దోసకాయ ఇగురూ - మిరియాల చారూ



అమ్మ వచ్చి నాల్రోజులుండెళ్ళింది....,చక్కగా వండిపెట్టింది నాకిష్టమైన కూరలన్నీ.. అందులోనూ పులుసులు, నా ఆల్‍టైమ్ ఫ్యావరేట్స్....ఇక అమ్మ వెళ్ళిన దగ్గర్నుంచీ నాలుక మెస్సుకెళ్ళనని మొరాయించింది..ఇక తప్పదు కదా నాలుకవాడు ఎల్లా చెప్తే అల్లా వినాలి మరి...అయినా ఆ మెస్సు వెధవలు ఏనాడూ ఒక్ఖ పులుసుకూర కూడా చెయ్యరాయె...ఎప్పుడు చూడు పప్పు,వేపుడు కూరలు ఇంతింత పిచ్చిత్తుల నూనెలు పోసి, ఆఖరుకి తోటకూర ఎప్పుడన్నా చేసి తగలడితే అది కూడా రుచీపచీ లేకుండా వేయించి పడెయ్యడమే,ఇక అన్నంలో ఏం కలుపుకు చస్తాం..:).....కావున మన నాలుకవాడు కోరిన విధంగా ఇక నుంచి స్వయంపాకమే బెస్టనిపించి నిన్నట్నుంచి రంగంలోకి దిగిపోయా..అమ్మ వచ్చేప్పుడు కమ్మగా ఓ చిన్నడబ్బాడు "సంబారుకారం" కూడా తెచ్చింది,ఇక మనకి తిరుగేముంది, జంకూ గొంకూ లేకుండా ముందుకు దూసుకెళ్ళడమే...:)....

పైగా నిన్న ఒక అజ్ఞాతగారు స్టార్టింగ్ కిట్ కావాలన్నారు...కాబట్టి మనం మామూలుగా వండే కూరలు కూడా రాసేస్తే పోలా అనిపించింది, దానికి రావుగారి ప్రోత్సాహం కూడా......అసలు నా బ్లాగు మొదలెట్టిందే అందుకనుకోండి, కాని మరీ మామూలుగా వండుకున్నే కూరలు వీడు చెప్పేదేంటి అనుకుంటారని,దానికితోడు ఆ మధ్య జరిగిన చిన్న రగడవల్ల ఆ రకాలు కాస్త పక్కకి పెట్టా....కాని అవి కావల్సినవాళ్ళు చాలా మందే ఉన్నారనిపిస్తోంది, అందుకే రాసేస్తున్నా...:)..

ఇక నిన్న నా కంచంలోకి చేరినవి నాలుగు రకాలు....రెండు కుండపచ్చళ్ళు, ఒకటి ఉసిరికాయ నల్ల పచ్చడి, రెండోది మొన్న అమ్మ వస్తూ చేసుకొచ్చిన టమాటా ఎండుమిరగాయల పచ్చడి........తర్వాత అక్కడ అందంగా కనబడుతోంది దోసకాయ ఇగురు, నా పిచ్చ ఫ్యావరేట్.....తర్వాత మిరియాలచారు...ఆ తర్వాత మాంఛి పెరుగు..అదీ నా నిన్నటి భోజనం......ఇప్పుడు మీకు దోసకాయ ఇగురూ, మిరియాల చారూ ఎలా వండేనో చెప్పబోతున్నానన్నమాట......నిజ్జంగా నిజం చెప్పాలంటే నాకు పిండివంటలూ,స్పెషల్ ఐటమ్సూ కుదిరినంత బాగా మామూలు కూరలు కుదరవు.....కాని నిన్న ఈ రెండూ అద్భుతంగా కుదిరాయ్,అచ్చు అమ్మ వండినవాటిలా.....నేను తింటుంటే మా ఫ్రెండొకడు వచ్చి ముద్దలు పెట్టించుకుని "కెవ్వు"మనేశాడు.....:)......అద్దన్నమాట సంగతి!...:)

మొదట దోసకాయ ఇగురెల్లా చెయ్యాలో చెప్తా.......

కొన్ని జీవాలుంటాయ్, దోసకాయంటే ఆమడదూరం పరిగెడతారు...అడిగితే మాకు దాని వాసన పడదు(చేపల కంపు మాత్రం హాయిగా పీల్చుకుంటారు..:)...) అంటారు....సరిగ్గా వండిన దోసకాయ ఎప్పుడూ తిని ఉండరు..వాళ్ళ దురదృష్టానికి నాకు జాలేస్తుంటుంది......నాకు తెలిసి దోసకాయంత ప్రియంగా,హాయిగా గొంతు దిగే కూర మరోటి ఉండదేమో...అందునా ఈ ఎండాకాలంలో దోసకాయకూర లోపలికెళ్తుంటే ప్రాణానికి ఎంతహాయిగా ఉంటదో....అసలు దోసకాయ ఎన్ని రకాలుగా వండుకోవచ్చో...పప్పులో పెట్టుకోవచ్చు,పులుసు పెట్టుకోవచ్చు,పాలేసి ఇగురొండుకోవచ్చు, పచ్చి ముక్కల పచ్చడి రకరకాలుగా తొక్కుకోవచ్చు,ఒరుగులు పెట్టుకోవచ్చు....ఏంటో! పాపం ఆ జనాలు ఇన్ని రుచులూ మిస్సయినట్టేకదా...:).....సర్లెండి మనం నేర్చుకుందాం,వండుకుందాం,తిని ఎంజాయ్ చేద్దాం....:)
  • మొదట మంచి కండ పట్టి ఉన్న దోసకాయలు తీసుకోండి, అరకేజీ నలుగురికి సుష్టుగా సరిపోతుంది......కాయ మరీ పండి మగ్గితే ఇగురుకి పనికిరాదు, పులుసు పెట్టుకోవాల్సిందే....కాబట్టి మరీ పచ్చి,పండు కాకుండా దోరగా,గట్టిగా,నిగనిగలాడే పసుపు రంగులో ఉన్న కాయలైతే బాగుంటాయ్......ఇప్పుడు ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి,చెక్కు తియ్యండి.....ప్రతి కాయనీ సగానికి కోసి మధ్యలో విత్తనాలున్న గుజ్జుని కాస్త నోట్టో వేసుకు చూడండి,చేదుగా ఉంటే విత్తనాలు తీసి పడెయ్యండి.అప్పుడు కండ కూడా కాస్త గిల్లితిని చూడాలి,అదీ చేదుగా ఉంటే పడెయ్యటమే....:).....{కొంత మంది విత్తనాలు వేసుకోడానికి ఇష్టపడరు...కాని ఇగురు కూరలో విత్తనాలు తగుల్తుంటే చాలా రుచిగాఉంటుంది....ఒకవేళ విత్తనాలు తీసేసేట్టైతే వాటిని పడెయ్యకుండా ఎండబెట్టుకుని, చింతకాయపచ్చడి తొక్కేప్పుడు వేయించి కలిపి తొక్కితే పచ్చడి ఘుమఘుమలాడిపోద్ది......}..ఇక కాయల్ని సన్నగా సమానమైన సైజుల్లో ముక్కలుకొయ్యాలి...ఎక్కువాతక్కువగా కోస్తే కూర సరిగ్గా ఉడకదు.....నేనైతే పైన ఫొటోలో ఉన్నట్టుగా మోయనమైన సైజులో కోస్తాను,అప్పుడు ముక్క పంటికింద తగుల్తూ బాగుంటుంది....మా అక్కవాళ్ళు సన్నగా తరిగేస్తారు,అప్పుడు కూర గుజ్జుగా ఐపోద్ది..అదోరుచి...:)
  • తర్వాత కావాలంటే ఒక టమాటా, రెండు పచ్చిమిరపకాయలు,కాసిన్ని ఉల్లిపాయలు తరిగివేసుకోవచ్చు...నేను ఉల్లిపాయలు వాడను..దోసకాయలో ఉన్న సాధుత్వం పోతుంది.....ఇలా తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకోండి...
  • ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి దాంటో ఓ చిన్నగెంటెడు నూనేస్కోవాలి...అది కొంచెంకాగిందనగానే ఒక ఎండు మిరగాయ తుంచి వెయ్యండి...తర్వాత ఆవాలు,తాలింపుగింజలూ(మినప్పప్పూ,పచ్చనగపప్పూ),కాస్త జీలకఱ్ఱా,కొంచెం ఇంగువ,కాస్త కరివేపాకు వేసుకోవాలి...ఇవన్నీ వేగి చిటపటలాడాయనుకోగానే,పైన కోసి పెట్టుకున్న ముక్కలన్నీ ఆ తాలింపులో వేసెయ్యండి.....తాలింపు వేగినంత సేపూ పొయ్యి సిమ్ లోనే ఉంచుకోండి..తాలింపు మాడకుండా ఉండటానికి ఇది సేఫ్టీ మెజర్...:)
  • ఇప్పుడు ఓ గ్లాసెడు నీళ్ళు పోసి, మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి....తర్వాత మూత తీసి సరిపడా ఉప్పూ,కారం వేసుకోవాలి....ఎంత వెయ్యాలీ? అంటే నేను ఖచ్చితంగా కొలతలు చెప్పలేను..నేను చేత్తో తీసుకుని ఉరామరిగ్గా వేసేస్తా...:)..మీరు వేసుకు సరి చూసుకుని మళ్ళా కలుపుకోండి....కాని దోసకాయకి కొంచెం ఎక్కువే పడతాయ్ ఉప్పూ,కారాలు....మా సంబారుకారమేశారనుకోండి, అది వెయ్యగానే కూర ఉడుకుతుంటే వచ్చే వాసనకే మీకు పొట్టనిండిపోద్ది మరి...:)
  • ఇక మూతపెట్టి ఉడకనివ్వండి...మధ్య,మధ్యలో మూత తీసి చూసి కలపెడుతూ ఉండాలి,లేకపోతే అడుగు మాడిపోద్ది...ముక్క ఉడక్కుండానే అడుగు మాడుతుందని అనుమానమొస్తే ఇంకాసిని నీళ్ళు పోసి ఉడికించండి....ఎగరెయ్యటం చేతైతే ఎగరెయ్యొచ్చు, ఎందుకంటే కలిపితే ముక్క చెదిరిపోద్ది..:)
  • చివరగా ముక్క బాగా ఉడికింది అనుకోగానే ఒక 100ml కాచినపాలు పోసి కలపండి.పాలుపోస్తే కూర బాగా గుజ్జుగా వస్తుంది,రంగుకూడా వస్తుంది...రంగు బాగా పసుపుగా కావాలంటే ఓ చిటికెడు పసుపు మొదట ముక్కలు తాలింపులో వెయ్యగానే వేసుకోవాలి.....ఇప్పుడు రుచికి కాస్త అల్లం,వెల్లుల్లి తొక్కి వేసుకోవాలి,కాసిన్ని కొతిమీరాకులు కూడా....:)
  • అవి వేశాక ఒక నిమిషం పొయ్యి మీద ఉంచి దించెయ్యండి...అంతే ఘుమఘుమలాడె దోసకాయ ఇగురు తయారు....చాలా వీజీగా ఉంది కదా....
ఇలా చేసుకున్న దోసకాయ చాలా ఆరోగ్యం,పులుసుల కన్నా.......పైల్స్ ఉన్నవాళ్ళకి,మలబద్ధకం ఉన్నవాళ్ళకి దోస అద్భుతంగా ఉపయోగపడుతుంది...

ఇక మిరియాల చారెలా పెట్టాలో గబగబా నేర్చేసుకుందాం...ఇది అరవోళ్ళ రసం అవునో కాదో నాకు మాత్రం తెలీదు..మా ఇళ్ళల్లో మాత్రం దీన్ని మిరియాలచారనే అంటాం..:)....కొన్ని చోట్ల మరుగుచారని కూడా అంటారు.....బాగా అలిసిపోయి బడలికగా ఉన్నప్పుడు, జొరమొచ్చి నోరు చవి చెడిఉన్నప్పుడూ,కొంచెం ఆజీర్తిగా ఉన్నప్పుడూ ఘాటుగా ఈ చారు కనక పెట్టుకు తింటే భలే హాయిగా ఉంటది....చెయ్యటం చాలా వీజీ...:)
  • ముందర కాసిన్ని మిరియాలూ,ధనియాలూ తీసుకోవాలి...మిరియాలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఘాటుగా.....నాలుగు మెంతులూ,కాస్త జీలకఱ్ఱా కూడా తీసుకోవాలి....కొంతమంది కంది పప్పు కూడా వేస్తారు.....ఇవన్నీ తీసుకుని బాండీలో వేసి పొయ్యిమీద పెట్టి రెండు నిమిషాలు వేయించాలి....అవి వేగగానే తీసి అన్నీ కలిపి రోట్లో పొడికొట్టుకోవాలి..మిక్సీలో వేస్తే అంత రుచి రాదు..ఉన్న సువాసనకాస్తా పోతుంది..రోలు లేకపోయినా మసాలా నూరుకునే గిన్నె ఉంటదికదా దాంటొ అయినా మెత్తగా నూరుకోవాలి.....
  • ఇప్పుడు ఒక లీటరు నీళ్ళు తీసుకుని దాంట్లో ఒక చిన్నముద్ద చింతపండు వెయ్యాలి...కావాలనుకుంటే రెండు టమాటాలు సన్నగా ముక్కలుకోసి వేసుకోవచ్చు...ఇప్పుడు పైన నూరిపెట్టుకున్న మిరియాలపొడి దీంటొ వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి....లీటరు సగం అయ్యేవరకు మరిగించొచ్చు...కొంతమంది చిక్కగా రావాలంటే పప్పు కలపాలేమో అనుకుంటారు..అవసరమే లేదు...ఎంత బాగా మరిగిస్తే అంత చిక్కగా వస్తుంది...
  • దించబోయే రెండు నిమిషాల ముందు అల్లం, వెల్లుల్లి తొక్కి వెయ్యాలి,మరికాస్త కొత్తిమీర,సరిపడా ఉప్పు కూడా వేసి మరగనివ్వాలి.....ఇక దించబోయే ముందు రెండు యాలక్కాయలు కొట్టి వెయ్యండి...వాసన అదిరిపోద్ది....పక్క ఇళ్ళవాళ్ళు కూడా ముక్కులు ఎగబీల్చేసుకుంటారు...:)
  • తర్వాత దీంటోకి మామూలుగా పెట్టుకునే తాలింపు తిప్పి వెయ్యడమే....ఆయితే తాలింపులో మరికాస్త కరివేపాకు,జీలకఱ్ఱ్ర వేస్తే అదిరిపోతుంది...
మిరియాలచారు బాగా కుదిరిందనడానికి నిదర్శనం ఏంటంటే, కంచంలో అన్నంపెట్టుని దాంట్లో చారుపోసి అలా కలపగానే అన్నం మెత్తగా అయిపోయి చారు చిక్కగా అయిపోతుంది..:)....బాగా పిసికి తింటే అద్భుతంగా ఉంటది....ఇలా చేసుకున్న మిరియాలచారు అన్నంతినబోయే ముందు ఒక చిన్న కప్పుడు తాగితే చాలు ఆకలి బాగా పెరుగుతుంది.....మాంఛి ఎపటైజర్ అన్నమాట...:)

హమ్మో! ఇవ్వాళ రెండు కూరలు చెప్పేశా.....మళ్ళా మరో మంచికూర చెయ్యగానే చెప్తానేం...ప్రస్తుతానికి టాటా,బైబై......:)


22 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

తాలింపు అంతా "సిం" లోనే చేస్తారా. అందుకనే మిరపకాయలు ముందరేస్తే మాడకుండా వున్నయ్యల్లె ఉంది. మిరియాల చారు కి తాలింపు విడిగా వేసి చారుకి కలుపుతారు అందుకే ఆ రుచి. దానిలో ఇంగువ కూడా వేస్తారా మీరు. ఇక్కడ దొరకని దోసకాయల బదులు "కుకుంబర్" వాడదామని అనుకుంటున్నాను. వూరెల్లుతున్నా వచ్చే నెలలో చేస్తా. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

రావు గారు, కీర దోసకాయతో పప్పైతే ప్రయత్నించవచ్చూ! ఇక్కడ దోసకాయలు దొరక్క అప్పుడప్పుడు కీరదోసకాయ పప్పు వండేసుకుంటా.. బాగుంటుంది...

Rao S Lakkaraju చెప్పారు...

దిలీప్ థాంక్స్

తృష్ణ చెప్పారు...

మీరేనా? అంటే నేనిదివరకూ మీ బ్లాగ్ చూసాను. కానీ నాకు వ్యాఖ్య రాసే కౌటిల్య మీరే అని తెలీదు..:) పేరు చూడకుండా టపా చూసి వెళ్పోతూ ఉంటా..:)అప్పుడెప్పుడో మీరు రాసిన కొబ్బరి కూర టపా ఇంకా గుర్తుందండి.

దోసకాయ పచ్చడి నా ఫేవొరేట్. దోసకాయ వీలైనంత సన్నగా ముక్కలు తరిగి, కాసిని ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర కూడా వేస్తే సూపర్. ఇక చారు ఏరకమైనా నాకు సూప్ రోజూ. అన్నంలో కలుపుకోను కానీ రెండు కప్పులు తాగేస్తా. నెక్స్ట్ నా బ్లాగ్లో కొన్ని రకాల చారులు రాస్తానుండండి..మీకు పోటీగా..:) చాలా నవ్వులు అయిపోయాయి.

Sravya V చెప్పారు...

కౌటిల్య మీకు లాగా నాకు దోసకాయ కూర అంటె మహా ఇష్టం . నాకు ఈ కూర అన్నం తో కన్నా చపాతీ తో ఇష్టం !

jyothi చెప్పారు...

బాగున్నాయి మీ కూరలు.అలాగే కాస్త మీ సాంబార్ కారం,ఆ చేత్తోటే టమాటో పచ్చడి రెసిపీలు కూడా ఇచ్చేయండి.

సుజాత వేల్పూరి చెప్పారు...

జ్యోతి గారు, సాంబార్ కారం కాదు, సంబారు కారం!

కౌటిల్యా ఈ కూర నాక్కూడా చపాతీల్తోనే ఇష్టం! లేకపోతే మరీ పథ్యం కూరలా ఉంటుంది.

సర్లేగానీ సంబారు కారం కొలతలతో ఇచ్చేయరాదూ, మనాళ్లంతా పండగ చేసుకుంటారు!

కౌటిల్య చెప్పారు...

రావు గారూ! అవునండీ నాకు పెద్ద వత్తిలో తాలింపు పెట్టాలంటే పిచ్చ బయ్యం..ః)..మిరపకాయలు ముందు వేసేది ఎందుకంటే తర్వాత వేస్తే సరిగ్గా వేగవు,అవి వేగే లోపు మిగతావి మాడిపోతాయ్..ః)....మన దిలీపు చేస్తుంటాడు కీరదోస పప్పు, ప్రయత్నించండి...

దిలీపూ, ఇక నీకు కీరదోస పప్పు తినాల్సిన పన్లేదుగా, చక్కాగా బెంగళూర్లో మంచి దోసకాయలే దొరుకుతాయనుకుంటా..ః)

తృష్ణ గారూ! దోసకాయ ముక్కలపచ్చడి మా ఇంట్లో ఐదారు రకాలుగా చేస్తారు, ఎలా చేసినా అద్భుతమే...ః)...ఇప్పుడే మీ చారులు చూశా..మీకు నేను పోటీ ఏంటండీ బాబూ...మీరు సూపరు అసలు...ః)

కౌటిల్య చెప్పారు...

శ్రావ్య గారూ! అవును చపాతీల్లో చాలా బాగుంటుంది, హాయిగా గొంతు దిగిద్ది, మిగతా మసాలా కూరల్లా కాకుండా...ః)

జ్యోతి గారూ! అది "సంబారు కారం"..ః)..రాస్తాను త్వరలో...టమాటా పచ్చడి అమ్మ రెసిపీ అండీ! నాకు ఇక్కడ చెయ్యటం కుదరదు..రోలు చిన్నది కొంటున్నా త్వరలో...అప్పట్నుంచీ ఇక పాకవేదంలో బండ పచ్చళ్ళే బండ పచ్చళ్ళు...ః)

సుజాత గారూ! కాస్తంత మన సంబారుకారం ఎక్కవవేసి మరికాసిని పాలు పోస్తే పథ్యంకూరలా అస్సలు అనిపించదు...ః)....అవును మొన్న మీరు చేశారుగా సంబారుకారం! ఎలా వచ్చింది? నే చెప్పిన కొలతలన్నీ సరిపోయాయా...ః)

సుజాత వేల్పూరి చెప్పారు...

కౌటిల్య, బెంగుళూరులో మన దోసకాయలు దొరకవు! కోలగా ఉండే చేదు దోస కాయలే! గింజలు తీసేసి సాంబార్లో వేసుకుంటారు

sunita చెప్పారు...

మీరు చెప్పిన దోసవిత్తనాల కిటుకు మా అమ్మమ్మ వాడేది. వేయించిన దోస గింజలు నూరి చింతకాయ పచ్చడిలో కలిపేది. అలానే ఓ చిన్న వెదురు బుట్టెడు ఎండు చింతాకులు కూడా. వేయించి కారంకొట్టించేది అప్పుడప్పుడు మిరియాల చారులో వేసేది. బాగా రాసారు.

పద్మవల్లి చెప్పారు...

కౌటిల్య గారు
వంటల కన్నా, మీరు చెప్పే స్టైల్ నాకు నచ్చింది.
దోసకాయ కూర నా ఫేవరేట్ కానీ, కొన్ని మార్పులతో (ఎక్కువ ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమిర వేస్తాను.). కూర ఒక్కటే కూడా సాలడ్ ల తింటాను నేనైతే. లేదా చపాతీ, ఉఇనొఅ, వ్హేఅట్ దేనితోనైన అదుర్స్. పాలు వేసి అస్సలు చేయను. ఎందుకో పాలు వేసిన కూరలు నాకు అలవాటు లేదు, అందుకేనేమో చెయ్యాలని కూడా ఇష్టం ఉండదు. దేశి దోసకాయలు దొరికినప్పుడు తప్ప, లేకపోతె ఇక్కడ కీర దోసకాయలతోనే ఎక్కువగా చేస్తాను. బాగానే వస్తుంది కానీ కొంచెం తొందరగా ఉడికిపోతుంది.

మిరియాల చారు ట్రై చేసి, తరువాత చెప్తాను.

కౌటిల్య చెప్పారు...

సుజాత గారూ! అవునా..ప్చ్..పాపం దిలీపు...ఎప్పటికి మంచిగా మన దోసకాయకూర తింటాడో..ః)

సునీత గారూ,అవును కదా! మన వేపు దోసవిత్తనాల వాడకం ఎక్కువే....మా అమ్మమ్మైతే ఇంట్లో లేకపోతే కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చి మరీ వేసేది చింతకాయ పచ్చట్లో..ః).....చింతాకు మా ఇంటో వాడం కాని మా నాయనమ్మ బాగా వాడిద్ది....

పద్మవల్లి గారూ,
మీ కాంప్లిమెంటుకి బోల్డన్ని మంగిడీలు...ః)....
ఒకసారి పాలేసిన కూరలుకూడా రుచ్చూడండి...ః)
మా ఇంట్లో ఉల్లిపాయలు వాడం అండీ..కాని అందరూ వేసుకుంటారు...
ఇంతకీ మిరియాల చారు పెట్టరా!

పద్మ చెప్పారు...

మీ రాసే విధానం భలే ఉంటుంది కౌటిల్య గారు. :)

మా ఇంట్లో దోస కూర బానే చేస్తారు కానీ అల్లం వెల్లుల్లి పాలు మటుకు వెయ్యరు. ఈ కూరకి కీర/English Cucumbers బావుండవేమో? కొంచెం పులుపు ఉన్న దోస కాయలైతే అదిరిపోతుంది కూర. :)

మిరియాల చారు మనదేనండి. అరవ్వాళ్ళ పేటెంట్ ఉందంటే నేనొప్పుకోనంతే. నా తెలుగు ఫ్రండ్స్ ఎవరైనా రసం అంటే వెంటనే చారు అని కరెక్ట్ చేస్తూంటా. :p

మా ఇంట్లో రోజూ మిరియాల చారు కంపల్సరీ. మా అమ్మ చారు పొడి కొట్టిందంటే అసలా వాసనకి ముక్కుపుటాలు అదిరిపోవాల్సిందే. శొంఠి కూడా వేస్తుంది మంచిదని. ఎంతైనా ఇంట్లో చేసినవాటి రుచి మరి దేనికి రాదు. నేను ఏ మసాలా అయినా ఇక తప్పక ఇక్కడ కొంటానేమో కానీ సాంబార్ పొడి, చారు పొడి, కూర పొడి మా ఆదరా బాదరాలో మా ఇంటి నించి రావాల్సిందే. :)

కౌటిల్య చెప్పారు...

ధన్యవాదాలు పద్మ గారూ!నేను అల్లం,వెల్లుల్లి ఊరికే కొంచెం వాసనకోసం వేస్తానండీ! పాలు వేస్తే బాగా గుజ్జుగా ఉంటుంది కూర...ః)

అవునండీ! మనది మిరియాల చారే...ఈ రసం అన్న పదం నాకూ నచ్చదు, మనవి చారులే.....నేను చారుకి పొడి ఎప్పటిది అప్పుడు తొక్కి వెయ్యటమే...అలా వేస్తేనే వాసన కమ్మగా ఉంటుంది....

మరువం ఉష చెప్పారు...

"సంబారుకారమేశారనుకోండి, అది వెయ్యగానే కూర ఉడుకుతుంటే వచ్చే వాసనకే మీకు పొట్టనిండిపోద్ది మరి...:)" 100% నిజం. మా ఊరికి నెలకోసారికన్నా దోసకాయ రాదు :( వచ్చేవి మెత్తబడి కూరకి అనువు కావు. కనుక ఆర్నెల్లకో సారి అంతే. ఇక :) పేచీ అంటే ఏదో అనేసుకున్నారు కదా. ఏమీలేదండి - మా ఇళ్ళలో వంత లెక్క ఇది - ఇగురు అంటే ముందుగా నీళ్ళలో ఉడికించిన కూరగాయాల్ని ఉప్పు కారాలతో, తదితర దినుసులతో వండే ప్రక్రియ "ఇగురు" కూర. అందువలన దోసకాయ ఇగురు లేదు. అరటి, చేమ, బంగాళా దుంప వగైరాలు ఇగుర్లకి వస్తాయి. అంతే! ఇక మీ బీరకాయ కి జోడులా మాకు దోసకాయకి టమాటతో పాటుగా ములక్కాయ తప్పనిసరి. అపుడపుడూ బంగాళాదుంప కలుస్తుంది. అవునూ గోదారోళ్ళు అని తెగ ఎత్తిచూపుతున్నారేమీ? ;) దోసగింజలకారం తెలిసినవారు ఇచ్చేవారు, అది అన్నంలో నెయ్యితో కలిపి తినటమే, అప్పట్లో ఏడ్చుకుంటూ తినేదాన్ని, మీ చింతకాయల దోసగింజల వర్ణన మాత్రం మళ్ళీ తినాలనిపిస్తుంది.

కౌటిల్య చెప్పారు...

ఉష గారూ! మాకు ఇగుర్లంటే అన్ని కూరలూ వస్తాయి...నూనె తక్కువ వేసి తాలింపు పెట్టి దాంట్లో ముక్కలు పడేసి, నీళ్ళు పోసి ముక్కలు ఉడికేదాకా ఇగరబెట్టటమే...ఇగురు కూరలన్నిట్లో పాలు పోస్తారు దాదాపు...

దోసకాయ,టమాటా,ములక్కాయ,బంగాళాదుంప కాంబినేషన్ నా ఫ్యావరేట్!..ః)

మీరు కూడా గోదారా!....హిహిహి....సరదాకండీ!

దోసగింజల కారం ఏడ్చుకుంటూ తినటం దేనికండీ! వేడన్నంలో నెయ్యేసుకు తింటే కమ్మగా ఉంటదిగా....ః)

Rao S Lakkaraju చెప్పారు...

దోసకాయ,టమాటా,ములక్కాయ,బంగాళాదుంప కాంబినేషన్ నా ఫ్యావరేట్!..ః)
----------
I got to try this "Iguru".

అజ్ఞాత చెప్పారు...

kautilya garu (mi peru kotthaga vundhamdi, miru vantalu nijamga baga chepthunnaru, inka boledanni kaburlu chadhavataniki bale vunnai) assalu miriyala charu lo elachi vesthara???? vesthe baguntundha??? nenu 1st time vintunnanu....

కౌటిల్య చెప్పారు...

అజ్ఞాత గారూ! పేరు కొత్తది కాదు, చాలా పాతదే!

మీ కామెంటు చూశాక, బ్లాగు యాక్టివ్ గా రాద్దామని ఉత్సాహమొస్తున్నది....

యాలక్కాయ వేసి చూడండి, నేను చెప్పినట్టు రెండు కాకపోయినా ఒకటి వేసి చూడండి...నచ్చితే కంటిన్యూ, లేకపోతే డిస్కంటిన్యూ...ః)... మేము మాత్రం వేసుకుంటాం...

అజ్ఞాత చెప్పారు...

na peru roopa.... koutilya garu... miru blog rayatam manesara leka kotha blog rasthunnara.... continue cheyatam ledhem??? busy ga vunnara ledha vantalu cheyatam bore kottesindha? asalu blog chusukuntunnara????
paina comment lo ' rasam lo elachi vesthara' ani adigina vyekthini nene.. inthaki ee blog ki endhuku antha break icharu??

అజ్ఞాత చెప్పారు...

na peru roopa.... koutilya garu... miru blog rayatam manesara leka kotha blog rasthunnara.... continue cheyatam ledhem??? busy ga vunnara ledha vantalu cheyatam bore kottesindha? asalu blog chusukuntunnara????
paina comment lo ' rasam lo elachi vesthara' ani adigina vyekthini nene.. inthaki ee blog ki endhuku antha break icharu??

Blogger ఆధారితం.