బీరపొట్టుతో బండ పచ్చడీ - "పెసర కట్టు" అనబడే ఓ రకం చారూ....హమ్మయ్య! మొన్న వండిన కూరలకి, రాయటానికి ఇవ్వాళ్టికి తీరిక దొరికింది......ఇవ్వాళా, రేపు మరో రెండు వెరైటీలు.....అవెప్పుడు రాయాలో!!!...స్వయంపాకం ఏమోగాని నా చెయ్యి అద్భుతంగా తిరుగుతోంది....అసలు ఒక్కో కూరా ఎలా కుదుర్తున్నాయంటే మాటల్లో చెప్పలేనన్నమాట! అన్నీ చేత్తో, అమ్మవాళ్ళలాగానే ఉరామరిగ్గా వేసేస్తున్నా..ఒక్ఖటి కూడా మొరాయించకుండా చక్కగా ఒదిగిపోతున్నయ్..:).ఇవ్వాళ నిమ్మకాయ పులిహోర కలిపానా..నా జీవితంలో మొదటిసారి పులిహోర చెయ్యడం..అచ్చు అమ్మ పులిహోరలానే కమ్మగా ఉంది.{అమ్మ రకరకాల పులిహోరలు చెయ్యటంలో దిట్టలెండి,మా ఊర్లో అంతా ఫేమస్సు, ఎవరింటో బంతి పెట్టుకున్నా,పులిహోర కలపడానికి అమ్మనే పిలుస్తారు...}.....వెరైటీ ప్రియత్వం ఎక్కువైన నా నాలిక్కి పెద్ద పండగలా ఉంది......

కాని వంట చేతవ్వడం పెద్ద గొప్పకాదనిపిస్తోంది, ఓపిగ్గా రోజూ నలుగురైదుగురికి రెండు మూడు రుచులు వండిపెట్టాలంటే మాత్రం చాలా గొప్పపని, బహుకష్టం.....ఎంత ప్లానింగు ఉండాలో,ప్రతి రోజూ ఎన్ని ప్రణాళికలు గీయాలో!!!.....ఆడవాళ్ళూ మీకు సలాం, అందుకు మాత్రం..{కాని రుచిగా మేం వండినట్టు మీరు వండలేరులే....;)...}....

మరీ "స్వడబ్బా" కాస్త ఎక్కువైనట్టుంది కదా! మరి నే చేసిన వంట మన బ్లాగర్లెవరన్నా తినుంటే కాస్త నాగురించి "పరడబ్బా" వాయించేవాళ్ళు....తర్వాత కామెంట్లలో "పరస్పర డబ్బా" ఎటూ ఉండేదే అనుకోండీ...;)......"అబ్బ! నీ సోది ఆపి మ్యాటర్ కి వచ్చెయ్ రా బాబూ" అనుకుంటున్నారా...వాకే వాకే....ఇవ్వాళ పాకవేదంలో ఏం నేర్చుకోబోతున్నారో మీరు టైటిల్ చూస్తే అర్థం అయ్యి ఉండాలి......అసలు ఈ "బీరపొట్టు పచ్చడి" కి పేద్ద హిస్టరీ ఉందిలెండి..అది తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడెప్పుడన్నా చెప్పుకుందాం.....కొంతమంది పీక్కుతినే బ్యాచ్ ఉంటారు, వాళ్ళు అంటుంటారు,"బీరపొట్టు పచ్చడా! ఏం బీరకాయల్తో చేస్తారుగా,చాల్లేదా...పొట్టుకూడా వదిలిపెట్టరా!" అని....వాళ్ళ బొంద వాళ్ళకేం తెలుస్తది, ఒక్కసారి తింటే ఎవడూ వదిలెపెట్టలేరని తెలిసి చస్తేగా.....అసలు ఇలా ఏ పదార్థాన్నీ వ్యర్థం అనుకోకుండా ప్రతి దాంటో ఉన్న రుచిని వెతికి పట్టుకునే తత్వం మన తెలుగోళ్ళకి తప్ప ఇంకెవరికీ ఉండదేమో......

ఇక పచ్చడి ఎలా చెయ్యాలో చెప్తా, పన్లో పనిగా బీరకాయ కూర కూడా చెప్పేస్తానేం సింపుల్గా........
  • ముందు బాగా లేతగా పీచు పట్టకుండా ఉన్న బీరకాయలు తీసుకోండి...అదెలా తెలుస్తుందంటారా..విరిచి చూస్తే చక్కగా విరిగిపోతుంది,మొరాయించకుండా....కొంచెం మొరాయించినా పీచు పట్టేసినట్టే.....కాయల్ని బాగా కడగాలి....కడిగాక మొదలు,చివర్లు కోసేసి ఎత్తుగా ఉన్న రిడ్జెస్ ని ముందు స్క్రాపర్ తో గీకెయ్యండి.ఎందుకంటే అది పడితే పచ్చడి మరీ గరుగ్గా తగిలిద్ది తినేప్పుడు.......తర్వాత చెక్కు మొత్తం తీసెయ్యండి...ఇలా అన్ని కాయల చెక్కు తీశాక దాన్ని వేరేగా తీసి, బాగా కడగండి.....చెక్కు తీసిన కాయల్ని కూడా బాగా కడిగి మోయనమైన సైజుల్లో ముక్కలు కోసుకోండి, తర్వాత కూర చేసుకుందాం.....:)
  • ఇక ఈ చెక్కుని బాండీలో తీసుకుని, కాసిన్ని పచ్చి మిరగాయలు,ధనియాలు,జీలకఱ్ఱ వేసి ఒక చిన్నగెంటెడు నూనె వేసి,పొయ్యి మీద పెట్టి బాగా వాడ్చండి.....పచ్చి మిరగాయలు కోసి వేయించొద్దు,కోరొచ్చిద్ది.....పచ్చిమిరగాయల మీద తెల్లగా మచ్చలు వచ్చే వరకు వేయించండి....(అరకేజీ బీరకాయల పొట్టుకు నాలుగైదు మిరగాయలు సరిపోతై.తినేవాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవచ్చు.కాని ఉల్లిపాయలు వేస్తే పచ్చడి నిలవుండదు.వెయ్యకపోతే ఫ్రిజ్జులో పెట్టకపోయినా నాలుగురోజులుంటుంది)..
  • ఇప్పుడు పైన వేయించినవన్నీ రోట్టో వేసి తొక్కుకోవాలి...తొక్కేప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలూ,కాస్త చింతపండూ,సరిపడా ఉప్పూ,కాస్త కొతిమీరా వేసి కచ్చాపచ్చాగా తొక్కుకోవాలి.రోలు లేకపోతే మిక్సీలో ఒక తిప్పు తిప్పి వదిలెయ్యండి.....మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే రుచి అంతగా ఉండకపోగా గరుగ్గా తగుల్తూ ఉంటుంది.....ఇలా తొక్కుకున్న పచ్చడిని అలానే తినెయ్యొచ్చు.లేకపోతే కొంచెం నూనె వేసి ఇంగువ తిరగమాత పెడితే బాగా రుచొస్తుంది,నిలవుంటుంది.
ఇక ఆలస్యమెందుకు? బీరకాయ కూర చేసినప్పుడల్లా పొట్టు పచ్చడి కూడా చేసుకుని ఎంజాయ్ చెయ్యండి.....రెండో కూరని గూర్చిన దిగులూ ఉండదు....

ఇక బీరకాయ కూర కూడా సింపుల్గా చెప్పేస్తానేం.....
  • పైన చక్కగా ముక్కలు తరిగిపెట్టుకున్నారు కదా, వాటికి తోడు రెండు లేత ములక్కాయల్ని కూడా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి.బీరకాయకి ములక్కాయ కాంబినేషన్ అదిరిపోతుంది.తినాలనుకునేవాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు...
  • తర్వాత పొయ్యి మీద కూరగిన్నె పెట్టి దాంట్లో తాలింపు పెట్టండి....ఆ తాలింపులో ముక్కల్ని వెయ్యండి.తర్వాత ఉప్పూ,కారం వేసి కాసిన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఉడకనివ్వండి.(స్టీలు గిన్నెగాని,కాపర్ బాటమ్ గిన్నె కాని ఐతే సిమ్ లో ఉడికించండి. లేకపోతే నీళ్ళున్నా బీరకాయ కూర ఊరకనే మాడిపోద్ది). కారం సంబారుకారమైతే బాగా రుచొస్తుంది....
  • ఇక ముక్క బాగా ఉడికి, నీళ్ళన్నీ ఇగిరిపోతున్నాయనుకోగానే ఒక 100ml కాచిన పాలు పోసి ఒక్క నిమిషం మగ్గనిచ్చి దించెయ్యండి...బీరకాయకి పాలు వేస్తేనే రుచి...ఎన్ని పోస్తే అంత గుజ్జుగా,కమ్మగా ఉంటుంది కూర.....ఇక మన టైటిల్లో రెండో వంటకం "పెసరకట్టు " చూద్దాం..... మా ఇళ్ళల్లో ఐతే పెసరపప్పు దోశలకి,వడపప్పుకి మహా ఐతే పునుగులకి తప్ప ఇక దేనికీ వాడరు..పప్పుగాని,పప్పుచారు గాని అస్సలు చెయ్యరు....తృష్ణగారి బ్లాగులో చూశాక నాకు చేద్దామనిపించి చేశా,ఆద్భుతంగా కుదిరింది....నెట్ లో కొన్ని వీడియోలు,రెసిపీలు చూశా..ఒక్కోళ్ళు ఒక్కోలా చెప్తున్నారు...అన్నిట్నీ క్రోడీకరించి చూద్దునా ఇదో రకం పప్పుచారే, ఐతే కాస్త పల్చగా పెడతారు....మరి దీన్ని "కట్టు" అని ఎందుకంటారూ! అని నన్నడగొద్దు, అది నాకు ఇప్పటికీ అర్థం కాలా...:)...ఇక నేనెలా పెట్టానో ఈ పెసరకట్టు చెప్తా...
  • ముందు పెసరపప్పుని మరికాసిన్ని నీళ్ళుపోసి ఉడికించాలి...(ఒకటికి మూడు పోశాన్నేను)....కుక్కర్ మూడు విజిల్స్ రాగానే దించి పప్పుని బాగా పప్పుగుత్తితో మెత్తగా ఎనిపాను....
  • ఈ పప్పుని వేరే గిన్నెలో తీసుకుని ఎక్కువనీళ్ళు(అరగ్లాసు పప్పుకి అరలీటరు పైన) పోసి, దాంటో పచ్చిమిరగాయలు రెండు(నిలువుగా చీల్చి), ఒక టమాటా ముక్కలు చేసి వేశా...ఇక బాగా మరిగించడమే....మరిగేప్పుడు సరిపడా ఉప్పు కాస్త అల్లం,వెల్లుల్లి,కొతిమీర వేశా......రెండు మిరియాలు,రెండు ధనియాలు వేయించి పొడి కొట్టి వేశా.....ఓ చిటికెడు పసుపు కూడా వేసి కొంచెం చిక్క బడే వరకూ మరిగించా...దించి మాంచి ఇంగువపోపు పెట్టి ఈ చారులోకి తిప్పెయ్యడమే.....చారు కొంచెం వేడి తగ్గాక కాస్తంత నిమ్మరసం పిండాను....అంతే "పెసరకట్టు" అనబడే పప్పుచారు రెడీ.... ;)
కాని నాకు నిమ్మరసం వెయ్యకముందే బాగా అనిపించింది...చక్కగా వేడి వేడిగా సూపులా తాగెయ్యొచ్చనిపించింది....ఇది అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంది. రియల్లీ ఫింగర్ లికింగ్ టేస్ట్.....కొంతమంది చింతపండు పులుసు వేసి చేస్తారట, అప్పుడిక "కట్టు" అనటమెందుకూ, పప్పుచారు అనేస్కోవచ్చు...:)....ఈ మాట ఆ యాంకరమ్మ అడిగితే ఆవిడ తెలివిగా చెప్పిన సమాధానం, దీంటో ఉల్లిపాయలు వెయ్యంకదా అని....హ్హిహిహిహ్హి....మరప్పుడు ఉల్లిపాయలు తినని మాలాంటి వాళ్ళు పెట్టుకున్నే పప్పుచార్లన్నిటినీ "కట్టు"లు కట్టెయ్యాల్సిందేనా.....:)

4 కామెంట్‌లు:

పద్మ చెప్పారు...

పప్పు కట్టు అనగా పప్పు ఉడికించిన నీళ్ళు. సాధారణంగా పప్పులో ఎక్కువ నీళ్ళు పోసి ఉడికించి లేదా మామూలుగా పప్పు వండినప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువైతేనో ఆ పప్పుని పప్పు గానో లేక సాంబార్ గానో చేసుకుని ఆ మిగిలిన నీటిని చారులో వేస్తారు. మామూలు నీటితో చేసే చారు కన్నా ఈ పప్పుకట్టుతో చేస్తే ఆ రుచి మహా అద్భుతంగా ఉంటుంది.

కౌటిల్య చెప్పారు...

అవును పద్మ గారూ! "కట్టు" అంటే నేను అసలు విన్నది,తృష్ణగారు బ్లాగులో చెప్పిందీ మీరు చెప్పినట్టే...కాని నెట్ లో ఎక్కడ చూసినా పప్పు వేసేస్తున్నారు,(చాలా మంది పెద్దవయసు వాళ్ళు కూడా)..మా ఆంటీ ఒకరు అద్భుతంగా చేస్తారు వంట,ఆవిడకూడా పప్పు వెయ్యమనే చెప్పారు...నేను అలా రకరకాల అభిప్రాయలు కలెక్ట్ చేసి పైలా తయారు చేశాను...ః)

మరువం ఉష చెప్పారు...

మీ పోస్ట్ చదివాక నేనూ నా కుండీ రాయి మీద పడి నూరి చేశాను. మాకోకటే రూల్ - పచ్చిమిర్చి వేస్తే ధనియాలవీ వెయ్యం. జస్ట్ పచ్చి(==వేపని) జీలకర్ర, వెల్లుల్లి చివర్న తీసే ముందు వేసి తొక్కుతాము. లేదా ఎండుమిర్చి, ఛాయామినప్పప్పు, ధనియాలు, పిసరు మెంతులు నూనెలో వేపి అవి దంచాక, కూర ముక్కలు, చింతపండు, ఉప్పు తో నూరి, రవ్వంత బెల్లం, జీలకర్ర, వెల్లుల్లి చివర్న తీసే ముందు వేసి తొక్కుతాము.

ఇక పప్పు కట్టు - మీరు ఓ చోట రాసినట్లుగా, పద్మ గారు, తృష్ణ గారు అన్నట్లుగా ఉడికే పప్పు పైన నీరు. మేము కందికట్టు తక్కువ కానీ పెసరకట్టు ఎక్కువ. అసలు ఈ కట్టుల్లో మహారాణి ఉలవకట్టు. పాడి పశువుకి/కాడెద్లకి వండే దాణా రాగి/మట్టి కుండ బాగా కడిగి - కుతకుత ఉడికే నీళ్ళు తీసి చేసే ఉలవచారు, తాజా మీగడ తో కలిపితే అమృతమే. అలాగే బియ్యం ఉడుకు నీళ్ళు కాస్త ఉప్పు, నేతి తడితో తాగితే వడదెబ్బ పరార్ డాక్టర్ గారు ;) + సూపర్ సమ్మర్ డ్రింక్.

ఏదో ఈ పదిహేడేళ్ళగా ఇక్కడ ఆముదం వృక్షాలం. సొంత డబ్బా కాదుగానీ వలస వలనే వంటలోనూ ఎదిగాము. ఇలానే కాస్త అరుదైన వంటలవీ, అరుదైన అమ్మ చేతివీ రాయండి.

మీ తేనెతొనల పోస్ట్ చదివితే నాకు నా పనసతొనల వంటకం తలపుకొచ్చింది.

కౌటిల్య చెప్పారు...

అయ్యబాబోయ్! ఉష గారూ! భలే నోరూరించే కబుర్లు చెప్తున్నారు....మాకు ఏ మిరపకాయవేసినా బండ పచ్చట్లో, అన్నీ పడాల్సిందే...ః)
ఉలవకట్టు అమ్మ అప్పుడప్పుడూ చేస్తుంది....

ఇక "గంజి" మా చిన్నప్పుడు సాయంత్రాలు, మా రెగ్యులర్ డ్రింక్....ః).....డయేరియా వచ్చినవాళ్ళకి ఇప్పటికీ నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఇదే...ః)

Blogger ఆధారితం.