ఆవమజ్జిగ....కాస్తంత రుచ్చూడండొచ్చి....హమ్మయ్య! పాకవేదంలో నా మొదటి వంటకంతో మీ ముందుకొచ్చేస్తున్నానోచ్......ముందు చెప్పినట్టుగా ఇది చాలా సింపులు వంటకమన్నమాట!కూసింత మనసెట్టి చేత్తే, తిన్నోళ్ళు మీకు కాంప్లిమెంట్లమీద కాంప్లిమెంట్లు ఊదరగొట్టేత్తారు..:)

"ఆవమజ్జిగా! ఇదేంటీ? ఆవుమజ్జిగ,గేదెమజ్జిగలా" అనుకుంటున్నారా! చిన్నప్పటినుంచి ఎవరికి చెప్పినా ఇదే కొచ్చను..అయినా తినబోతూ రుచులెందుకండీ అడగడం....నే చెప్పినట్టు ఫాలో ఐపోయి వండి, తిని,రుచ్చూసి చెప్పండి-సొర్గానికి బెత్తెడెత్తునున్నారో లేదో!...నాల్రోజుల కితం ఓ స్నేహితుడింట్లో చేస్తే, అందరూ మొదటి ముద్ద నోట్టో ఏసుకోగానే, అలా రీళ్ళు తిప్పేసుకుని సొర్గం అంచులదాకా ఎళ్ళొచ్చారంటే, దీని కమ్మదనం గురించి ఏరే చెప్పాల్నా!కాని నే చెప్పే స్టెప్పులన్నీ ఇదిగా ఫాలో అవ్వాలన్నమాట!.... అదీ, బుద్ధిమంతుల లచ్చనం....

ఓ పదిహేనేళ్ళ క్రితం అనుకుంటా! నాన్న నన్ను తీసుకుని అయ్యవార్లింటికి వెళ్ళారు...అయ్యవారంటే, బడిపంతులో, గుళ్ళో పూజారిగారో కాదండీ! పేద్ద అగ్రహారీకులు,తమిళబ్రాహ్మలు....వాళ్ళిల్లు పెద్ద రాజులకోటమల్లే ఉంటది.... దాసీలు,హడావుడి...చుట్టుపక్కల నలభై,యాభై ఊళ్ళకి గురువుగారిలాంటి వారన్నమాట!లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రోపాసకులు....రోగమొచ్చినా,ఇబ్బందొచ్చినా, పెళ్ళి ముహుర్తాలకైనా,ఇళ్ళప్లానులకైనా,గుళ్ళు కట్టాలన్నా అందరూ ఆయన దగ్గరకే వెళ్ళేవారు....ఎవరి దగ్గరా కాణీ పుచ్చుకోరు...అందరికీ ఉచిత సహాయమే....ఊళ్ళో ఏ ఆడపిల్ల పెళ్ళైనా వెళ్ళి తాళిబొట్టిచ్చి పెళ్ళి చేయించేవాళ్ళు...వాళ్ళ పొలాలు అందరూ ఊరికే చేసుకునే వాళ్ళు..... మా ఊరికి పది కిలోమీటర్లదూరంలో ఉంటుంది వాళ్ళఊరు...ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రోజుకి కనీసం ఇరవై,ముఫ్ఫైమంది వాళ్ళింట్లో ఉచితంగా భోజనం చేసేవాళ్ళు...అందరికీ చిన్నయ్యవార్ల భార్య చక్కగా మడి కట్టుకుని, కొసరి కొసరి వడ్డించేవాళ్ళు......

నాన్నగారికి,అయ్యవార్లకీ బాగా స్నేహితం...అమ్మగార్లకి కూడా నాన్నగారు బాగా పరిచయం...నాన్న ఎంత వాస్తుపండితుడైనా సలహాకో,డిస్కషనుకో ఆయన దగ్గరకి వెళ్ళేవారు...ఒకరోజు నన్నుకూడా తీసుకెళ్ళారు...బైట వెయిట్ చేస్తూ ఉన్నాం.. మధ్యాన్నమైంది....అమ్మగారొచ్చి బైటున్నందర్నీ భోజనానికి పిలిచారు...ముందు పప్పు,కూర వడ్డించారు....అయ్యాక అమ్మగారు "ఆవమజ్జిగ" వేసుకుంటారా అనడిగారు..నేను "మజ్జిక్కాదు,కొంచెం కూరవెయ్యండి" అన్నా....ఆవిడ నవ్వుతూ ఇది కూడా కూరలాంటిదే అన్నారు...సరే వెయ్యమన్నా....ఆవిడ పెద్ద వెండిలోటాతో తెచ్చి వడ్డించారు.....మొదటి ముద్ద నోట్టో పెట్టుకున్నానో లేదో
కమ్మటి,ఘాటైన రుచి నసాళానికంటి,ముక్కులకెగదన్ని కిందుమీదయ్యాను........ఆ రుచి ఇంతవరకి నే మర్చిపోలేదు...వెంటనే ఎలా చెయ్యాలో నాన్న అమ్మగారినడిగి కనుక్కున్నారు..ఇక నేను,నాన్న ఇంటికొచ్చిన తర్వాత అమ్మని పోరు పెట్టి చేయించాం....కాని ఆ రుచిలో వందోవంతుకూడా వచ్చేదికాదు......ఎందుకా అని ఆలోచిస్తే అమ్మ ఎజ్జాట్టుగా అమ్మగారు చెప్పినట్టు చేసేదికాదు...సొంత తెలివి జోడించేది....సో, మనకి నచ్చేదికాదు....ఇక్కడ మీకు ఆ ఎజ్జాట్టు రెసిపీ చెప్పబోతున్నా అన్నమాట!

హమ్మయ్య! ఇప్పటికి సోది ఆపాడురా బాబూ ఆనుకుంటున్నారా! మరి ఇలాంటి గొప్ప రెసిపీలు నేర్చుకున్నే ముందు వాటి హిస్టరీలు కూడా కూసింత తెలుసుకోవాలి మరి.....ఇక రెసిపీలోకి ఎంటరైపోదాం.....
 • ముందుగా ఏం కావాలి? - మీరు ఎంత తిందామనుకుంటున్నారో అన్ని మజ్జిగ.....ఈ మజ్జిగ ఎలా ఉండాలి? ఎలా ఉంటే మంచిరుచొస్తుంది?- బాగా గట్టిగా తోడుకున్న తియ్యటి గేదే పెరుగైతే మంచి రుచొస్తది....మజ్జిగ అన్చెప్పి మళ్ళా పెరుగంటాడేవిఁట్రా అనుకుంటున్నారా? అల్లాంటి పెరుగునుంచి చేసిన మజ్జిగ ఐతే సూపరన్నమాట!.....మజ్జిగ చిక్కగా ఉండాలి, ఎంత చిక్కగా ఉంటే అంత రుచి......కొంచెం పుల్లగా అయ్యేవరకు ఉంచాలి....అంటే సుమారు మూణ్ణాలుగ్గంటలన్నమాట! పొద్దున్నే వంట చెయ్యాలనుకుంటే, రాత్రిటి పెరుగుని కాస్త తీసి పక్కనపెట్టుకుని పొద్దున్నేలేచి,చిలికేసి ఒక గంటాగాక చేస్తే సరిపోద్ది...మరీ పుల్లగా అయినా రుచి మారిపోద్ది......ఇంకో మాట! వెన్న తియ్యొద్దు,అలానే ఉంచెయ్యండి....కాని పైన తేలకుండా, కరిగిపొయ్యేట్టు చూసుకోవాలి.....
 • తర్వాత కావల్సిన ముఖ్యమైన పదార్థం- ఆవాలు......చక్కగా,నల్లగా గుండులా ఉండేవైతే బాగుంటాయి....రాళ్ళు లేకుండా చూసుకోవాలి...ఒక అరలీటరు మజ్జిగకి, గుప్పెడు ఆవాలు సరిపోతయ్.ఇప్పుడు ఈ పచ్చి ఆవాల్ని మెత్తగా పొడికొట్టాలి....(వేయించొద్దు,అస్సలు) మిక్సీ కన్నా బండమీద గుండ్రాయెట్టి నూరితేనే మంచిది..గుండ్రాయి లేకపోతే బరువైన చిన్నగిన్నెకూడా వాడుకోవచ్చు....రోలైతే మరీ మంచిది.....బరక,బరగ్గా ఉన్న ఆ పొడిని పల్చటి గుడ్డలోక్కాని, టీ నెట్ లోక్కాని ఎత్తుకోవాలి......అందులో నీళ్ళు కొద్ది కొద్ది చుక్కలుగా వేసి ఈ పొడినుంచొచ్చే రసాన్ని,పైన రెడీ గా ఉంచుకున్న మజ్జిగలోకి పిండుకోవాలి(వడకట్టాలన్నమాట)...ఎంత రసం వస్తే అంత రుచి......పిప్పి మజ్జిగలో పడకుండా జాగ్రత్త పడాలి, పడితే తినేప్పుడు చెత్తచెత్తగా అనిపిస్తుంది...(ఈ వడకట్టటం,రసం తియ్యడం ఎందుకులే అనుకుంటే, పొడి బాగా మెత్తగా నూరుకుని, నాలుగు చుక్కలు నీళ్ళు వేసి పేస్టులా చేసి,అప్పుడు మజ్జిగలో కలపాలి....పొడి డవిరెక్టుగా మాత్రం కలపొద్దేం)......
 • తర్వాత చిటికెడు పసుపు కలపాలి....(స్పూనుల లెక్కలు మనకు తెలవదు..చేత్తో తీసుకుని ఉరామరిగ్గా వేసెయ్యటమే...).. ఆనక, మీరు ఎంత తింటారో అంత ఉప్పు,కాసింత ఎండుకారం కలుపుకోవాలి(మసాలా కారాలు,కొబ్బరికారాలు వాడొద్దు)...
 • టమాటా ముక్కలు,ఉల్లిపాయలు లాంటి చెత్త మాత్రం అస్సలు కలపొద్దు...కలిపితే అసలు టేస్టు హుష్ కాకీ!అల్లం కూడా వద్దు, సాధుత్వం పోతుంది. అంతగా వెయ్యాలనుకుంటే డైరెక్టుగా ముక్కలు వెయ్యొద్దు..కాస్తంత రసం తీసి వేసుకోవచ్చు.....పచ్చి మిర్చి మాత్రం మీ ఇష్టం....ఒకటి,రెండు కాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు....
 • ఇలా కావలసినవన్నీ వేసి బాగా కలుపుకోవాలి...
 • ఇప్పుడు తిరగమాతెట్టుకోవాలి. అదేనండీ మీ భాషల్లో తాలింపు,పోపు వగైరా వగైరా.....
 • నా మట్టుక్కు నాకు ఏ కూర రుచైనా తిరగమాత మీదే ఆధారపడుంటది....ఒక్కో కూరకి ఒక్కోరకం తాలింపు....ఇక్కడెలా పెట్టాలి? తొందరెందుకూ, చెప్తా కదా! మొదట్లో నాకైతే తిరగమాత మాడకుండా సూస్కోటమే పేద్ద నల్భీమపాకంలా అన్పించేది మరి!
 • పొయ్యి మీద బాండీ పెట్టెయ్యండి..బాండీ వేడెక్కగానే, దాంటో ఓ గెంటెడు నూనేస్కోవాలి..ఏ నూనె? అది మీ ఇష్టం...నాకు మట్టుక్కూ నాకు, నెయ్యిగాని,వేరుశనగనూనె గాని కావాలి....వాటి దుంపదెగ! అవెట్టి పోపెడితే ఎంత కమ్మగా ఉంటయ్యో కూరలు.....ఇదిగో హెల్తెవేర్నెస్సు పిల్లలూ! నామీదకి దండెత్తెయ్యకండేం!.... నూనె కొంచెం కాగిందనంగానే కాసిన్ని ఆవాలూ, మరి కాసింత జీలకఱ్రా ఎయ్యాలి..అవి చిటపటలాడగానే కాసిన్ని ఎండు మిరగాయలు(తుంచి వెయ్యాలి),మాంఛి నవ నవలాడే కరేపాకు గుప్పెడు వేసెయ్యండి...అసలు ఆవమజ్జిక్కి రుచల్లా ఈ రెండే....మధ్యలో పొయ్యి వత్తి తగ్గించి పెట్టుకోండి, లేకపోతే తిరగమాత మాడిపోద్ది....మినప్పప్పూ,పచ్చనగపప్పూ వెయ్యాల్సిన పన్లేదు...వేసినా ఇబ్బందిలేదు...ఇవి వేగేలోపే, ఒక వెల్లుల్లిరెబ్బ గరిటతోగాని, పప్పుగుత్తితోగాని నొక్కి వెయ్యండి..ఆ చేత్తోటే కాసింత ఇంగువ.....అన్నీ మోయనంగా వేగాక బాండీ దించెయ్యండి...
 • ఇప్పుడు ఈ తిరగమాతని, ముందు అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్న మజ్జిగలోకి వేసి తిప్పెయ్యండి...అంతే ఘుమఘుమలాడే "ఆవమజ్జిగ" రెడీ...పైన అలంకరణకి కావాలంటే కూసిన్ని కొతిమీరాకులు జల్లుకోవచ్చు....
 • ఇక దీన్ని వేడివేడి సన్నన్నంలో గాని, జొన్న సంకటిలోగాని కలుపుకు తింటే ఉంటది...ఆహా! సొర్గానికి నిజంగా బెత్తెడెత్తునే....అదేదో ఇంగిలీసులో అంటారే ఫింగర్‍లికింగ్ అని, అలా ఎవరూ చూడకుండా వేళ్ళు కూడా నాకేస్కోవాలని తెగ అనిపించేత్తది మరి.....ఇంకోమాట చెప్పటం మర్చిపొయ్యా. ఎండు మిరగాయలు,కరేపాకు ఏరెయ్యకండేం....నూనెలో వేగి,తర్వాత మజ్జిగలో నానిన వాటి రుచే వేరు.....
 • ఇందులో ఆరోగ్యం,క్యాలరీలు,తొక్కు,తోలుగుడ్డూ అని ఏం ఆలోచించకుండా చక్కగా రుచిని ఆస్వాదించండేం.... చేసేప్పుడు ఏమన్నా డవుట్లొస్తే ఎంటనే కామెంటెట్టెయ్యండి.....
 • మళ్ళా ఓ మాంఛి వంటకంతో కలుసుకుందాం....ఉంటానేం....

25 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుంది బాగా రాశారు :-) వండర్ ఫుల్.. మరిన్ని మంచి ఆంధ్రావంటకాల కోసం ఎదురు చూస్తున్నాను :-)

raamudu చెప్పారు...

మీరు వండెరో లేదో తెలియదు కాని, వర్ణన అద్భుతం. వంట మాట దేవుడెరుగు ఇలా వ్రాసి మమ్మలని ఊరించండి

కౌటిల్య చెప్పారు...

వేణూ గారూ! బోల్డన్ని మంగిడీలు..ః)....నే రాస్తూ ఉంటా, మీరు చేసుకుతిని ఎంజాయ్ చెయ్యండి...ః)

రాముడు గారు! నిజ్జంగా నేనే వండానండీ! పుటో పెట్టా కదా! అయినా నమ్మకం కలగట్లేదా! ఐతే ఈ పాల్నించి వీడియో కూడా పెడతా!..ః).....ఊరికే నోరూరుకుంటూ కూచోటమెందుకండీ! వండి, టేస్టుని ఎంజాయ్ చెయ్యండి...ః)

జ్యోతి చెప్పారు...

చెప్పిన విధానంతోనే నోరూరిపోతుంది. ఈ మజ్జిగపులుసుకు మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే ఆ రుచే వేరు. అందుకే ఎప్పుడైనా పెరుగు పుల్లగా ఉందంటే చాలు దాన్ని మజ్జిగపులుసు చేసి కాసిన్ని సెనగపిండి బజ్జీలు వేసి కలిపేస్తే సరి. గిన్నె ఖాళీ. ఈసారి బజ్జీలు వేసి చూడండి.

sunita చెప్పారు...

meeru cheppina vidhaanam maatram sooparu!idi naakentoe ishTamaina vanTakam. kaakunTae perugutoe chaestaa ullipaayalaesi maree.

కౌటిల్య చెప్పారు...

జ్యోతి గారూ! బాబోయ్ మీ కామెంటుతో నా బ్లాగుకి మహారాజ పత్రం లభించినట్లే! మంగిడీలు...ః).....మజ్జిగ చారులో బజ్జీలా!ఈ సారి ట్రై చేస్తా...


సునీత గారూ! తేంక్యూలు...ః)...ఈ సారి ఉల్లిపాయలు లేకుండా చేసి చూడండి...బాగా సాధువుగా అదిరిపోద్ది...

అజ్ఞాత చెప్పారు...

చదువుతుంటేనే నోరూరింది. మాకు మెంతి మజ్జిగ, మజ్జిగ పులుసు తెలుసు కానీ, ఆవ మజ్జిగ ఇంతవరకూ తెలియదు. మీ బ్లాగు పోస్టు ఇంట్లోవాళ్ళకి చూపించాలి.

పాకవేదం - దుష్టసమాసం అయితే కాదు కదా.. :-) అవునండీ, పాకవేదానికీ పాకశాసనుడికీ సంబంధం ఎలా తీసుకొచ్చారు!! మీకో టాగ్ లైన్ సజెషన్. Ratatouille లో Anyone can cook - దీన్ని తెలుగు చేస్తే ఎలా ఉంటుంది?

ఆ.సౌమ్య చెప్పారు...

ఓహ్ బావుంది, మరో వంటల బ్లాగు. మేము మజ్జిగ పులుసు చేసుకుంటాంగానీ ఈ ఆవమజ్జిగ తెలీదు....హ్మ్ అయితే ఓ పట్టు పట్టాల్సిందే...వండి, రుచి చూసాక మళ్ళొచ్చి కామెంటుతా.

నేస్తం చెప్పారు...

బావుంది..బావుంది :)

కౌటిల్య చెప్పారు...

మురళి గారూ! నిజ్జంగా నోరూరుతోందా! ఐతే అర్జెంటుగా అమ్మగారితో వండించేసి, తినేసి ఎలా ఉందో చెప్పండి..ః)....హ్మ్! దుష్టసమాసం అంటారా!శ్రీరమణగారు వాడారు కదా! అందుకే నేను కూడా వాడేశానన్నమాట! అయినా నాకు సూపరుగా నచ్చిందండీ ఈ మాట!పైగా పరిచయం పోస్టులో ఇవరంగా రాశా చూడండి!....ఇకపోతే "పాకశాసనుడి"కి అర్థం వేరైనా,మన దేవుళ్ళలో నాకు ఎవరూ వంటల దేముళ్ళు కనపడలా! పైగా పేరు బాగా అతికింది..అందుకే వాడేశానన్నమాట:)..!కాని చిన్నప్పుడు ఎవరో చెప్తే విన్నా,వంటలకి ఇంద్రుడే అధిపతి అని.....మీరు రుచుల మధ్యలో ఇలాంటి సాహిత్యం పాయింట్లు తీసుకురాకూడదన్నమాట!..ః))...పోతే, మీ ట్యాగ్‍లైను సజెషను సూపరు..అదేదో మీరే తెనిగించి పెట్టకూడదూ..ః)

కౌటిల్య చెప్పారు...

ఆ.సౌమ్య గారూ,
మీ ఫీడ్‍బ్యాక్ కామెంటుకోసం ఎదురు చూస్తుంటా..ః)

నేస్తం గారు,
ఏంటి బాగుంది? నేను చెప్పిన విధానమా లేకపోతే ఆల్రెడీ వండేసి టేస్టు బాగుందని చెప్తున్నారా..ః)

రాణి చెప్పారు...

అర లీటరు మజ్జిగకి, గుప్పెడు ఆవాలు అంటేనే ఎందుకో అనుమానంగా ఉంది. అయినా సరే ప్రయత్నించి చూస్తాను. ఏమన్నా తేడా వచ్చిందొ మీదే పూచీ :P

అజ్ఞాత చెప్పారు...

:-) కౌటిల్య. పాకవేదంలో పాకం సంస్కృతమైతే దుష్టసమాసం కాదు. కానీ తెలుగు 'పాక' అయితే దుష్టసమాసమే... సరదాకి అలా అన్నా.
టాగ్ లైన్ - 'కారెవరూ వంటకనర్హం' అంటే ఎలా ఉంటుంది?

మాలా కుమార్ చెప్పారు...

నాకు ఇలా మగ్గిగ తో చేసేవి చాలా ఇష్టమండి . నేను ఆవాలు మెత్తగా నూరి , నీళ్ళలో కలిపి వేస్తాను . పోపు మీరు చెప్పినట్లే వేస్తాను . కాని వెల్లుల్లి వేయకుండా చేస్తానండి . మరి ఆరుచి రాదంటారా ?
బాగుందండి మీ పాక వేదం .

కౌటిల్య చెప్పారు...

నాగమురళి గారూ,
సంస్కృతమే అనుకుందాం...ః)..మీ ట్యాగ్‍లైన్ సూపరు..కాని ఈ టెంప్లెట్ ట్యాగ్‍లైన్ సపోర్ట్ చెయ్యట్లా..ః(..

మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలండీ...పొడి కలిపితే అంత రుచి రాదండీ...వెల్లుల్లిపాయ మీ ఇష్టం...ఒకసారి వేసి, ఒకసారి లేకుండా చెయ్యండి...ఏది బావుంటే దానికి ఫిక్స్ అయిపోండి..ః)

రాణిగారూ! పూచీనాది, మీరు వేసెయ్యండి...ఇక్కడ పుటో పెట్టింది,అరలీటరే! గుప్పెడు ఆవాల రసం వేశా,అయినా నాకు ఘాటు సరిపోలేదు...పొడి కలిపేట్టైతే కొంచెం తక్కువే వేసుకోవచ్చు...

పరిమళం చెప్పారు...

కౌటిల్య గారూ ! థాంక్సండీ...మీరు చెప్పినట్టు తు.చ (అంటే ఏంటని అడక్కండి నాకూతెలీదు) తప్పకుండా చేశాను.మా వాళ్ళందరూ చదివి చేసే వంటలంటే భయపడుతూ ఉంటారు కానీ ఈసారి నాకన్నీ శభాష్ లే !చాలా బావుందండీ .

కౌటిల్య చెప్పారు...

పరిమళం గారూ! చాలా ఆనందంగా ఉందండీ, మీరు అలానే వండి, మీ వాళ్ళచేత శెభాషులు చెప్పించుకున్నందుకు....ఆ శభాషుల్లో నాక్కూడా ఏమన్నా ఉన్నాయా!..ః)

మధురవాణి చెప్పారు...

కౌటిల్య గారూ,
మీ పోస్టు చూడగానే అర్జెంటుగా ఆవమజ్జిగ చేసానండీ! ఫ్రెష్ కరివేపాకు లేకపోయినా.. (మాకు ఇక్కడ దొరకదు :() ఉన్న ఎండు కరివేపాకే వేసి చేశాను. అయినా బానే వచ్చింది. రుచి చాలా చాలా బాగుంది. నాకు తెగ నచ్చేసింది. తక్కువ టైం ఉన్నప్పుడు చకచకా చేసుకోగలిగిన వంట చెప్పారు. థాంక్యూ సో మచ్! ఆవ మజ్జిగ చేసుకున్నప్పుడల్లా మీకు థాంక్స్ చెప్పుకుంటాను. :) ఇలాంటి రుచికరమైన వంటకాలు మరిన్ని మాకు పరిచయం చేస్తారని ఆశిస్తూ..

కౌటిల్య చెప్పారు...

మధురవాణి గారూ,
మరి కరివేపాకు వేశారు సరే,తిన్నారా.....ః)

ధన్యవాదాలండీ...

నిజ్జంగానే చేసిన ప్రతిసారీ తేంక్యూలు చెప్పాలి మరి...ః)

మరీ తరచుగా చెయ్యకండి..బోర్ కొట్టిందంటే మళ్ళా ఆ రుచిని సరిగ్గా ఆస్వాదించలేరు..ః)

Sravya V చెప్పారు...

బావుంది కాని నాకు చిన్న డౌట్ సాధారణం గా వెల్లుల్లి వేస్తే , ఇంగువ వేయరు అలాగే ఇంగువ వేస్తే వెల్లుల్లి వెయ్యరు కదా ? ఇక్కడ రోండూ వాడొచ్చా ?

బాలు చెప్పారు...

కౌటిల్యగారూ ఎలా మిస్సయిపోయానీ పోస్టుని!
ఐ లైక్ ఆవ పెట్టిన వంటాస్. ఆవపెట్టిన పనసపొట్టుకూర, ఆ.పె.అరటికాయకూర...
ఎనీథింగ్ దట్ హాజ్ ఆవ... ఐలైక్ దట్ మచ్చోమచ్చ్.

కౌటిల్య చెప్పారు...

శ్రావ్యగారూ! మీరేదో కొత్త కాన్సెప్టు చెప్తున్నారు..నాకది తెలియదండీ..మా ఇళ్ళల్లో శుభ్రంగా రెండూ వాడతారు...ః)..ఇక్కడ కూడా ఏం ఢోకాలేకుండా వాడుకోవచ్చు మీరు..ః)

బాలు గారూ!
నాక్కూడా యమా ఇష్టమండీ ఆవ పెట్టిన వంటలంటే..కాని మా అమ్మగారు "ఆవ" అంటేనే గయ్ఁమంటారు...వేడి చేస్తదని...ః)

అజ్ఞాత చెప్పారు...

hello sir garu "కౌటిల్య అన్నారు...
వేణూ గారూ! బోల్డన్ని మంగిడీలు..ః)....నే రాస్తూ ఉంటా,
మీరు చేసుకుతిని ఎంజాయ్ చెయ్యండి...ః)
రాముడు గారు! నిజ్జంగా నేనే వండానండీ! పుటో పెట్టా కదా! అయినా
నమ్మకం కలగట్లేదా! ఐతే ఈ పాల్నించి వీడియో కూడా పెడతా!..ః).....ఊరికే
నోరూరుకుంటూ కూచోటమెందుకండీ! వండి, టేస్టుని ఎంజాయ్
చెయ్యండి...ః)
2 జనవరి 2011 1:07 PM" video lu petthunnara andhuke na busy ga vunnaru?? yeppudu petthunatu? leka pettesara? ekkada??

mi blog abhimani ^_^

sujatha చెప్పారు...

మేము ఆవ పెరుగు పచ్చడి చేస్తాము, ఒకఎండు మిరపకాయ అరచెంచా ఆవాలు ఒక చెంచా నీళ్ళ తో నూరి పెరుగు లో కలిపి , ఉప్పు,పసుపు వేసి, ఇంగువ ,మినప్పప్పు,జీలకర్ర,ఆవాలు,కరివేపాకు,నేతిలో వేయించి తిరగమోత పెడతాము. ఈ ఆవ మజ్జిగ చేయాలి అలాగే ఉంటుందేమో

padmaja చెప్పారు...

అయ్యా,
తమిళ బ్రాహ్మల దగ్గర నేర్చుకున్న వంటకం అంటున్నారు, ఇంగువ వేసిన దాంట్లో వెల్లుల్లి వేస్తారా?

Blogger ఆధారితం.