"నేతిబీరకాయ" - ఇందులో నెయ్యి ఉంటుందండీ! నిజ్జంగా నిజం ..:)
మీరంతా నేతిబీరకాయ సామెత వినే ఉంటారుగా......నాకు తెలిసి అది తప్పు! నేతిబీరకాయలో నెయ్యి ఉంటుందండీ...నిజ్జంగా నిజమండీ బాబూ! మరి మన పెద్దవాళ్ళు ఆలాగున ఉపమానం చెప్పటంలో అంతరార్థం మరైదైనా ఉందేమో నాకు తెలీదు కాని, నేతిబీరకాయలో నిజ్జంగానే నెయ్యుంటుంది...;)....తివిరి యిసుమున తైలం తియ్యటం కష్టమేమోగాని, నేతిబీరకాయనుంచి నెయ్యి తియ్యటం మాత్రం చాలా వీజీ....:)....
"ఉన్నంతమాత్రాన అసలు నేతిబీరకాయ నుంచి నెయ్యి తీయాల్సిన అవసరమేంటటా? చక్కగా ఆవునెయ్యి,గేదెనెయ్యి దొరుకుతుండగా....దాన్ని ఆపాటున వండేసుకోవచ్చుగా?" అంటారేమో! మరదే,కాస్త నన్ను చెప్పనివ్వండీ! ఇక్కడ నా ఉద్దేశం నేతిబీరకాయలో నెయ్యి ఉంటుందని చెప్పటమేకాని, దాన్ని తీసుకుని గేదెనెయ్యికో,ఆవునెయ్యికో బదులు వాడుకోమని కాదు...;).....కాని నెయ్యి తియ్యాలి, ఎందుకో కింద చెప్తానేం....:)
నాకు తెలిసి చాలా మందికి అసలు "నేతి బీరకాయ" అంటేనే తెలీదేమో!ఇందాక మిత్రులొకరు "నేతిబీరకాయ పచ్చడి" చేశాను అనగానే, "బాగా నెయ్యి పోశావా!" అన్నాడు....హ్మ్! అందుకని ఇంత గొప్ప శాకం చాలా మందికి తెలీకపోవటం వల్ల దాని పుటో కూడా పెడుతున్నా ఇక్కడ....వీటి గురించి చాలా మందికి తెలీకపోడానికి కారణం, అన్ని కూరల్లా ఇవి బజార్లో దొరకవు....ఇంట్లో పండించాల్సిందే.....మాకైతే కొష్టాల దగ్గర వేసి, తీగని గడ్డివాముల మీదికి అల్లించేవాళ్ళం....విరగ్గాసేవి, గడ్డి వామి నిండా అల్లుకున్న తీగతో,కాయలతో ఎంత అందంగా ఉండేదో!...... ఇవి మొన్న నాన్న వస్తూ తెచ్చినవి, పదిరోజులనుంచి చల్లపెట్టెలో ఉన్నాయి కదా, అందుకే అంత తాజాగా లేవు......ఇంటో అయితే ఎప్పటికప్పుడు తెంపుకు వచ్చి పచ్చడి చేసుకునేవాళ్ళం.......ఇక్కడ దొరికిందే భాగ్యం ఇలా సర్దుకుపోవాల్సిందే!
మొన్న నాన్న తెచ్చిన మూడు కాయల్లో ఒకటి పప్పులో పెట్టా! మిగతా రెండూ ఇవ్వాళ పచ్చడి చేశా......నేతి బీరకాయలు పప్పులో పెట్టినా, పచ్చడి చేసినా ఎంతకమ్మగా ఉంటాయో! కూర మాత్రం అంత రుచి ఉండదు.......ఈ నేతిబీరకాయ పచ్చడి అంటేనే ముందు గుర్తొచ్చేది కార్తీకమాసం.....కార్తీకమాసం ఉపవాసాలున్నవాళ్ళు ఇది తప్పనిసరిగా తింటారు...మా ఊళ్ళో బ్రాహ్మలకి ప్రతి సోమవారం,పౌర్ణానికి,ఏకాదశులకి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం......అలా అందరికీ పంచడం అదో సరదా......
ఇక పచ్చడి ఎలా చెయ్యాలో చెప్తాను.....మామూలుగా నేతిబీరకాయ పచ్చడి రెండు రకాలుగా చేస్తారు......ఇక్కడ రెండూ చెప్తాను....జాగ్రత్తగా ఫాలో అవ్వండేం....:)
మొదటి రకం :-
- ముందు మంచి నేతిబీరకాయల్ని తీసుకోవాలి.రెండు కాయల్తో పచ్చడి చేస్తే నలుగురికి రెండు పూటలా వస్తుంది....కాయ మరీ లేతగా ఉండకూడదు,అలా ఉంటే పచ్చడి మరీ లేహ్యమైపోతుంది....అలా అని మరీ ముదిరి, విపరీతంగా పీచు పట్టినా తినలేం.....కాని, ముదిరినకాయ ఉంటే పచ్చడి చేసుకోటమే ఉత్తమం, పప్పుకి అస్సలు బాగోదు......
- ఇప్పుడు ఈ కాయల్ని కుమ్ములో పెట్టి కాలవాలి.....హ్మ్! "ఇక్కడ ఈ సిటీల్లో కుమ్ము మాకు ఎక్కడనుంచి వచ్చిద్ది బాబూ" అంటారేమో! స్టవ్ మీద సన్నమంట పెట్టి దానిమీదకూడా కాల్చుకోవచ్చు.కాని కుమ్ములో పెట్టిన రుచి రాదు.....స్టవ్ మీద కాల్చేప్పుడు, తొడెం పట్టుకుని తిప్పుతూ అన్ని వేపులా సమంగా కాలేలా చూసుకోవాలి.మరీ బొగ్గు అయ్యేవరకు ఉంచేరు పొరపాటున..:).....బాగా లోపల కాయంతా మగ్గి,ఉడికేవరకు ఉంచితే చాలు..నొక్కితే అర్థమవుతుంది........అదే కుమ్ములో పెట్టేట్టైతే ఒక అరగంట ఉంచి వదిలేస్తే చాలు, చక్కగా మగ్గిపోద్ది....
- ఇప్పుడు ఈ కాయకి పైన తొక్క బాగాకాలి స్పూనుతో గీరేస్తే సులువుగా వచ్చేస్తుంది.....ఇప్పుడు ఈ కాయని పట్టుకుని రెండు చేతులతో పిండితే కమ్మటి సువాసనగల నెయ్యి(లాంటి పదార్థం) వచ్చిద్ది. ఈ నెయ్యిని వేరే గిన్నెలోకి పిండి పక్కన ఉంచుకోవాలి.....ఎందుకు ఈ నెయ్యి తియ్యాలీ అంటే, అలానే నూరితే పచ్చడి సరిగ్గా మెదగదు......
- ఇప్పుడు ఆరేడు పచ్చిమిరపకాయలు,కాసిని ధనియాలు,కాస్త జీలకఱ్ఱ,ఒక ఎండుమిరపకాయ,నాలుగు మెంతిగింజలు,కాస్త కరివేపాకు చిన్న బాండీలోకి తీసుకుని రెండు చిన్నగెంటెలు నూనేసి, పచ్చిమిరపకాయలు తెల్లబడేవరకు వాడ్చాలి.....
- ఇప్పుడు రోట్లో నెయ్యి పిండేసిన కాయల్ని వేసి కచ్చాపచ్చాగా తొక్కాలి.తొక్కేప్పుడు పైన వాడ్చిపెట్టుకున్న మిరపకాయలు,ధనియాలు,జీలకఱ్ఱ్ర,కరివేపాకు ,కాసింత చింతపండు,సరిపడా ఉప్పు వేసి పచ్చడి బండతో నూరాలి...పొత్రం వేసి రుబ్బొద్దు.....ఈ పచ్చడి మరీ లేహ్యంలా ఉంటే బాగుండదు...కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది.....నూరేప్పుడు చివర్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు,కాసిని కొతిమీరాకులు వేసి తొక్కాలి....పచ్చడికల్లా ఇవే రుచి.....తినని వాళ్ళు మీ ఇష్టం, లేకపోయినా బానే ఉంటుంది....
- ఇప్పుడు ఇలా నూరుకున్న పచ్చడికి, ముందు తీసిపెట్టుకున్న "నెయ్యి" కలపాలి......:)...అప్పుడు రుచి అదిరిపోద్ది.....
- రోలు లేకపోతే, మిక్సీలో వెయ్యాలి అనుకుంటే ముందు మిరపకాయలు,ధనియాలు ఇవన్నీ ముందు ఒక తిప్పుతిప్పి తర్వాత కాయవేసి ఒక్కతిప్పుతిప్పి వదిలెయ్యండి......కాని రోటి పచ్చడి రోటి పచ్చడే.....:)
- చివర్లో కావాలనుకున్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు, కాని అంత అవసరంలేదు అన్నీ నూనెలో వాడుస్తాం, పైగా "నెయ్యి" కలుపుతాం కదా! నాకైతే తాలింపు లేకపోతేనే నచ్చిద్ది.........
- ఇది మామూలే, మిగతా అన్ని బండపచ్చళ్ళలానే......
- ముందు కాయల్ని శుభ్రంగా కడిగాలి.సాధారణంగా నేతిబీరకాయలకి చెక్కు ఎక్కువ ఉండదు.కాబట్టి అలానే ముక్కలు కోసుకోవచ్చు...కాదు అనుకుంటే, పైపైన చెక్కు తీసి చిన్న ముక్కలుగా కొయ్యాలి.
- ఇప్పుడు ఈ ముక్కల్ని బాండీలోవేసి, ఒక చిన్నగెంటెడు నూనెవేసి పొయ్యిమీద పెట్టి వాడ్చాలి......ముక్కల్లోంచి నీరంతా బైటకొస్తుంది,ఖంగారు పడొద్దు....నీరంతా ఇగిరిపోయే వరకు వేయించాలి......తర్వాత పైన చెప్పినట్టుగా పచ్చిమిరపకాయలు,ధనియాలు,జీలకఱ్ఱ,మెంతులు,కరేపాకు కాస్తనూనేసి వాడ్చాలి....ఇలా విడివిడిగా ఓపికలేదనుకుంటే ముక్కలతో కలిపికూడా వేయించొచ్చు.....
- తర్వాత షరా మామూలే...పైన చెప్పినట్టు రోట్లోగాని,మిక్సీలోగాని వేసి,కాస్త చింతపండు,నాలుగు వెల్లుల్లి రెబ్బలు,కాసిని కొతిమీరాకులు,కావాలనుకున్నంత ఉప్పు వేసి నూరుకోటమే.....తర్వాత తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు.....
- కాని మిక్సీలో నూరిన పచ్చడికి,ఇలా ముక్కలు వేయించి నూరిన పచ్చడికి నేను రుచి అంత గ్యారంటీ ఇవ్వలేనన్నమాట......;)
4:38 PM
|
లేబుళ్లు:
బండ పచ్చళ్ళు
|
You can leave a response
8 కామెంట్‌లు:
http://vareesh.blogspot.com/2009/11/blog-post.html
ఈ లింక్ లో వరూధిని గారు రాసిన నేతి బీర పచ్చడీ, ఆకు పచ్చని బేతి బీర పందిరి ఫొటో ఉన్నాయి చూడు కౌటిల్యా,! ఇందాక లింకు సరిగా ఇవ్వలేదు
"నేతిబీరకాయ పచ్చడి" చేశాను అనగానే, "బాగా నెయ్యి పోశావా!" అన్నాడు...
:-)
నేతి బీరకాయలు ఇంకా దొరుకుతున్నాయా? ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడే ఊర్లో ఇక అయిపోయాయి అన్నారే! మీదే ఊరో చెప్పండి..ఈ వారాంతం ఎటూ ఇంటికి వెళ్తున్నా పనిలో పని మీ ఊరెళ్ళి పట్టుకొచ్చుకుంటా!
సుజాత గారూ! చూశాను...వరూధిని గారు నాకన్నా చాలా ముందున్నారు...వాఆఆఆఆఆఅ....కాని వరూధిని గారు ఒక్కరకమే రాశారు, నేను రెండు రకాలుగా రాశానుగా...ఐ ఐ ఐ...ః)
భాస్కర్ గారూ!....ః)..ః)
వరూధిని గారూ! మా ఇంట్లో పాదు కాస్తోందట! అమ్మ శ్రద్ధగా నీళ్ళుపోసి కాయిస్తుంది మరి..ః)....
మా ఊరు గుంటూరుకు రెండుగంటల ప్రయాణం...మీకు అంత శ్రమెందుకుగాని, ఎవరన్నా వస్తుంటే,ఉంటే తెప్పిస్తాను....ః)
నెను ఎప్పుడు నేతి బీరకాయ పెరు చూడలేదు వినలేదు....ఇంకా నాకు తెలియని కూరలు ఎన్ని ఉన్నయో...?పచ్చడి చాలా బాగుంది..మాకు దొరికితే ట్రై చేస్తాను
కాల్చిన తరువాత పిండితే నెయ్యి వస్తుంది పచ్చడి చేసిన తరువాత ఆ నెయ్యి పొయ్య మన్నారు. రుచి లో బాగా తేడా ఉంటుందా? మేము Lita Squash అని ఉంటుంది ఇక్కడ దానితో స్టేవ్వు మీద కాల్చి చేస్తాము. మీ బొమ్మలో లాగానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. కానీ ఈ స్క్వీజ్ చెయ్యటం అనేది వినలేదు.
మాధవి గారూ! హ్మ్...అందుకేనండీ,కాయ ఫొటో కూడా పెట్టాను,చూసి బాగా గుర్తు పెట్టుకోండి..ఈసారి ఎక్కడన్నా కనిపిస్తే గబుక్కున తెచ్చేసుకుని పచ్చడి చెయ్యండి....ః)
రావు గారూ! అలా నెయ్యి పిండితే పచ్చడి త్వరగా,బాగా మెదుగుతుందండీ...పైగా నూరేప్పుడు రోలుకి(మిక్సీకి) అంటుకుపోయి వృథా అవ్వకుండా ఉంటుంది...కాబట్టి రుచిలో కూడా తేడా బానే ఉండొచ్చు...నేను డవిరెక్టుగా ఎప్పుడూ చెయ్యలేదు మరి...ః)
కామెంట్‌ను పోస్ట్ చేయండి