చింతకాయపచ్చడీ - నేతరిసెలూ



ఆగండాగండీ! టైటిలు చూసి ఖంగారుపడకండి... నేతరిసెలు ఎల్లా చెయ్యాలో ఇక్కడ చెప్పబోటంలేదు లెండి! మరి రెండూ ఎందుకు రాశానంటారా టైటిల్లో? ఎందుకో టపా మధ్యలోనో, చివర్లోనో కబుర్ల మధ్యలో నాకు గుర్తొచ్చినపుడు చెప్తానులెండి. మరి అలాంటప్పుడు ఇలా టైటిల్లో పెట్టటమెందుకూ, బడాయి కాకపోతే అంటారా- అవును మరి! ఆ మాత్రం బడాయి లేకపోతే ఎల్లాగుమరి! ఎంత లౌక్యం తెలీకపోయినా మాకూ కాసిని మార్కెటింగు టిప్పులు తెలుసులెండి! అందుకని ఇల్లా ఫాలో అయిపోయా. అబ్బబ్బ! శెబాసని నాకు నేనే జబ్బచరిచేసుకోవాలనిపిస్తోంది. సర్లే! ఇంక సోదాపి మ్యాటర్లోకి ఎంటరైపోతా.

ఈ మధ్యన కాస్త పనివత్తిడీ, చదువూ- "మునగానాం, తేలానాం"గా ఉంది మన పరిస్థితి. అందుకని పొయ్యి వెలిగించిందిలేదు అసలు, మెస్సుల్లో పడి తినటమే. అలా అయితే మన పాకవేదం అభిమానులు బెంగెట్టుకోరూ అనిపించింది. అందుకని ఇక నెలకొక రకమైనా మనవాళ్ళందరికీ రుచ్చూపించాలని డిసైడయ్యా. అదన్నమాట సంగతి. కాస్త ఫ్రీ అయ్యాక ఎడపెడా రాసి వడ్డిస్తాలెండి....:)

ఇక మన ఇవ్వాళ్టి ఐటంలోకి వచ్చేద్దాం. దీన్ని రోటి పచ్చళ్ళ సెక్షన్లో వేసుకుంటారో, ఊరపచ్చళ్ళ సెక్షన్లో వేసుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే, ఇది రెండూ కాబట్టి..:)

"చింతకాయ" - అసలు ఈ పేరు చెవినపడగానే నోట్లో నీళ్ళూరని నరమానవుడుండడేమో! నాకైతే ఉత్తి నీళ్ళూరడం కాదు, ఏకంగా పళ్ళు తెగ పులిసిపోతాయి..:). పుల్ల చింతకాయకి ఉప్పూకారం అద్దుకుని, అందరికీ నోళ్ళల్లో నీళ్ళూరేట్టు ఊరిస్తూ తినటం- అదో తుత్తి. అదేం మహత్యమో గాని దాని పేర్లోనేకాదు, చెట్టు-చెట్టు మొత్తం పులుపే! మన తెలుగునాట ప్రతి ఊళ్ళో దాదాపు పెద్ద పెద్ద చింతతోపులుండేవి. అవి ఊరిమొత్తం ప్రజలకి కామన్ ఆస్తి. ఆ చెట్లన కాసే పూత,చిగురు, కసరు పిందె దగ్గర్నుంచి గుల్లగా పండిన మాంఛి చింతకాయ వరకూ ప్రతిదీ అందరికీ ఉమ్మడి ఆస్తి. ఎవరిక్కావల్సింది వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. కూరకి వెతుక్కోవల్సిన అగత్యం ఎవరికీ ఉండేదికాదు. పప్పులోకో, పచ్చడిగానో, పెరుగుపోపులోకో మేమున్నాం అని అభయహస్తం ఇచ్చేవి. ఆ తోపులు పిల్లలకి ఆటవిడుపు స్థలాలు, పెద్దలకి విశ్రాంతి తీసుకోను చల్లటినీడనిచ్చే చోటులు.
జనం డబ్బు రుచి మఱిగి, కనపడ్డ ప్రతి నేలనీ, తోటనీ, తోపునీ మాగాణులు చేశారు అప్పట్లో. ఇప్పుడు వాటినే మళ్ళా వెంచర్లని పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారనుకోండి! అలా నాకు తెలిసినంతవరకు, మాగాణి జనాలు చాలామందికి అందునా నది ఒడ్డున్నే ఉన్నవాళ్ళకి చింతతోపులూ, వాటి చల్లటినీడా, అవిచ్చే పుల్లపుల్లని రుచులూ అంత ఎఱుకై ఉండకపోవచ్చు. ఆ విషయానికి నేను అదృష్టవంతుణ్ణేనేమో, మాగాణి దేశంలో పుట్టనందుకు. అప్పుడోసారి మార్కెట్టుకెడితే చింతచిగురు కనిపించింది. ఎంత ఖర్మ పట్టిందిరా దేవుడా, చింతచిగురు కూడా కొనుక్కోవాల్సొస్తోంది అనిపించింది. నోరూరుకోక రేటెంతో అడిగా...వాడు చెప్పిన రేటుకి నాకు గుండెలు నిజంగానే పగిలిపోయాయసలు, వందగ్రాములు ఇరవై రూపాయలట! కలికాలమంటే ఇదికదా అనిపించింది. హ్మ్! వెంటనే మా కాలేజికెళ్ళి చక్కా ఒక చెట్టుని గెడపెట్టి నాలుగు దులుపులు దులిపి గుప్పెడు తెచ్చుకుని పప్పులో, పెరుగు పచ్చట్లో వేసుకున్నా.


ఇక "చింతకాయ పచ్చడి"- ఈ పేరు వింటేనే ఒక ఆత్మీయమైన భావన కలిగిద్ది నాకు. ఇప్పటికీ మా వేపు బీదవాడి దగ్గర్నుంచి కోటీశ్వరుడి వరకూ తేడా లేకుండా తినే కూర ఇది. అప్పట్లో పాలేర్లు, పనివాళ్ళూ ఆసాములింట్లో కాస్తంత ముడిచింతకాయపచ్చడి ముద్ద పెట్టించుకొనెళ్ళి, రెండు ఎండుమిరగాయలేసి రోట్లో నూరుకుని వేడి సంకట్లో వేసుకుతినేవాళ్ళు. అన్ని ఊరగాయల్లా కారంలో,నూనెలో ఊరదుకాబట్టి రోజూ తిన్నా ఆరోగ్యానికి ఏం చెరుపు చేసేదికాదు, వాటిలా ఖర్చూ ఉండదు. తోపులో చింతకాయలూ, రెండురూపాయలు ఉప్పూ అంతే! పైగా ఒకసారి నూరి పెట్టుకుంటే పదిరోజుల వరకూ పాడవ్వదాయె, అందువల్ల పొలంపనులు చేసుకొచ్చి అలిసిపోయి ఏ కూర వండుకోవాలా అన్న జంజాటం ఉండేదికూడా కాదు. కూరాకు పండని రోజుల్లో ఎంత ఆపుగా ఉండేదో! అందుకే మావేపు చింతకాయపచ్చడి కుండనీ, పున్నీళ్ళ కుండనీ "మాలచ్చిమి" అని బొట్లెట్టి పూజ చేస్తారు. ఎంత కరువొచ్చినా ప్రాణాలు నిలబెట్టేవి ఆ రెండేనంట! అందుకే పొద్దున్నే మా అమ్మమ్మ ఆ కుండకి దండం పెట్టుకోకుండా మొదలెట్టేదికాదు పని. మాకు గృహప్రవేశాలప్పుడు లోపలికి తీసుకువెళ్ళే అన్ని వస్తువులలో ముడిచింతకాయపచ్చడి ముఖ్యమైన వస్తువు. ఇక బంతిభోజనాలకి తప్పనిసరి ఐటెం, రకాలకోసం వెతుక్కోవాల్సిన పనుండదు. పూర్వమేమో తెలీదుగాని, ఇప్పుడు కొన్నిప్రాంతాల్లో చాలామంది చింతకాయపచ్చడి అంటే మిగతా అన్ని ఊరగాయల్లా నూనె, ఎండుకారం పోసి పెట్టుకోటం మొదలెట్టారు. అదే అసలురకం అనుకుంటారు, అసలు చింతకాయపచ్చడిని మర్చేపోయారు.

అమ్మ ఎప్పుడన్నా "కూర ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు" అంటే, నాన్న "ఉంది గదటోయ్, ఆపద్భాందవి, అనాథరక్షకి చింతకాయపచ్చడి. నాలుగు దోసిత్తనాలు, కాసిన్ని ఎండు మిరపకాయలూ, రెండు వెల్లుల్లి రెబ్బలూ వేసి తొక్కి చిన్న గెంటెడు నూనె, చిటికెడు ఇంగువా వేసి చెయ్. కుంపట్లో పప్పు పడెయ్. పచ్చడి నూరేలోపు ఉడికిపోతుంది. కాసింత మెఱుగు బొట్టేసుకుని రెండూ విడివిడిగా నాలుగుముద్దలూ, కలిపి నాలుగుముద్దలూ తింటే పోయే! ఆత్మారాముడు బహుభేషుగ్గా శాంతిస్తాడు" అనేవాళ్ళు.

ఇక ఈ చింతకాయపచ్చడి పాతపడే కొద్దీ రుచి పెరుగుతుంటుంది. పాత చింతకాయపచ్చడి అనగానే నాకు భానుమతమ్మ డవిలాగులు గుర్తొస్తాయి. విచిత్రవివాహంలో అనుకుంటా. కూతురు, భానుమతమ్మ తెచ్చిన సంబంధం వద్దు అని ఇలా అంటుంది, "అమ్మా! పెద్దవాళ్ళు తెచ్చే పాతచింతకాయ పచ్చడి సంబంధాలు నాకఖ్ఖర్లేదు"అని. అప్పుడు భానుమతమ్మ తనదైన వెటకారం ధ్వనించే గొంతుతో,"పాత చింతకాయపచ్చడి పథ్యానికి మంచిది, వంఠికి ఆరోగ్యం. కొత్తచింతకాయ పచ్చడి జలుబు చేస్తుంది"అనంటుంది. అదన్నమాట సంగతి. ఇప్పుడు మనం ఆ కొత్త చింతకాయపచ్చడి ఎలా పెట్టుకోవాలో, దాన్ని పాతచింతకాయ పచ్చడిగా ఎలా మార్చుకోవాలో, కమ్మగా ఎలా తినాలో చెప్పుకుందాం ఇవ్వాళ...

ముందు ముడి చింతకాయపచ్చడి (దీన్నే కొన్ని ప్రాంతాల్లో చింతాకాయ తొక్కు అంటారట!) ఎలా పెట్టుకోవాలో చెప్పుకుని దాన్ని తర్వాత రకరకాలుగా, రుచులు రుచులుగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పుకుందాం.

  • దీనికి కావల్సిన మొట్టమొదటి రిక్వైర్మెంటు మాంఛిరోలు..:)... పెద్ద కుందిరోలైతే బాగా అనువుగా ఉంటుంది. రోట్లో కాకుండా ఎలా చేస్తారో నాకైతే తెలీదు. పూర్వం చింతకాయపచ్చడి సీజన్లో బజారురోళ్ళసలు ఖాళీనే ఉండేవికావట! రోజూ ఎవరో ఒకళ్ళ పచ్చడి నలుగుతూనే ఉండేదట!
  • తర్వాత బాగా ముదిరిన చింతకాయలు(గీకిచూస్తే పచ్చదనం ఉండాలి, విరిచి చూస్తే పూర్తిగా విత్తనం పట్టి ఉండకూడదు) బాగా కండపట్టి ఉన్నవి, పులుపు ఉన్నవి తెచ్చుకోవాలి. నలుగురున్న ఇంట్లో, బాగా విరివిగా వాడుకునేవాళ్ళైతే రెండు కేజీలు సరిపోతుంది సంవత్సరానికి. బాగా ముదిరిన కాయలు పండగెళ్ళాకే వస్తాయి సాధారణంగా.
  • ఇక ఆ చింతకాయల్ని కడిగి, ఆరబోసి, బాగా ఆరాక తొడాలు కోసేసి, ఓపికుంటే సగానికి కోసుకోవాలి. ఇంకా ఓపికుంటే ఇంకా ముక్కలుగా కోసుకున్నా పర్లేదు. కాని, ఎటూ తొక్కేవే కాబట్టి అంత చిన్నముక్కలుగా కొయ్యాల్సిన పన్లేదు. తొడాలు కోసేప్పుడు పట్టుకుని లాగితే కొంత పీచు వచ్చేసిద్ది.
  • ఇక ఈ కాయల్ని రోట్లో వేసి, ఉప్పు, పసుపు వేసి ముక్క బాగా నలిగేవరకు తొక్కడమే. రెండు రోకళ్ళపోటు వెయ్యగలిగితే త్వరగా మెదుగుతుంది. ఉప్పు కొలత, కట్టుకాయలకి సోలాగిద్ద. కట్టంటే కాస్త అటూ ఇటూగా రెండుకేజీల తూకం. అంటే కేజీ కాయలకి అరసోల(షుమారు రెండొందలగ్రాములు). కళ్ళుప్పే బాగుంటుంది. పసుపు చిటికెడు చాలు.
  • ఇలా కచ్చాపచ్చాగా తొక్కిన పచ్చడిని జాడీలోకి తీసుకుని పదిహేను రోజులు ఊరనివ్వాలి. చింతకాయల్లో ఉండే నీరు, ఉప్పు కలిసి బాగా ఊరతాయి.
  • పదిహేను రోజుల తర్వాత ఈ ఊరిన పచ్చడిని తీసి మళ్ళా రోట్లోవేసి మెత్తగా అయ్యేవరకు తొక్కాలి. రెండు స్పూన్లు మెంతిపిండి, చిటికెడు పసుపు వెయ్యాలి తొక్కేప్పుడు. దీన్ని తిరగతొక్కడం అంటాం. ఇలా రెండుసార్లు తొక్కటం ఎందుకంటే, కచ్చాపచ్చాగా తొక్కిన పచ్చడి ఉప్పులో ఊరి ఈసారి తేలిగ్గా మెదుగుతుంది. మొదటిసారి మెత్తగా తొక్కటానికి అవ్వదు.
  • తిరగతొక్కేప్పుడు చింతకాయల్లో పీచు చూసి వేరేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువ వెయ్యకూడదు, చేదొస్తుంది. రంగురావడానికి సరిపడా వేసుకుంటే చాలు.
  • ఇక ఇలా మెత్తగా తొక్కుకున్న ముడి చింతకాయపచ్చడిని జాడీలో ఎత్తి పెట్టుకోవాలి. జాడీలోకి తీసుకునేముందు అడుగున, మొత్తం పెట్టాక పైన నాలుగు స్పూన్లు మంచి వంటాముదం వెయ్యాలి. ఆముదం పచ్చడి నల్లబడకుండా చేస్తుంది. కొంతమంది తిరగతొక్కేప్పుడే పచ్చట్లో రెండుగెంటెలు ఆముదంపోసి తొక్కుతారు.
  • ఇది ఒక నెల అయ్యాక అవసరమైనప్పుడు కొంచెంకొంచెం తీసుకుని తినాలి. కొత్తల్లో అంతమంచిదికాదు.
  • కొన్ని రోజులు బైట ఉంచినా ఏంకాదు. గట్టిగా అయిపోయినా కాస్తనీళ్ళబొట్టు వేసుకుని నూరుకుంటే సరిపోతుంది.
  • ఇలా పెట్టుకున్న ముడిపచ్చడి రెండేళ్ళైనా అలానే ఉంటుంది.

హమ్మయ్య! మొదటి భాగం పూర్తయ్యింది. ఇక అసలు భాగం. ఈ ముడిచింతకాయ పచ్చడిని రుచులురుచులుగా ఎలా తయారు చేసుకోవాలి,ఇంకా వేటివేటిల్లో వాడుకోవచ్చు అనేది. ఈ ముడి చింతకాయపచ్చడిని చింతపండు బదులుగా అన్ని రోటిపచ్చళ్ళల్లో వాడుకోవచ్చు. టమాటాపచ్చడి, దొండకాయ, కొబ్బరిపచ్చడి, దోసకాయ పచ్చిముక్కలపచ్చడి......ఇలా అన్నిట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ముడి చింతకాయపచ్చడితో పులిహోర కలిపితే అద్భుతంగా ఉంటుంది, ఏ పులిహోరా దీనికి సాటిరాదు. చెయ్యటం రెండు నిమిషాల పని.

ఈ ముడిపచ్చడిని తినాలకున్నప్పుడు నాలుగైదు రకాలుగా(వాటిలో వేసే పదార్థాలను మార్చి) చేసుకుంటారు. ఒక్కోదానిది ఒక్కోరుచి, ఏదీ తక్కువకాదు. నేను ఎక్కువగా చేసుకునే రకం ఇక్కడ వివరంగా చెప్తా. మిగతావి చివర్లో క్లుప్తంగా చెప్తా.
  • మొదట చారెడు వేరుశనగపప్పు వేయించి పొట్టుతీసి పెట్టుకోవాలి. తర్వాత రెండు స్పూన్లు దోసిత్తనాలు, కాసిన్ని ధనియాలు, నాలుగు మెంతులూ వేయించాలి. దోసిత్తనాలు చిటపటలాడే వరకు వేయిస్తే చాలు.
  • గుప్పెడు ఎండు మిరపకాయలు(తినాలనుకున్న కారాన్నిబట్టి) తీసుకుని చెంచాడు నూనెవేసి, దోరగా ఘాటు వచ్చేవరకు వేయించాలి. మరీ నల్లగా అయ్యేవరకు అవసరంలేదు. కొంతమంది అసలు వేయించకుండానే వాడేసుకుంటారు.
  • ఇక పైన తయారుచేసుకు పెట్టుకున్న దినుసులన్నీ రోట్లోకి మార్చుకుని మెత్తగా దంచాలి. అప్పుడు కావలసినంత ముడి పచ్చడిని తీసుకుని ఆ దంచినపొడిలో వేసి బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు తొక్కడమే. తొక్కేప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలూ, చిటికెడు జీలకఱ్ఱా వేస్తే సరి! నూరేప్పుడు మెదగటానికి కాసిని నీళ్ళు వేసుకోవచ్చు.
  • ఉప్పు ముడిపచ్చడిలోనే ఉంటుంది కాబట్టి అవసరంలేదు.
  • ఇలా నూరిన పచ్చడి తీసుకుని మంచి పప్పునూనెతో తిరగమాత పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపు పెట్టకపోయినా పర్లేదు, అదోరుచి..:)
  • ఇలా నూరిన చింతకాయపచ్చడి పదిహేను రోజులైనా పాడవదు.

ఇక వేరే రకాల్లో ముఖ్యమైంది, పచ్చిమిరపకాయలతో చేసుకునేది. అందులో వేరుశనగపప్పు, దోసిత్తనాలు పన్లేదు. మిగతావన్నీ వేసుకోవాలి. అయితే అన్నీ(పచ్చిమిరపకాయలూ, ధనియాలు, మెంతులూ) నూనెలో వాడ్చి ముడిపచ్చడితో కలిపి తొక్కుకోవాలి. చివర్లో వెల్లుల్లీ, జీలకఱ్ఱా కామన్. వీటితోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వాడ్చి వేసి తొక్కితే అదో డిఫరెంటు రుచి. ఉల్లిపాయలు పూర్తిగా మెదగకుండా పంటికి తగులుతుంటే బాగుంటుంది. ఎటూ అన్నీ నూనెలోవాడుస్తాం కాబట్టి, తాలింపు పన్లేదు. వేసుకున్నా బానే ఉంటుంది. అయితే ఇలా నూరిన పచ్చడి ఎక్కువరోజులు నిలవుండదు.

పచ్చిమిరపకాయలు వాడ్చకుండా కూడా చేసుకుంటారు కొంతమంది. నాకు అది అంతగా నచ్చదు. ఎండు మిరపకాయలు వేసి చేసుకునేప్పుడు వట్టి వేరుశనగపప్పు గాని, వట్టి దోసిత్తనాలుగాని(రెండవది లేకుండా) వేసి చేసుకున్నా బాగుంటుంది. వేసుకోవాలనిపించినవాళ్ళు, తొక్కేప్పుడు ఏ రకంలో అయినా పచ్చికొబ్బరిగాని, ఎండుకొబ్బరిగాని వేసుకోవచ్చు ,మంచి రుచొస్తుంది. కొత్తిమీర , పచ్చిమిరపకాయలు వేసి చేసుకునే దాంట్లో వేస్తే బాగుంటుంది....అబ్బో ఇలా బోలెడు రకాలు.... :)..

ఇక ఈ పచ్చడి అసలు రుచి ఆస్వాదించాలంటే అప్పుడే పొయ్యిమీద నుంచి తీసి, పొగలు కక్కుతున్న అన్నంలో కమ్మటి నెయ్యి పోసుకుని తింటుంటే ఉంటుందీ...అబ్బబ్బ! స్వర్గానికో, వైకుంఠానికో బెత్తెడెత్తున కాదు, నిఝంగా ఆపైన ఏదన్నా ఉంటే అదే!జ్వరపడి లేచి, పథ్యం చేసి చవిచెడిఉన్న నోర్లకి ఈ పచ్చడి ఇచ్చేటంత హాయి ఇంకేదీ ఇవ్వలేదు.

ఇక మారు ముద్దలోకి ముద్దపప్పులో నెయ్యివేసుకు కలుపుకుతింటే ఆహాహా! చెప్పడానికి వెయ్యినోళ్ళున్న సామికి కూడా వల్లకాదు. అందునా తిన్న తర్వాత వచ్చిన గుజ్జు కంచం అంచుకు తీసి, అలా వేలిమీది వేసుకుని నాలిక్కి రాసుకుని చప్పరిస్తే....... ఊహూఁ! చెప్పటంకాదు తిని చూడాల్సిందే!

ఇక జొన్నసంకట్లో, పొంగలన్నంలో దీని కాంబినేషన్ అదుర్స్!
అదన్నమాట సంగతి... ఎవరికన్నా ముడిపచ్చడి పెట్టుకునే ఓపిక లేదంటే, మా ఇంటికొచ్చెయ్యండి...:)



హా! మర్చేపోయా, అసలు సంగతి! టైటిల్లో చెప్పానుగా.... ఇది నా నాలుకవాడు చేసిన మహా వెరైటీ ప్రయోగం. నేతరిసెల్లో కొంతమంది పెసరపప్పో, కందిపప్పో పెట్టుకుని నెయ్యి పోసుకుని తింటారు. కొంతమంది మధ్యలో ఏ కారప్పూసో, చక్కలో, జంతికలో నముల్తారు. నాకు బాగా వెగటేసినప్పుడు పైన చెప్పిన వేరుశనగపప్పు, దోసిత్తనాలు వేసి నూరిన చింతకాయపచ్చడి నంజుకు తింటుంటా. అదిరిపోతుందసలు. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి, అరిసెలు తినీ తినీ వెగటనిపించినప్పుడు...;)

తు.చ :- ఇక్కడ అరిసెల పుటో పెట్టలేదు, ఎందుకనగా తీద్దామంటే, పండక్కి అమ్మ చేసిన నేతరిసెలన్నీ అవ్వగొట్టేశా...:)

14 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

చితకాయ పచ్చడి నా ఆల్ టైమ్ ఫేవరెట్టూ!చింత చెట్టే ఏకంగా నా ఫేవరెట్! చింత చిగురు పప్పు, వామన చింతకాయ పప్పు,చింతకాయ పండు మిరప పచ్చడి, చింతకాయ తొక్కు,చింత చిగురు పొడి,చింతకాయ పులిహోర...ఒకటా రెండా?

దీన్ని ఊర రోటి పచ్చడి అని పిలుద్దంలే!

కౌటిల్యా, ఈ పచ్చడికి వంద మార్కులు వేసేస్తున్నానోయి!

నీ పాక వేదానికి నూటపది!

ఇంతకీ నేతరిసెలు అవ్వగొట్టే ముందు ఫొటో తీసుకోవద్దూ, నీ పాకవేదం అభిమానుల కోసం?

రసజ్ఞ చెప్పారు...

కాస్త ఫ్రీ అయ్యాక ఎడపెడా రాసి వడ్డిస్తాలెండి....:) రాసి వడ్డించడమేనా? రుచి చూసే అదృష్టం లేదా?;) సుజాత గారి కామెంటే నాది కూడా! చింతచిగురు పప్పు నా ఆల్ టైం ఫావేరేట్!

తృష్ణ చెప్పారు...

బావుంది టపా సూపరు !! నాకు పాత చింతకాయతొక్కుతో చేసే బెల్లం పచ్చడి, చింత చిగురు పప్పు ఇష్టం.
మార్కులు....సుజాత గారి మాటే నాదీనూ..:)

Kiran చెప్పారు...

బహు బాగు, ధన్యవాదాలు, మీరు ఇచ్చిన వివరాలికి ఇంకా మీ ఇంటికి రావచ్చన్న ఆహ్వానానికి. చింత చిగురు పప్పు వగైరా తెలుసు కానీ పులిహార లోను మిగిలిన రోటి పచ్చళ్ళ లోను కలపచ్చన్నది ఇప్పుడే తెలిసింది.
కంచం అంచులకి చెయ్యి రాసుకుని తినడం గురించి చదువుతుంటే కళ్ళు చెమర్చాయి.
పాకవేదం పేరు కు తగ్గట్టుగా ఉంది.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

పోస్ట్ కెవ్వు సుజాత గారు వేసిన మార్కులే నాతరపున కూడా మరో నూటపదేస్కో :-)
అయినా నేతరిసెలు వెగటు అనిపించడమా అబ్బే అసాధ్యం.. :-)

ఆత్రేయ చెప్పారు...

చూస్తుంటే మీరు మాంచ్చి చేయి తిరిగిన బ్లాగరు కం నలభీముడిలా ఉన్నారు.
కానీ ఆరోజు కలిసినప్పుడు చూసా మీ చేతులు తిరిగిలేవేం చెప్మా..!!

Zilebi చెప్పారు...

అయ్య బాబోయ్,

ఇంత కష్టమైన పనా చింత కాయ పచ్చడి చెయ్యడం !

నేనేదో ప్రియా పచ్చళ్ళు, 'ఎంటీఆర్' పచ్చళ్ళు లాంటి వాటితో అయిపోనిస్తున్నాను !

రోలు, రుబ్బులు కి ఎక్కడ పోయేది కౌటిల్య గారు !

నేతరిసెలు అప్పుడు మళ్ళీ వస్తాను !!

చీర్స్
జిలేబి.

Sravya V చెప్పారు...

ఈ పచ్చడి నాకు భలే ఇష్టం , పండు మిరపకాయల పచ్చడి కూడా ఇలాగే chestaaru కదా .
పోస్టు సూపర్ ఉంది ! మేము చిన్నప్పుడు ఈ చింత కాయలని బ్లేడు తో నైస్ గా కట్ చేయటం లో మహా నైపుణ్యం చూపించేవాళ్ళం :)) ఈ పచ్చడి చేసేటప్పుడు గింజలు వేరతారు కదా అది చెప్పలేదు మీరు :)

మీరు వాటిని చింత తోపులంటారా , మేము వాములదొడ్లు అనేవాళ్ళం :))

కనపడ్డ ప్రతి నేలనీ, తోటనీ, తోపునీ మాగాణులు చేశారు అప్పట్లో. ఇప్పుడు వాటినే మళ్ళా వెంచర్లని పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారనుకోండి!
---------------------
ఏం చేస్తారు మరి జనాభా విపరీతం లో పెరుగుతుంటే దానికి తగ్గ పంటలు , ఇళ్ళ అవసరాలు ఉంటాయి కదా ?

విరజాజి చెప్పారు...

చింత చిగురు పొడీ, చింతాకు (ముదిరిన ఆకు) పొడీ మరిచిపోయారు మీరు! మా వైపు చింతాకును నీడలో ఆరబెట్టి పొడి చేసి పెట్టుకిని, కూరల్లో వాడతారు!

మా వైపు దోసకాయ, చింతకాయ పచ్చడి చేసుకుంటారు - ఇదీ మాములు రోటి పచ్చడికి మల్లేనే! ఎటొచ్చీ దోసకాయ పచ్చడిలో చింతపండు బదులు ముడి చింతకాయ పచ్చడి వేస్తామన్నమాట.

అలాగే ముడి చింతకాయ, కొరివికారమూ (పండు మిరపకాయల పచ్చడి) కలిపి నూరుకుని, మాంచి ఇంగువ తాలింపు పెట్టుకుంటే - అదో రుచి.

నాకు మాత్రం చింతకాయ పచ్చడిలో కి ఉల్లిపాయ కంటే, పచ్చిమిరపకాయ కొరుక్కుని తింటేనే మజా గా అనిపిస్తుంది!

చింతకాయ పచ్చడి నూరాక, ఆ రోలు కడిగిన నీళ్ళు వృధాగా పోకుండా మా అమ్మమ్మ చారులోనొ, సాంబారులోనో పోసేది, కమ్మటి రుచీ, పైగా తిరగమాత వాసనా!

అరిసెలు ఉడికించిన పెసర పప్పులో నానబెట్టుకుని తినడం మాకు తప్ప ఎవ్వరికీ తెలీదని మహా బడాయి మా అత్తగారింట్లో! మీ బ్లాగు చూపిస్తా... మావాళ్ళకీ తెలుసు అని!

kiranmayi చెప్పారు...

ఇప్పుడు నాకు కుంచెం చాలా ఖోపం ఒచేస్తోంది. చింతకాయ పచ్చడి డితైల్సా? చెప్పితిరి పో ... తిన్నాక గుజ్జు కంచానికి రాసే డిస్క్రిప్ షన్ ఒకటా ? ఇచ్చితిరి పో ....... నేతి అరిసెలు తినేశాను.... ఫోటో లేదు అని ఊరించి ........ వాఆఆఆఆఆఆఆఅ. మీ అరాచాకాలకి అసలు అంతు ఉండదా? ఆ?

Unknown చెప్పారు...

ఆధునిక కాలంలో తెలుగు పదాల రాశులున్న ... వేదం.. ఈ పాకవేదం

కౌటిల్య చెప్పారు...

కమల్ గారూ! చాలా రోజుల తర్వాత నా బ్లాగు చూశాను, మీ కామెంటు మూలంగా...చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళా రాయాలనిపిస్తోంది...

Zilebi చెప్పారు...


"ఒకానొక కాలం " లో జేజే అని వెలిగిన బ్లాగు !

చాలా మంచి నిర్ణయం కౌటిల్య గారు : వెంటనే వచ్చెయ్యండి సరి కొత్త టపా వంటకాలతో :)

చీర్స్
జిలేబి

Zilebi చెప్పారు...



"ఒకానొక కాలం " లో జేజే అని వెలిగిన బ్లాగు !

చాలా మంచి నిర్ణయం కౌటిల్య గారు : వెంటనే వచ్చెయ్యండి సరి కొత్త టపా వంటకాలతో :)

చీర్స్
జిలేబి

Blogger ఆధారితం.