కమ్మకమ్మగా...."క్యారెట్ హల్వా"


"ఓస్! క్యారెట్ హల్వానేనా!" అనుకుంటున్నారా? మరి ముందే చెప్పాగా, మామూలు వంటలే రుచిగా ఎలా చేసుకోవాలో చెప్తానని....
అసలు నాకు చిన్నప్పటినుంచి హల్వాలంటే స్వీటుషాపులవాళ్ళు మాత్రమే చెయ్యగలరని, మనింట్లో చేసుకోటం అస్సలవ్వదని అనుకునేవాణ్ణి....కాని అన్నిటికన్నా బహువీజీగా చేసుకోగల స్వీటులు హల్వాలని నేను గరిట పట్టుకోటం మొదలెట్టాక అర్థమైంది....ఇంకేముంది! వారానికో రకం హల్వా చేసి పడేసి మా వాళ్ళమీదికి వదిలేవాణ్ణి...ఎలా చేసినా బ్రహ్మాండంగా కుదిరేవి...మా వాళ్ళు లొట్టలేసుకుంటూ లాగించేవాళ్ళు.....అసలీ హల్వాలు చెయ్యటానిక్కావలసిందల్లా ముఖ్యంగా ఓపిగ్గా ఓ రెండుగంటలు పొయ్యి ముందు కూచోడమే!


ఎన్ని రకాలు చేసినా నా చెయ్యితిరిగిందల్లా క్యారెట్ హల్వా చెయ్యడంలోనే! ఓ రకంగా దీనిమీద రీసెర్చ్ చేశానని చెప్పుకోవచ్చు...ఎంతలా అంటే "కౌటిల్య చేసిన క్యారెట్ హల్వా రుచి మరొకరికి రాదు" అనేంతలా....మరీ స్వడబ్బా కొట్టుకుంటున్నాననుకోకండి..:)...నిఝంగా మా వాళ్ళందరూ అనే మాటే ఇది...:)...{ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఎవరికన్నా స్వీట్ తినాలనిపిస్తే నన్ను ముందు చెయ్యమని అడిగేది క్యారెట్ హల్వానే!}..మన బ్లాగర్లలో కూడా చాలామంది పోయినేడు పుస్తకాల సంతలో నా క్యారెట్‍హల్వా రుచ్చూసి ఈ మాట అన్నవాళ్ళే!....:)

మొదట దీని రెసిపీ అక్కనడిగి తెలుసుకున్నా..తర్వాత ఓ సారి అక్క చేస్తుంటే చూశా...తర్వాత ఇక్కడికొచ్చాక చెయ్యటం మొదలెట్టా....ఇక ప్రతి, వారం మార్చి వారం క్యారెట్ హల్వానే...చెయ్యడం, మా కాంప్లెక్సులో అంతా పంచడం.....అలా అన్ని రకాల స్వీట్లూ రిపీటెడ్ గా చేసి ఓ పట్టు సాధించా.....ఎంతలా అంటే మా కాంప్లెక్సులో డాక్టర్లందరం కలిసి " డాక్టర్స్ స్వీట్స్, వీక్లీ స్పెషల్ " అన్నపేరుతో ఓ మిఠాయికొట్టు తెరుద్దాం అనుకునేంతలా!!!!......

మా కాంప్లెక్సులో మా సీనియర్ మేడం ఒకావిడ ఉండేవాళ్ళు....ఆవిడ నా హల్వా రుచ్చూసి, నన్ను రెసిపీ అడిగి వాళ్ళమ్మగారితో నాలుగైదు సార్లు చేయించారట! కాని ఒక్కసారికూడా ఆ ఫ్లేవర్ రాలా! "కౌటిల్య ఇలా చేసుంటాడేమో, అలా చేసుంటాడేమో" అని రకరకాలుగా ప్రయత్నించారట! కాని కుదరక నన్నొచ్చి అడిగారు," ఎలా చేశావు బాబూ" అని....నేను పెద్ద ఫోజు కొడుతూ "అందులో కొన్ని కిటుకులున్నాయి మేడం" అని ఉడికించేవాణ్ణి.....:)...ఆ కిటుకులేంటో మీకివ్వాళ చెప్పబోతున్నానన్నమాట!...:)

మరింకెందుకాలస్యం! త్వరగా వచ్చెయ్యండి నేర్చుకుందురు.........................

  • అన్ని పదార్థాలూ సమపాళ్ళల్లో తీసుకోవాలి.....అంటే కేజీ క్యారెట్లకి, లీటరు పాలు, అటూ ఇటూగా కేజీ పంచదార(నేను ముప్పాతిక కేజీ వేస్తాను.తీపి తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు).....
  • క్యారెట్లు మంచివి ఎంచుకోవాలి. బాగా ఎర్రగా, పెద్దగా ఉన్నవి తీసుకోండి...చిన్నవి, వడలిపోయినట్టుండే వాటితో అంత రుచి రాదు...ఎక్కడా కుళ్ళు డాగులు, రంగుమార్పులు లేనివి చూసి తీసుకోండి...గాజరగడ్డలంటారే, వాటితో అంతబాగా కుదరదు........ఇలా ఎంచుకు తెచ్చుకున్న క్యారెట్లని శుభ్రంగా కడిగాలి.....చివర మొనలు కత్తిరించి, ఆవేపు నుంచి తురుముకోవాలి(అంటే నిలువుగా పెట్టి తురమాలి)...అడ్డంగా తురిమితే అంతా ముద్దలా వచ్చేస్తుంది,బాగా ఉడకదు......గడ్డ మొత్తం తురిమాక చివర్లో తొడిమ దగ్గర పచ్చగా వస్తుంది ఒక్కోసారి.అది వదిలేయండి.......ఈ తురుముని ఒక మందపాటి,లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి....(ఈ తురుముని కొందరు కొంచెం నెయ్యివేసి వేయిస్తారు, తొందరగా ఉడుకుతుందని...అలా చేస్తే అంత రుచిరాక పోగా నిలవుండదు)
  • ఇప్పుడు పాలు తీసుకుని పైన రెడీగా పెట్టుకున్న తురుములో పొయ్యండి.....పాలు ఎంత చిక్కగా ఉంటే అంత రుచి వస్తుంది...గేదె పాలు డైరెక్టుగా దొరకని వాళ్ళు హోల్ మిల్క్ వాడండి...టోన్డ్ మిల్క్ వాడితే అంత రుచి ఉండదు....కేజీకి లీటరు పాలు, అరకేజీకి అరలీటరు...అదీ కొలత....
  • ఇప్పుడు ఒక రెండు గుప్పిళ్ళు పంచదార తీసుకుని పైన పాలు, తురుము మిశ్రమం లో కలపాలి...ఇలా తయారైన మిశ్రమాన్ని మూతపెట్టి ఒక పావుగంట నాననివ్వండి....ఇలా చెయ్యడంవలన ఉడికేప్పుడు తొందరగా ఉడకడమే కాకుండా మంచిరుచొస్తుంది.
  • ఇప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళి పొయ్యిమీద పెట్టాలి...పొయ్యి వత్తి తక్కువలో ఉండాలి..సెగ సన్నగా గిన్నెంతా సమానంగా తగలాలి.....ఏ హల్వా అయినా ఇదే ముఖ్యం...సెగ సమానంగా తగలాలి...అందుకని నేను రైస్ కుక్కర్ వాడతా...రైస్ కుక్కర్ తో ఇంకో ఎడ్వాంటేజీ....పొయ్యి ముందు గంటలసేపు నిలబడి సెగ తగిలించుకోడాన్ని తప్పించుకోవచ్చు..చక్కగా ఏ సినిమానో చూస్తూ లాగించెయ్యొచ్చు....:)
  • ఇక ఏముంది? పాలు కొంచెం కాగబట్టినయ్యనగానే తిప్పడం మొదలెట్టాలి....అలా తిప్పుతూ, తిప్పుతూ ఊఊఊఊఊఊఊఊఊనే ఉండాలి....ఊరకే తిప్పడం కాదు...కిందనుంచి మీదకి కలేసి తిప్పాలి...మీరు ఎంత బాగా తిప్పితే అంత రుచన్నమాట!
  • కొంచెం ఉడుకుపట్టగానే మిగతా పంచదారని కూడా వేసి కలతిప్పండి....పంచదార మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు...తీపి సరి చూసుకుని మధ్యలో అయినా కలుపుకోవచ్చు...
  • ఇప్పుడు ఉడుకుతుండగానే జీడిపప్పు ఓ గుప్పెడు తీసుకుని వేసి కలబెట్టి ఉడకబెట్టెయ్యండి...జీడిపప్పుతో కలిసి ఉడికితే మంచి రుచొస్తుంది...ఓపికుంటే జీడిపప్పుని పొడి చేసి కూడా కలుపుకోవచ్చు....
  • ఇక అసలు హల్వాలన్నిటికీ ముఖ్యమైన అమృతంలాంటి పదార్థం....లాంటేమిటీ! అమృతమే!..అదేనండీ బాబూ "నెయ్యి"....కేజీ క్యారెట్లకి అరకేజీ నెయ్యి..అదీలెక్క....కనీసం నాలుగోవంతన్నా వెయ్యాలి....లేకపోతే అసలు హల్వా వండటం వృథా....."హమ్మో! అంత నెయ్యా! మా హార్టేం కావాలి? మా గ్లామరేం కావాలి" అంటారేమో! ఎప్పుడొ ఆర్నెల్లకోసారి వండి, ఓ చిన్నకప్పుడు తినేటప్పుడు ఇల్లాంటివన్నీ ఆలోచించకూడదు...హార్టు కాదు కదా, దాని మీదుండే కవరుకి కూడా ఏం కాదు, నాదీ పూచీ! నెయ్యి మాత్రం మంచి క్వాలిటీది వాడండి...ఇంట్లో తాజాగా వెన్నకాచిన నెయ్యైతే శ్రేష్ఠం....బాగా ఎఱ్ఱగా కాగిన ముదురుకాపునెయ్యైతే ఘుమఘుమలాడి పోద్ది...డాల్డాల్లాంటివి దయచేసి వాడొద్దు..వాడితే అంతా రసాభాసమే!....వెగటేస్తది అని నెయ్యి దగ్గర కాంప్రమైజ్ కావొద్దు...కావాలంటే కాస్త తీపి తగ్గించుకోండి, సరిపోద్ది...
  • పంచదార వేశాక, కొంచెం దగ్గరకి అవుతుంది అనుకోగానే కొంచెం కొంచెం నెయ్యి వేసి ఉడకనివ్వాలి...ఇలా నేతిలో ఉడికితే రుచికి రుచీ, మృదుత్వానికి మృదుత్వమూ......
  • బాగా దగ్గరకి అవ్వగానే ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష, చిటికెడు యాలక్కాయల పొడి వెయ్యాలి.....
  • ఇక అంచులు విడిపడతన్నై అనుకోగానే మిగతా నెయ్యి పోసేసి తిప్పండి...(ఇక్కడ తిప్పడంలో కాస్త ఏమరారా అంతేసంగతి! రుచిమాట దేవుడెరుగు, మాడిపోద్ది.)
  • "మర్దనం రుచి వర్ధనం" అన్నారు...మొదటి నుంచి చివర వరకూ తిప్పుతూనే ఉండాలి, అప్పుడే రుచి...ముందే చెప్పాకదా! పొయ్యి ముందు కనీసం ఓ గంటైనా కూర్చునే ఓపికుండాలి.....
  • ఇక చివర్లో గోరంత పచ్చ కర్పూరం వేసి, ఒక్క నిమిషం ఉంచి దింపెయ్యాలి....పైన మీకు అలంకరణకి కావాలంటే నేతిలో వేయించిన జీడిపప్పు,బాదంపప్పు వేసుకోవచ్చు....
  • పచ్చికోవాలు,ఎండుకోవాల్లాంటివి వేసుకుని రుచి చెడగొట్టుకోవద్దు...
  • అంతే! కమ్మకమ్మని క్యారెట్ హల్వా తయార్! ఇలా చేసింది వేడిగా ఐనా తినొచ్చు... చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది....ఫ్రిజ్‍లో పెట్టకపోయినా నాలుగైదురోజులు నిలవుంటుంది....

తు.చ. :- పైన పుటో బాగా రాలేదు, (మన పొటోగ్రపీ స్కిల్సు అలా ఉన్నై మరి)...కాని నెయ్యి మాత్రం అలా తేలుతూ కనపడాలి...:)

13 కామెంట్‌లు:

yogirk చెప్పారు...

బాబూ చిన్నా, ఎంత ఓపిక నీకు! :)

అజ్ఞాత చెప్పారు...

కొద్దివారాల క్రితం మా ఇంట్లో కేరెట్ హల్వా ప్రయోగం జరిగింది. మీరన్న గాజరగడ్డలు వాడారు. ఇహ పక్కన నేనుండగా మీరు చెప్పినట్టుగా నెయ్యి వెయ్యాలంటే అది జరిగే పనే కాదు. కాబట్టి హల్వా ఎలా వచ్చిందని మీరడగక్కర్లేదు. ఏదో కొద్దిగా తిని మిగతా అంతా దానం చెయ్యాల్సొచ్చింది.

ఈసారి మీరు చేసిన హల్వాయే రుచి చూస్తాం లెండి. ఆర్కే అన్నట్టు మీ ఓపిక్కి మాత్రం జోహార్లండి.

జ్యోతి చెప్పారు...

ఓసోస్! ఇంత ప్రొసీజర్ లేకుండా అన్నీ కలిపి ప్రెషర్ కుక్కర్లో వేసి పావుగంటలో రుచికరమైన, అందమైన క్యారట్ హల్వా చేయొచ్చు. కావాలంటే షడ్రుచులులో చూడు బాబు.

ఐనా ఇంతసేపు కలుపుతూ ఉంఢడానికి ఎంత ఓపిక చిట్టి?

One Stop resource for Bahki చెప్పారు...

మీ కేరెట్ హల్వా తిన్న అవకాశం నాకు కలిగినది , నెనర్లు కానీ మీరు చెప్పిన్నన్ని జీడిపప్పులు,ఈ ద్రాక్శ రాలేదు ఎదో ఒకటో అరో తగిలినది ..్ఈ సారి హైదరాబాదు వచ్హేటప్పుడు ఒక పావు కిలో ప్రార్సిల్

Ennela చెప్పారు...

డాకటర్లు ఇలా పాక శాస్త్రం లో కూడా పరిశోధనలు చేస్తారా? బాగుందండీ..ఇప్పుడు మీరు క్యారట్ హల్వా స్పెషలిస్టు అన్నమాట

సుజాత వేల్పూరి చెప్పారు...

కౌటిల్యా,
మీ చదువు చెట్టెక్కుతుందేమో అని భయమేస్తుంది నాకు...ఇంత ఓపిగ్గా రాస్తున్న రెసిపీలు చూస్తుంటే! మాలతీ చందూర్ కూడా ఇలా రాయలేదేమో!

జ్యోతిగారూ , మీ వాదన ఖండిస్తున్నా! కుక్కర్లో వండితే ఇంత టేస్టుగా రాదు. అదంతా అలా తిప్పుతూ....ఊఊఊఊఊఊఊ నే ఉండటంలో ఉందనుకుంటా ఆ కిటుకు!

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా ఓపికండి మీకు. నా అనుమానం అసలు మీరు మెడికల్ కాలేజీలోనేనా చదివింది లేక హోటల్ మానేజ్మెంట్ కాలేజిలోనా!!

జ్యోతి గారు కారెట్ హల్వా కుక్కర్లో కన్నా విడిగా చేస్తేనే బాగుంటుంది. నిన్నే రిలయన్సులో కారెట్లు బాగున్నాయని ఓ కిలో పట్ట్తుకొచ్చా హల్వా చేద్దామని..ఈ సారి మీ పద్దతిలో చెయ్యాలి! మీ పద్దతికి నా పద్దతికి ప్రాధమిక తేడా..నేను కారెట్టు ముందు నేతిలో వేయించుతాను. మిగతా అంతా ఒకటే!

కండెన్సుడు మిల్కు (మిల్క్ మెయిడు) వాడితే ఇంకా రుచిగా ఉంటుంది. అప్పుడు పంచదార బాగా తగ్గించి వేసుకోవాలి.

కౌటిల్య చెప్పారు...

దేంట్లో ఆర్కే! వండటంలోనా, రాయటంలోనా....నాకు రెండిట్లోనూ బద్దకమే ప్రస్తుతానికి...ః)

నాగమురళి గారూ,హన్నా! నాకో ఫోను కొట్టాల్సింది వండేప్పుడు...నెయ్యి వెయ్యకపోతే అది హల్వా అవ్వదండీ, అదేదో ఐద్ది..ః)...ఈసారి వండి పట్టుకొస్తాలెండి, అక్కడికొచ్చి చేస్తే మీరు నెయ్యి వెయ్యనివ్వరుగా!..ః)

జ్యోతిగారూ! మీరు చెప్పిన రకంగా, ఇంకా రకరకాలుగా చెయ్యటం అయ్యాకే ఈ పద్ధతికి ఫిక్స్ అయ్యా నేను...ః)..ఎలా చేసినా క్యారెట్ హల్వా అందంగానే వచ్చిద్దండీ!

కశ్యప్ జీ! మీకు జీడిపప్పులు,దాచ్చలు రాలేదా! అయ్యో! ఐతే ఈపాలి మీకోసం స్పెసల్ గా చేసి పట్టుకొస్తాలే!..ః)

ఎన్నెల గారూ!అందరూ చెయ్యరండీ! నేనుకొంచెం భోజనప్రియుణ్ణి,అందుకే అలా రీసెర్చిలు చేస్తుంటా..ః) నన్నలా ఫిక్స్ చేసెయ్యకండి..ఏదో సర్జన్ అవుదాం అనుకుంటున్నా...ః)

కౌటిల్య చెప్పారు...

సుజాతగారూ! చదువులో పడే రాయటం ఇంత లేటయ్యింది..ఇది వండి, ఫొటొలు తీసి పదిహేను రోజులయ్యిందండీ!....ః)....హమ్మో!పెద్ద పెద్దోళ్ళతో పోల్చేస్తున్నారు నన్ను...ః)...

సిరిసిరిమువ్వ గారూ!
అమ్మో! ఇప్పటికే బ్లాగ్లోకంలో నామీద చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి..మీరింకొంచెం డవుటు పెంచకండీ!...ః)..అయినా ఆ వోటలు మేనేజ్మెంటు పిల్లకాయలు చేసే వంటకాలు చూట్టానికి అద్భుతంగా ఉంటాయ్ కాని నోట్టో పెట్టుకో వల్లవదండీ!

చేసి ఎలా ఉందో చెప్పండి..ః)...మిల్కుమెయిడు ఒకసారి వేశానండీ!నాకు నచ్చలా! హోమ్లీగా అనిపించలా! పైగా నేను స్టోర్డ్ ఫుడ్ కి బద్ధ్దవ్యతిరేకిని...ః)

ఆ.సౌమ్య చెప్పారు...

నాకి ఇది భలే ఇష్టం....హైదరాబాదులో దొరికే కేరట్ హల్వా కన్నా, డిల్లీలో దొరికే హల్వా మరింత రుచిగా ఉంటుంది, కిటుకేమిటో తెలీదు మరి.

ఇంట్లో చేసుకోవాలంటే ఇంత ప్రాయాసపడాలా :(

హ్మ్ ఎప్పుడైనా తిప్పుతూ ఊఊఊఊ ట్రై చెయ్యాలి ఒకసారి :)

karthik చెప్పారు...

>>డిల్లీలో దొరికే హల్వా మరింత రుచిగా ఉంటుంది, కిటుకేమిటో తెలీదు మరి.
thats becasue they use different carrots, the long and thin ones which are more sweeter..
for me, the best gaajar halwa is what i ate in lucknow.. unbeatable..

జ్యోతి చెప్పారు...

వరూధిని, సుజాత మామూలుగా చేస్తేనే బావుంటుంది. కాని ఈ కౌటిల్య దాన్ని తిప్పుతూ,తిప్పుతూ తిప్పుతుంటే విసుగొచ్చింది. అతడంటే బ్రహ్మచారి. బోలెడు టైమ్ ఉంటుంది. ఎంత కరెంట్, గ్యాస్ ఖర్చైనా లెక్కలేదు. మనకలా కాదుగా. ఎడమవైపు పోపులో ఇంగువ వేయాలి. కుడివైపు హల్వాలో యాలకులపొడి వేయాలి.అంత సేపు క్యారట్ హల్వాను తిప్పుతూ కూర్చుంటే ఇక తిన్నట్టే. నేను మాత్రం చాలామటుకు కుక్కర్లోనే చేస్తాను.

సౌమ్య, నువ్వు చెప్పేది డిల్లీ గాజర్ సంగతి. అవి మంచి రంగు కలిగి ఎక్కువ తియ్యగా ఉంటాయి. తక్కువ పంచదార పడుతుంది. రుచి కూడా బావుంటుంది. నేను ఎప్పుడు ఈ డిల్లీ గాజర్ కనపడినా కొనేసి హల్వా చేసేస్తాను. ఎవ్వరూ తినకుంటే ఫ్రిజ్ లో పెట్టుకుని రోజూ తినడమే. కౌటిల్యలా నెయ్యి పొయ్యను. వేస్తాను. సో ఎంత తిన్నా నో ప్రాబ్లం..

శ్రీ చెప్పారు...

మీరు చెప్పినట్టు చేసాను, చాలా బాగా వచ్చిందండి కేరెట్ హల్వా.

Blogger ఆధారితం.