పులగం - మన "భోగి" విశేష భోజ్యం




సంక్రాంతి పండగొస్తుందంటే మన తెలుగిళ్ళల్లో ఉండే సందడి అంతా ఇంతా కాదు...రాత్రిళ్ళు మేలుకుని మరీ వేసే ముగ్గులతో,హరిదాసుతో నెలముందే మొదలవుద్ది....ఒక పదిహేను రోజులు పోయాక, ఇక మొదలవుతాయి. ప్రతి ఇంటినుంచీ ముక్కుకి కమ్మగా తగిలే నేతి వాసనలు...ఎవరింట్లో ఏం చేస్తున్నారో వాసనబట్టి తెలుసుకోటం మాకు చిన్న సరదా పజిల్ లా ఉండేది....లయబధ్ధంగా వినిపించే రోళ్ళ చప్పుళ్ళు...ఇక్కడ మూడురోకళ్ళు,నాలుగురోకళ్ళతో పోటు వెయ్యటంలో పోటీలు పడేవాళ్ళు.....నాకు రెండు రోకళ్ళపోటే కష్టంగా ఉండేదనుకోండి....

పాకం పట్టిన అరిసెల పిండిని అమ్మ చూడకుండా ఎత్తుకెళ్ళడం,భలే సరదాగా ఉండేది....ఒకళ్ళింట్లో అరిసెలు చేస్తున్నారంటే, చుట్టుపక్కల పదిళ్ళవాళ్ళు చేరి కలిసి చేసేవాళ్ళు..అమ్మ ఆ పదిరోజులూ బిజీ బిజీ...ఎక్కడోచోట సరిపోయేది..."ఇవ్వాళ వాళ్ళింట్లో పాకం సరిగ్గా కుదర్లేదురా,అరిసెలు సరిగ్గా రాలా" అంటూ వచ్చేది....మా ఇంట్లో అరిసెలంటే ఓ పెద్ద ప్రహసనం....పాలేర్లు మధ్యాహ్నం పిండి కొట్టటంతో మొదలయ్యేది...సాయంత్రం పాకం పట్టేవాళ్ళు....ఇక అరిసెలు వత్తటమంటే ఓ పెద్ద ఆర్టు...మా పెద్దత్త ఒకేసారి నాలుగు,ఐదు వత్తేది...నేను కూడా ఓ చెయ్యేసేవాణ్ణి... :)....అందరూ నెయ్యి, నూనె కలిపి వండేవాళ్ళు, మా ఇంట్లో మాత్రం వట్టి నెయ్యిలో వండేవాళ్ళు..నాన్న డాల్డాలు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు... అన్నీ వరిచెత్త మీద ఆరపోసే వాళ్ళు....లెక్కపెట్టటం పిల్లల వంతన్నమాట! వెయ్యి దాకా అయ్యేవి....నేను మరీ చిన్నప్పుడు నేను నిద్ర లేచేపాటికి వంటగది నిండా అరిసెల డబ్బాలుండేవి. "తెల్లారేకల్లా ఎల్లా వచ్చాయా?" అని తెగ హాచ్చర్య పడిపోయేవాణ్ణి...అమ్మ,"నాన్న మంత్రం వేసాడు, అంతే వచ్చేశాయి" అని నవ్వుతూ చెప్పేది....



ఇక పండగ మూడురోజుల్లోకీ నాకు బహు ఇష్టమైంది భోగి...ఎందుకంటే, రకరకాల విశేషాలన్నీ ఆ రోజే కదా! సంక్రాంతి రోజు ఏముంది? ఎప్పట్లా పూజ, బెల్లం పాయసం నైవేద్యం, హరిదాసుకీ, బ్రాహ్మడికీ మోయనలివ్వటం..అంతే కదా! అదే భోగి రోజునైతే వేకువఝామున్నే పోటీలు పడి వేసే భోగిమంటలు, తర్వాత అమ్మ తలకి ఆముదం,వంటికి నువ్వులనూనె రాసి రేపటగ్గిలో నుంచోపెట్టేది..తర్వాత కుంకుళ్ళెట్టి తలకలు...కొత్త బట్టలేసుకుని సాయంత్రం భోగిపళ్ళకి కావాల్సిన రేగిపళ్ళ కోసం చేల మీద పడేవాళ్ళం...,,ఊర్లోకల్లా మాదే పెద్ద రేగిచెట్టు....అన్నయ్య ఎవరూ రాకుండా కాపలా నుంచుంటే, నేను అక్కావాళ్ళం పిందెతో సహా దులిపేసేవాళ్ళం...దార్లో వచ్చేప్పుడు ఉండే చిన్న చిన్న రేగ్గుట్టల్ని కూడా వదిలేవాళ్ళం కాదు... ;)....


ఇక ఇంటికి రాగానే అమ్మ అరిటాకులేసి, కమ్మటి వాసనతో ముక్కు పుటాలు అదరగొడుతున్న వంటకం వడ్డించేది...."పులగం".....అదన్నమాట! ఇవ్వాళ పాకవేదంలో మనం రుచ్చూడబోతున్నది.....అసలు ఆ వాసనే చాలు. కడుపు నింపెయ్యటానికి....అన్నంలో పెసరపప్పు,నెయ్యి కలిపిన ఆ వాసన నాకు సంవత్సరమంతా ముక్కంటుకునే ఉండేది...మధ్యలో పేద్ద గురుగు చేసి, దాన్నిండా నెయ్యి పోసుకుని, పక్కన దొడ్లో కాసిన లేత సొరకాయల్తో నూరిన పచ్చడి, లేలేతవంకాయలు కుమ్ములో పెట్టి కాల్చి చేసిన రోటి పచ్చడి వేసుకుని తింటుంటే...."అబ్బబ్బా! ఇది కదా సంక్రాంతి సంబరమంటే!" అననిపించేది...

మరిక అలాంటి "కమ్మటి పులగం" చేసుకుని రుచ్చూద్దామా!
  • మొదట సరిపడా బియ్యం తీసుకుని రాళ్ళులేకుండా చెరిగేసి, బాగా శుభ్రంగా కడిగి, మునిగే వరకు నీళ్ళు పోసి కనీసం రెండు గంటలు నానపెట్టాలి.బియ్యం ఎంత బాగా నానితే అంత మృదువుగా వస్తుంది పులగం.....కొంత మంది కొత్తగా పండిన ధాన్యమే వాడాలని జొన్నలతో చేసేవాళ్ళు....వట్టి జొన్నలైతే కొంచెం కాయలుగా వస్తుంది, అందుకని తొక్కి రవ్వ చేసుకుని వాడుకుంటే బాగా వస్తుంది...
  • తర్వాత పైన తీసుకున్న బియ్యంలో మూడొంతులు పెసరపప్పు తీసుకోవాలి.అంటే గ్లాసు పెసరపప్పుకి మూడుగ్లాసుల బియ్యమన్నమాట! లేకపోతే మా ఊరి భాషలో "గిద్ద పప్పుకి మూడుగిద్దలు బియ్యం".....ఇవి కూడా బాగా కడిగి నానపెట్టుకోవాలి. {పెసరపప్పు బదులు కొంతమంది నల్లపెసలు వాడతారు.కందిపప్పు కూడా వాడుకోవచ్చు. కాని పెసరపప్పు రుచే వేరు..;)........అసలు ఈ పెసరపప్పు,బియ్యంల నిష్పత్తిని బట్టే దానికి పులగం,మళహోర,కట్టుపొంగలి,కిచడీ అని పేర్లు మారతాయ్.....౧) "మళహోర"లో పెసరపప్పు కి రెట్టింపు బియ్యం( అంటే బియ్యంలో సగం పెసరపప్పు) వేస్తారు...దీన్నే తమిళులు కాసింత నెయ్యి, జీడిపప్పు ఎక్కువ జోడించి "కటు పొంగలి" అంటారు. "కట్ పొంగల్", "కట్టు పొంగలి","కట్టె పొంగలి" దీని నామాంతరాలన్నమాట! తీపి వేసి, బాగా పాలు పోసి చేస్తే అది తీపి పొంగలి, తీపిలేకుండా కొంచెం కారంగా "మిరియాలు,అల్లం" వేసి చేస్తే కారంగా, కటువుగా ఉంటుంది కాబట్టి "కటు పొంగలి". ఈ కటుపొంగలి అనేది తమిళపదం, "మళహోర" మన తెలుగువాళ్ళది.కాబట్టి దీన్ని మనవాళ్ళు ఎన్నో వందలేళ్ళుగా వండుకుతింటున్నారని, ఎక్కడి నుంచీ అప్పు తెచ్చుకు తిందికాదని మనవి!........౨)ఇక "కిచిడీ" అనే "కిచ్చడి"లో బియ్యానికి, రెట్టింపు పెసరప్పు(అంటే గ్లాసు బియ్యానికి,రెండు గ్లాసుల పెసరపప్పు) కూరగాయ ముక్కలు కలిపి వండుతారు....... }.
  • అవి బాగా నానాక సరిపడా గిన్నె పెట్టి దాంట్లో తాలింపు పెట్టుకోవాలి. ఏ వంటకానికైనా తాలింపే ముఖ్యం అని చెప్పాకదా! ఎలా పెట్టాలో చూద్దాం. గిన్నెలో బాగా మరింత నెయ్యి వేసి కాగనివ్వాలి.నెయ్యి వేస్తేనే రుచి.లేకపోతే నూనెతో కూడా పెట్టుకోవచ్చు. కాగిన నేతిలో సరిపడా జీలకఱ్ఱ వెయ్యాలి. ఎక్కువైనా వేసుకోవచ్చు.ఇంక ఏ తాలింపుగింజలూ వాడొద్దు...ఇంగువకూడా వెయ్యాలి...మిరియాలు తగినన్ని ఈ తాలింపులో వేసుకోవాలి...(లేకపోతే అన్నం ఉడికేప్పుడు కూడా వేసుకోవచ్చు.మిరియాలపొడి వాడేట్టైతే అన్నం ఉడికేప్పుడే కలపాలి....)....
  • మిరియాలు వేసిన వెంటనే ఎసరు పొయ్యాలి. ఎంత పొయ్యాలి? మామూలుగా అన్నం వండేప్పుడు గ్లాసు బియ్యానికి, రెండు గ్లాసుల నీళ్ళు పోస్తాం కదా! ఇక్కడ మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి.రుచికి కావాలంటే చిన్న గ్లాసుడు పాలు కూడా పోసుకోవచ్చు.
  • ఎసరు బాగా తెర్లింతర్వాత, పైన నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. బియ్యం ఉడుకు పట్టిందనగానే పెసరపప్పు వేసి బాగా కలతిప్పి ఉడికించాలి. ఎంత బాగా తిప్పితే అంత రుచి.....రెండూ బాగా దగ్గరకయ్యాయి అనుకోగానే రుచికి తగినంత ఉప్పు, కాసిన్ని అల్లం ముక్కలు(సన్నగా తరిగినవి) కలుపుకోవాలి.మరీ గట్టిపడనివ్వొద్దు...కొంచెం మెత్తగా,లేహ్యంలా ఉంటేనే రుచి. చివర్లో దించేప్పుడు మరికాస్త నెయ్యి వేసి కలిపి దించాలి.....
  • దించాక నేతిలో వేయించిన జీడిపప్పు కలుపుకోవచ్చు......అంతే! ఘుమఘుమలాడే "పులగం" తయారన్నమాట!
  • ఎక్కడో ఒక కవి " సస్నేహా కామినీ వేయం కృశరా శిశిరే హితా" అని చక్కగా వర్ణిస్తాడు...అంటే, " ఈ పులగాన్ని కమ్మటి నెయ్యి మరికాస్త వేసుకు తింటే చలికాలంలో పడుచుపిల్లలా వెచ్చదనాన్నిస్తుందని" అర్థం...అంటే, చలికాలంలో తింటే ఆరోగ్యం అన్నమాట! నందికేశ్వర నోములో బ్రాహ్మలిళ్ళల్లో ఎక్కువగా వండుతారు దీన్ని!
  • ఇక ఆలస్యం దేనికి...చక్కగా వండుకుని, ఎత్తుకెత్తు నెయ్యి పోసుకుని, చక్కటి రోటి పచ్చడి కాని, మాంఛి దప్పళం కాని వేసుకుతిని స్వర్గ వీధుల్లో విహరించండి మరి!
చిత్రం: జ్యోతిగారి సౌజన్యంతో

7 కామెంట్‌లు:

నిషిగంధ చెప్పారు...

మీరు ఇంతలా నోరూరించేలా రాసేకా ఓ పెద్ద గిన్నెడు పులగం వండకుండా అస్సలుండలేను.. పెట్టేశా రేపటికే ముహూర్తం :-)

బాగా రాస్తున్నారు... ఇలానే కంటిన్యూ అయిపోయిండి.. మర్చిపోయా, మీ వంటల్లో 'సాధుత్వం' భలే నచ్చింది :)

మీకూ, మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శుభాకాంక్షలు :-)

కౌటిల్య చెప్పారు...

నిషిగంధ గారూ,
వండారా మరి! బాగా కుదిరిందా! ఈ సంవత్సరం నాకు పులగం తినే భాగ్యం లేదు....

నా "సాధుత్వం" నచ్చినందుకు ధన్యవాదాలు..ఏం చేద్దాం, వెజిటేరియన్ ప్రాణం కదా!

సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? ఏమేం స్పెషల్స్ చేశారు..?...

సుజాత వేల్పూరి చెప్పారు...

డియర్ కౌటిల్యా,
నీ సంక్రాంతి కబుర్లు పులగం కంటే కమ్మగా ఉన్నాయి. అరిసెలు చేసే రోజులకు పరిగెత్తించాయి. పాకం పట్టిన అరిసెల పిండిని దొంగిలించే మా సరదా వల్ల అమ్మ జాగ్రత్తగా ఉండి, మొదటి రెండు వాయలూ వెండి పళ్ళెంలో పెట్టి దేవుడి ముందు పెట్టాక మాకు దొంగతనం ఛాన్స్ ఇచ్చేది.

"ఛాన్స్" ఇచ్చాక చేసే దొంగతనం మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా! నీరసం వచ్చేది మాకు.

"రేపటగ్గి" అంటే? భోగిమంట పక్కనే ఉండే సెగ అనా?

మీ టపాలో అచ్చ తెలుగు, పచ్చి తెలుగు మాటలు ఎంచక్కా ఉన్నాయి. మా ఇంట్లో అమ్మ వండే పులగం రెసిపీ కొంచెం డిఫరెంట్ గా ఉండేది..

సరే, త్వరలో బీర పొట్టు పచ్చడి, వంకాయ బజ్జీ పచ్చడి రాయాలి మరి!

కౌటిల్య చెప్పారు...

సుజాత గారూ!
మీరు కూడా మా జట్టే అన్నమాట! అయినా చాన్స్ ఇస్తే మజా ఉండదు కదా!..ః)

చిన్నప్పుడు ఇంట్లో జరిగేవన్నీ గుర్తు తెచ్చుకుంటూ రాశా..అందుకే మంచి తెలుగుపదాలు పడ్డట్టున్నాయి..ః)...నాకనిపిస్తూ ఉంటది..చిన్నప్పుడు పల్లెటూర్లో ఉంటూ తెలుగు మాత్రమే మాట్టాడి, ఇప్పుడెందుకు కష్టపడుతున్నామా అని...

రేపటగ్గి అంటే పొద్దున్నే వచ్చే ఎండ అండీ! నీరెండ అంటాం కదా....మా అమ్మమ్మ గొడవెట్టేసేది..."పిల్లల్ని రేపటగ్గిలో నుంచోబెట్టావు,కళ్ళు తిరుగుతాయ్" అని ..ః)..

వండినవన్నీ తప్పకుండా రాస్తానండీ!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అబ్బ , ఎంత బాగా రాశారండీ!

అజ్ఞాత చెప్పారు...

/మాంఛి దప్పళం కాని/

ఆచార్యా, కౌటిల్యా ..
ఈ ధప్పళంబనగా ఎట్టిది? ఎప్పుడునూ భుజింపలేదు. ధప్పళ ప్రాశస్త్యంబునూ, జేయు విధంబును దయయుంచి వివరింపుడు.

కౌటిల్య చెప్పారు...

snkr గారూ, ధప్పళం కాదండీ "దప్పళం"....ఒక రకమైన కూరగాయల పులుసు....ఈ సారి చేసినప్పుడు వివరంగా రాస్తాను...ః)

Blogger ఆధారితం.