమ్మగా ఉంటుంది. గోంగూర ఎంత నూనె పోసినా, ఎన్ని మిరపకాయలు పోసినా వద్దనదని వెనకటికెవరో ఓ కవిగారు చెప్పారు మరి!...:)
 • తాలింపు గింజల్లో మినప్పప్పూ,పచ్చనగపప్పూ,ఆవాలూ,ఎండు మిరపకాయలూ, ఇంగువా వేసుకోవాలి. జీలకఱ్ఱ్రా,కరివేపాకూ అవసరం లేదు.
 • ఇక వెల్లుల్లి ఇష్టమున్నవాళ్ళు వేసుకోవచ్చు,లేకపోతే లేదు.
 • ఇక అన్నిటికన్నా ముఖ్యం తడిచేతులు,తేమ అస్సలు తగలనివ్వొద్దు. పచ్చడి బాగా ఆరాకే డబ్బాకో,జాడీకో పెట్టండి. ఇలా చేస్తే తేలిగ్గా నాలుగైదునెలలుంటుంది, మీరు ఉండనిస్తే...;)...... ఫ్రిజ్జులో అయితే సంవత్సరంపాటుంటుంది.
 • పచ్చడి రెండురోజులు ఊరనిచ్చి తింటే సరిపోతుంది మరి! నేనిక్కడ తెగ లాగించేస్తున్నా, మీరూ బరిలోకి దిగండి మరి.


రోటి పచ్చళ్ళు - రెండవభాగం - చుక్కకూర పచ్చడి; కొసరుగా " మెంతికూర పప్పుచారు"
నా రోటిపచ్చళ్ళ ధారావాహికంలో రెండవభాగానికి స్వాగతం! సుస్వాగతం! కిందటిసారి చెప్పిన రోళ్ళవిషయాలు బాగా గుర్తున్నాయా! ఎవరన్నా తెచ్చుకున్నారా కొత్తరోలు!..:)

సరే ఈసారి ఆ రోట్లోకి వాడుకునే పచ్చడిబండలూ, రోకళ్ళూ, పొత్రాల గురించి నాలుగుమాటలు చెప్పి తర్వాత పైన పుటోలో పెట్టిన పదార్థం గురించి చెప్తా.....;)

మామూలుగా నూరుకునే పచ్చళ్ళకైతే, పచ్చడిబండ సరిపోతుంది. అదే, చట్నీలు (అదేనండీ బాబూ! దోశల్లోకి,ఇడ్లీల్లోకి), ఊర పచ్చళ్ళూ గట్రా రుబ్బుకోవాలంటే పొత్రం కొనుక్కోవాల్సిందే! నాకు పొత్రంతో అంత పనిలేదనిపించి ఒట్టి పచ్చడిబండ వరకు తెచ్చుకున్నా.... బాగా నున్నగా చెక్కిఉన్న పచ్చడిబండ తీసుకోవాలి.నూరేవైపు వెడల్పు ఎక్కువ ఉండాలి.చివర్లో పట్టుకోను కాస్త బుడిపెలా ఉన్నదైతే బాగుంటుంది. మా ఇంట్లో ఎఱ్ఱచందనంతో చేసిన రోకలిబండ ఉండేది. దాంతో పచ్చడి తొక్కితే పచ్చడి ఎఱ్ఱ్రగా, భలే రంగులోకి వచ్చేది. కమ్మటివాసన కూడా ఉండేది....

ఇక పెద్దరోకళ్ళ విషయానికొస్తే, బాగా పొడవాటివి ఉంటాయి, చివర ఇనపకట్లతో....వీటిని గింజలు దంచుకోటానికి, పొడిపిండి కొట్టటానికి, పెద్దమోతాదులో పచ్చళ్ళకి వాడతారు. కుందిరోళ్ళలోనే వాలుగా ఉంటుంది. అదేదో సినిమాలో "పగడపురోకలి, బంగరుకట్లూ" అని పెళ్ళిపాటలో వస్తుంది.... ఎలా ఐనా నా పెళ్ళికి బంగారురోలూ, బంగారపు కట్లేసిన పగడపురోకలితో పసుపు దంచాలని కలలు కనేవాణ్ణి...హిహిహి...ఇప్పుడు బంగారం ధరలు చూస్తే కనీసం అరచేతులో పట్టే రోలూ, వేలుపొడవు రోకలి కూడా చేయించుకోలేననిపిస్తోంది.....;)

ఇక పొత్రాలు! రెండు రకాలుంటాయి. గుండు పొత్రాలు, చివర మొనదేలి ఉండేవి. ఇవి రోలుగుంట ఆకారాన్ని బట్టి ఉంటాయి. సరైన సైజు చూసి వేయించుకోవాలి పొత్రం. లేకపోతే రోలు మొత్తం దండగే...సరిగ్గా తిరుగుతుందా, లేదా చూసుకోవాలి. కక్కుకూడా బాగా ఉన్నదే తీసుకోవాలి. అడుగు వెడల్పులేని పొత్రాలే బెటర్! లేకపోతే పిండి కిందకెళ్ళిపోయి సరిగ్గా మెదగదు. పిడికూడా సరిగ్గా వేయించుకోవాలి. మా పొత్రం పిడి సరిగ్గా ఉండేదికాదు. మా అమ్మమ్మ పిడి చేసిన కంసలాణ్ణి తిట్టుకుంటూ "దభీ, దభీ"మని గుండ్రాయితో నాలుగు దెబ్బలు ఆ పిడిమీద వేసి, వాడిమీద కసి తీర్చుకునేది, రుబ్బే ప్రతిసారీ..;)

ఇంకోరకం బండలుంటాయ్, నూరుడుబండలని! బల్లపరుపుగా ఉన్న రాయిమీద, కొంచెం పొడవుగా చెక్కిన ఇంకో రాయితీసుకుని అడ్డంగా పెట్టి ముందుకూ,వెనక్కూ నూరతారు. మావేపు ఎక్కడా ఇవి వాడకంలో లేవు నాకు తెలిసి. నెల్లూరులో ఉంటాయి. మసాలాలు నూరుకోను వాడతారు ఎక్కువగా....

ఇక ఇవ్వాళ నేను చెప్పబోయే రోటిపచ్చడి, చుక్కకూర పచ్చడి. చెయ్యటం చాలా తేలిక, తొందరగా అయిపోతుందికూడా చెయ్యటం, ఖచ్చితంగా పదినిమిషాల పని.... పైగా ఈ పచ్చడి రోట్లో తప్పితే బాగోదు. మిక్సీల్లో వేస్తే మరీ లేహ్యమైపోయి అంతబాగోదు.

ఆకుకూరలన్నిటిలోకల్లా నాకు ఇష్టమైంది చుక్కకూరే! దీన్ని అన్నిరకాలుగా వండుకోవచ్చు. పైగా దాని రుచి వేరేవాటికి రాదు. పప్పులో పెట్టినా, పచ్చడి చేసినా,తోటకూరతో కలిపి పులుసుకూర చేసినా ఎంత కమ్మగా ఉంటుందో! చింతపండు అవసరం లేదు, సహజసిద్ధమైన పులుపు.... పాలకూర, పప్పులోకి తప్ప పనికిరాదు.(రోటీల్లోకి వండే కూర మనకసలు నచ్చదులెండి..;)..). ఇక తోటకూర పచ్చడికి పనికిరాదు. పచ్చడికి బాగుండేవి రెండే! చుక్కకూర, మెంతికూర..... రెండిట్లో చుక్కకూరే బాగుంటుంది. ఇక ఎలా చెయ్యాలో చెప్తానేం!

 • చుక్కకూర మీడియం సైజు కట్టలు రెండిటితో చేస్తే పైన గిన్నెలో ఉన్నంత పచ్చడయ్యింది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోడమే! చుక్కకూర చివరకాడలు కత్తిరించి, ఆకుని బాగా నీళ్ళల్లో వేసి కడగాలి.లేకపోతే ఇసక ఉండిపోతుంది.
 • ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టి, ఒక చిన్నగెంటెడు నూనెవేసి అది కాగగానే పైన కడిగిపెట్టుకున్న చుక్కకూరవేసి వేయించాలి. చుక్కకూర ఊరికనే వేగిపోతుంది.అలా బాండీలో వెయ్యగానే రంగుమారిపోతుంది. ఆకులోంచి నీరు బైటకి వస్తుంది. ఆనీరు సగానికిపైగా ఇగిరిపోయే వరకు వేయించాలి. ఈ వేయించినదాన్ని వేరే గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి.
 • ఇప్పుడు బాండీలో ఇంకో గెంటెడు నూనెవేసి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసి వాడ్చాలి. చివర్లో కాసిని ధనియాలు,మెంతులూ,జీలకఱ్ఱ్రా వేసి అవి వేగగానే దించెయ్యాలి.
 • ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి, కాస్త పచ్చికొబ్బరి, నాలుగు ఎండుమిరపకాయలు, ఒక చుక్కనీళ్ళూ వేసి మెత్తగా అయ్యేవరకు తొక్కాలి.
 • తర్వాత దాంట్లో పైన వాడ్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలూ,మెంతులూ,ధనియాలూ,జీలకఱ్రా వేసి పైన నాలుగు వెల్లుల్లి రెబ్బలువేసి తొక్కాలి.
 • పైవన్నీ బాగా మెదిగాయనగానే, పైన వేయించి పెట్టుకున్న చుక్కకూరని దీంట్లో వేసి, ఒక పెద్ద స్పూను ఉప్పువేసి రోకలిబండ గుండ్రంగా తిప్పుతూ నూరాలి. మామూలుగా తొక్కినట్టు తొక్కితే నీరుగా ఉన్న కూరమొత్తం చిందిపోతుంది. నాలుగైదుసార్లు తిప్పగానే బాగ మెదిగిపోయి అన్నీ కలిసిపోతాయి. మరీ లేహ్యంలా చెయ్యొద్దు.
 • ఇక దీన్ని గిన్నెలోకి వేసుకుని, పచ్చనగపప్పూ, మినప్పప్పూ మరికాస్త వేసి ఇంగువతాలింపు పెట్టుకోవాలి.
 • వేడి వేడన్నంలోకి అప్పుడే తాలింపు పెట్టిన పచ్చడి వేసుకు తింటుంటే, నూనెలో వేగిన పప్పులూ,ఎండు మిరపకాయలూ తగుల్తూ అద్భుతంగా ఉంటుంది.

పచ్చికొబ్బరి, ఎండు మిరపకాయలూ వేస్తే వేసుకోవచ్చు, లేకపోయినా బానే ఉంటుంది. ఎండు మిరపకాయలు వెయ్యకపోతే పచ్చిమిరపకాయలు కాసిని ఎక్కువ వెయ్యాలి. చుక్కకూర పులుపుకి, కారం ఎక్కువ పడుతుంది. ఉప్పుకూడా కాస్త ఎక్కువే పడుతుంది,చూసుకుని కలుపుకోవాలి.

చుక్కకూర పచ్చడితోపాటు , మరి రెండాదరువులు కూడా చేశానివ్వాళ. లేతవంకాయ ముక్కలు,టమాటాతో కలిపి నూనె లో మరికాస్త సంబారు కారం వేసి మగ్గించా. మా వాళ్ళు భోజనానికి వస్తామన్నారని, కాస్త ఆటిరావాలని తర్వాత పప్పుచారు పెడదామనుకున్నా. వెరైటీగా చేద్దాంలే అని " మెంతికూర పప్పుచారు " చేశా.... అద్భుతంగా కుదిరింది. పెద్దగిన్నెడు చేస్తే మావాళ్ళు చుక్క మిగల్చకుండా లాగించేశారు. అదికూడా సింపులుగా చెప్తాను ఎలా చేశానో! అసలు పప్పుచారులు,పప్పుపులుసులు,సాంబారులు; రకాలు; మరెప్పుడన్నా డీటైల్గా చెప్పుకుందాం......:) • ముందు, అరగ్లాసుడు (మా ఇంటినుంచొచ్చిన,మంగలంపెట్టి వేయించి చేసిన) కందిపప్పు నానేశా... ఒక అరగంట నాననిచ్చి శుభ్రంగా కడిగి, గ్లాసుడు నీళ్ళుపోసి కుక్కర్లో పెట్టి పొయ్యిమీద పెట్టా.
 • నిమ్మకాయంత చింతపండు రెండుగ్లాసుల నీళ్ళుపోసి నానబెట్టా.
 • పప్పు ఉడుకుతుండగా, ఒక పెద్ద ములక్కాయ, రెండు టమాటాలు ముక్కలుగా కోశా. నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా తరిగా.
 • ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకుని వేళ్ళు కత్తిరించి, మిగతా ఆకుని ముక్కలుగా కోసి పక్కన పెట్టా.
 • వెడల్పాటి గిన్నె తీసుకుని, పొయ్యి మీద పెట్టి నాలుగు స్పూనులు నెయ్యివేసి, ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేసి, మరికాస్త ఇంగువ,కరివేపాకు వేసి పోపు పెట్టా... అందులో పైన కోసి పెట్టుకున్న టమాటా,పచ్చిమిర్చీ,ములక్కాయలూ,మెంతికూరా వేసి టమాటాలు మెత్తగా అయ్యేవరకూ ఉడకనిచ్చా....నెయ్యిలో మెంతికూర వేగుతుంటే ఎంత కమ్మటి వాసనొచ్చిందో!
 • ఇప్పుడు,పైన నానబెట్టిన చింతపండు పిండి ఆ పులుసు ఈ తాలింపులో వేసి, సరిపడా ఉప్పూ, కాస్త సంబారుకారం,కాస్త పసుపూ వేసి మరిగించా...
 • కుక్కర్ నాలుగు విజిల్స్ రాగానే దించి పప్పుగుత్తితో పప్పు మెత్తగా ఎనిపి పెట్టుకున్నా.
 • పులుసు బాగా తెర్లగానే ఈ ఎనిపి పెట్టుకున్న పప్పువేసి ఇంకాసేపు మరిగించా.
 • కాస్తంత పచ్చికొబ్బరి తొక్కివేశా. కాసిన్ని కొత్తిమీరాకులు, చిన్న ముక్క బెల్లం కూడా వేశానండోయ్...
 • బాగా తెర్లి, చిక్కబడ్డాక దించేశా...

అంతే నెయ్యి,మెంతికూర కలిసిన వాసనతో ఘుమఘుమలాడిపోతున్న "మెంతికూర పప్పుచారు" రెడీ ఐపోయిందోచ్.
దీన్నిమీరు పప్పుచారంటారో,పప్పు పులుసంటారో లేక సాంబారంటారో మీ ఇష్టం. ఎలా అన్నా రుచి మాత్రం అద్భుతం....:)..


అదన్నమాట సంగతి! అలా అయ్యింది ఇవ్వాళ మా భోజనం!

నా కొత్తరోలూ - రోటి పచ్చళ్ళూ - దొండకాయ పచ్చడి

హమ్మయ్య! ఇన్నాళ్ళకి మళ్ళా మీ ముందుకొస్తున్నా! చాలా కూసింత బిజీగా ఉండటంవల్ల అప్పుడెప్పుడో మీకు చెబ్దామనుకున్న నా "కొత్తరోలు కథలు" చెప్పటానికి, ఇవ్వాళ్టికి కాస్త తీరిక దొరికింది. ఇప్పుడు కూడా ఇంకా చాలా కూసింత బిజీనేకాని, మరీ నా బ్లాగు "ఆకలో రామచంద్రా! రోటి పచ్చడో రామచంద్రా!" అని తెగ గొడవెట్టేస్తుంటేనూ ఇక ఉగ్గబట్టుకోలేక వచ్చేశానన్నమాట! ఇక మొదలెట్టేద్దామా నా రోటిపచ్చళ్ళ పురాణం..;)! ఇది కొన్ని భాగాలుగా రాస్తానన్నమాట! ఒక్కోభాగంలో కొన్ని కొన్ని టిప్స్ అలా ఫ్లోలో చెప్పేస్తానేం.......

మీకందరికీ బాగా తెలుసుకదా, నాకున్న రోటి పచ్చళ్ళ పిచ్చి! మిక్సీలు, గ్రైండర్లూ మనకి పడవు, కాబట్టి రోలు కొనుక్కోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసి ఒక బుజ్జి రోలు తెచ్చుకున్నా... మరేం! పెద్దది చాలా రేటు చెప్పాడు, మనం పప్పులూ,గట్రా రుబ్బంకదా, పచ్చడికే కదా అని చిన్నదే తెచ్చుకున్నా... మాకు ఇక్కడ చిన్నపాటి రోళ్ళపరిశ్రమ ఉందిలెండి! ఈ రోజుల్లో ఎవరు కొంటున్నారబ్బా అనుకున్నా! నాలాంటి పిచ్చ ఉన్నోళ్ళు చాలామందే ఉన్నారనిపించింది,అక్కడ వాళ్ళు తయారు చేసే రోళ్ళు చూస్తే....

ఇక ఎలాంటి రోలు మంచిది, మన్నిక ఉండాలంటే ఎలాంటిది తెచ్చుకోవాలి? అన్నది పెద్ద ప్రశ్న... రోళ్ళు కొండరాయితో చేసినవి, నాపరాయితో చేసినవి రెండు రకాలుంటాయి. కొండరాయితో చేసింది కాస్త ధర ఎక్కువగాని, వందల ఏళ్ళున్నా ఏమీకాదు. అదే నాపరాయితో చేసిందైతే ధర తక్కువైనా నాలుగైదేళ్ళకే పగిలిపోతుంది. కాబట్టి, కొండరాయిదే తెచ్చుకున్నా నేను. మా ఊళ్ళో మా ఇళ్ళ ముందు ఒక పెద్ద రోలుండేది. కొండరాయిదే, కాని ఎఱ్ఱ్రరాయిది...నేలబారున ఉండేది. అప్పట్లో పల్లెటూళ్ళల్లో ఇలాంటి రోళ్ళు ఊరి మధ్యలో, లేకపోతే ఇరవై ముఫ్ఫై ఇళ్ళకి కలిపి ఒకటి ఖచ్చితంగా ఉండేవి..వడ్లు దంచుకోటానికీ, చింతకాయ పచ్చడి తొక్కుకోనూ అందరూ ఇదే వాడుకునేవాళ్ళట! అటెళ్ళేవాళ్ళూ,ఇటెళ్ళేవాళ్ళూ కాసేపు రోకలి తీసుకుని నాలుగుపోట్లు వేసివెళ్ళేవాళ్ళు.. అలా అందరం ఒక కుటుంబం అన్న భావాన్ని పెంపొందించడానికి ఈ రోళ్ళు బాగానే ఉపయోగపడేవి... ఆ రోళ్ళూ పోయాయి, ఆ కలివిడి బతుకులూ పోయాయి..ప్చ్!

నేను కొన్న రోలు చిన్నది కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పన్లేదు. గుంట కాస్త లోతు ఎక్కువ ఉన్నదే తీసుకున్నా. అదే, పెద్ద రోలు కొనే పనైతే గట్టు బాగా వెడల్పు ఉన్నది, గుంట తక్కువ ఉన్నది తీసుకుంటే మంచిది, రుబ్బుకోటానికి అప్పుడే అనువుగా ఉంటుంది. లోతు ఎక్కువ ఉంటే పొత్రం కిందకి వెళ్ళిపోయి పచ్చడిగాని,పిండిగాని సరిగ్గా మెదగదు. గట్టు లేకపోతే పక్కకి పడిపోతుంది. పొత్రం కూడా సరైన సైజు చూసి సరిగ్గా వేయించుకోవాలి.

పెద్దరోళ్ళలో రెండు రకాలుంటాయి. ఒకటి మామూలుగా పచ్చళ్ళు,పిండ్లు రుబ్బుకోటానికి. రెండోది గింజలు దంచుకోటానికి, పొడిపిండి కొట్టుకోటానికి, ఎక్కువ మోతాదు పచ్చళ్ళు(చింతకాయ,ఉప్పుగోంగూర,కొరివికారం) తొక్కటానికి. మొదటిది ఒకటే రోలు, నాలుగు పలకలుగా ఉంటుంది. రెండోది రెండు భాగాలుగా ఉంటుంది. కింద చిన్నగుంటతో ఉన్న గుండ్రటి కుంది ఉంటుంది.దానిపైన ఇంకాస్త వెడల్పున్న గుండ్రటి చట్రాన్ని ఎక్కిస్తారు.రెండూ కలిసి లోతు ఎక్కువ వస్తాయి. పై చట్రంగట్టు, కింద కుందికన్నా బాగా వెడల్పుంటుంది.

ఈ రోట్లో అరిసెల పిండి కొట్టేప్పుడు, చింతకాయ పచ్చడి తిరగ తొక్కేటప్పుడు, జొన్నలు తొక్కేటప్పుడు భలే సరదాగా ఉండేది. రెండు రోకళ్ళపోటు,మూడు రోకళ్ళపోటు,నాలుగు రోకళ్ళపోటు ఇలా పందేలు కట్టి వేసేవాళ్ళు. నాలుగురోకళ్ళపోటు వెయ్యగలిగితే మొనగాడి లెఖ్ఖ! ఒక రోకలికి ఒకటి తగలకుండా, రోలు అంచుకి తగలకుండా పోటు వెయ్యటమంటే, అబ్బో! పెద్ద ఆర్టు అది... మనకి మూడు రోకళ్ళపోటే గగనంగా ఉండేది..;) లయబధ్ధంగా పోటు వేస్తూంటే ఆ రోకళ్ళ చప్పుడు వింటానికి ఎంత బాగుండేదో! అసలు మాకు పొద్దున్నే ఈ రోకళ్ళపోటుతోనే తెల్లారేది...పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ వెళ్ళి అన్నయ్యా, నేనూ జొన్నలు తొక్కేవాళ్ళం..మా పక్కింటోళ్ళకీ, మాకూ పోటీ! ఎవరు వేగంగా పోటేస్తున్నారా అని. అన్నయ్య బాగా ఆవేశపడిపోయేవాడు. మనమేమో మహా నిమ్మది, రిజల్టు! నాలుగైదు పోట్లకొకసారైనా రెండు రోకళ్ళూ ఢీకొనేవి... నాన్న వచ్చి డిప్పమీద ఒకటిచ్చేవాడు, సరిగ్గా వెయ్యి అని....హ్మ్! ఆ రోజులే వేరు.........


ఇక రోలు ఎంచుకునేప్పుడు "కక్కు" బాగా కొట్టింది తీసుకోండి, అంటే లోపలవైపున గరుగ్గా గుంటలు,గుంటలుగా ఉంటుంది కదా, అది! అప్పుడు బాగా మెదుగుతుంది, పచ్చడైనా, పిండైనా....{దీన్నే గంట్లు కొట్టటం అని కూడా అంటారని గోదారోళ్ళ ఉవాచ!...;)..;)..}... పాతరోళ్ళకి కూడా మళ్ళా మళ్ళా "కక్కు" కొట్టిస్తూనే ఉండాలి...

ఇక రోలు సెలెక్షను అయిపోయింది కదా! అందులోకి వాడే రోకళ్ళూ,పచ్చడిబండలూ, పొత్రాల గురించి తరువాయి భాగంలో చెప్తానేం! అలా తెచ్చుకున్న కొత్తరోలుని "అలవాటు" చెయ్యాలి! అంటే కొత్తగా చెక్కిన రోలు కదా, ఇసుక వచ్చిద్ది అలానే వాడేస్తే. అందుకని ఆ ఇసక పోయేట్టు చెయ్యటాన్ని అలవాటు చెయ్యటం అంటారు... మామూలుగా అందరూ ఊకపోసి దంచుతారు ఏడెనిమిదిసార్లు...అప్పుడు లోపలున్న ఇసకంతా పోయి పచ్చడి తొక్కుకోటానికి వీలుగా తయారైద్ది. ఐతే నాకిక్కడ ఊక ఎక్కడ దొరికిద్ది? అందుకే జ్యోతిగార్ని అడిగా.... భలే అవిడియా చెప్పారు జ్యోతిగారు. గోధుమపిండి కలిపి, ఆ ముద్దని వేసి బాగా గుంటలో అంతా నాలుగైదు సార్లు రుద్ది, తర్వాత శుభ్రంగా కడిగేస్తే ఇసక ఒక్క పిసరకూడా లేకుండా పోయింది...
తర్వాత కొత్తరోలు మొదలెట్టాలంటే ఉండ్రాళ్ళు పొయ్యాలంట, తాంబూలాలివ్వాలంట! ఇవన్నీ మన బ్రహ్మచారి జీవితానికి ఎక్కడ కుదురుతాయి. అందుకని కాస్త పసుప్పూసి, కుంకవెఁట్టి, ఓ పసుపుకొమ్ము తాడు కట్టి మొదలెట్టేశా....;) పైగా ఎప్పుడెప్పుడు రోట్లో పచ్చడి తొక్కుకు తిందామని ఆత్రం..;)! ఇక నా రోట్లో తొక్కిన మొదటి పచ్చడి చుక్కకూరపచ్చడి. దాని ఫొటో తియ్యలేదు ఆరోజు హడావుడిలో... తర్వాత దొండకాయ పచ్చడి చేశా! అది చెప్పుకుందామేం ఇవ్వాళ!

 • అసలు దొండకాయలంటే పచ్చడే!వాడ్చి పచ్చడి తొక్కితే ఎంత కమ్మగా ఉంటదో! వేపుడు,ఇగురూ మనకి అంత ఎక్కవు..... అది కూడా మా ఇళ్ళల్లో అంత రెగ్యులర్గా అలవాటు లేదు. దొండపందిరి ఉన్నా, ఇక ఏ కూరగాయలూ లేకపోతే దొండకాయ పచ్చడి అన్నమాట! "పిచ్చి దొండకాయలు" అంటుంటారు, మరి తింటే పిచ్చెక్కిద్దనో లేక పాపం!నీళ్ళు పోసినా, పొయ్యకపోయినా సంవత్సరాల తరబడి అలానే పిచ్చిపిచ్చిగా కాస్తుంటాయనో...;)
 • బాగా పచ్చిగా ఉన్న దొండకాయలే బాగుంటాయి పచ్చడికైనా, వేపుడు కైనా... కాస్తంత దోరబడి, లోపల ఎఱ్ఱగా ఉన్నా పచ్చడికి పనికొస్తాయి కాని వేపుడుకి పనికి రావు...ఇక పూర్తిగా పండిపోయాయనుకోండి! చూసుకోటానికీ,నోట్టో వేసుకు చప్పరించటానికీ,అదీ కాకపోతే అందమైన అమ్మాయి పెదవులతో పోల్చి వర్ణించుకోటానికీ తప్ప పచ్చడికి పనికి రావు..;)
 • అలా పచ్చగా నవనవలాడుతున్న దొండకాయలు ఒక పావుకేజీ(నలుగురికి రెండు పూటలకీ వచ్చిద్ది) తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి అడ్డంగా, చక్రాల్లా సన్నగా తరుక్కోండి...తొడెం, చివరి ముట్టె తీసేయండి. అవి పడితే సరిగ్గా మెదగవు. పంటికింద పడితే బాగోవు.
 • ఇప్పుడు బాండీ పొయ్యిమీదెట్టి, ఓ పెద్ద గెంటెడు నూనేసి, అది కాగంగనే, పైన తరుక్కున్న దొండకాయ ముక్కల్ని, ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్నీ వేసి వాడ్చాలి, అదేనండీ వేయించాలి ..;)..... అన్నీ బాగా వేగాయనుకోగానే చివర్లో కాస్త జీలకఱ్ఱా,నాలుగు మెంతులూ,కాసిన్ని ధనియాలూ వేసి వేగనివ్వాలి....
 • పచ్చిమిరపకాయల్తో తొక్కితే ఒకలా ఉంటుంది. ఎండు మిరపకాయలేసి తొక్కినా బాగుంటుంది. ఎండు మిరపకాయలైతే వేయించాల్సిన పన్లేదు. ముందు రోట్లో ఎండు మిరపకాయలేసి, కాసిన్ని నీళ్ళు పోసి తొక్కాలి, అది మెదిగాక దొండకాయ ముక్కలు, మిగతావి వేసి తొక్కా లి.
 • పైన వేయించిన సంభారాలన్నీ బాండీలోంచి డవిరెక్టుగా రోట్టోకి మార్చి, కుంకుడుగాయంత చింతపండూ,నాలుగు వెల్లుల్లి రెబ్బలూ, ఒక చిన్నస్పూను ఉప్పూ వేసి ఇక రోకలిబండ తీసుకుని తొక్కటమే.
 • ఒక చేత్తో ఎగదోసుకుంటూ మరో చేత్తో నూరాలి.దీనికి కొంచెం ఒడుపు కావాలి. అలవాటుమీద అదే వస్తుందనుకోండి.పైగా చేతి కండరాలకి భలే వ్యాయామంలే!..;)..పచ్చడి కొంచెమే అయితే, రెండు చేతులతో రోకలిబండ చివర్న పట్టుకుని నూరితే తొందరగా మెదిగిపోద్ది...
 • అలా రోట్లో పచ్చడి తొక్కుతూ ఉంటే, నాలుగైదు పోట్లు పడగానే కమ్మటి వాసన ముక్కుపుటాలకంటి ఉక్కిరిబిక్కిరి ఐపోతాం.... కాస్త తీసుకుని నాలిక్కి రాసుకోందే ప్రాణం ఊరుకోదు. కాని, రోటి దగ్గర నాకితే పెళ్ళికి వానపడిద్దని ఇంట్లో కట్టడి! ఇక్కడ మనకి స్వతంత్రం కదా! "పడితే పడింది వెధవవాన, పేద్ద కళ్యాణమండపం తీసుకుని చేసుకుందాంలే" అని సర్ది చెప్పుకుని చక్కగా రోకలికి అంటింది వేలితో తీసి చివర్లో నాకేస్తుంటా..;)
 • కొంచెం మెదిగింతర్వాత మరికాస్త కొత్తిమీర వేసి తొక్కండి. పచ్చడి మరీ లేహ్యంలా తొక్కొద్దు. కచ్చాపచ్చాగా తొక్కితేనే బాగుంటుంది. అమ్మ చెప్తూ ఉంటుంది,నెల్లూరులో ఉన్నప్పుడు ఇంటి ఓనర్లు అమ్మ పచ్చడి తొక్కుతుంటే,"పచ్చడిబండ అరిగిపోద్ది" అని హాస్యమాడేవాళ్ళంట! వాళ్ళు మరీ ఊరకే అలా, అలా ముక్కలు చితగ్గొట్టి తినేస్తారు...
 • ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లోంచి గిన్నెలోకి తోడుకొని, కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు... ఎక్కువ పచ్చడి, అంటే ఒక కేజీ తొక్కి, నాలుగైదు రోజులు నిలవుంచాలనుకుంటే తాలింపు పెట్టుకుంటే నిలవుంటుంది.
 • ముక్కలు వేయించేప్పుడు కాసిన్ని దోసిత్తనాలు వేసి వేయించి పచ్చట్లో వేసి నూరితే పచ్చడి ఘుమఘుమలాడిపోద్ది.... చింతపండు బదులు ముడిచింతకాయ పచ్చడి కూడా వేసుకోవచ్చు,బాగుంటుంది. కొంతమంది ఇందులో పచ్చికొబ్బరివేసి నూరతారు, మనకి నచ్చదు.
 • పచ్చడి చేసుకున్న ఆనందంలో రోలు కడగటం మర్చిపోవద్దండోయ్! రోలూ,రోకలిబండా శుభ్రంగా కడిగి, రోకలిబండ ఎండ తగలని చోట జాగ్రత్త చేసుకోవాలి.
 • ఇప్పుడు చక్కగా అన్నం వండుకుని, వేడివేడన్నంలో ఈ పచ్చడేసుకుని, మరికాస్త నెయ్యివేసుకు తింటుంటే అబ్బబ్బ! ఆ వాసనకే ఆకలి చచ్చిపోయిన రోగికి కూడా ప్రాణంలేచొచ్చి ఓ ముద్ద నోట్లో వేసుకుని తరిస్తాడు...;)

తొలేకాశి - అసలిది " పేలపిండి" పండగఇవ్వాళ "తొలేకాశి"... అదేనండీ "తొలి ఏకాదశి" పండగ.....ఇంక వేర్వేరు చోట్ల ఎలా పిలుస్తారో,ఎలా జరుపుకుంటారో నాకు తెలీదుగాని, మాకు మాత్రం ఇది చాలా పేద్ద పండగ.....ఉగాది,నవమి తర్వాత పండగలు లేక,సంబరాలు లేక మొహంవాచిపోయున్న మాలాంటి పిల్లకాయలకి, ఉత్సవభక్తులకి ఇది ఎంత సంబరాన్ని తెచ్చే పండగో! ఎంత పేద్ద పండగో! అసలు మా ఊళ్ళల్లో చాలామంది దీన్ని పిలిచే పేరేంటో తెలుసా, "పేలపిండి పండగ".....ఇహహాహ్హ! అద్గదీ! అందుకని మన పాకవేదంలో ఈ టపా....అసలు పండగలంటే నాకు తెలిసీ కొత్తబట్టలు వేసుకోటానికీ, చక్కగా రకరకాలు వండుకు తినటానికిన్నీ.....అందుకే ఈ తొలిపండగ జనాల నోళ్ళల్లో "పేలపిండి పండగ" అయ్యికూర్చుంది...:)

"అసలీ పండగేంటి? దానికా పేరు ఎందుకొచ్చింది? సంవత్సరంలో ఇన్ని ఏకాదశులుండగా, ఈ ఏకాదశినే పెద్ద పండగలా చేసుకోటం ఏంటీ! అందునా సంవత్సరం మధ్యలో వచ్చే ఏకాదశిని "తొలి" ఏకాదశి అనటమేంటీ! ఈ పెద్దోళ్ళకి ఒక ఆలోచనా,బుఱ్ఱా పాడూ ఉండదు, నేనైతే "మధ్య ఏకాదశి" అనో,లేకపోతే "రాములోరి ఏకాదశి"(మూణ్ణెల్ల ముందు శ్రీరామ"నవమి" వెళ్ళిందికదా, అందుకని. పైగా, మా ఊరిగుళ్ళో ప్రతి సంవత్సరం ఈ పండక్కి "రామాయణం" నాటకం వేసేవాళ్ళు లెండి) అనో పెట్టేవాణ్ణి. అసలదంతా ఎందుకు చక్కగా "పేలపిండి పండగ" అని పిల్చుకుంటే పోలా!" .....ఈ విధంగా మన బుల్లప్పుడు బుఱ్ఱ్ర, పెదపేద్ద ఆలోచనలు చేసేసి, నిర్ణయాలు తీసేసుకుని, జంకూగొంకూ లేకుండా వెళ్ళి అమ్మమ్మ దగ్గర డబడబా వాగేసేది...దానికి అమ్మమ్మ,"నీ మాత్రం తెలివి లేకనుకున్నావా! ఉగాదితో పండగలు ఊడ్చుకుపోతయ్యి, తొలేకాశితో తొలకరిస్తయ్యి.అందుకని దీన్ని తొలేకాశి అంటారు చిన్నయ్యా!"అని చెప్పేది...ఊఁహూఁ! నాకస్సలు నచ్చలా ఆ సమాధానం...పైగా దానివల్ల ఇంకా బోలెడు అనుమానాలు..ఇక ఆగలేక నాన్నని అడిగేద్దామనుకుని డిసైడైపోయా.....

మళ్ళా నాన్న దగ్గర మాత్రం అల్లా కాదండోయ్!మన అతి తెలివి ప్రదర్శించామనుకోండి, వీపు పేలిపోద్ది....అందుకని అతితెలివి కన్నా ఇంకా కొంచెం తెలివిగా నాన్న దగ్గరకెళ్ళి, అమాయకంగా,గోముగా, మన జ్ఞానపిపాస అంతా మొహంలో కనిపిచ్చేట్టు," నాన్నీసూ! ఈ పండగకి "తొలి ఏకాదశి" అనే పేరు ఎలా వచ్చిందీ తెలుసుకోవాలనుంది" అని అడిగేవాళ్ళమన్నమాట....మన జ్ఞానతృష్ణకి నాన్న మహదానందపడిపోయి, బొజ్జమీద కూర్చోబెట్టుకుని,
" ఏం లేదు చిన్నీసూ! వెరీ సింపులు. మనకి తొలకరి వర్షాలు పడేది ఎప్పుడు?".
"ఆషాఢమాసంలో".
"కదా! మనం వ్యవసాయదారులం. తొలకరి అంటే మనకి పెద్ద పండగ. అందుకని ఆషాఢ శుద్ధఏకాదశిని "తొలి ఏకాదశి" పండగ్గా చేసుకుంటామన్నమాట!"....
హ్మ్! అయినా మనం సమాధాన పడలా.....
"మరి ఆషాఢ శుధ్ధపాడ్యమిని "తొలిపాడ్యమి" అనీ, విదియని " తొలివిదియ" అనీ ఇలా ఎందుకు చేసుకోము..పైగా, వర్షాలసలు ఒక్కోసారి జ్యేష్ఠంలోనే మొదలవుతాయి కదా..."అని, తెగ ఆలోచిస్తుంటే, మన కొశ్చన్ మార్క్ మొహం చూసి నాన్న నవ్వేసి, " తృప్తి కలగలేదా! సరే అసలు కారణం చెప్తానుండు.....చాతుర్మాస్య వ్రతం అని ఒక వ్రతం ఉంది....అది ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలయ్యి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రపోతాడు.అందుకని ఆ రోజుని "శయనైకాదశి" అనీ, "తొలి ఏకాదశి" అనీ పిలుస్తారు. కార్తీకశుద్ధ ఏకాదశినాడు మళ్ళా నిద్రలేస్తాడు,కాబట్టి దాన్ని "ఉత్థాన ఏకాదశి" అనీ, " చిల్కు ఏకాదశి" అనీ పిలుస్తారు. ఈ నాలుగు నెలలూ యోగులు,సన్యాసులు ఎక్కడికీ కదలకుండా ఒక్కచోటనే ఉండి, ఆ విష్ణువుని అర్చిస్తారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు.కాబట్టి మనం ఆషాఢ శుద్ధఏకాదశిని పండగలా చేసుకుంటాం" అని చెప్పారు....

మన మొహంలో ఇంకా పావువంతు కొశ్చనుమార్కు ఎక్స్ ప్రెషను....:)
అది చూసి నాన్న నవ్వుతూ," పైగా పిన్ని వాళ్ళు సంవత్సరమంతా ఏకాదాశి ఉపవాసాలుంటారు తెలుసు కదా! ఆ ఉపవాసాలని ఇవ్వాళ మొదలెడతారన్నమాట! ఇవ్వాళ మొదలెట్టి ఇరవైనాలుగేకాదశులూ చేస్తారు....కాబట్టి దీన్ని "తొలి ఏకాదశి" అన్నారు..." అని ముగించారు.....హమ్మయ్య! మనసు అప్పటికి తేలికపడింది....

అద్దండీ! అసలు "తొలేకాశి" పండగ వెనకున్న కథ.....

ఇక పండగ రోజు ఎన్ని సంబరాలో!పొద్దున్నే లేవడం, తలకలు,కొత్తబట్టలు,పూజ మామూలే.... పబ్లిక్ హాలిడే కాదు కాబట్టి స్కూలుకెళ్ళాల్సిందే...వెళ్ళి హెడ్మాస్టరు గారిమీద మా టీచర్లందరిచేతా గాట్టి వత్తిడి తెప్పించి, హాఫ్ డే ఆప్షనల్ సెలవిప్పించుకుని పుస్తకాల సంచి గిరగిరా తిప్పుకుంటూ ఇంటికి పరిగేత్తుకొచ్చేసేవాళ్ళం..వచ్చేపాటికి, పొయ్యి మీద మంగలం పెట్టి అమ్మమ్మ పేలాలు వేపుతూ ఉండేది...ఇక గొంతు, గుళ్ళో మోగుతున్న మైకుకి పోటీగా పెంచి అమ్మమ్మని అరిచేసేవాణ్ణి..."పక్కింటి గోవిందమ్మ నాయనమ్మా, కాంతమ్మమ్మమ్మా వాళ్ళ రోళ్ళు అప్పుడే మోగుతున్నయ్యి. నువ్వింకా పేలాలు వేపుతూనే ఉన్నావ్....ఎప్పుడు వేపుతావ్, పిండెప్పుడు కొడతావ్..వాళ్ళది ఐపోగానే శ్రీనూ, శివా గిన్నెలనిండా పోసుకొచ్చుకొని తింటూ, నాకు ఊరిస్తూ గొప్పలు పోతారు...నువ్వేమో ప్రతిసంవత్సరం ఇంతే, నా ఫరువు తీసేస్తున్నావ్.." అని తెగ ఆయాసపడి పోయేవాణ్ణి....

అమ్మమ్మ" చిన్నయ్యా! గోవిందమ్మవాళ్ళది వట్టి పిండే...కొబ్బరుండదు,దోసిత్తనాలుండవు...కాంతమ్మ వాళ్ళది వట్టి చిమ్మిలి.....పైగా, ఇద్దరిదీ నోటికి చుట్టకొచ్చేట్టు పొడి పిండి...నీకు నిండా మెఱుగేసి పెడతాగా...అప్పుడుదాకా, గుళ్ళోకిపోయి సంబరం చూసిరా" అనేది.....సరేలెమ్మని పొంగలన్నంలో వంకాయకూరేసుకుని నిండా లాగించి, గుడికి ఒక్క దౌడు తీసేవాణ్ణి...అన్నయ్య అప్పటికే గుడి దగ్గర వీరవిహారం చేస్తుండేవాడులెండి......

మా చెన్నకేశవ స్వామి గుళ్ళో తొలేకాశికి ఏకాహం చేస్తార్లెండి...గుడి ఆవరణంతా పందిళ్ళు, భజనలు, ఫెళఫెళగా ఉండేది...రామనామం సాగుతూనే ఉండేది...ఊర్లోకెల్లా బుధ్ధిమంతుణ్ణి కదా..;)....దేవుడికి దణ్ణవెఁట్టుకుని, కాసేపు భజన చేసి తర్వాత ఆటల్లో పడేవాళ్ళం.....అబ్బో ఎన్ని ఆటలో....ముఖ్యంగా కళ్యాణమండపం స్తంభాలు పట్టుకుని ఆడే "నాలుగు స్తంభాలాట"...ఎంత ఇష్టమో నాకు.....తెగ ఆడీ ఆడీ, నాలుగింటికల్లా ఇల్లు చేరేవాణ్ణి.( నాన్న ఆఫీసునుంచి వచ్చేస్తారుగా అందుకని..;)..)....అప్పటికి ఘుమఘుమలాడిపోతున్న "పేలపిండి" రెడీగా ఉండేది...ఎత్తుకెత్తు నెయ్యి పోసుకుని శుభ్రంగా లాగించేవాణ్ణి..ఇక సాయంత్రం అమ్మా నాన్నలతో కలిసి గుడికెళ్ళేవాళ్ళం...ఎందుకో మరి, అమ్మ ప్రతి తొలేకాశికి గుడికెళ్తూ వాళ్ళ పెళ్ళిచీర కట్టునేది......వక్కరంగు వెండిజరీ చీరలో, గుళ్ళో వేసిన రంగురంగుల ట్యూబులైట్ల కాంతిలో మెరిసిపోతుండేది అమ్మ.......

అర్చన చేయించుకుని, కాసేపు భజన దగ్గర కూర్చుని వచ్చేసేవాళ్ళం.ఇక రాత్రికి "రామాయణం" నాటకం చూడాలని గబగబా తినేసి అమ్మమ్మని లాక్కుని వెళ్ళేవాళ్ళం.....కాని వాళ్ళు మొదలెట్టేపాటికి పదో,పదకొండో అయ్యేది...మనం ఆపాటికి చక్కగా అమ్మమ్మ వళ్ళో బజ్జుండేవాళ్ళం.....కళ్యాణమప్పుడూ, చివర పట్టాభిషేకమప్పుడూ లేపి చూపించేది...ఒక్క సంవత్సరం కాబోలు నాన్న తీసుకెళ్ళి మొత్తం నాటకం చూపించారు...తర్వాత రోజు స్కూల్లో ఆ డిస్కషన్లతో గడిచిపోయేది..కొంత మంది "పేలపిండి" పొట్లాలు కట్టుకు తెచ్చుకునేవాళ్ళు....;).....తిరిగొస్తూ గుడికెళ్ళి, ఏకాహం ముగించి ఊరేగటానికి బైల్దేరుతున్న మా స్వామితో ఊరంతా ఒక రౌండేసి వచ్చేవాళ్ళం...చివర్లో పెట్టే "పంచ కజ్జాయం" నాకు ఎంత ఇష్టమో........అల్లా ముగిసేవి మా తొలేకాశి సంబరాలు......

బాగా రెండు మూడు పెద్ద డబ్బాలకి కొట్టి పెట్టేది అమ్మమ్మ....ఆ పది పదిహేను రోజులూ నెయ్యి పోసుకుని తెగలాగించేవాళ్ళం.అసలా రుచే వేరు.పండగరోజు సాయంత్రం చాకలి సుబ్బన్న వచ్చేవాడు. అమ్మమ్మ గిన్నెలో పొంగలన్నం పెట్టి, పేలపిండి కాగితంలో చుట్టిచ్చేది.వాడది తీసుకుని "కాస్త మెఱుగుబొట్టు వెయ్యి కాపమ్మా,లేకపోతే నోరు చుట్టకొచ్చిద్ది" అనేవాడు.అమ్మమ్మ నవ్వుతూ, పెద్దగిన్నె నిండా నెయ్యి పోసిచ్చేది.
ఈ సంవత్సరం నేను కొత్తరోలు కొన్నాగా..కాబట్టి పేలపిండి కొడదామనుకున్నా..అమ్మకి చెప్తే,"ఇప్పుడు మన ఊర్లో కూడా ఎవరూ కొట్టట్లేదు చిన్నీ. రిస్కు ఎక్కడ పడతావ్.కాస్త చిమ్మిలి చేసుకో.త్వరగా ఐపోద్ది అంది...." ఆయ్! సమస్యేలేదు. పేలపిండి చెయ్యాల్సిందే.తినాల్సిందే" అని,అన్ని సంభారాలూ తెచ్చుకుని కొట్టాను...భలేగా కుదిరింది లెండి...నెయ్యి పోసుకు తింటుంటే ఎంత కమ్మగా ఉందో! పన్లోపని మీకు కూడా చెప్తే మీరూ చేసుకుంటారుగా! చెయ్యటం చాలా వీజీ!

 • మొదట మాంఛి జొన్నలు తీసుకోండి. పచ్చజొన్నల కన్నా తెల్లజొన్నలు బెటర్...ఎన్ని?...మీ ఇష్టమండీ బాబూ! నేనైతే పావుకేజీ తెచ్చుకున్నా....నా ఒక్కపొట్టే కదా... ఆ జొన్నల్ని రాళ్ళు లేకుండా ఏరేసుకోండి. బాగా వెడల్పాటి బాండీ పొయ్యి మీద పెట్టుకోండి.....ఆ బాండీలో ఈ జొన్నలు పోసి,వెడల్పాటి అట్లకాడతో కదుపుతూ జాగ్రత్తగా వేయించాలి.....సన్నసెగ మీద వేయించుకోవాలి....లేకపోతే ఊరికే మాడిపోతయ్.....కుంపట్లో ఐతే బెటర్...బాగా పొట్లాలు విచ్చుకుని, పేలాలయ్యాక దించెయ్యండి......కాని ఈ పేలాలు వేయించడం మాత్రం పెద్ద బ్రహ్మవిద్యే.....అన్నీ చక్కగా పువ్వుల్లా రావాలంటే చాలా కష్టం.....కొంతమందికే జొన్నపేలాలు వేగుతాయ్ అంటారు..చేతుల మహిమ...:)
 • ఇప్పుడు అదే బాండీలో పేలాలు తీసేసి ఓ చుక్క నెయ్యి వేసి దోసవిత్తనాలు వేయించుకోవాలి...ఈ దోసిత్తనాలు చేత్తో అలా తీసుకుని ఉజ్జాయింపుగా వేసుకోడమే......మీరు తయారు చేసుకున్న విత్తనాలైనా పర్లేదు.లేకపోతే పచారీ కొట్లో దొరుకుతాయి...బాగా పప్పు పట్టినవి చూసి తీసుకోండి...చిటపటలాడి ఎగిరిపోతయ్,కాస్త జాగ్రత్తగా మూత అడ్డం ఉంచుకుని చిన్నవత్తి మీద వేయించండి....ఇవి కొంచెం ముదురు రంగు తిరగ్గానే దించెయ్యాలి..వేయిస్తుంటే ఎంత కమ్మటి వాసన వస్తాయో....
 • ఇక పేలాల్ని రోట్లో వేసి దంచాలి.(రోలు లేకపోతే మిక్సీ..రుచి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను..:)...)..కొద్దిగా బరగ్గా పిండయ్యాయి అనుకున్నాక దోస విత్తనాలు వేసి తొక్కాలి...బాగా మెదగ్గానే, మీకు ఎంత తీపి కావాలనుకుంటే అంత బెల్లం వేసుకోవాలి..నేను పావుకేజీ జొన్నలకి,పావుకేజీ బెల్లం వేశాను....బెల్లం పిండిలో బాగా కలిసేట్టు తొక్కాలి.....
 • రోట్లోంచి వెడల్పు గిన్నెలోకి ఎత్తుకుని, యాలకులపొడి కలపాలి....కావాలనుకున్నవాళ్ళు ఎండుకొబ్బరి తురుము కూడా కలుపుకోవచ్చు...
 • ఇక గాలిపోకుండా డబ్బాలో పెట్టుకుని, రోజూ కాస్త లాగించడమే! ఎత్తుకెత్తు మెఱుగు మాత్రం మర్చిపోవద్దేం! అదేనండీ, కమ్మటి నెయ్యి..:)

"నేతిబీరకాయ" - ఇందులో నెయ్యి ఉంటుందండీ! నిజ్జంగా నిజం ..:)


మీరంతా నేతిబీరకాయ సామెత వినే ఉంటారుగా......నాకు తెలిసి అది తప్పు! నేతిబీరకాయలో నెయ్యి ఉంటుందండీ...నిజ్జంగా నిజమండీ బాబూ! మరి మన పెద్దవాళ్ళు ఆలాగున ఉపమానం చెప్పటంలో అంతరార్థం మరైదైనా ఉందేమో నాకు తెలీదు కాని, నేతిబీరకాయలో నిజ్జంగానే నెయ్యుంటుంది...;)....తివిరి యిసుమున తైలం తియ్యటం కష్టమేమోగాని, నేతిబీరకాయనుంచి నెయ్యి తియ్యటం మాత్రం చాలా వీజీ....:)....

"ఉన్నంతమాత్రాన అసలు నేతిబీరకాయ నుంచి నెయ్యి తీయాల్సిన అవసరమేంటటా? చక్కగా
ఆవునెయ్యి,గేదెనెయ్యి దొరుకుతుండగా....దాన్ని ఆపాటున వండేసుకోవచ్చుగా?" అంటారేమో! మరదే,కాస్త నన్ను చెప్పనివ్వండీ! ఇక్కడ నా ఉద్దేశం నేతిబీరకాయలో నెయ్యి ఉంటుందని చెప్పటమేకాని, దాన్ని తీసుకుని గేదెనెయ్యికో,ఆవునెయ్యికో బదులు వాడుకోమని కాదు...;).....కాని నెయ్యి తియ్యాలి, ఎందుకో కింద చెప్తానేం....:)

నాకు తెలిసి చాలా మందికి అసలు "నేతి బీరకాయ" అంటేనే తెలీదేమో!ఇందాక మిత్రులొకరు "నేతిబీరకాయ పచ్చడి" చేశాను అనగానే, "బాగా నెయ్యి పోశావా!" అన్నాడు....హ్మ్! అందుకని ఇంత గొప్ప శాకం చాలా మందికి తెలీకపోవటం వల్ల దాని పుటో కూడా పెడుతున్నా ఇక్కడ....వీటి గురించి చాలా మందికి తెలీకపోడానికి కారణం, అన్ని కూరల్లా ఇవి బజార్లో దొరకవు....ఇంట్లో పండించాల్సిందే.....మాకైతే
కొష్టాల దగ్గర వేసి, తీగని గడ్డివాముల మీదికి అల్లించేవాళ్ళం....విరగ్గాసేవి, గడ్డి వామి నిండా అల్లుకున్న తీగతో,కాయలతో ఎంత అందంగా ఉండేదో!...... ఇవి మొన్న నాన్న వస్తూ తెచ్చినవి, పదిరోజులనుంచి చల్లపెట్టెలో ఉన్నాయి కదా, అందుకే అంత తాజాగా లేవు......ఇంటో అయితే ఎప్పటికప్పుడు తెంపుకు వచ్చి పచ్చడి చేసుకునేవాళ్ళం.......ఇక్కడ దొరికిందే భాగ్యం ఇలా సర్దుకుపోవాల్సిందే!

మొన్న నాన్న తెచ్చిన మూడు కాయల్లో ఒకటి పప్పులో పెట్టా! మిగతా రెండూ
ఇవ్వాళ పచ్చడి చేశా......నేతి బీరకాయలు పప్పులో పెట్టినా, పచ్చడి చేసినా ఎంతకమ్మగా ఉంటాయో! కూర మాత్రం అంత రుచి ఉండదు.......ఈ నేతిబీరకాయ పచ్చడి అంటేనే ముందు గుర్తొచ్చేది కార్తీకమాసం.....కార్తీకమాసం ఉపవాసాలున్నవాళ్ళు ఇది తప్పనిసరిగా తింటారు...మా ఊళ్ళో బ్రాహ్మలకి ప్రతి సోమవారం,పౌర్ణానికి,ఏకాదశులకి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం......అలా అందరికీ పంచడం అదో సరదా......

ఇక పచ్చడి ఎలా చెయ్యాలో చెప్తాను.....మామూలుగా నేతిబీరకాయ పచ్చడి రెండు
రకాలుగా చేస్తారు......ఇక్కడ రెండూ చెప్తాను....జాగ్రత్తగా ఫాలో అవ్వండేం....:)

మొదటి రకం :-

 • ముందు మంచి నేతిబీరకాయల్ని తీసుకోవాలి.రెండు కాయల్తో పచ్చడి చేస్తే నలుగురికి రెండు పూటలా వస్తుంది....కాయ మరీ లేతగా ఉండకూడదు,అలా ఉంటే పచ్చడి మరీ లేహ్యమైపోతుంది....అలా అని మరీ ముదిరి, విపరీతంగా పీచు పట్టినా తినలేం.....కాని, ముదిరినకాయ ఉంటే పచ్చడి చేసుకోటమే ఉత్తమం, పప్పుకి అస్సలు బాగోదు......
 • ఇప్పుడు ఈ కాయల్ని కుమ్ములో పెట్టి కాలవాలి.....హ్మ్! "ఇక్కడ ఈ సిటీల్లో కుమ్ము మాకు ఎక్కడనుంచి వచ్చిద్ది బాబూ" అంటారేమో! స్టవ్ మీద సన్నమంట పెట్టి దానిమీదకూడా కాల్చుకోవచ్చు.కాని కుమ్ములో పెట్టిన రుచి రాదు.....స్టవ్ మీద కాల్చేప్పుడు, తొడెం పట్టుకుని తిప్పుతూ అన్ని వేపులా సమంగా కాలేలా చూసుకోవాలి.మరీ బొగ్గు అయ్యేవరకు ఉంచేరు పొరపాటున..:).....బాగా లోపల కాయంతా మగ్గి,ఉడికేవరకు ఉంచితే చాలు..నొక్కితే అర్థమవుతుంది........అదే కుమ్ములో పెట్టేట్టైతే ఒక అరగంట ఉంచి వదిలేస్తే చాలు, చక్కగా మగ్గిపోద్ది....
 • ఇప్పుడు ఈ కాయకి పైన తొక్క బాగాకాలి స్పూనుతో గీరేస్తే సులువుగా వచ్చేస్తుంది.....ఇప్పుడు ఈ కాయని పట్టుకుని రెండు చేతులతో పిండితే కమ్మటి సువాసనగల నెయ్యి(లాంటి పదార్థం) వచ్చిద్ది. ఈ నెయ్యిని వేరే గిన్నెలోకి పిండి పక్కన ఉంచుకోవాలి.....ఎందుకు ఈ నెయ్యి తియ్యాలీ అంటే, అలానే నూరితే పచ్చడి సరిగ్గా మెదగదు......
 • ఇప్పుడు ఆరేడు పచ్చిమిరపకాయలు,కాసిని ధనియాలు,కాస్త జీలకఱ్ఱ,ఒక ఎండుమిరపకాయ,నాలుగు మెంతిగింజలు,కాస్త కరివేపాకు చిన్న బాండీలోకి తీసుకుని రెండు చిన్నగెంటెలు నూనేసి, పచ్చిమిరపకాయలు తెల్లబడేవరకు వాడ్చాలి.....
 • ఇప్పుడు రోట్లో నెయ్యి పిండేసిన కాయల్ని వేసి కచ్చాపచ్చాగా తొక్కాలి.తొక్కేప్పుడు పైన వాడ్చిపెట్టుకున్న మిరపకాయలు,ధనియాలు,జీలకఱ్ఱ్ర,కరివేపాకు ,కాసింత చింతపండు,సరిపడా ఉప్పు వేసి పచ్చడి బండతో నూరాలి...పొత్రం వేసి రుబ్బొద్దు.....ఈ పచ్చడి మరీ లేహ్యంలా ఉంటే బాగుండదు...కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది.....నూరేప్పుడు చివర్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు,కాసిని కొతిమీరాకులు వేసి తొక్కాలి....పచ్చడికల్లా ఇవే రుచి.....తినని వాళ్ళు మీ ఇష్టం, లేకపోయినా బానే ఉంటుంది....
 • ఇప్పుడు ఇలా నూరుకున్న పచ్చడికి, ముందు తీసిపెట్టుకున్న "నెయ్యి" కలపాలి......:)...అప్పుడు రుచి అదిరిపోద్ది.....
 • రోలు లేకపోతే, మిక్సీలో వెయ్యాలి అనుకుంటే ముందు మిరపకాయలు,ధనియాలు ఇవన్నీ ముందు ఒక తిప్పుతిప్పి తర్వాత కాయవేసి ఒక్కతిప్పుతిప్పి వదిలెయ్యండి......కాని రోటి పచ్చడి రోటి పచ్చడే.....:)
 • చివర్లో కావాలనుకున్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు, కాని అంత అవసరంలేదు అన్నీ నూనెలో వాడుస్తాం, పైగా "నెయ్యి" కలుపుతాం కదా! నాకైతే తాలింపు లేకపోతేనే నచ్చిద్ది.........
రెండవరకం :-
 • ఇది మామూలే, మిగతా అన్ని బండపచ్చళ్ళలానే......
 • ముందు కాయల్ని శుభ్రంగా కడిగాలి.సాధారణంగా నేతిబీరకాయలకి చెక్కు ఎక్కువ ఉండదు.కాబట్టి అలానే ముక్కలు కోసుకోవచ్చు...కాదు అనుకుంటే, పైపైన చెక్కు తీసి చిన్న ముక్కలుగా కొయ్యాలి.
 • ఇప్పుడు ఈ ముక్కల్ని బాండీలోవేసి, ఒక చిన్నగెంటెడు నూనెవేసి పొయ్యిమీద పెట్టి వాడ్చాలి......ముక్కల్లోంచి నీరంతా బైటకొస్తుంది,ఖంగారు పడొద్దు....నీరంతా ఇగిరిపోయే వరకు వేయించాలి......తర్వాత పైన చెప్పినట్టుగా పచ్చిమిరపకాయలు,ధనియాలు,జీలకఱ్ఱ,మెంతులు,కరేపాకు కాస్తనూనేసి వాడ్చాలి....ఇలా విడివిడిగా ఓపికలేదనుకుంటే ముక్కలతో కలిపికూడా వేయించొచ్చు.....
 • తర్వాత షరా మామూలే...పైన చెప్పినట్టు రోట్లోగాని,మిక్సీలోగాని వేసి,కాస్త చింతపండు,నాలుగు వెల్లుల్లి రెబ్బలు,కాసిని కొతిమీరాకులు,కావాలనుకున్నంత ఉప్పు వేసి నూరుకోటమే.....తర్వాత తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు.....
 • కాని మిక్సీలో నూరిన పచ్చడికి,ఇలా ముక్కలు వేయించి నూరిన పచ్చడికి నేను రుచి అంత గ్యారంటీ ఇవ్వలేనన్నమాట......;)
ఈ పచ్చడి వేడి వేడన్నంలో మరికాస్త మెఱుగుబొట్టేసుకుని(అదేనండీ నెయ్యి) లాగిస్తే అద్భుతంగా ఉంటుంది. ముద్దపప్పులో కలుపుకున్నా భలేఉంటుంది.....ఎప్పుడన్నా ఈ "నేతి"బీరకాయలు దొరికితే ఆలస్యం చెయ్యకుండా పచ్చడి చేసుకుని లాగించండేం.....:)

Blogger ఆధారితం.