పెరుగొంకాయ్ కూరోయ్ బ్లాగర్లూ! కోరి వండినానోయ్ బ్లాగర్లూ!.. ;)
"వంకాయ వంటి కూరయు" ఈ పద్యం మొత్తం కాకపోయినా ఈ లైనైనా జీవితంలో ఒకసారో,వందసార్లో వినే ఉంటారు కదా! ఎందుకూఊఊఊఊఊఊఊ అని ఎప్పుడేనా ఆలోచిస్తిరా ఎవరైనాఆఆ...ఆహాఁ! ఆలోచించారా అంట!... "ఎందుకేవిఁటి నీ మొహం! రుచిగా ఉంటుంది కాబట్టి" అని గబుక్కున అనేస్తారేమో! నాకామాత్రం తెలీకడిగానా...అయినా రుచి అనేది అన్ని కూరలకీ ఉంటుంది, దేని రుచి దానిది....కొంతమంది చేతుల్లో కొన్ని కూరలు అద్భుతంగా అలాగా కుదిరిపోతాయ్ అంతే....కొన్ని కూరలు వాటిల్లో పడాల్సిన ద్రవ్యాలు నిఖార్సుగా పడితే, వాసనకే నోట్టో నీళ్ళు రప్పించేస్తాయ్, తింటే జిహ్వకంటుకుని సంవత్సరాలపాటు వదిలిపెట్టవు.......మరి "వంకాయవంటి కూర" లేదని సదరు కవిగారు ఎందుకన్నారో!
నేను తెగ ఆలోచించేసి కనుక్కున్న కారణం చెప్తా......మిగతాపద్యం కూడా చదివితే కాస్త తెలివికొచ్చిద్ది....." పంకజముఖి సీత వంటి భార్యామణి", "శంకరుని వంటి దైవము" "లంకాపతి వైరి వంటి రాజు" వీళ్ళలాంటి వాళ్ళు లేరట! అంటే అలా, ఆయా పాత్రల్లో అనువుగా ఒదిగిపోయి, ఆ పదాలకి అర్థం అంటే వీళ్ళే,,వాళ్ళే పరమ ప్రమాణం అనిపించేవాళ్ళు కదా! కాబట్టి మనం ఇక్కడ "కూర" అనే దానికి ప్రమాణంగా తీసుకోవాలంటే ఎలా ఉండాలి అది! ఎవరు వండినా, ఎలా చేసినా "ఆహా!" అనిపించేలా ఉండాలి.....ఏ ద్రవ్యం వేసి చేసినా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా దాని అసలు లక్షణం వదిలిపెట్టకూడదన్నమాట! అలా ఎవరి చేతుల్లో ఐనా చక్కగా ఒదిగిపోయి, తిన్నవాళ్ళ నోళ్ళల్లో కరిగిపోవాలి...అద్దన్నమాట సంగతి!
ఇలాంటి లక్షణాలున్న శాకం నాకు "వంకాయ" తప్ప ఏదీ కనిపించలా....కొన్ని ఒకరకంగా చేస్తేనే బాగుంటాయ్, కొంతమందికే "వహ్వా" అనేలా కుదురుతాయి.... కాని వంకాయ మాత్రం ఎన్ని రకాలుగా వండినా, ఎవరు వండినా, ఏ ద్రవ్యం పడ్డా,పడకపోయినా...దాని రుచి దానిదే...."సాటిలేదు శాకరాజమా నీకు, అందుకో ఇవే మా ప్రణామంబులు"....ః).....
అసలు వంకాయతో ఎన్ని రకాలు వండచ్చో!!!!!.....నూనె వంకాయ, గుత్తి వంకాయ( ఇందులో మళ్ళా కారం పెట్టి,ఉల్లి ముద్ద పెట్టి, మసాలా పెట్టి,ధనియాల కారం పెట్టి,....) మెంతి వంకాయ, వంకాయ వేపుడు(పకోడీతో మళ్ళా), వంకాయ పులుసు, వంకాయ పాలేసి, పెరుగు వంకాయ,టమాటాతో,ఉర్లగడ్డతో,వంకాయ పచ్చడి, వంకాయ బజ్జిపచ్చడి, వంకాయ ఊరగాయ.......ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఆగదేమో...;).....
కొంతమందికి మరో డవుటు రావచ్చు....వంకాయ ఆరోగ్యానికి మంచిది కాదుగా అంటారేమో!......"వృంతాకం కోమలం పథ్యం" అండీ బాబూ...చక్కటి నాజూకు, లేలేత వంకాయలు మిగులవేపుళ్ళు కాకుండా వండుకు తింటే ఆరోగ్యానికి ఏం ఢోకా ఉండదు......ముదురు వంకాయలు మాత్రం మంచిది కాదు....కాని సంవత్సరానికొక పాలి చేసుకుతింటే బజ్జి పచ్చడీ, ఊరగాయా(ఇవి ముదిరిన వంకాయలతోనే చేస్తారు) ఆరోగ్యాన్ని చెరపవులెండి......ః).....కాబట్టి చక్కగా రకరకాలుగా వండుకు తినండి....... "వంకాయ వంటి కూరయు" అని మళ్ళా మళ్ళా పాడుకోండి..........
ఇక ఇవ్వాళ నే చెప్పబోయే వంకాయ రకం మా గుంటూరు పేటెంటన్నమాట! అదే "పెరుగు వంకాయ"......ఇహహాహ్హ! హిహిహిహి! అదో అక్కడ గోదారోళ్ళు ముఠా కట్టేస్తున్నారు....కాస్తాగండి, టపా అయ్యాక తేల్చుకుందాం మనం.....;)...... మా ఇంట్లో మా అమ్మమ్మ ఇది తప్పితే వండేదికాదు....పెరట్లో నిండా విరగ్గాసేవా...వారంలో మూడు రోజులు పెరుగొంకాయే....ఎప్పుడన్నా పులుసు, పచ్చడి...నూనొంకాయ, గుత్తొంకాయ ఎంత బతిమాలినా చేసేదికాదు, అదేమంటే "ఇట్టా చేస్తేనే వంటికి మంచిది..చలవ.." అని మా నోళ్ళు మూయించేది.....పైగా నాన్న సపోర్టు......"ఎంత రుచిగా ఉన్నా ఏం తింటామండీ బాబూ! అదే రోజూ" అనిపించేది...
మా ఊళ్ళో ఒక చిన్న "జరిగిన కథ" చెప్తుంటారు.....మా వెనకతరాలామె ఒకామె ఒక ఆదివారంనాడు వంకాయకూర,బాగా అన్ని మసాలాలూ దట్టించి వండిందంట....మొగుడు తిని "ఆహా, ఓహో, అద్భుతం, అమృతం" అన్నాట్ట....ఇంకేముంది, మా ఆయనకి ఇంత బాగా నచ్చిందిగా అని మళ్ళా మరసనాడు అదే వండిందట.....ఆ మొగుడుగారు తిని "చాలా బాగుంది ఇవ్వాళ కూర" అన్నాట్ట...మళ్ళా మరసట్రోజు కంచంలోకి అదే కూర, ఏ మార్పూలేకుండా.....తిని కూర బాగుంది అని లేచిపోయాట్ట.....ఇక అమ్మగారు శుక్రవారం వరకూ సేం ఫార్ములాతో అదే వంకాయ కూర వడ్డించిందట పాపం....ఈ మూడ్రోజులూ ఏం మాట్టాడకుండా తిని వెళ్ళాట్ట....ఈ మహా ఇల్లాలు "గమ్మున తింటున్నాడుగా, నేను వంకాయ కూర ఎంత బాగా వండుతున్నానో" అనుకుని భుజాలెగరేసుకుంటూ శనివారంకూడా అదే వంకాయకూర పళ్ళెంలో వేసిందట.....అట్టా కంచంలో పడీ పడగానే ఆయన ఇంతెత్తున అరిచేసి కంచం విసిరికొట్టాట్ట....ఆ భార్యగారికీ వెంటనే కోపం తన్నుకొచ్చి మళ్ళా ఆ కింద పడ్డ కూరంతా ఎత్తి కంచంలో వేసి ఆయన ముందు పెట్టి,"ఇన్ని రోజులూ లొట్టలేసుకు తిన్నావ్, ఇవ్వాళేమైంది....తినకపోయావో పోలీసుల్ని పిలుస్తా" అందట.....హిహ్హిహొహిహిహి.....అసలే మెతక ప్రాణం ఏమో కిక్కురుమనకుండా తిన్నాట్ట సదరు భాబా....;)....హిహిహిహి...అదేనండీ భార్యాబాధితుడు......;)
మాకు ఈ కథ చెప్పి మమ్మల్ని హడలగొట్టేది మా అమ్మమ్మ...తినకపోతే నరాలవీరమ్మ(పైన చెప్పిన భార్యామణి పేరులెండి.....;)...) పిలిచినట్టు పోలీసుల్ని పిలుస్తా అనేది.....కుఁయ్,కఁయ్ అనకుండా తినేవాళ్ళం.............కాని బైటకొచ్చాక ఈ వేపుళ్ళ దెబ్బకి, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి పెరుగొంకాయ తిందామా అనిపించేది.....ఇప్పుడు నా వంటలో వంకాయ చేస్తే పెరుగొంకాయే......అంత విరక్తి వచ్చేసింది వేపుడన్నా, నూనొంకాయన్నా........పైగా ఎండాకాలంకదా.....చల్లగా కూర గొంతు దిగుతుంటే ఎంత హాయిగా ఉంటదో.....;).....
మరి చెప్పెయ్యనా ఎలా చేసుకోవాలో.........
- మాంఛి లేతగా విత్తనం పట్టకుండా ఉన్న వంకాయలు కావాలి.....ఈ కూరకు మన దేశవాళీ పొడవు వంకాయలే బాగుంటాయి....గుండు వంకాయలు అంత రుచి రావు......ఈ కాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగండి.......ఈ కాయల్ని సన్నగా కొంచెం పొడవుగా ముక్కలు కొయ్యాలి, పైన ఫోటోలో పెట్టాకదా, ఆ సైజులో.....కోసేప్పుడు పక్కనే నీళ్ళగిన్నె పెట్టుకుని, దాంటో చిటికెడు ఉప్పు వేసి ఈ కోసిన ముక్కని కోసినట్టు ఆ ఉప్పునీళ్ళల్లో వేసుకోవాలి....ముక్క విడిగా ఉంచితే నల్లగా అయిపోతుంది, పైగా కరుణెక్కుతుంది(చేదు వస్తుంది).......
- ఇప్పుడు కూరగిన్నె తీసుకుని దాంట్లో ఈ ముక్కలు నీళ్ళలోంచి తీసి వేసి, వెంటనే అవి మునిగేంతగా మజ్జిగ పొయ్యాలి.....మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది......
- ఇప్పుడు సరిపడా ఉప్పు,కారం వేసి ఈ గిన్నెని పొయ్యి ఎక్కించాలి.....కాస్త చిన్నవత్తిలో ఉడికించాలి..మరీ పెద్ద వత్తైతే ముక్క చిదిరిపోతుంది....కూర ఉడికేప్పుడు ఎక్కువగా కలపొద్దు....ఈ కూరకి ముక్క చిదిరితే బాగుండదు....మధ్య మధ్యలో గిన్నె పట్టుకుని ఎగరెయ్యాలి కూర కలవడానికి బాగా....ఈ ఎగరెయ్యటం బాగా అలవాటుంటేనే చెయ్యండి, లేకపోతే ముక్కలన్నీ గాల్లోకెళ్ళిపోతాయి....;)...అంత రిస్కు ఎందుకనుకుంటే చిన్న స్పూనులాంటిది తీసుకుని జాగ్రత్తగా కలపండి...ఇదంతా అడుగంటకుండా చూసుకోటం కోసమే....;)
- ముక్క బాగా ఉడికి, మజ్జిగ అన్నీ ఇగిరిపోగానే గిన్నె దించేసి చక్కటి ఇంగువపోపు పెట్టి దీంట్లోకి తిప్పెయ్యండి.....ఆ తిరగమాత మీదే వెంటనే సరిపడా పెరుగు వేసి కూరని కలిపెయ్యండి,పైనా కాస్త కొతిమీరాకులు చల్లుకోవాలి...మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి..అప్పుడు పెరుగు ముక్కకి బాగా పడుతుంది.....అల్లం,వెల్లుల్లి,పచ్చి మిరపకాయలు,మసాలాలు వెయ్యొద్దు, సాధుత్వం పోతుంది
- అంతే! కమ్మటి పెరుగువంకాయ తయార్....వేడిగా తిన్నా, చల్లగా తిన్నా అదిరిపోతుంది... ఇది నూనె వంకాయలా తొందరగా పాడవదు, ఫ్రిజ్జులో లేకున్నా సాయంత్రం వరకూ బానే ఉంటుంది.ఎండాకాలంలో ఈ కూర తింటుంటే పొట్టకీ, ప్రాణానికీ హాయిగా ఉంటుంది......
ఈ సారి మరో సూపర్ వంటకం చెప్పుకుందామే... అంతవరకూ సెలవా మరి......ః)
12:39 AM
|
లేబుళ్లు:
తెలుగింటి కూర
|
You can leave a response
14 కామెంట్‌లు:
Mouth Watering........... :)
చాలా సింపుల్ గ ఉన్నది. చేసి చూస్తాను చైనీస్ వంకాయలు(పొడుగు వంకాయలకి ఇక్కడ పేరు) సేలు లో వచ్చినప్పుడు. .
పెరుగొంకాయ్..శుభ్రంగా వంకాయ పెరుగు కూర అనొచ్చుగా ...ఇజీనగరంవాళ్లలాగా పేర్లుపెడితే ఎలా:)
ఈ వంకాయ పెరుగు కూర మేము మూడు నాలుగు రకాలుగా వండుతాం.దేని రుచి దానిదే.
"కరుణెక్కుతుంది"(చేదు వస్తుంది)..
"కండ్రెక్కుతుంది"!
ఇతకీ నూనొంకాయ ఏంటో?
పెరుగొంకాయ్ .. ప్చ్ ఏదో ఈపూటకి లాగిస్తున్నా... ఇంకో నెల దాకా ఇలా వంకాయకు ఇలా భ్రష్టత్వం పట్టించొద్దు డ్రాక్ట్టారు.
/ఇతకీ నూనొంకాయ ఏంటో?/
చక్కటి ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయలు ఓ సారి మారువేషంలో ప్రస్తుత అనతపుర ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు.... మల్లీశ్వరిని చూడటం, నాగరాజు, .. తర్వాత బి.ఎన్.రెడ్డి గారు సినిమా తీయడం జరిగింది. తిరుగుప్రయాణంలో రాయలుగారు ఓ పూటకూళ్ళమ్మ ఇంట్లో నూనొంకాయ తినడం జరిగింది, అంతే! పూటకూళ్ళమ్మ ఆస్థాన వంటాధికారైపోయింది. నూనొంకాయ అలా రాయలసీమ వంటకంగా పేటెంటై పోయింది...
ఇక అథెంటిక్ నూనొంకాయ ఎలా చేస్తారంటే... డ్రాట్టరు గారు వివరించండి బాబూ, పెరుగొంకాయ తిని గొంతు కాస్త బొంగురు పోయినట్టుంది. :))
కేవీకే గారూ, మంగిడీలు...మరీ అంత నోరూరుతుంటే ఆలస్యం చెయ్యకుండా వండేసుకుని తినెయ్యండి మరి....
రావుగారూ, అవునండీ చాలా సింపులు..చైనీసు వంకాయలా...భలే..ః)
మువ్వ గారూ! మా ఇళ్ళల్లో పెరుగొంకాయే అంటామండీ,అందుకని అలానే రాశా....వంకాయ పెరుగుకూర అంటే నాకు గోదారోళ్ళ పేరులా అనిపించింది...;)
మూణ్ణాలుగు రకాలా....నాకైతే రెండే తెలుసు, ఒకటి పైలా..రెండోది, తాలింపులో ముక్కలు ఉడికించి చివర్లో పెరుగు కలపడం....మీరు ఎలా చేస్తారో కూడా కాస్త టూకీగా చెప్పెయ్యండీ...ః)
అసలు పాత ప్రయోగం....."కనరెక్కు"....అది పోను పోను "కన్రెక్కు". "కండ్రెక్కు"గా మారి ఉంటుంది.....ఇప్పుడే నా దగ్గరున్న నాలుగైదు నిఘంటువులన్నీ తిరగేసి వస్తున్నా....మొన్న నేను చెప్పిన విశ్వనాథవారి నిఘంటువులో "కరుణెక్కు" కూడా ఉంది,సమనార్థం దగ్గరే...కాపీ పేస్ట్ కొడదామంటే అవ్వలా....
"కనరెక్కు,కరుణెక్కు(నెల్లూరు జిల్లా) - కాటుబోవు,వెగటెక్కు" అని ఉంది...
...మాకు కొంచెం నెల్లూరు ప్రభావం కూడా పడిందిలెండి...అమ్మ వాళ్ళు పెళ్ళైన తరవాత ఎనిమిదేళ్ళు నెల్లూరుజిల్లానే...ః)
ఇక నూనొంకాయంటే మామూలుగా మనం వండుకునే వంకాయకూరేనండీ,నీళ్ళు అసలులేకుండా మరికాస్త నూనె వేసి ఇగరబెడతారు,బాగా తిప్పితే గుజ్జుగా తయారైద్ది.....ఇక్కడ snkr గారు నూనొంకాయ సీమ పేటెంటంటున్నారు మరి, అక్కడెలా చేస్తారో నాకు తెలవదు మరి....ః)
@snkr గారూ,
ఏంటండీ అంత మాటనేశారు, భ్రష్టు పట్టించానా....మా వేపు ఇది చాలా ఫేమస్సు....మీరు వండారా! సరిగ్గా కుదర్లేదా ఏంటి...హ్మ్...కాస్త ఉప్పు,కారం ఎక్కువ పడతాయండీ,తాలింపులో నూనె కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలి...
మేం వండుకున్నే నూనొంకాయ పైన చెప్పేశా...మరి మీ సీమలో ఎలా చేస్తారో మీరే చెప్పాలి మరి....ః)
అబ్బే వుత్తినే ..మీరు చేయడమూ బాగలేక పోవడమూనా, సరదాకలా అన్నాను.
సిరిస్రిమువ్వ గారూ గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్.....మధ్యలో మా ఇజీనారం వాళ్ళమేమి చేసాం. :( మా పేర్లు మాకుంటాయి. మీకు తెలీదంతే...అది మీ అజ్ఞానం :D
snkr గారూ,
సరదాగానేనా అయితే వాకే.....;)
సౌమ్య గారూ,
ఇంతకీ మీరనుకుంటున్న వంకాయపెరుగుపచ్చడి, ఇది ఒకటి కాదని తేల్చారా,లేదా....ః)
మీ వంటల ప్రహసనాలు ముచ్చటగా ఉన్నాయండి. అమెరికాకు ఉన్నత విద్యార్జనకు వస్తున్న కొడుక్కి ఒక తల్లి శ్రద్ద్గగా చేతి వ్రాతతో రాసిన - అదీ రకానికొక సెక్షన్ పెట్టి రాసిన పుస్తకం అప్పట్లో ఆస్ట్రేలియాలో ఉన్న నాకు ఒక ఫోటోస్టాట్ కాపీ గా అందింది. ఆవిడ గుంటూరు ప్రాంతం వారు. ఇక ఖాళీ ఉన్న చోటల్లా నా తిరుపతి నెచ్చెలి వాళ్ళమ్మగారి ఇంటి వంటలు ఇరికించింది. ఇప్పటికీ నాకెంత ఆనందమో ఆ పడికట్టు వంటలంటే. నా ఉజ్జాయింపు/అమ్మ/మామ్మ వంటలు దాటితే అదే నా రిఫరెన్స్. ఆ పుస్తకాన్ని మా పిల్లకి ఇస్తాను. :) అలానే మీ బ్లాగు మీ ఇంటి వంటకి మారు రూపుగా మా మదిలో మెదిలేలా తీర్చి దిద్దుతారని, మా రెండో రిఫరెన్స్ గా మారుస్తారని ఆశిస్తున్నాను.
noone vankaayanTae bagaaraa vankaayi, vaerusenagapappupoDi chintapanDu pulusoo vaesi chaestaaru. bagaaraa baigan.
ఉష గారూ! రెండో రిఫరెన్సా.....ధన్యవాదాలు...ః)..
సునీత గారూ! ఈ బాగరా వంకాయ అసలెప్పుడూ వినలేదండీ! కాస్త చెప్తే చేసుకు తిని ఆనందిస్తాం....ః)
మీరురాసే విధానము,అలాగే మీరు చేసే విధానము కూడా చాలా బాగుంది.
సునీత గారూ!మీరు చెప్పిన బాగరావంకాయ అంటే చూశానండీ, అది మనం చేసుకునే ఒకరకం గుత్తొంకాయే కదా...ః)
మాధవి గారూ! ధన్యవాదాలు..మీ బ్లాగు చూశాను...చాలా రకాలున్నాయ్...ప్రయత్నించాలి నేను కూడా,ఒక్కోటి మెల్లగా....ః)
కామెంట్‌ను పోస్ట్ చేయండి