నా కొత్తరోలూ - రోటి పచ్చళ్ళూ - దొండకాయ పచ్చడి





హమ్మయ్య! ఇన్నాళ్ళకి మళ్ళా మీ ముందుకొస్తున్నా! చాలా కూసింత బిజీగా ఉండటంవల్ల అప్పుడెప్పుడో మీకు చెబ్దామనుకున్న నా "కొత్తరోలు కథలు" చెప్పటానికి, ఇవ్వాళ్టికి కాస్త తీరిక దొరికింది. ఇప్పుడు కూడా ఇంకా చాలా కూసింత బిజీనేకాని, మరీ నా బ్లాగు "ఆకలో రామచంద్రా! రోటి పచ్చడో రామచంద్రా!" అని తెగ గొడవెట్టేస్తుంటేనూ ఇక ఉగ్గబట్టుకోలేక వచ్చేశానన్నమాట! ఇక మొదలెట్టేద్దామా నా రోటిపచ్చళ్ళ పురాణం..;)! ఇది కొన్ని భాగాలుగా రాస్తానన్నమాట! ఒక్కోభాగంలో కొన్ని కొన్ని టిప్స్ అలా ఫ్లోలో చెప్పేస్తానేం.......

మీకందరికీ బాగా తెలుసుకదా, నాకున్న రోటి పచ్చళ్ళ పిచ్చి! మిక్సీలు, గ్రైండర్లూ మనకి పడవు, కాబట్టి రోలు కొనుక్కోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసి ఒక బుజ్జి రోలు తెచ్చుకున్నా... మరేం! పెద్దది చాలా రేటు చెప్పాడు, మనం పప్పులూ,గట్రా రుబ్బంకదా, పచ్చడికే కదా అని చిన్నదే తెచ్చుకున్నా... మాకు ఇక్కడ చిన్నపాటి రోళ్ళపరిశ్రమ ఉందిలెండి! ఈ రోజుల్లో ఎవరు కొంటున్నారబ్బా అనుకున్నా! నాలాంటి పిచ్చ ఉన్నోళ్ళు చాలామందే ఉన్నారనిపించింది,అక్కడ వాళ్ళు తయారు చేసే రోళ్ళు చూస్తే....

ఇక ఎలాంటి రోలు మంచిది, మన్నిక ఉండాలంటే ఎలాంటిది తెచ్చుకోవాలి? అన్నది పెద్ద ప్రశ్న... రోళ్ళు కొండరాయితో చేసినవి, నాపరాయితో చేసినవి రెండు రకాలుంటాయి. కొండరాయితో చేసింది కాస్త ధర ఎక్కువగాని, వందల ఏళ్ళున్నా ఏమీకాదు. అదే నాపరాయితో చేసిందైతే ధర తక్కువైనా నాలుగైదేళ్ళకే పగిలిపోతుంది. కాబట్టి, కొండరాయిదే తెచ్చుకున్నా నేను. మా ఊళ్ళో మా ఇళ్ళ ముందు ఒక పెద్ద రోలుండేది. కొండరాయిదే, కాని ఎఱ్ఱ్రరాయిది...నేలబారున ఉండేది. అప్పట్లో పల్లెటూళ్ళల్లో ఇలాంటి రోళ్ళు ఊరి మధ్యలో, లేకపోతే ఇరవై ముఫ్ఫై ఇళ్ళకి కలిపి ఒకటి ఖచ్చితంగా ఉండేవి..వడ్లు దంచుకోటానికీ, చింతకాయ పచ్చడి తొక్కుకోనూ అందరూ ఇదే వాడుకునేవాళ్ళట! అటెళ్ళేవాళ్ళూ,ఇటెళ్ళేవాళ్ళూ కాసేపు రోకలి తీసుకుని నాలుగుపోట్లు వేసివెళ్ళేవాళ్ళు.. అలా అందరం ఒక కుటుంబం అన్న భావాన్ని పెంపొందించడానికి ఈ రోళ్ళు బాగానే ఉపయోగపడేవి... ఆ రోళ్ళూ పోయాయి, ఆ కలివిడి బతుకులూ పోయాయి..ప్చ్!

నేను కొన్న రోలు చిన్నది కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పన్లేదు. గుంట కాస్త లోతు ఎక్కువ ఉన్నదే తీసుకున్నా. అదే, పెద్ద రోలు కొనే పనైతే గట్టు బాగా వెడల్పు ఉన్నది, గుంట తక్కువ ఉన్నది తీసుకుంటే మంచిది, రుబ్బుకోటానికి అప్పుడే అనువుగా ఉంటుంది. లోతు ఎక్కువ ఉంటే పొత్రం కిందకి వెళ్ళిపోయి పచ్చడిగాని,పిండిగాని సరిగ్గా మెదగదు. గట్టు లేకపోతే పక్కకి పడిపోతుంది. పొత్రం కూడా సరైన సైజు చూసి సరిగ్గా వేయించుకోవాలి.

పెద్దరోళ్ళలో రెండు రకాలుంటాయి. ఒకటి మామూలుగా పచ్చళ్ళు,పిండ్లు రుబ్బుకోటానికి. రెండోది గింజలు దంచుకోటానికి, పొడిపిండి కొట్టుకోటానికి, ఎక్కువ మోతాదు పచ్చళ్ళు(చింతకాయ,ఉప్పుగోంగూర,కొరివికారం) తొక్కటానికి. మొదటిది ఒకటే రోలు, నాలుగు పలకలుగా ఉంటుంది. రెండోది రెండు భాగాలుగా ఉంటుంది. కింద చిన్నగుంటతో ఉన్న గుండ్రటి కుంది ఉంటుంది.దానిపైన ఇంకాస్త వెడల్పున్న గుండ్రటి చట్రాన్ని ఎక్కిస్తారు.రెండూ కలిసి లోతు ఎక్కువ వస్తాయి. పై చట్రంగట్టు, కింద కుందికన్నా బాగా వెడల్పుంటుంది.

ఈ రోట్లో అరిసెల పిండి కొట్టేప్పుడు, చింతకాయ పచ్చడి తిరగ తొక్కేటప్పుడు, జొన్నలు తొక్కేటప్పుడు భలే సరదాగా ఉండేది. రెండు రోకళ్ళపోటు,మూడు రోకళ్ళపోటు,నాలుగు రోకళ్ళపోటు ఇలా పందేలు కట్టి వేసేవాళ్ళు. నాలుగురోకళ్ళపోటు వెయ్యగలిగితే మొనగాడి లెఖ్ఖ! ఒక రోకలికి ఒకటి తగలకుండా, రోలు అంచుకి తగలకుండా పోటు వెయ్యటమంటే, అబ్బో! పెద్ద ఆర్టు అది... మనకి మూడు రోకళ్ళపోటే గగనంగా ఉండేది..;) లయబధ్ధంగా పోటు వేస్తూంటే ఆ రోకళ్ళ చప్పుడు వింటానికి ఎంత బాగుండేదో! అసలు మాకు పొద్దున్నే ఈ రోకళ్ళపోటుతోనే తెల్లారేది...పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ వెళ్ళి అన్నయ్యా, నేనూ జొన్నలు తొక్కేవాళ్ళం..మా పక్కింటోళ్ళకీ, మాకూ పోటీ! ఎవరు వేగంగా పోటేస్తున్నారా అని. అన్నయ్య బాగా ఆవేశపడిపోయేవాడు. మనమేమో మహా నిమ్మది, రిజల్టు! నాలుగైదు పోట్లకొకసారైనా రెండు రోకళ్ళూ ఢీకొనేవి... నాన్న వచ్చి డిప్పమీద ఒకటిచ్చేవాడు, సరిగ్గా వెయ్యి అని....హ్మ్! ఆ రోజులే వేరు.........


ఇక రోలు ఎంచుకునేప్పుడు "కక్కు" బాగా కొట్టింది తీసుకోండి, అంటే లోపలవైపున గరుగ్గా గుంటలు,గుంటలుగా ఉంటుంది కదా, అది! అప్పుడు బాగా మెదుగుతుంది, పచ్చడైనా, పిండైనా....{దీన్నే గంట్లు కొట్టటం అని కూడా అంటారని గోదారోళ్ళ ఉవాచ!...;)..;)..}... పాతరోళ్ళకి కూడా మళ్ళా మళ్ళా "కక్కు" కొట్టిస్తూనే ఉండాలి...

ఇక రోలు సెలెక్షను అయిపోయింది కదా! అందులోకి వాడే రోకళ్ళూ,పచ్చడిబండలూ, పొత్రాల గురించి తరువాయి భాగంలో చెప్తానేం! అలా తెచ్చుకున్న కొత్తరోలుని "అలవాటు" చెయ్యాలి! అంటే కొత్తగా చెక్కిన రోలు కదా, ఇసుక వచ్చిద్ది అలానే వాడేస్తే. అందుకని ఆ ఇసక పోయేట్టు చెయ్యటాన్ని అలవాటు చెయ్యటం అంటారు... మామూలుగా అందరూ ఊకపోసి దంచుతారు ఏడెనిమిదిసార్లు...అప్పుడు లోపలున్న ఇసకంతా పోయి పచ్చడి తొక్కుకోటానికి వీలుగా తయారైద్ది. ఐతే నాకిక్కడ ఊక ఎక్కడ దొరికిద్ది? అందుకే జ్యోతిగార్ని అడిగా.... భలే అవిడియా చెప్పారు జ్యోతిగారు. గోధుమపిండి కలిపి, ఆ ముద్దని వేసి బాగా గుంటలో అంతా నాలుగైదు సార్లు రుద్ది, తర్వాత శుభ్రంగా కడిగేస్తే ఇసక ఒక్క పిసరకూడా లేకుండా పోయింది...
తర్వాత కొత్తరోలు మొదలెట్టాలంటే ఉండ్రాళ్ళు పొయ్యాలంట, తాంబూలాలివ్వాలంట! ఇవన్నీ మన బ్రహ్మచారి జీవితానికి ఎక్కడ కుదురుతాయి. అందుకని కాస్త పసుప్పూసి, కుంకవెఁట్టి, ఓ పసుపుకొమ్ము తాడు కట్టి మొదలెట్టేశా....;) పైగా ఎప్పుడెప్పుడు రోట్లో పచ్చడి తొక్కుకు తిందామని ఆత్రం..;)! ఇక నా రోట్లో తొక్కిన మొదటి పచ్చడి చుక్కకూరపచ్చడి. దాని ఫొటో తియ్యలేదు ఆరోజు హడావుడిలో... తర్వాత దొండకాయ పచ్చడి చేశా! అది చెప్పుకుందామేం ఇవ్వాళ!

  • అసలు దొండకాయలంటే పచ్చడే!వాడ్చి పచ్చడి తొక్కితే ఎంత కమ్మగా ఉంటదో! వేపుడు,ఇగురూ మనకి అంత ఎక్కవు..... అది కూడా మా ఇళ్ళల్లో అంత రెగ్యులర్గా అలవాటు లేదు. దొండపందిరి ఉన్నా, ఇక ఏ కూరగాయలూ లేకపోతే దొండకాయ పచ్చడి అన్నమాట! "పిచ్చి దొండకాయలు" అంటుంటారు, మరి తింటే పిచ్చెక్కిద్దనో లేక పాపం!నీళ్ళు పోసినా, పొయ్యకపోయినా సంవత్సరాల తరబడి అలానే పిచ్చిపిచ్చిగా కాస్తుంటాయనో...;)
  • బాగా పచ్చిగా ఉన్న దొండకాయలే బాగుంటాయి పచ్చడికైనా, వేపుడు కైనా... కాస్తంత దోరబడి, లోపల ఎఱ్ఱగా ఉన్నా పచ్చడికి పనికొస్తాయి కాని వేపుడుకి పనికి రావు...ఇక పూర్తిగా పండిపోయాయనుకోండి! చూసుకోటానికీ,నోట్టో వేసుకు చప్పరించటానికీ,అదీ కాకపోతే అందమైన అమ్మాయి పెదవులతో పోల్చి వర్ణించుకోటానికీ తప్ప పచ్చడికి పనికి రావు..;)
  • అలా పచ్చగా నవనవలాడుతున్న దొండకాయలు ఒక పావుకేజీ(నలుగురికి రెండు పూటలకీ వచ్చిద్ది) తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి అడ్డంగా, చక్రాల్లా సన్నగా తరుక్కోండి...తొడెం, చివరి ముట్టె తీసేయండి. అవి పడితే సరిగ్గా మెదగవు. పంటికింద పడితే బాగోవు.
  • ఇప్పుడు బాండీ పొయ్యిమీదెట్టి, ఓ పెద్ద గెంటెడు నూనేసి, అది కాగంగనే, పైన తరుక్కున్న దొండకాయ ముక్కల్ని, ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్నీ వేసి వాడ్చాలి, అదేనండీ వేయించాలి ..;)..... అన్నీ బాగా వేగాయనుకోగానే చివర్లో కాస్త జీలకఱ్ఱా,నాలుగు మెంతులూ,కాసిన్ని ధనియాలూ వేసి వేగనివ్వాలి....
  • పచ్చిమిరపకాయల్తో తొక్కితే ఒకలా ఉంటుంది. ఎండు మిరపకాయలేసి తొక్కినా బాగుంటుంది. ఎండు మిరపకాయలైతే వేయించాల్సిన పన్లేదు. ముందు రోట్లో ఎండు మిరపకాయలేసి, కాసిన్ని నీళ్ళు పోసి తొక్కాలి, అది మెదిగాక దొండకాయ ముక్కలు, మిగతావి వేసి తొక్కా లి.
  • పైన వేయించిన సంభారాలన్నీ బాండీలోంచి డవిరెక్టుగా రోట్టోకి మార్చి, కుంకుడుగాయంత చింతపండూ,నాలుగు వెల్లుల్లి రెబ్బలూ, ఒక చిన్నస్పూను ఉప్పూ వేసి ఇక రోకలిబండ తీసుకుని తొక్కటమే.
  • ఒక చేత్తో ఎగదోసుకుంటూ మరో చేత్తో నూరాలి.దీనికి కొంచెం ఒడుపు కావాలి. అలవాటుమీద అదే వస్తుందనుకోండి.పైగా చేతి కండరాలకి భలే వ్యాయామంలే!..;)..పచ్చడి కొంచెమే అయితే, రెండు చేతులతో రోకలిబండ చివర్న పట్టుకుని నూరితే తొందరగా మెదిగిపోద్ది...
  • అలా రోట్లో పచ్చడి తొక్కుతూ ఉంటే, నాలుగైదు పోట్లు పడగానే కమ్మటి వాసన ముక్కుపుటాలకంటి ఉక్కిరిబిక్కిరి ఐపోతాం.... కాస్త తీసుకుని నాలిక్కి రాసుకోందే ప్రాణం ఊరుకోదు. కాని, రోటి దగ్గర నాకితే పెళ్ళికి వానపడిద్దని ఇంట్లో కట్టడి! ఇక్కడ మనకి స్వతంత్రం కదా! "పడితే పడింది వెధవవాన, పేద్ద కళ్యాణమండపం తీసుకుని చేసుకుందాంలే" అని సర్ది చెప్పుకుని చక్కగా రోకలికి అంటింది వేలితో తీసి చివర్లో నాకేస్తుంటా..;)
  • కొంచెం మెదిగింతర్వాత మరికాస్త కొత్తిమీర వేసి తొక్కండి. పచ్చడి మరీ లేహ్యంలా తొక్కొద్దు. కచ్చాపచ్చాగా తొక్కితేనే బాగుంటుంది. అమ్మ చెప్తూ ఉంటుంది,నెల్లూరులో ఉన్నప్పుడు ఇంటి ఓనర్లు అమ్మ పచ్చడి తొక్కుతుంటే,"పచ్చడిబండ అరిగిపోద్ది" అని హాస్యమాడేవాళ్ళంట! వాళ్ళు మరీ ఊరకే అలా, అలా ముక్కలు చితగ్గొట్టి తినేస్తారు...
  • ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లోంచి గిన్నెలోకి తోడుకొని, కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు... ఎక్కువ పచ్చడి, అంటే ఒక కేజీ తొక్కి, నాలుగైదు రోజులు నిలవుంచాలనుకుంటే తాలింపు పెట్టుకుంటే నిలవుంటుంది.
  • ముక్కలు వేయించేప్పుడు కాసిన్ని దోసిత్తనాలు వేసి వేయించి పచ్చట్లో వేసి నూరితే పచ్చడి ఘుమఘుమలాడిపోద్ది.... చింతపండు బదులు ముడిచింతకాయ పచ్చడి కూడా వేసుకోవచ్చు,బాగుంటుంది. కొంతమంది ఇందులో పచ్చికొబ్బరివేసి నూరతారు, మనకి నచ్చదు.
  • పచ్చడి చేసుకున్న ఆనందంలో రోలు కడగటం మర్చిపోవద్దండోయ్! రోలూ,రోకలిబండా శుభ్రంగా కడిగి, రోకలిబండ ఎండ తగలని చోట జాగ్రత్త చేసుకోవాలి.
  • ఇప్పుడు చక్కగా అన్నం వండుకుని, వేడివేడన్నంలో ఈ పచ్చడేసుకుని, మరికాస్త నెయ్యివేసుకు తింటుంటే అబ్బబ్బ! ఆ వాసనకే ఆకలి చచ్చిపోయిన రోగికి కూడా ప్రాణంలేచొచ్చి ఓ ముద్ద నోట్లో వేసుకుని తరిస్తాడు...;)

19 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

ఏకంగా రోటి గీత ఉపదేశించారుగా! :)
శుభం.
వేళ్ళు నలగ్గొట్టుకోకుండా నాలుక్కాలాలపాటు పచ్చళ్ళు చేసుకోండి.

అజ్ఞాత చెప్పారు...

అబ్బా భలే రాస్తారుగా..ఇప్పటికిప్పుడు రోటిపచ్చడి తినాలని ఉంది

nestam

సుజాత వేల్పూరి చెప్పారు...

అనేక బాహూదర వక్త్ర నేత్రం________అన్నట్టు ఎటు చూసినా నువ్వూ, నీ రోలే! విశ్వరూపం చూపించావు కదా తండ్రీ!

So, కౌటిల్య బ్లాగులో రోటి పచ్చళ్ల ఫెస్టివల్ ప్రారంభమన్నమాట! నాకో టేబుల్ ఈ ఫెస్టివల్ అయ్యేదాకా బుక్ చేయించెయ్ కౌటిల్యా!

నీ దుంప తెగ, పసుపూ కుంకాలెట్టి పసుపు కొమ్ము కట్టావా? రోలుకి? నువ్వు తొందరగా పెళ్ళి చేసుకుని మీ యావిడకి ఇలా కొసరి కొసరి పచ్చళ్ళు తొక్కి ముద్దలు కలిపి పెడుతుంటే ఈ ప్రాణి ఎలా ఫీలవుతుందో అర్జెంటు గా చూడాలనిపిస్తోంది!కానీ మరి!

Unknown చెప్పారు...

టపా బావుందండి.

SHANKAR.S చెప్పారు...

బావుంది కౌటిల్యా. ఇకనుంచీ మీరు ఇలాంటి వంటల విషయంలో మన బ్లాగర్లందరికీ "రోలు" మోడల్ గా నిలవాలని కోరుకుంటున్నా :))

Rao S Lakkaraju చెప్పారు...

రాచ్చిప్ప లో చేసిన పప్పుచారులూ రోట్లో చేసిన పచ్చళ్ళు, వీటికి తిరుగు లేదు. ఆ రుచులు ఇంకో విధంగా రావు. పోస్ట్ బాగుంది. నాకో చిన్న సలహా కావాలి. మాకొచ్చిన ఉప్పు గోంగూరలో ఉప్పెక్కువ అయ్యింది అనిపిస్తోంది. ఉప్పు తగ్గించటానికి ఏమి చెయ్యాలో ఒక సలహా ఇటు పడెయ్యండి.

రాజ్ కుమార్ చెప్పారు...

డాక్టర్.. మీరు ఎంబీబియస్ డాక్టర్ అనుకున్నా
రోళ్ళ మీద రోటీ పచ్చళ్ల మీదా పీ హెచ్ డీ చేసితిరా? హహహ సూపర్ పోస్టు ;)

9thhouse.org చెప్పారు...

చితగ్గొట్టారుగా... :-)

మేమొచ్చినప్పటికే ఉంది కదండీ రోలు?

(కౌటిల్య వంటలు తినే భాగ్యం కలిగింది నెల్లాళ్ళ క్రితం. చెయ్యి తిరిగిన ఆడవాళ్ళు కూడా ఆయన ముందు పనికిరారు. అమృతహస్తం ఆయనది. కొత్తగా చెప్పక్కర్లేదనుకోండి!!)

kiranmayi చెప్పారు...

కుండ పచ్చళ్ళ కౌటిల్య, చారుల సార్వభౌమ, తియ్య తియ్యటి త్రివిక్రమ, తెలుగు వంట కి షాన్, బండ పచ్చళ్ళ భయంకర, రోలుతో వేంచేస్తున్నారహో ............
బాబు, ఇంక ఈ వంది మాగధుల "రోల్" లో నేను ఉండలేను కాని మీ వంటకి, మీ బ్లాగ్ కి, మీ రాసే ఓపికకి నా సహస్ర కోటి వందనంస్.
ఇన్ని రోజులు మీ బ్లాగ్ చూడని "ఫుడ్ బ్లాగ్" addict అయినందుకు సిగ్గుపడుతూ, మీ బ్లాగ్ గురించి చెప్పని నా బ్లాగ్ మిత్రులందరినీ (ఇందులో సుజాత గారే మెయిన్) తిట్టుకుంటూ మీ బ్లాగ్ ని బుక్ మార్క్ చేయ్యదమైనదని చిత్త గించ వలసిందని సవినయంగా మనవి చేసుకుంటున్నా
నాకిప్పుడు ఇంకేమి వ్రాయటానికి టైం లేదు. ముందర వెళ్లి మీ బ్లాగ్ చదవాలి

జేబి - JB చెప్పారు...

మీ రోటిమాటలతోనే కడుపునిండితే దొండకాయ లటలట (రోట్లో 'లటలటా' నూరితే కమ్మగా ఉంటుందని మా ఆమ్మ అంటుంది) పచ్చడితో ఆకలి పెంచేశారు, ఇపుడు అర్థరాత్రి పన్నెండింటికి నాకెక్కడి నుండి వస్తుంది :-(

కొన్ని నెలల క్రితం, అమెరికా నుండి తిరిగొచ్చినపుడు, ఒక రోజు పొద్దున్నే మా ఆమ్మ (అపుడు మా ఇంటికి వచ్చింది) చాటలకి పుయ్యడానికని కాగితాలు+మెంతులు కలిపి రుబ్బడం మొదలుపెట్టింది. ఆవిడ కష్టపడడం చూడలేక నేను వెళ్ళి ఒక గంట్ రుబ్బాను. మంచి ఎక్సర్సైజని నేను ఆస్వాదించానుగానీ, అది చూసి మా అమ్మ, పిన్ని పాపం మా ఆమ్మని తిట్టారు - సాఫ్ట్వేరు ఇంజినీరు, అదీ అమెరికానుండి వచ్చాడు, వాడిచేత రుబ్బిస్తావా అని.

అజ్ఞాత చెప్పారు...

అమ్మయ్యా! అలా "ఓ రోలు వాడివయ్యావన్నమాట" (ఓ ఇంటివాడివయినట్టు). ఈ వ్యాసం నోరూరించే చక్కటి ఆఆలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ తగుపాళ్ళలో లాలించి, బుజ్జగించి, వేయించిన తిరుగువాత పెట్టిన అద్భుతమైన చింతకాయ పచ్చడిలా వుందంటే మీరు నమ్మాలి.
మీ రోలు నిండుగ నూరేళ్ళూ మీతో కలిసి కాపురం చేసి, గంపెడు దొండపండంటి పచ్చళ్ళు అందించాలని, శాలువావేసుకుని మరీ దీవిస్తున్నాను. మరో జన్మంటూ వుంటే... మీ చేతి రోకలిగా పుట్టి మీ చేతిపచ్చళ్ళు అందరికన్నా ముందే ఆస్వాదించుకునే మహద్భాగ్యం కలగించమని ఆ మహాదేవుని ప్రార్థిస్థున్నా... లేదంటే, కనీసం మీరూమ్ మేట్‌గా అయినా ...

మాలా కుమార్ చెప్పారు...

బాగుందండి మీ పోస్ట్ . వెల్లుల్లి లేకుండా ఏవైనా వంటలు చెప్పండి ప్లీజ్ .

కౌటిల్య చెప్పారు...

కొత్తపాళీ గారూ!
రోటిగీతా..ః)
వేళ్ళు నలిగే అవకాశమే లేదండీ, రెండు రోకళ్ళ పోటు కూడా బ్రహ్మాండంగా వేస్తాను నేను..మీ దీవెనకి నా మంగిడీలు..

నేస్తం గారూ,
అలా తినాలనిపించినపుడు ఎలాగోకలా చేసుకుతినటమే!

సుజాత గారూ!
హిహిహి..విశ్వరూపమా....;)
మొదటి టేబుల్ మీదే! అసలీ రోటిపచ్చళ్ళ సిరీస్ మొదలెట్టింది మీకోసమే!...
మీ మూడో కామెంటుకి నో కామెంట్స్...;)

శైలబాల గారూ, ధన్యవాదాలు.

కౌటిల్య చెప్పారు...

శంకర్ గారూ, చమక్కులెయ్యడంలో మీకు మీరేసాటి!..;)

రావుగారూ! అవునండీ రాచ్చిప్ప కూడా సంపాదించాలి నేను. రాచ్చిప్పలో పులుసుని తెగ మిస్సైపోతున్నా...
ఉప్పు తగ్గించటానికి చాలా మార్గాలున్నాయండీ!

ఒకటి పచ్చడి మళ్ళా తొక్కుకుని తాలింపు పెట్టుకునేప్పుడు కాస్త కొరివికారం అందులో కలుపుకోడం లేదా ఇప్పుడే కాసిని పండుమిరపకాయలు అందులోపోసి తొక్కడం,

రెండోది నిమ్మరసం పిండడం...ఇది సరిగ్గా చూసుకుంటూ కలుపుకోవాలి. రుచి ఎలా ఉంటుందో నేను గ్యారంటీ చెప్పలేను.

మూడోది ఇంకా సింపులు, అన్నిటికన్నా బెస్ట్! తిరగతొక్కి తాలింపు పెట్టుకునే ప్రతిసారీ బంగాళాదుంప నాలుగు చిన్నముక్కలు అందులో పడెయ్యండి. ఒక అరగంటకి ఆ ఎక్కువగా ఉన్న ఉప్పంతా ఇవి పీల్చేసుకుంటాయ్! తర్వాత తీసెయ్యడమే...

కౌటిల్య చెప్పారు...

ఓయ్! రాజ్! ఇప్పటికే జనాలు చాలామంది నన్ను ఫేకు అంటున్నారు...నీ కామెంటు చూస్తే వాళ్ళకి మరికాస్త డవుటు పెరిగిపోద్ది.కావాలంటే నా డిగ్రీ స్కాన్ చేసి పెడతా....;)

నాగమురళి గారూ! హిహిహి...ఆ రోజు మీ లక్కండీ బాబూ! ఏదో బాగా కుదిరాయి..
రోలు మీరొచ్చినప్పటికే ఉందండీ కానీ ఈ సిరీస్ ఎప్పుడో రెండు నెలల క్రితం మొదలెట్టాల్సింది...

కిరణ్మయి గారూ, మీ స్తోత్రానికి నిజంగానే నేను చెట్టేక్కేశా..ః)... ధన్యవాదాలు, మిగతా పోస్టులు కూడా చదివి చెప్పండి మరి!

మాలా కుమార్ గారూ! వెల్లుల్లి ఇష్టం లేకపోతే వదిలెయ్యొచ్చండీ! బానే ఉంటుంది. కాని, వెల్లుల్లి పడితేనే రుచి..ః)

కౌటిల్య చెప్పారు...

జేబీ గారూ! మీరూ గుంటూర్లానే ఉందిగా! ప్రస్తుతం పరదేశవాసంలో ఉన్నారా!
అవునండీ! ఆ "లటలట" మా అమ్మమ్మ కూడా అంటుండేది...
మీకు నోరూరించానా! తిట్టుకోకండేం...;)

హహహ! అమెరికాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయితేనేం మూలాలు మర్చిపోలేం కదండీ! ఊరెళ్తే నేను ఇప్పటికీ పొలం పనులు చెయ్యాల్సిందే! ఆ కాగితాలు, మెంతులు రుబ్బిన పిండి వాసన భలే గమ్మత్తుగా ఉండేది...

snkr గారూ,
చింతకాయ పచ్చడీ-రకాలూ కూడా త్వరలోనే రాస్తానండీ...;)

మీరు నోరారా దీవించిన దీవెనలకి నా మంగిడీలు..రోకలిగా పుట్టే సంగతి పై జన్మలో చూసుకోవచ్చుగాని, ఇప్పుడు మా ఇంటికొచ్చెయ్యండి..హాయిగా తిని వెళ్దురు...;)

రసజ్ఞ చెప్పారు...

కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నా! పచ్చడి ఉందా అయిపాయిండా? రోలులో చేసిన పచ్చడికి ఉన్న రుచి మిక్సీలలో చేసినా దానికి వస్తుందా? చితక్కొట్టండి

Rao S Lakkaraju చెప్పారు...

అదృష్టవశాత్తూ పండుమిరప కాయలు స్టోర్ లో కనపడ్డాయి. ఉప్పు గోంగూరలో ఉప్పు తగ్గించటానికి మీ సలహా కాసిని "పండుమిరపకాయలు అందులోపోసి తొక్కడం" చేసాము బాగా వచ్చింది. థాంక్స్.
పండు మిరపకాయలు వేయించి తోక్కాలా పచ్చివే తోక్కచ్చా అనే మీమాంస వచ్చింది కాని చివరికి వేయించి చేసాము.

నవజీవన్ చెప్పారు...

బాగుంది సార్ .మీ బ్లాగు..పాకశాస్త్రం మీద మీ బ్లాగు ముచ్చట గ వుంది.

Blogger ఆధారితం.