ఇవాళ్టి నా భోజనం...."కొబ్బరికూర" తో.....


ఇవ్వాళ మెస్సుకి వెళ్ళబుద్ది కాలా! స్వయంపాకం రుచ్చూసి చాన్నాళ్ళయింది...వండుకుందాం అనుకుని, బియ్యం నానేశా....కూర ఏం వండుదామా అని ఫ్రిజ్జు తీసి చూస్తే, కూరగాయలేమీ లేవు.....మార్కెట్టుకి ఈ టైమప్పుడు వెళ్ళాలంటే మహా బద్దకం....ఏమున్నాయా అని చూస్తే, మొన్న గుళ్ళు తిరిగొచ్చిన ఫలితం రెండు కొబ్బరిచిప్పలు కనిపించాయ్....పచ్చడి చేద్దాం అనుకున్నా...కాని మనకి భోజనంలోకి కనీసం మూడు ఆదరువులుండాలి, హీనపక్షం రెండైనా ఉండాలి...వాటిల్లో ఒక "కూర" తప్పనిసరి....
పచ్చళ్ళైతే రెండు,మూడున్నాయి, మరిప్పుడు కూర ఎలాగబ్బా అని ఆలోచిస్తుంటే, ఓ బ్రహ్మాండమైన అవిడియా తట్టింది......ఏం! పచ్చికొబ్బరితో పచ్చడే చెయ్యాలా, ఇంకేం చెయ్యకూడదా అనిపించింది....మీక్కూడా అప్పుడప్పుడు అలానే అనిపించుంటది కదూ!

గుడికెళ్ళొచ్చినాక మిగిలే కొబ్బరి చిప్పలు సాధారణంగా ఏదన్నా కూరలో తురిమెయ్యడమో లేకపోతే పొద్దున్నే దోశల్లోకి కొబ్బరి చట్నీ చెయ్యటమో చేస్తారు....మరీ ఓపికుంటే నాలుగు పచ్చిమిరగాయలేసి పచ్చడి నూరి అన్నంలో వేసుకుంటారు....ఇంకాస్త ఓపికెక్కువుంటే తురుం పట్టేసి కొబ్బరిలౌజు వండేసుకుంటారు....మరి మన బెమ్మీలకి ఇవన్నీ కష్టం కదా, టిఫన్లు బయట కాబట్టి చట్నీ పన్లేదు......పచ్చడి చేస్తే అన్నంలోకి ఆటిరాదు........మరి నాకొచ్చిన అవిడియా ప్రకారం ఇదిగా ఫాలో ఐపోయి చేశారనుకోండి, రుచికి రుచీ, ఆ పూట అన్నంలోకి మంఛి ఆదరువూ దొరుకుద్ది....పైగా ఒకపూట కూరగాయల ఖర్చూ మిగులుద్ది........:)

ఇంతకీ ఆ అవిడియా ఏంటా అనుకుంటున్నారా! "కొబ్బరికూర"...ఇహహాహ్హ! భలే కుదిరిందిలే! :)....చెయ్యడం బహువీజీ.....పది నిమిషాల్లో అయిపోద్ది....నేను ఎలా చేశానో చెప్పమంటారా......

ఎలాగంటే,.............,

 • ముందు కొబ్బరిని అలా చిప్పల పళంగా పచ్చికొబ్బరి తురిమే దాంతో సన్నగా తురిమేశా.... (మీ దగ్గర అది లేదనుకోండి, మామూలు ఎండుకొబ్బరి తురిమే దాంతో అయినా తురుముకోవచ్చు,కాకపోతే కొంచెం కష్టపడాలి. అదీ లేకపోతే చాకుతో బాగా సన్నగా తరగండి. మిక్సీలో వెయ్యొద్దు,బాగా రాకపోవచ్చు.పెద్ద ముక్కలు పడనివ్వొద్దు,సరిగ్గా ఉడకవు.).
 • తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ఓ రెండు గెంటెలు నూనేశా....అది కొంచెం కాగిందనంగానే కాసిన్ని ఆవాలు,జీలకఱ్ఱ వేసేశా....మినప్పప్పు,పచ్చెనగపప్పు కాసిన్ని ఎక్కువేశా.(ఎందుకంటే ఇవి ఎక్కువ పడితే అవి తినేప్పుడు మధ్యలో తగులుతుంటే సూపర్గా ఉంటది)....ఒక ఎండు మిరగాయ తుంచి వేశా....ఒక వెల్లుల్లి రెబ్బ నొక్కి వేసి, ఆనక ఓ చిటికెడు ఇంగువ పడేశా....
 • ఈ తిరగమాత గింజలన్నీ వేగి చిటపటలాడ్గానే, ముందే రెడీగా పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేశా...
 • కొంచెం గెంటెతో అలా అలా కలిపేసి, ఓ పెద్ద గ్లాసుడు నీళ్ళు పోసేసి ఉడకనిచ్చా....నీళ్ళన్నీ ఇట్టే ఇగిరిపొయ్యాయ్....మళ్ళా కాసిన్ని నీళ్ళు పోసి, పొయ్యి వత్తి తగ్గించా.....
 • కాస్తంత ఉప్పు, ఘుమఘుమలాడిపోయే మా సంబారుకారం మరికాస్తంత వేసి వేగించటం మొదలెట్టా.....ఆట్టా సంబారుకారం పడగానే ఘుమఘుమా వాసనొచ్చేసి నోట్లో నీళ్ళూరిపోయాయంటే నమ్మరు....
 • ఇక అలా వేగిస్తూ బాగా ఉడికిందనిపించగానే(ఉడక్కపోతే ఇంకాసిని నీళ్ళుపోసి ఇంకొద్దిసేపు వేగించొచ్చు) బాండీ దింపేసి మూతపెట్టి కాసేపు మగ్గనిచ్చా.....
 • అంతే! ఘుమాయిస్తున్న "కొబ్బరికూర" రెడీ అయిపోయింది...

ఆ పాటికి పక్కన కుక్కర్ లో అన్నం ఉడికిపోయింది.....వేడి వేడన్నం పళ్ళెంలో పెట్టుకుని, దాంటో ఈ కొబ్బరికూరేసుకుని లొట్టలేసుకుంటూ లాగించా....తర్వాత కొత్తిమీర పచ్చడి, కొరివికారం-దుంపల పచ్చడి(వీటి రెసిపీలు తర్వాత టపాల్లో రాస్తానేం..) కమ్మటి నెయ్యితో...చివరాకర్న పెరుగు, మాగాయ....అట్టా ఇవాళ్టి భోజనం ముగిచ్చేసి, గఱ్ఱున త్రేన్చేశానన్నమాట!

మీరుకూడా ఓపాలి ట్రై చెయ్యండి....:)

తియ్యతియ్యని "తేనెతొనలు"రెండ్రోజుల క్రితం, పొద్దున పొద్దున్నే అమ్మ ఫోను.."చిన్నీ! ఎల్లుండి నాన్నొస్తున్నారు నీ దగ్గరకి. ఏం పంపమంటావ్?" అని.
నేను,"ఏముంది మామూలుగానే కూరలు, పెరుగు పంపు"అన్నా...
దానికి అమ్మ,"మొన్న చిన్నత్త నేతరిసెలు పంపింది. ఓ పాతిక దాకా ఉన్నాయి.చక్కలు కూడా చేశా.అవి పంపుతున్నా...ఇంకా ఏమన్నా కావాలా?బూంది మిఠాయికాని,రవ్వలడ్డుకాని......".....
అంతే! నా గొంతు హైపిచ్ లోకెళ్ళిపోయింది..:)......"ఎప్పుడూ చక్కలు,కారప్పూస,రవ్వలడ్డు....విసుకొస్తోందమ్మా! ఏవఁన్నా కొత్తరకం పంపరాదూ..."అన్నా..
అమ్మ అంతకంటే హైలోకెళ్ళిపోయి,"నాకవే వచ్చు.తింటే తిను.లేకపోతే మానుకో" అనేసింది......
ఇంకేముంది? మనం కాళ్ళబేఱానికి...:)....."అమ్మా! ఓ కొత్త వంటకం ఉంది. "
తేనెతొనలు" అని. నాకు తినాలనుంది.చెయ్యవాఆఆఅ.....ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అన్నా..
అమ్మ ఒక్కమెట్టుదిగి,"నాకలాంటివి చెప్పకు.నాకు కుదరవు.అయినా కొత్త కొత్త రకాలు ఎక్కడో చదువుతావు,నా ప్రాణం తీస్తావు." అంది.

అమ్మకొంచెం చల్లపడిందిగా, ఇక మనం అల్లుకుపోయాం...."అమ్మా! ఇది
కొత్తరకం కాదే! "హంసవింశతి" కావ్యంలో "ఇడ్డెనలు తేనెతొనలు బుడుకులు నేలకికాయలు" అని చెప్పాడు....అంటే ఎంతో పాతవి, ప్రాచీనమైనవి అన్నమాట! ఎలా చెయ్యాలో నే చెప్తా, అలా ఫాలో అయిపోయి చేసెయ్యి..అవిల్రెడీ నేనొకసారి చేసి సూపర్ హిట్టు కొట్టా కూడా....ఇప్పుడు చేసుకున్నే ఓపికలేక అడుగుతున్నా..ప్లీజ్...".

ఇంకేముంది, అమ్మ పూర్తిగా ఐసయిపోయి,"సరే చెప్పు...మళ్ళా బాగా రాకపోతే నన్ను వేళాకోళమాడగూడదు మరి మీరిద్దరూ కలిసి...".

"వాకే" అనేసి, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పా... కాని దానికి అమ్మ కొంత సొంత తెలివి జోడించింది...ఫలితం, పైన ఫొటొలా ఒక షేపూ,పాడూ లేకుండా వచ్చాయి, నా దగ్గరకొచ్చేపాటికి...బాగా మెత్తగాఉండి ట్రాన్సుపోర్టులో విరిగిపోయాయి...:(.......కాని టేస్టు మాత్రం తేడా రాలేదులే.....:)....

అసలు నాకు "
తేనె" అన్న మాట వింటేనే నోరంతా తియ్యగా అయిద్ది..చిన్నప్పట్నుంచీ, పిచ్చిపిచ్చి కంపెనీ తేనెలు కాకుండా మంచి కొండతేనె, పుట్టతేనె అలవాటయ్యి ఉండటం మూలాన్నేమో!

అసలు తేనె అంటేనే నాకు మొదట గుర్తొచ్చేది, మా భజనలో
ఆరగింపు పాట.. మా ఊరిగుళ్ళో రాత్రి పూట భజన చివర్లో నైవేద్యం పెడుతూ, రాములవారి ఆరగింపు పాట పాడేవాళ్ళు..." ఆరగింపు చేసేమయ్యా! మీరారగించండి రామయ్యా" అని...ఆ పాటలో రకరకాల నైవేద్యాలు చెప్తూ మధ్యలో, "తేనెతో మాగినా తియ్య మామిడి పళ్ళ రసమూ" అని వస్తుంది....అదివిని రాములవారికి,ఆయన పరివారానికి ఏమోగాని నాకు మాత్రం తెగ నోరూరిపోయేది...:)...ఇక మామిడిపళ్ళ సీజను రాగానే మా తోటలోంచి మంచి రసాలు కోసుకొచ్చి అమ్మని చావగొట్టేసేవాణ్ణి," ఇప్పుడివి తేనెలో మాగపెట్టి రసం తీసి ఇస్తావా, లేదా" అని..అమ్మ మాడు మీద ఒక్కటి పీకి "నోరుమూసుకో" అనేది....నా ఆ కోరిక ఇప్పటికీ తీరకుండా అలానే ఉండిపోయింది..ప్చ్..ఏం చేస్తాం...

ఇక మన "తేనెతొనల" దగ్గరికొస్తే పేరుకు తగ్గట్టు "మధురం"గా ఉంటై....చెయ్యటం చాలా వీజీ....నేను మొదట చదివి ప్రయోగం చేసినట్టే చెప్తున్నా..మీకు ఇంకా ఏవన్నా కొత్త ఉపాయాలు తడితే, అలాకూడా ప్రయత్నించండి...

 • మొదట కావల్సిన పదార్థం గోధుమపిండి....ఆటా కాని, మైదాకాని ఏదైనా వాడుకోవచ్చు...దేని రుచి దానిదే....మైదాతో ఐతే కాస్త మెత్తగా వస్తాయి.....వరిపిండి కూడా వాడుకోవచ్చు...కాని వేయించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి....ఈ పిండిని బాగా జల్లించుకోవాలి, బరకలేకుండా....
 • ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బెల్లం వేసి తొక్కాలి....తీపి ఎక్కువ తిందామనుకునేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు.....కాని మొదట చేసేప్పుడు, రెండూ తక్కువ మోతాదులోనే ప్రయత్నించండి...ఒక వందగ్రాముల పిండి, యాభై గ్రాముల బెల్లం అలా....తర్వాత కావాలనుకుంటే పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చు.
 • ఇలా తొక్కినపిండిలో కాస్తంత నెయ్యి, సరిపడా నీళ్ళూ వేసి చపాతీ పిండిలా బాగా కలపండి....బాగా మర్దించాలి....ఇక్కడ నెయ్యి ఎక్కువ వెయ్యొద్దు...వేస్తే వేయించటానికి కుదరదు...
 • ఇక ఈ పిండిని, చిన్న నిమ్మ లేదా కమలా తొనల ఆకారంలో అంటే నెలవంక చంద్రుళ్ళా బిళ్ళలుగా తయారు చేసుకోవాలి...ఎలా చెయ్యాలనేది మీ ఇష్టమండీ! చేత్తో అయినా, అచ్చుతో అయినా......తొనల ఆకారమే కాదండీ, అంత మందంగా కూడా వత్తుకోవాలి....
 • ఇలా వత్తుకున్న బిళ్ళల్ని నేతిలో గాని, మంచి నూనెలోగాని వేయించుకోవాలి......(పిండి లో ఎక్కువ నెయ్యి వేసి కలిపేట్టైతే వేయించొద్దు..ఓవెన్ లో గాని, కేకు చేసే గిన్నెలో గాని బేక్ చేసుకోవచ్చు..).
 • ఇక ఈ తొనల్ని మంచి తేనె ,మునిగేట్టుగా పోసి ఊరించటమే! ఒక రోజు పాటు ఊరనివ్వాలి......
 • అంతే! నోరూరించే "తేనెతొనలు" తయార్.ఇట్టా నోట్టో వేసుకుంటే అట్టా కరిగిపోతాయ్...
 • పిల్లలకి ఇంతకన్నా మంచి తినుబండారాలు ఏముంటాయి చెప్పండి....డయాబెటిక్స్ బెల్లం వెయ్యకుండా వట్టి తేనేతో తడుపుకుని తినొచ్చు.(మితంగా)....:)

తు.చ. :-
రెసిపీ: ఓ పాత పుస్తకంలో చదివిన దానికి నా మాడిఫికేషన్...
శ్రమ పడి చేసినవారు: శ్రీమతి సుగాత్రీ నరసింహారావు గారు....అదేనండీ మా అమ్మగారు..:).
అవిడియా, పుటో, టపా మాత్రం నావేనండీ...:)

కమ్మకమ్మగా...."క్యారెట్ హల్వా"


"ఓస్! క్యారెట్ హల్వానేనా!" అనుకుంటున్నారా? మరి ముందే చెప్పాగా, మామూలు వంటలే రుచిగా ఎలా చేసుకోవాలో చెప్తానని....
అసలు నాకు చిన్నప్పటినుంచి హల్వాలంటే స్వీటుషాపులవాళ్ళు మాత్రమే చెయ్యగలరని, మనింట్లో చేసుకోటం అస్సలవ్వదని అనుకునేవాణ్ణి....కాని అన్నిటికన్నా బహువీజీగా చేసుకోగల స్వీటులు హల్వాలని నేను గరిట పట్టుకోటం మొదలెట్టాక అర్థమైంది....ఇంకేముంది! వారానికో రకం హల్వా చేసి పడేసి మా వాళ్ళమీదికి వదిలేవాణ్ణి...ఎలా చేసినా బ్రహ్మాండంగా కుదిరేవి...మా వాళ్ళు లొట్టలేసుకుంటూ లాగించేవాళ్ళు.....అసలీ హల్వాలు చెయ్యటానిక్కావలసిందల్లా ముఖ్యంగా ఓపిగ్గా ఓ రెండుగంటలు పొయ్యి ముందు కూచోడమే!


ఎన్ని రకాలు చేసినా నా చెయ్యితిరిగిందల్లా క్యారెట్ హల్వా చెయ్యడంలోనే! ఓ రకంగా దీనిమీద రీసెర్చ్ చేశానని చెప్పుకోవచ్చు...ఎంతలా అంటే "కౌటిల్య చేసిన క్యారెట్ హల్వా రుచి మరొకరికి రాదు" అనేంతలా....మరీ స్వడబ్బా కొట్టుకుంటున్నాననుకోకండి..:)...నిఝంగా మా వాళ్ళందరూ అనే మాటే ఇది...:)...{ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఎవరికన్నా స్వీట్ తినాలనిపిస్తే నన్ను ముందు చెయ్యమని అడిగేది క్యారెట్ హల్వానే!}..మన బ్లాగర్లలో కూడా చాలామంది పోయినేడు పుస్తకాల సంతలో నా క్యారెట్‍హల్వా రుచ్చూసి ఈ మాట అన్నవాళ్ళే!....:)

మొదట దీని రెసిపీ అక్కనడిగి తెలుసుకున్నా..తర్వాత ఓ సారి అక్క చేస్తుంటే చూశా...తర్వాత ఇక్కడికొచ్చాక చెయ్యటం మొదలెట్టా....ఇక ప్రతి, వారం మార్చి వారం క్యారెట్ హల్వానే...చెయ్యడం, మా కాంప్లెక్సులో అంతా పంచడం.....అలా అన్ని రకాల స్వీట్లూ రిపీటెడ్ గా చేసి ఓ పట్టు సాధించా.....ఎంతలా అంటే మా కాంప్లెక్సులో డాక్టర్లందరం కలిసి " డాక్టర్స్ స్వీట్స్, వీక్లీ స్పెషల్ " అన్నపేరుతో ఓ మిఠాయికొట్టు తెరుద్దాం అనుకునేంతలా!!!!......

మా కాంప్లెక్సులో మా సీనియర్ మేడం ఒకావిడ ఉండేవాళ్ళు....ఆవిడ నా హల్వా రుచ్చూసి, నన్ను రెసిపీ అడిగి వాళ్ళమ్మగారితో నాలుగైదు సార్లు చేయించారట! కాని ఒక్కసారికూడా ఆ ఫ్లేవర్ రాలా! "కౌటిల్య ఇలా చేసుంటాడేమో, అలా చేసుంటాడేమో" అని రకరకాలుగా ప్రయత్నించారట! కాని కుదరక నన్నొచ్చి అడిగారు," ఎలా చేశావు బాబూ" అని....నేను పెద్ద ఫోజు కొడుతూ "అందులో కొన్ని కిటుకులున్నాయి మేడం" అని ఉడికించేవాణ్ణి.....:)...ఆ కిటుకులేంటో మీకివ్వాళ చెప్పబోతున్నానన్నమాట!...:)

మరింకెందుకాలస్యం! త్వరగా వచ్చెయ్యండి నేర్చుకుందురు.........................

 • అన్ని పదార్థాలూ సమపాళ్ళల్లో తీసుకోవాలి.....అంటే కేజీ క్యారెట్లకి, లీటరు పాలు, అటూ ఇటూగా కేజీ పంచదార(నేను ముప్పాతిక కేజీ వేస్తాను.తీపి తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు).....
 • క్యారెట్లు మంచివి ఎంచుకోవాలి. బాగా ఎర్రగా, పెద్దగా ఉన్నవి తీసుకోండి...చిన్నవి, వడలిపోయినట్టుండే వాటితో అంత రుచి రాదు...ఎక్కడా కుళ్ళు డాగులు, రంగుమార్పులు లేనివి చూసి తీసుకోండి...గాజరగడ్డలంటారే, వాటితో అంతబాగా కుదరదు........ఇలా ఎంచుకు తెచ్చుకున్న క్యారెట్లని శుభ్రంగా కడిగాలి.....చివర మొనలు కత్తిరించి, ఆవేపు నుంచి తురుముకోవాలి(అంటే నిలువుగా పెట్టి తురమాలి)...అడ్డంగా తురిమితే అంతా ముద్దలా వచ్చేస్తుంది,బాగా ఉడకదు......గడ్డ మొత్తం తురిమాక చివర్లో తొడిమ దగ్గర పచ్చగా వస్తుంది ఒక్కోసారి.అది వదిలేయండి.......ఈ తురుముని ఒక మందపాటి,లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి....(ఈ తురుముని కొందరు కొంచెం నెయ్యివేసి వేయిస్తారు, తొందరగా ఉడుకుతుందని...అలా చేస్తే అంత రుచిరాక పోగా నిలవుండదు)
 • ఇప్పుడు పాలు తీసుకుని పైన రెడీగా పెట్టుకున్న తురుములో పొయ్యండి.....పాలు ఎంత చిక్కగా ఉంటే అంత రుచి వస్తుంది...గేదె పాలు డైరెక్టుగా దొరకని వాళ్ళు హోల్ మిల్క్ వాడండి...టోన్డ్ మిల్క్ వాడితే అంత రుచి ఉండదు....కేజీకి లీటరు పాలు, అరకేజీకి అరలీటరు...అదీ కొలత....
 • ఇప్పుడు ఒక రెండు గుప్పిళ్ళు పంచదార తీసుకుని పైన పాలు, తురుము మిశ్రమం లో కలపాలి...ఇలా తయారైన మిశ్రమాన్ని మూతపెట్టి ఒక పావుగంట నాననివ్వండి....ఇలా చెయ్యడంవలన ఉడికేప్పుడు తొందరగా ఉడకడమే కాకుండా మంచిరుచొస్తుంది.
 • ఇప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళి పొయ్యిమీద పెట్టాలి...పొయ్యి వత్తి తక్కువలో ఉండాలి..సెగ సన్నగా గిన్నెంతా సమానంగా తగలాలి.....ఏ హల్వా అయినా ఇదే ముఖ్యం...సెగ సమానంగా తగలాలి...అందుకని నేను రైస్ కుక్కర్ వాడతా...రైస్ కుక్కర్ తో ఇంకో ఎడ్వాంటేజీ....పొయ్యి ముందు గంటలసేపు నిలబడి సెగ తగిలించుకోడాన్ని తప్పించుకోవచ్చు..చక్కగా ఏ సినిమానో చూస్తూ లాగించెయ్యొచ్చు....:)
 • ఇక ఏముంది? పాలు కొంచెం కాగబట్టినయ్యనగానే తిప్పడం మొదలెట్టాలి....అలా తిప్పుతూ, తిప్పుతూ ఊఊఊఊఊఊఊఊఊనే ఉండాలి....ఊరకే తిప్పడం కాదు...కిందనుంచి మీదకి కలేసి తిప్పాలి...మీరు ఎంత బాగా తిప్పితే అంత రుచన్నమాట!
 • కొంచెం ఉడుకుపట్టగానే మిగతా పంచదారని కూడా వేసి కలతిప్పండి....పంచదార మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు...తీపి సరి చూసుకుని మధ్యలో అయినా కలుపుకోవచ్చు...
 • ఇప్పుడు ఉడుకుతుండగానే జీడిపప్పు ఓ గుప్పెడు తీసుకుని వేసి కలబెట్టి ఉడకబెట్టెయ్యండి...జీడిపప్పుతో కలిసి ఉడికితే మంచి రుచొస్తుంది...ఓపికుంటే జీడిపప్పుని పొడి చేసి కూడా కలుపుకోవచ్చు....
 • ఇక అసలు హల్వాలన్నిటికీ ముఖ్యమైన అమృతంలాంటి పదార్థం....లాంటేమిటీ! అమృతమే!..అదేనండీ బాబూ "నెయ్యి"....కేజీ క్యారెట్లకి అరకేజీ నెయ్యి..అదీలెక్క....కనీసం నాలుగోవంతన్నా వెయ్యాలి....లేకపోతే అసలు హల్వా వండటం వృథా....."హమ్మో! అంత నెయ్యా! మా హార్టేం కావాలి? మా గ్లామరేం కావాలి" అంటారేమో! ఎప్పుడొ ఆర్నెల్లకోసారి వండి, ఓ చిన్నకప్పుడు తినేటప్పుడు ఇల్లాంటివన్నీ ఆలోచించకూడదు...హార్టు కాదు కదా, దాని మీదుండే కవరుకి కూడా ఏం కాదు, నాదీ పూచీ! నెయ్యి మాత్రం మంచి క్వాలిటీది వాడండి...ఇంట్లో తాజాగా వెన్నకాచిన నెయ్యైతే శ్రేష్ఠం....బాగా ఎఱ్ఱగా కాగిన ముదురుకాపునెయ్యైతే ఘుమఘుమలాడి పోద్ది...డాల్డాల్లాంటివి దయచేసి వాడొద్దు..వాడితే అంతా రసాభాసమే!....వెగటేస్తది అని నెయ్యి దగ్గర కాంప్రమైజ్ కావొద్దు...కావాలంటే కాస్త తీపి తగ్గించుకోండి, సరిపోద్ది...
 • పంచదార వేశాక, కొంచెం దగ్గరకి అవుతుంది అనుకోగానే కొంచెం కొంచెం నెయ్యి వేసి ఉడకనివ్వాలి...ఇలా నేతిలో ఉడికితే రుచికి రుచీ, మృదుత్వానికి మృదుత్వమూ......
 • బాగా దగ్గరకి అవ్వగానే ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష, చిటికెడు యాలక్కాయల పొడి వెయ్యాలి.....
 • ఇక అంచులు విడిపడతన్నై అనుకోగానే మిగతా నెయ్యి పోసేసి తిప్పండి...(ఇక్కడ తిప్పడంలో కాస్త ఏమరారా అంతేసంగతి! రుచిమాట దేవుడెరుగు, మాడిపోద్ది.)
 • "మర్దనం రుచి వర్ధనం" అన్నారు...మొదటి నుంచి చివర వరకూ తిప్పుతూనే ఉండాలి, అప్పుడే రుచి...ముందే చెప్పాకదా! పొయ్యి ముందు కనీసం ఓ గంటైనా కూర్చునే ఓపికుండాలి.....
 • ఇక చివర్లో గోరంత పచ్చ కర్పూరం వేసి, ఒక్క నిమిషం ఉంచి దింపెయ్యాలి....పైన మీకు అలంకరణకి కావాలంటే నేతిలో వేయించిన జీడిపప్పు,బాదంపప్పు వేసుకోవచ్చు....
 • పచ్చికోవాలు,ఎండుకోవాల్లాంటివి వేసుకుని రుచి చెడగొట్టుకోవద్దు...
 • అంతే! కమ్మకమ్మని క్యారెట్ హల్వా తయార్! ఇలా చేసింది వేడిగా ఐనా తినొచ్చు... చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది....ఫ్రిజ్‍లో పెట్టకపోయినా నాలుగైదురోజులు నిలవుంటుంది....

తు.చ. :- పైన పుటో బాగా రాలేదు, (మన పొటోగ్రపీ స్కిల్సు అలా ఉన్నై మరి)...కాని నెయ్యి మాత్రం అలా తేలుతూ కనపడాలి...:)

Blogger ఆధారితం.