ఇవాళ్టి నా భోజనం...."కొబ్బరికూర" తో.....
పచ్చళ్ళైతే రెండు,మూడున్నాయి, మరిప్పుడు కూర ఎలాగబ్బా అని ఆలోచిస్తుంటే, ఓ బ్రహ్మాండమైన అవిడియా తట్టింది......ఏం! పచ్చికొబ్బరితో పచ్చడే చెయ్యాలా, ఇంకేం చెయ్యకూడదా అనిపించింది....మీక్కూడా అప్పుడప్పుడు అలానే అనిపించుంటది కదూ!
ఎలాగంటే,.............,
- ముందు కొబ్బరిని అలా చిప్పల పళంగా పచ్చికొబ్బరి తురిమే దాంతో సన్నగా తురిమేశా.... (మీ దగ్గర అది లేదనుకోండి, మామూలు ఎండుకొబ్బరి తురిమే దాంతో అయినా తురుముకోవచ్చు,కాకపోతే కొంచెం కష్టపడాలి. అదీ లేకపోతే చాకుతో బాగా సన్నగా తరగండి. మిక్సీలో వెయ్యొద్దు,బాగా రాకపోవచ్చు.పెద్ద ముక్కలు పడనివ్వొద్దు,సరిగ్గా ఉడకవు.).
- తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ఓ రెండు గెంటెలు నూనేశా....అది కొంచెం కాగిందనంగానే కాసిన్ని ఆవాలు,జీలకఱ్ఱ వేసేశా....మినప్పప్పు,పచ్చెనగపప్పు కాసిన్ని ఎక్కువేశా.(ఎందుకంటే ఇవి ఎక్కువ పడితే అవి తినేప్పుడు మధ్యలో తగులుతుంటే సూపర్గా ఉంటది)....ఒక ఎండు మిరగాయ తుంచి వేశా....ఒక వెల్లుల్లి రెబ్బ నొక్కి వేసి, ఆనక ఓ చిటికెడు ఇంగువ పడేశా....
- ఈ తిరగమాత గింజలన్నీ వేగి చిటపటలాడ్గానే, ముందే రెడీగా పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేశా...
- కొంచెం గెంటెతో అలా అలా కలిపేసి, ఓ పెద్ద గ్లాసుడు నీళ్ళు పోసేసి ఉడకనిచ్చా....నీళ్ళన్నీ ఇట్టే ఇగిరిపొయ్యాయ్....మళ్ళా కాసిన్ని నీళ్ళు పోసి, పొయ్యి వత్తి తగ్గించా.....
- కాస్తంత ఉప్పు, ఘుమఘుమలాడిపోయే మా సంబారుకారం మరికాస్తంత వేసి వేగించటం మొదలెట్టా.....ఆట్టా సంబారుకారం పడగానే ఘుమఘుమా వాసనొచ్చేసి నోట్లో నీళ్ళూరిపోయాయంటే నమ్మరు....
- ఇక అలా వేగిస్తూ బాగా ఉడికిందనిపించగానే(ఉడక్కపోతే ఇంకాసిని నీళ్ళుపోసి ఇంకొద్దిసేపు వేగించొచ్చు) బాండీ దింపేసి మూతపెట్టి కాసేపు మగ్గనిచ్చా.....
- అంతే! ఘుమాయిస్తున్న "కొబ్బరికూర" రెడీ అయిపోయింది...
మీరుకూడా ఓపాలి ట్రై చెయ్యండి....:)
12:24 AM | లేబుళ్లు: తెలుగింటి కూర, భోజనం కథలు | 19 Comments
తియ్యతియ్యని "తేనెతొనలు"
రెండ్రోజుల క్రితం, పొద్దున పొద్దున్నే అమ్మ ఫోను.."చిన్నీ! ఎల్లుండి నాన్నొస్తున్నారు నీ దగ్గరకి. ఏం పంపమంటావ్?" అని.
నేను,"ఏముంది మామూలుగానే కూరలు, పెరుగు పంపు"అన్నా...
దానికి అమ్మ,"మొన్న చిన్నత్త నేతరిసెలు పంపింది. ఓ పాతిక దాకా ఉన్నాయి.చక్కలు కూడా చేశా.అవి పంపుతున్నా...ఇంకా ఏమన్నా కావాలా?బూంది మిఠాయికాని,రవ్వలడ్డుకాని......".....
అంతే! నా గొంతు హైపిచ్ లోకెళ్ళిపోయింది..:)......"ఎప్పుడూ చక్కలు,కారప్పూస,రవ్వలడ్డు....విసుకొస్తోందమ్మా! ఏవఁన్నా కొత్తరకం పంపరాదూ..."అన్నా..
అమ్మ అంతకంటే హైలోకెళ్ళిపోయి,"నాకవే వచ్చు.తింటే తిను.లేకపోతే మానుకో" అనేసింది......
ఇంకేముంది? మనం కాళ్ళబేఱానికి...:)....."అమ్మా! ఓ కొత్త వంటకం ఉంది. "తేనెతొనలు" అని. నాకు తినాలనుంది.చెయ్యవాఆఆఅ.....ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అన్నా..
అమ్మ ఒక్కమెట్టుదిగి,"నాకలాంటివి చెప్పకు.నాకు కుదరవు.అయినా కొత్త కొత్త రకాలు ఎక్కడో చదువుతావు,నా ప్రాణం తీస్తావు." అంది.
అమ్మకొంచెం చల్లపడిందిగా, ఇక మనం అల్లుకుపోయాం...."అమ్మా! ఇది కొత్తరకం కాదే! "హంసవింశతి" కావ్యంలో "ఇడ్డెనలు తేనెతొనలు బుడుకులు నేలకికాయలు" అని చెప్పాడు....అంటే ఎంతో పాతవి, ప్రాచీనమైనవి అన్నమాట! ఎలా చెయ్యాలో నే చెప్తా, అలా ఫాలో అయిపోయి చేసెయ్యి..అవిల్రెడీ నేనొకసారి చేసి సూపర్ హిట్టు కొట్టా కూడా....ఇప్పుడు చేసుకున్నే ఓపికలేక అడుగుతున్నా..ప్లీజ్...".
ఇంకేముంది, అమ్మ పూర్తిగా ఐసయిపోయి,"సరే చెప్పు...మళ్ళా బాగా రాకపోతే నన్ను వేళాకోళమాడగూడదు మరి మీరిద్దరూ కలిసి...".
"వాకే" అనేసి, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పా... కాని దానికి అమ్మ కొంత సొంత తెలివి జోడించింది...ఫలితం, పైన ఫొటొలా ఒక షేపూ,పాడూ లేకుండా వచ్చాయి, నా దగ్గరకొచ్చేపాటికి...బాగా మెత్తగాఉండి ట్రాన్సుపోర్టులో విరిగిపోయాయి...:(.......కాని టేస్టు మాత్రం తేడా రాలేదులే.....:)....
అసలు నాకు "తేనె" అన్న మాట వింటేనే నోరంతా తియ్యగా అయిద్ది..చిన్నప్పట్నుంచీ, పిచ్చిపిచ్చి కంపెనీ తేనెలు కాకుండా మంచి కొండతేనె, పుట్టతేనె అలవాటయ్యి ఉండటం మూలాన్నేమో!
అసలు తేనె అంటేనే నాకు మొదట గుర్తొచ్చేది, మా భజనలో ఆరగింపు పాట.. మా ఊరిగుళ్ళో రాత్రి పూట భజన చివర్లో నైవేద్యం పెడుతూ, రాములవారి ఆరగింపు పాట పాడేవాళ్ళు..." ఆరగింపు చేసేమయ్యా! మీరారగించండి రామయ్యా" అని...ఆ పాటలో రకరకాల నైవేద్యాలు చెప్తూ మధ్యలో, "తేనెతో మాగినా తియ్య మామిడి పళ్ళ రసమూ" అని వస్తుంది....అదివిని రాములవారికి,ఆయన పరివారానికి ఏమోగాని నాకు మాత్రం తెగ నోరూరిపోయేది...:)...ఇక మామిడిపళ్ళ సీజను రాగానే మా తోటలోంచి మంచి రసాలు కోసుకొచ్చి అమ్మని చావగొట్టేసేవాణ్ణి," ఇప్పుడివి తేనెలో మాగపెట్టి రసం తీసి ఇస్తావా, లేదా" అని..అమ్మ మాడు మీద ఒక్కటి పీకి "నోరుమూసుకో" అనేది....నా ఆ కోరిక ఇప్పటికీ తీరకుండా అలానే ఉండిపోయింది..ప్చ్..ఏం చేస్తాం...
ఇక మన "తేనెతొనల" దగ్గరికొస్తే పేరుకు తగ్గట్టు "మధురం"గా ఉంటై....చెయ్యటం చాలా వీజీ....నేను మొదట చదివి ప్రయోగం చేసినట్టే చెప్తున్నా..మీకు ఇంకా ఏవన్నా కొత్త ఉపాయాలు తడితే, అలాకూడా ప్రయత్నించండి...
- మొదట కావల్సిన పదార్థం గోధుమపిండి....ఆటా కాని, మైదాకాని ఏదైనా వాడుకోవచ్చు...దేని రుచి దానిదే....మైదాతో ఐతే కాస్త మెత్తగా వస్తాయి.....వరిపిండి కూడా వాడుకోవచ్చు...కాని వేయించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి....ఈ పిండిని బాగా జల్లించుకోవాలి, బరకలేకుండా....
- ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బెల్లం వేసి తొక్కాలి....తీపి ఎక్కువ తిందామనుకునేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు.....కాని మొదట చేసేప్పుడు, రెండూ తక్కువ మోతాదులోనే ప్రయత్నించండి...ఒక వందగ్రాముల పిండి, యాభై గ్రాముల బెల్లం అలా....తర్వాత కావాలనుకుంటే పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చు.
- ఇలా తొక్కినపిండిలో కాస్తంత నెయ్యి, సరిపడా నీళ్ళూ వేసి చపాతీ పిండిలా బాగా కలపండి....బాగా మర్దించాలి....ఇక్కడ నెయ్యి ఎక్కువ వెయ్యొద్దు...వేస్తే వేయించటానికి కుదరదు...
- ఇక ఈ పిండిని, చిన్న నిమ్మ లేదా కమలా తొనల ఆకారంలో అంటే నెలవంక చంద్రుళ్ళా బిళ్ళలుగా తయారు చేసుకోవాలి...ఎలా చెయ్యాలనేది మీ ఇష్టమండీ! చేత్తో అయినా, అచ్చుతో అయినా......తొనల ఆకారమే కాదండీ, అంత మందంగా కూడా వత్తుకోవాలి....
- ఇలా వత్తుకున్న బిళ్ళల్ని నేతిలో గాని, మంచి నూనెలోగాని వేయించుకోవాలి......(పిండి లో ఎక్కువ నెయ్యి వేసి కలిపేట్టైతే వేయించొద్దు..ఓవెన్ లో గాని, కేకు చేసే గిన్నెలో గాని బేక్ చేసుకోవచ్చు..).
- ఇక ఈ తొనల్ని మంచి తేనె ,మునిగేట్టుగా పోసి ఊరించటమే! ఒక రోజు పాటు ఊరనివ్వాలి......
- అంతే! నోరూరించే "తేనెతొనలు" తయార్.ఇట్టా నోట్టో వేసుకుంటే అట్టా కరిగిపోతాయ్...
- పిల్లలకి ఇంతకన్నా మంచి తినుబండారాలు ఏముంటాయి చెప్పండి....డయాబెటిక్స్ బెల్లం వెయ్యకుండా వట్టి తేనేతో తడుపుకుని తినొచ్చు.(మితంగా)....:)
తు.చ. :-
రెసిపీ: ఓ పాత పుస్తకంలో చదివిన దానికి నా మాడిఫికేషన్...
శ్రమ పడి చేసినవారు: శ్రీమతి సుగాత్రీ నరసింహారావు గారు....అదేనండీ మా అమ్మగారు..:).
అవిడియా, పుటో, టపా మాత్రం నావేనండీ...:)
2:39 AM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 2 Comments
కమ్మకమ్మగా...."క్యారెట్ హల్వా"
అసలు నాకు చిన్నప్పటినుంచి హల్వాలంటే స్వీటుషాపులవాళ్ళు మాత్రమే చెయ్యగలరని, మనింట్లో చేసుకోటం అస్సలవ్వదని అనుకునేవాణ్ణి....కాని అన్నిటికన్నా బహువీజీగా చేసుకోగల స్వీటులు హల్వాలని నేను గరిట పట్టుకోటం మొదలెట్టాక అర్థమైంది....ఇంకేముంది! వారానికో రకం హల్వా చేసి పడేసి మా వాళ్ళమీదికి వదిలేవాణ్ణి...ఎలా చేసినా బ్రహ్మాండంగా కుదిరేవి...మా వాళ్ళు లొట్టలేసుకుంటూ లాగించేవాళ్ళు.....అసలీ హల్వాలు చెయ్యటానిక్కావలసిందల్లా ముఖ్యంగా ఓపిగ్గా ఓ రెండుగంటలు పొయ్యి ముందు కూచోడమే!
- అన్ని పదార్థాలూ సమపాళ్ళల్లో తీసుకోవాలి.....అంటే కేజీ క్యారెట్లకి, లీటరు పాలు, అటూ ఇటూగా కేజీ పంచదార(నేను ముప్పాతిక కేజీ వేస్తాను.తీపి తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు).....
- క్యారెట్లు మంచివి ఎంచుకోవాలి. బాగా ఎర్రగా, పెద్దగా ఉన్నవి తీసుకోండి...చిన్నవి, వడలిపోయినట్టుండే వాటితో అంత రుచి రాదు...ఎక్కడా కుళ్ళు డాగులు, రంగుమార్పులు లేనివి చూసి తీసుకోండి...గాజరగడ్డలంటారే, వాటితో అంతబాగా కుదరదు........ఇలా ఎంచుకు తెచ్చుకున్న క్యారెట్లని శుభ్రంగా కడిగాలి.....చివర మొనలు కత్తిరించి, ఆవేపు నుంచి తురుముకోవాలి(అంటే నిలువుగా పెట్టి తురమాలి)...అడ్డంగా తురిమితే అంతా ముద్దలా వచ్చేస్తుంది,బాగా ఉడకదు......గడ్డ మొత్తం తురిమాక చివర్లో తొడిమ దగ్గర పచ్చగా వస్తుంది ఒక్కోసారి.అది వదిలేయండి.......ఈ తురుముని ఒక మందపాటి,లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి....(ఈ తురుముని కొందరు కొంచెం నెయ్యివేసి వేయిస్తారు, తొందరగా ఉడుకుతుందని...అలా చేస్తే అంత రుచిరాక పోగా నిలవుండదు)
- ఇప్పుడు పాలు తీసుకుని పైన రెడీగా పెట్టుకున్న తురుములో పొయ్యండి.....పాలు ఎంత చిక్కగా ఉంటే అంత రుచి వస్తుంది...గేదె పాలు డైరెక్టుగా దొరకని వాళ్ళు హోల్ మిల్క్ వాడండి...టోన్డ్ మిల్క్ వాడితే అంత రుచి ఉండదు....కేజీకి లీటరు పాలు, అరకేజీకి అరలీటరు...అదీ కొలత....
- ఇప్పుడు ఒక రెండు గుప్పిళ్ళు పంచదార తీసుకుని పైన పాలు, తురుము మిశ్రమం లో కలపాలి...ఇలా తయారైన మిశ్రమాన్ని మూతపెట్టి ఒక పావుగంట నాననివ్వండి....ఇలా చెయ్యడంవలన ఉడికేప్పుడు తొందరగా ఉడకడమే కాకుండా మంచిరుచొస్తుంది.
- ఇప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళి పొయ్యిమీద పెట్టాలి...పొయ్యి వత్తి తక్కువలో ఉండాలి..సెగ సన్నగా గిన్నెంతా సమానంగా తగలాలి.....ఏ హల్వా అయినా ఇదే ముఖ్యం...సెగ సమానంగా తగలాలి...అందుకని నేను రైస్ కుక్కర్ వాడతా...రైస్ కుక్కర్ తో ఇంకో ఎడ్వాంటేజీ....పొయ్యి ముందు గంటలసేపు నిలబడి సెగ తగిలించుకోడాన్ని తప్పించుకోవచ్చు..చక్కగా ఏ సినిమానో చూస్తూ లాగించెయ్యొచ్చు....:)
- ఇక ఏముంది? పాలు కొంచెం కాగబట్టినయ్యనగానే తిప్పడం మొదలెట్టాలి....అలా తిప్పుతూ, తిప్పుతూ ఊఊఊఊఊఊఊఊఊనే ఉండాలి....ఊరకే తిప్పడం కాదు...కిందనుంచి మీదకి కలేసి తిప్పాలి...మీరు ఎంత బాగా తిప్పితే అంత రుచన్నమాట!
- కొంచెం ఉడుకుపట్టగానే మిగతా పంచదారని కూడా వేసి కలతిప్పండి....పంచదార మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు...తీపి సరి చూసుకుని మధ్యలో అయినా కలుపుకోవచ్చు...
- ఇప్పుడు ఉడుకుతుండగానే జీడిపప్పు ఓ గుప్పెడు తీసుకుని వేసి కలబెట్టి ఉడకబెట్టెయ్యండి...జీడిపప్పుతో కలిసి ఉడికితే మంచి రుచొస్తుంది...ఓపికుంటే జీడిపప్పుని పొడి చేసి కూడా కలుపుకోవచ్చు....
- ఇక అసలు హల్వాలన్నిటికీ ముఖ్యమైన అమృతంలాంటి పదార్థం....లాంటేమిటీ! అమృతమే!..అదేనండీ బాబూ "నెయ్యి"....కేజీ క్యారెట్లకి అరకేజీ నెయ్యి..అదీలెక్క....కనీసం నాలుగోవంతన్నా వెయ్యాలి....లేకపోతే అసలు హల్వా వండటం వృథా....."హమ్మో! అంత నెయ్యా! మా హార్టేం కావాలి? మా గ్లామరేం కావాలి" అంటారేమో! ఎప్పుడొ ఆర్నెల్లకోసారి వండి, ఓ చిన్నకప్పుడు తినేటప్పుడు ఇల్లాంటివన్నీ ఆలోచించకూడదు...హార్టు కాదు కదా, దాని మీదుండే కవరుకి కూడా ఏం కాదు, నాదీ పూచీ! నెయ్యి మాత్రం మంచి క్వాలిటీది వాడండి...ఇంట్లో తాజాగా వెన్నకాచిన నెయ్యైతే శ్రేష్ఠం....బాగా ఎఱ్ఱగా కాగిన ముదురుకాపునెయ్యైతే ఘుమఘుమలాడి పోద్ది...డాల్డాల్లాంటివి దయచేసి వాడొద్దు..వాడితే అంతా రసాభాసమే!....వెగటేస్తది అని నెయ్యి దగ్గర కాంప్రమైజ్ కావొద్దు...కావాలంటే కాస్త తీపి తగ్గించుకోండి, సరిపోద్ది...
- పంచదార వేశాక, కొంచెం దగ్గరకి అవుతుంది అనుకోగానే కొంచెం కొంచెం నెయ్యి వేసి ఉడకనివ్వాలి...ఇలా నేతిలో ఉడికితే రుచికి రుచీ, మృదుత్వానికి మృదుత్వమూ......
- బాగా దగ్గరకి అవ్వగానే ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష, చిటికెడు యాలక్కాయల పొడి వెయ్యాలి.....
- ఇక అంచులు విడిపడతన్నై అనుకోగానే మిగతా నెయ్యి పోసేసి తిప్పండి...(ఇక్కడ తిప్పడంలో కాస్త ఏమరారా అంతేసంగతి! రుచిమాట దేవుడెరుగు, మాడిపోద్ది.)
- "మర్దనం రుచి వర్ధనం" అన్నారు...మొదటి నుంచి చివర వరకూ తిప్పుతూనే ఉండాలి, అప్పుడే రుచి...ముందే చెప్పాకదా! పొయ్యి ముందు కనీసం ఓ గంటైనా కూర్చునే ఓపికుండాలి.....
- ఇక చివర్లో గోరంత పచ్చ కర్పూరం వేసి, ఒక్క నిమిషం ఉంచి దింపెయ్యాలి....పైన మీకు అలంకరణకి కావాలంటే నేతిలో వేయించిన జీడిపప్పు,బాదంపప్పు వేసుకోవచ్చు....
- పచ్చికోవాలు,ఎండుకోవాల్లాంటివి వేసుకుని రుచి చెడగొట్టుకోవద్దు...
- అంతే! కమ్మకమ్మని క్యారెట్ హల్వా తయార్! ఇలా చేసింది వేడిగా ఐనా తినొచ్చు... చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది....ఫ్రిజ్‍లో పెట్టకపోయినా నాలుగైదురోజులు నిలవుంటుంది....
తు.చ. :- పైన పుటో బాగా రాలేదు, (మన పొటోగ్రపీ స్కిల్సు అలా ఉన్నై మరి)...కాని నెయ్యి మాత్రం అలా తేలుతూ కనపడాలి...:)
5:41 PM | లేబుళ్లు: తియ్యతియ్యగా | 13 Comments
పులగం - మన "భోగి" విశేష భోజ్యం
పాకం పట్టిన అరిసెల పిండిని అమ్మ చూడకుండా ఎత్తుకెళ్ళడం,భలే సరదాగా ఉండేది....ఒకళ్ళింట్లో అరిసెలు చేస్తున్నారంటే, చుట్టుపక్కల పదిళ్ళవాళ్ళు చేరి కలిసి చేసేవాళ్ళు..అమ్మ ఆ పదిరోజులూ బిజీ బిజీ...ఎక్కడోచోట సరిపోయేది..."ఇవ్వాళ వాళ్ళింట్లో పాకం సరిగ్గా కుదర్లేదురా,అరిసెలు సరిగ్గా రాలా" అంటూ వచ్చేది....మా ఇంట్లో అరిసెలంటే ఓ పెద్ద ప్రహసనం....పాలేర్లు మధ్యాహ్నం పిండి కొట్టటంతో మొదలయ్యేది...సాయంత్రం పాకం పట్టేవాళ్ళు....ఇక అరిసెలు వత్తటమంటే ఓ పెద్ద ఆర్టు...మా పెద్దత్త ఒకేసారి నాలుగు,ఐదు వత్తేది...నేను కూడా ఓ చెయ్యేసేవాణ్ణి... :)....అందరూ నెయ్యి, నూనె కలిపి వండేవాళ్ళు, మా ఇంట్లో మాత్రం వట్టి నెయ్యిలో వండేవాళ్ళు..నాన్న డాల్డాలు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు... అన్నీ వరిచెత్త మీద ఆరపోసే వాళ్ళు....లెక్కపెట్టటం పిల్లల వంతన్నమాట! వెయ్యి దాకా అయ్యేవి....నేను మరీ చిన్నప్పుడు నేను నిద్ర లేచేపాటికి వంటగది నిండా అరిసెల డబ్బాలుండేవి. "తెల్లారేకల్లా ఎల్లా వచ్చాయా?" అని తెగ హాచ్చర్య పడిపోయేవాణ్ణి...అమ్మ,"నాన్న మంత్రం వేసాడు, అంతే వచ్చేశాయి" అని నవ్వుతూ చెప్పేది....
ఇక పండగ మూడురోజుల్లోకీ నాకు బహు ఇష్టమైంది భోగి...ఎందుకంటే, రకరకాల విశేషాలన్నీ ఆ రోజే కదా! సంక్రాంతి రోజు ఏముంది? ఎప్పట్లా పూజ, బెల్లం పాయసం నైవేద్యం, హరిదాసుకీ, బ్రాహ్మడికీ మోయనలివ్వటం..అంతే కదా! అదే భోగి రోజునైతే వేకువఝామున్నే పోటీలు పడి వేసే భోగిమంటలు, తర్వాత అమ్మ తలకి ఆముదం,వంటికి నువ్వులనూనె రాసి రేపటగ్గిలో నుంచోపెట్టేది..తర్వాత కుంకుళ్ళెట్టి తలకలు...కొత్త బట్టలేసుకుని సాయంత్రం భోగిపళ్ళకి కావాల్సిన రేగిపళ్ళ కోసం చేల మీద పడేవాళ్ళం...,,ఊర్లోకల్లా మాదే పెద్ద రేగిచెట్టు....అన్నయ్య ఎవరూ రాకుండా కాపలా నుంచుంటే, నేను అక్కావాళ్ళం పిందెతో సహా దులిపేసేవాళ్ళం...దార్లో వచ్చేప్పుడు ఉండే చిన్న చిన్న రేగ్గుట్టల్ని కూడా వదిలేవాళ్ళం కాదు... ;)....
ఇక ఇంటికి రాగానే అమ్మ అరిటాకులేసి, కమ్మటి వాసనతో ముక్కు పుటాలు అదరగొడుతున్న వంటకం వడ్డించేది...."పులగం".....అదన్నమాట! ఇవ్వాళ పాకవేదంలో మనం రుచ్చూడబోతున్నది.....అసలు ఆ వాసనే చాలు. కడుపు నింపెయ్యటానికి....అన్నంలో పెసరపప్పు,నెయ్యి కలిపిన ఆ వాసన నాకు సంవత్సరమంతా ముక్కంటుకునే ఉండేది...మధ్యలో పేద్ద గురుగు చేసి, దాన్నిండా నెయ్యి పోసుకుని, పక్కన దొడ్లో కాసిన లేత సొరకాయల్తో నూరిన పచ్చడి, లేలేతవంకాయలు కుమ్ములో పెట్టి కాల్చి చేసిన రోటి పచ్చడి వేసుకుని తింటుంటే...."అబ్బబ్బా! ఇది కదా సంక్రాంతి సంబరమంటే!" అననిపించేది...
మరిక అలాంటి "కమ్మటి పులగం" చేసుకుని రుచ్చూద్దామా!
- మొదట సరిపడా బియ్యం తీసుకుని రాళ్ళులేకుండా చెరిగేసి, బాగా శుభ్రంగా కడిగి, మునిగే వరకు నీళ్ళు పోసి కనీసం రెండు గంటలు నానపెట్టాలి.బియ్యం ఎంత బాగా నానితే అంత మృదువుగా వస్తుంది పులగం.....కొంత మంది కొత్తగా పండిన ధాన్యమే వాడాలని జొన్నలతో చేసేవాళ్ళు....వట్టి జొన్నలైతే కొంచెం కాయలుగా వస్తుంది, అందుకని తొక్కి రవ్వ చేసుకుని వాడుకుంటే బాగా వస్తుంది...
- తర్వాత పైన తీసుకున్న బియ్యంలో మూడొంతులు పెసరపప్పు తీసుకోవాలి.అంటే గ్లాసు పెసరపప్పుకి మూడుగ్లాసుల బియ్యమన్నమాట! లేకపోతే మా ఊరి భాషలో "గిద్ద పప్పుకి మూడుగిద్దలు బియ్యం".....ఇవి కూడా బాగా కడిగి నానపెట్టుకోవాలి. {పెసరపప్పు బదులు కొంతమంది నల్లపెసలు వాడతారు.కందిపప్పు కూడా వాడుకోవచ్చు. కాని పెసరపప్పు రుచే వేరు..;)........అసలు ఈ పెసరపప్పు,బియ్యంల నిష్పత్తిని బట్టే దానికి పులగం,మళహోర,కట్టుపొంగలి,కిచడీ అని పేర్లు మారతాయ్.....౧) "మళహోర"లో పెసరపప్పు కి రెట్టింపు బియ్యం( అంటే బియ్యంలో సగం పెసరపప్పు) వేస్తారు...దీన్నే తమిళులు కాసింత నెయ్యి, జీడిపప్పు ఎక్కువ జోడించి "కటు పొంగలి" అంటారు. "కట్ పొంగల్", "కట్టు పొంగలి","కట్టె పొంగలి" దీని నామాంతరాలన్నమాట! తీపి వేసి, బాగా పాలు పోసి చేస్తే అది తీపి పొంగలి, తీపిలేకుండా కొంచెం కారంగా "మిరియాలు,అల్లం" వేసి చేస్తే కారంగా, కటువుగా ఉంటుంది కాబట్టి "కటు పొంగలి". ఈ కటుపొంగలి అనేది తమిళపదం, "మళహోర" మన తెలుగువాళ్ళది.కాబట్టి దీన్ని మనవాళ్ళు ఎన్నో వందలేళ్ళుగా వండుకుతింటున్నారని, ఎక్కడి నుంచీ అప్పు తెచ్చుకు తిందికాదని మనవి!........౨)ఇక "కిచిడీ" అనే "కిచ్చడి"లో బియ్యానికి, రెట్టింపు పెసరప్పు(అంటే గ్లాసు బియ్యానికి,రెండు గ్లాసుల పెసరపప్పు) కూరగాయ ముక్కలు కలిపి వండుతారు....... }.
- అవి బాగా నానాక సరిపడా గిన్నె పెట్టి దాంట్లో తాలింపు పెట్టుకోవాలి. ఏ వంటకానికైనా తాలింపే ముఖ్యం అని చెప్పాకదా! ఎలా పెట్టాలో చూద్దాం. గిన్నెలో బాగా మరింత నెయ్యి వేసి కాగనివ్వాలి.నెయ్యి వేస్తేనే రుచి.లేకపోతే నూనెతో కూడా పెట్టుకోవచ్చు. కాగిన నేతిలో సరిపడా జీలకఱ్ఱ వెయ్యాలి. ఎక్కువైనా వేసుకోవచ్చు.ఇంక ఏ తాలింపుగింజలూ వాడొద్దు...ఇంగువకూడా వెయ్యాలి...మిరియాలు తగినన్ని ఈ తాలింపులో వేసుకోవాలి...(లేకపోతే అన్నం ఉడికేప్పుడు కూడా వేసుకోవచ్చు.మిరియాలపొడి వాడేట్టైతే అన్నం ఉడికేప్పుడే కలపాలి....)....
- మిరియాలు వేసిన వెంటనే ఎసరు పొయ్యాలి. ఎంత పొయ్యాలి? మామూలుగా అన్నం వండేప్పుడు గ్లాసు బియ్యానికి, రెండు గ్లాసుల నీళ్ళు పోస్తాం కదా! ఇక్కడ మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి.రుచికి కావాలంటే చిన్న గ్లాసుడు పాలు కూడా పోసుకోవచ్చు.
- ఎసరు బాగా తెర్లింతర్వాత, పైన నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. బియ్యం ఉడుకు పట్టిందనగానే పెసరపప్పు వేసి బాగా కలతిప్పి ఉడికించాలి. ఎంత బాగా తిప్పితే అంత రుచి.....రెండూ బాగా దగ్గరకయ్యాయి అనుకోగానే రుచికి తగినంత ఉప్పు, కాసిన్ని అల్లం ముక్కలు(సన్నగా తరిగినవి) కలుపుకోవాలి.మరీ గట్టిపడనివ్వొద్దు...కొంచెం మెత్తగా,లేహ్యంలా ఉంటేనే రుచి. చివర్లో దించేప్పుడు మరికాస్త నెయ్యి వేసి కలిపి దించాలి.....
- దించాక నేతిలో వేయించిన జీడిపప్పు కలుపుకోవచ్చు......అంతే! ఘుమఘుమలాడే "పులగం" తయారన్నమాట!
- ఎక్కడో ఒక కవి " సస్నేహా కామినీ వేయం కృశరా శిశిరే హితా" అని చక్కగా వర్ణిస్తాడు...అంటే, " ఈ పులగాన్ని కమ్మటి నెయ్యి మరికాస్త వేసుకు తింటే చలికాలంలో పడుచుపిల్లలా వెచ్చదనాన్నిస్తుందని" అర్థం...అంటే, చలికాలంలో తింటే ఆరోగ్యం అన్నమాట! నందికేశ్వర నోములో బ్రాహ్మలిళ్ళల్లో ఎక్కువగా వండుతారు దీన్ని!
- ఇక ఆలస్యం దేనికి...చక్కగా వండుకుని, ఎత్తుకెత్తు నెయ్యి పోసుకుని, చక్కటి రోటి పచ్చడి కాని, మాంఛి దప్పళం కాని వేసుకుతిని స్వర్గ వీధుల్లో విహరించండి మరి!
10:08 PM | లేబుళ్లు: పండగల విశేష భోజ్యాలు | 7 Comments
ఆవమజ్జిగ....కాస్తంత రుచ్చూడండొచ్చి....
"ఆవమజ్జిగా! ఇదేంటీ? ఆవుమజ్జిగ,గేదెమజ్జిగలా" అనుకుంటున్నారా! చిన్నప్పటినుంచి ఎవరికి చెప్పినా ఇదే కొచ్చను..అయినా తినబోతూ రుచులెందుకండీ అడగడం....నే చెప్పినట్టు ఫాలో ఐపోయి వండి, తిని,రుచ్చూసి చెప్పండి-సొర్గానికి బెత్తెడెత్తునున్నారో లేదో!...నాల్రోజుల కితం ఓ స్నేహితుడింట్లో చేస్తే, అందరూ మొదటి ముద్ద నోట్టో ఏసుకోగానే, అలా రీళ్ళు తిప్పేసుకుని సొర్గం అంచులదాకా ఎళ్ళొచ్చారంటే, దీని కమ్మదనం గురించి ఏరే చెప్పాల్నా!కాని నే చెప్పే స్టెప్పులన్నీ ఇదిగా ఫాలో అవ్వాలన్నమాట!.... అదీ, బుద్ధిమంతుల లచ్చనం....
ఓ పదిహేనేళ్ళ క్రితం అనుకుంటా! నాన్న నన్ను తీసుకుని అయ్యవార్లింటికి వెళ్ళారు...అయ్యవారంటే, బడిపంతులో, గుళ్ళో పూజారిగారో కాదండీ! పేద్ద అగ్రహారీకులు,తమిళబ్రాహ్మలు....వాళ్ళిల్లు పెద్ద రాజులకోటమల్లే ఉంటది.... దాసీలు,హడావుడి...చుట్టుపక్కల నలభై,యాభై ఊళ్ళకి గురువుగారిలాంటి వారన్నమాట!లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రోపాసకులు....రోగమొచ్చినా,ఇబ్బందొచ్చినా, పెళ్ళి ముహుర్తాలకైనా,ఇళ్ళప్లానులకైనా,గుళ్ళు కట్టాలన్నా అందరూ ఆయన దగ్గరకే వెళ్ళేవారు....ఎవరి దగ్గరా కాణీ పుచ్చుకోరు...అందరికీ ఉచిత సహాయమే....ఊళ్ళో ఏ ఆడపిల్ల పెళ్ళైనా వెళ్ళి తాళిబొట్టిచ్చి పెళ్ళి చేయించేవాళ్ళు...వాళ్ళ పొలాలు అందరూ ఊరికే చేసుకునే వాళ్ళు..... మా ఊరికి పది కిలోమీటర్లదూరంలో ఉంటుంది వాళ్ళఊరు...ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రోజుకి కనీసం ఇరవై,ముఫ్ఫైమంది వాళ్ళింట్లో ఉచితంగా భోజనం చేసేవాళ్ళు...అందరికీ చిన్నయ్యవార్ల భార్య చక్కగా మడి కట్టుకుని, కొసరి కొసరి వడ్డించేవాళ్ళు......
నాన్నగారికి,అయ్యవార్లకీ బాగా స్నేహితం...అమ్మగార్లకి కూడా నాన్నగారు బాగా పరిచయం...నాన్న ఎంత వాస్తుపండితుడైనా సలహాకో,డిస్కషనుకో ఆయన దగ్గరకి వెళ్ళేవారు...ఒకరోజు నన్నుకూడా తీసుకెళ్ళారు...బైట వెయిట్ చేస్తూ ఉన్నాం.. మధ్యాన్నమైంది....అమ్మగారొచ్చి బైటున్నందర్నీ భోజనానికి పిలిచారు...ముందు పప్పు,కూర వడ్డించారు....అయ్యాక అమ్మగారు "ఆవమజ్జిగ" వేసుకుంటారా అనడిగారు..నేను "మజ్జిక్కాదు,కొంచెం కూరవెయ్యండి" అన్నా....ఆవిడ నవ్వుతూ ఇది కూడా కూరలాంటిదే అన్నారు...సరే వెయ్యమన్నా....ఆవిడ పెద్ద వెండిలోటాతో తెచ్చి వడ్డించారు.....మొదటి ముద్ద నోట్టో పెట్టుకున్నానో లేదో కమ్మటి,ఘాటైన రుచి నసాళానికంటి,ముక్కులకెగదన్ని కిందుమీదయ్యాను........ఆ రుచి ఇంతవరకి నే మర్చిపోలేదు...వెంటనే ఎలా చెయ్యాలో నాన్న అమ్మగారినడిగి కనుక్కున్నారు..ఇక నేను,నాన్న ఇంటికొచ్చిన తర్వాత అమ్మని పోరు పెట్టి చేయించాం....కాని ఆ రుచిలో వందోవంతుకూడా వచ్చేదికాదు......ఎందుకా అని ఆలోచిస్తే అమ్మ ఎజ్జాట్టుగా అమ్మగారు చెప్పినట్టు చేసేదికాదు...సొంత తెలివి జోడించేది....సో, మనకి నచ్చేదికాదు....ఇక్కడ మీకు ఆ ఎజ్జాట్టు రెసిపీ చెప్పబోతున్నా అన్నమాట!
- ముందుగా ఏం కావాలి? - మీరు ఎంత తిందామనుకుంటున్నారో అన్ని మజ్జిగ.....ఈ మజ్జిగ ఎలా ఉండాలి? ఎలా ఉంటే మంచిరుచొస్తుంది?- బాగా గట్టిగా తోడుకున్న తియ్యటి గేదే పెరుగైతే మంచి రుచొస్తది....మజ్జిగ అన్చెప్పి మళ్ళా పెరుగంటాడేవిఁట్రా అనుకుంటున్నారా? అల్లాంటి పెరుగునుంచి చేసిన మజ్జిగ ఐతే సూపరన్నమాట!.....మజ్జిగ చిక్కగా ఉండాలి, ఎంత చిక్కగా ఉంటే అంత రుచి......కొంచెం పుల్లగా అయ్యేవరకు ఉంచాలి....అంటే సుమారు మూణ్ణాలుగ్గంటలన్నమాట! పొద్దున్నే వంట చెయ్యాలనుకుంటే, రాత్రిటి పెరుగుని కాస్త తీసి పక్కనపెట్టుకుని పొద్దున్నేలేచి,చిలికేసి ఒక గంటాగాక చేస్తే సరిపోద్ది...మరీ పుల్లగా అయినా రుచి మారిపోద్ది......ఇంకో మాట! వెన్న తియ్యొద్దు,అలానే ఉంచెయ్యండి....కాని పైన తేలకుండా, కరిగిపొయ్యేట్టు చూసుకోవాలి.....
- తర్వాత కావల్సిన ముఖ్యమైన పదార్థం- ఆవాలు......చక్కగా,నల్లగా గుండులా ఉండేవైతే బాగుంటాయి....రాళ్ళు లేకుండా చూసుకోవాలి...ఒక అరలీటరు మజ్జిగకి, గుప్పెడు ఆవాలు సరిపోతయ్.ఇప్పుడు ఈ పచ్చి ఆవాల్ని మెత్తగా పొడికొట్టాలి....(వేయించొద్దు,అస్సలు) మిక్సీ కన్నా బండమీద గుండ్రాయెట్టి నూరితేనే మంచిది..గుండ్రాయి లేకపోతే బరువైన చిన్నగిన్నెకూడా వాడుకోవచ్చు....రోలైతే మరీ మంచిది.....బరక,బరగ్గా ఉన్న ఆ పొడిని పల్చటి గుడ్డలోక్కాని, టీ నెట్ లోక్కాని ఎత్తుకోవాలి......అందులో నీళ్ళు కొద్ది కొద్ది చుక్కలుగా వేసి ఈ పొడినుంచొచ్చే రసాన్ని,పైన రెడీ గా ఉంచుకున్న మజ్జిగలోకి పిండుకోవాలి(వడకట్టాలన్నమాట)...ఎంత రసం వస్తే అంత రుచి......పిప్పి మజ్జిగలో పడకుండా జాగ్రత్త పడాలి, పడితే తినేప్పుడు చెత్తచెత్తగా అనిపిస్తుంది...(ఈ వడకట్టటం,రసం తియ్యడం ఎందుకులే అనుకుంటే, పొడి బాగా మెత్తగా నూరుకుని, నాలుగు చుక్కలు నీళ్ళు వేసి పేస్టులా చేసి,అప్పుడు మజ్జిగలో కలపాలి....పొడి డవిరెక్టుగా మాత్రం కలపొద్దేం)......
- తర్వాత చిటికెడు పసుపు కలపాలి....(స్పూనుల లెక్కలు మనకు తెలవదు..చేత్తో తీసుకుని ఉరామరిగ్గా వేసెయ్యటమే...).. ఆనక, మీరు ఎంత తింటారో అంత ఉప్పు,కాసింత ఎండుకారం కలుపుకోవాలి(మసాలా కారాలు,కొబ్బరికారాలు వాడొద్దు)...
- టమాటా ముక్కలు,ఉల్లిపాయలు లాంటి చెత్త మాత్రం అస్సలు కలపొద్దు...కలిపితే అసలు టేస్టు హుష్ కాకీ!అల్లం కూడా వద్దు, సాధుత్వం పోతుంది. అంతగా వెయ్యాలనుకుంటే డైరెక్టుగా ముక్కలు వెయ్యొద్దు..కాస్తంత రసం తీసి వేసుకోవచ్చు.....పచ్చి మిర్చి మాత్రం మీ ఇష్టం....ఒకటి,రెండు కాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు....
- ఇలా కావలసినవన్నీ వేసి బాగా కలుపుకోవాలి...
- ఇప్పుడు తిరగమాతెట్టుకోవాలి. అదేనండీ మీ భాషల్లో తాలింపు,పోపు వగైరా వగైరా.....
- నా మట్టుక్కు నాకు ఏ కూర రుచైనా తిరగమాత మీదే ఆధారపడుంటది....ఒక్కో కూరకి ఒక్కోరకం తాలింపు....ఇక్కడెలా పెట్టాలి? తొందరెందుకూ, చెప్తా కదా! మొదట్లో నాకైతే తిరగమాత మాడకుండా సూస్కోటమే పేద్ద నల్భీమపాకంలా అన్పించేది మరి!
- పొయ్యి మీద బాండీ పెట్టెయ్యండి..బాండీ వేడెక్కగానే, దాంటో ఓ గెంటెడు నూనేస్కోవాలి..ఏ నూనె? అది మీ ఇష్టం...నాకు మట్టుక్కూ నాకు, నెయ్యిగాని,వేరుశనగనూనె గాని కావాలి....వాటి దుంపదెగ! అవెట్టి పోపెడితే ఎంత కమ్మగా ఉంటయ్యో కూరలు.....ఇదిగో హెల్తెవేర్నెస్సు పిల్లలూ! నామీదకి దండెత్తెయ్యకండేం!.... నూనె కొంచెం కాగిందనంగానే కాసిన్ని ఆవాలూ, మరి కాసింత జీలకఱ్రా ఎయ్యాలి..అవి చిటపటలాడగానే కాసిన్ని ఎండు మిరగాయలు(తుంచి వెయ్యాలి),మాంఛి నవ నవలాడే కరేపాకు గుప్పెడు వేసెయ్యండి...అసలు ఆవమజ్జిక్కి రుచల్లా ఈ రెండే....మధ్యలో పొయ్యి వత్తి తగ్గించి పెట్టుకోండి, లేకపోతే తిరగమాత మాడిపోద్ది....మినప్పప్పూ,పచ్చనగపప్పూ వెయ్యాల్సిన పన్లేదు...వేసినా ఇబ్బందిలేదు...ఇవి వేగేలోపే, ఒక వెల్లుల్లిరెబ్బ గరిటతోగాని, పప్పుగుత్తితోగాని నొక్కి వెయ్యండి..ఆ చేత్తోటే కాసింత ఇంగువ.....అన్నీ మోయనంగా వేగాక బాండీ దించెయ్యండి...
- ఇప్పుడు ఈ తిరగమాతని, ముందు అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్న మజ్జిగలోకి వేసి తిప్పెయ్యండి...అంతే ఘుమఘుమలాడే "ఆవమజ్జిగ" రెడీ...పైన అలంకరణకి కావాలంటే కూసిన్ని కొతిమీరాకులు జల్లుకోవచ్చు....
- ఇక దీన్ని వేడివేడి సన్నన్నంలో గాని, జొన్న సంకటిలోగాని కలుపుకు తింటే ఉంటది...ఆహా! సొర్గానికి నిజంగా బెత్తెడెత్తునే....అదేదో ఇంగిలీసులో అంటారే ఫింగర్‍లికింగ్ అని, అలా ఎవరూ చూడకుండా వేళ్ళు కూడా నాకేస్కోవాలని తెగ అనిపించేత్తది మరి.....ఇంకోమాట చెప్పటం మర్చిపొయ్యా. ఎండు మిరగాయలు,కరేపాకు ఏరెయ్యకండేం....నూనెలో వేగి,తర్వాత మజ్జిగలో నానిన వాటి రుచే వేరు.....
- ఇందులో ఆరోగ్యం,క్యాలరీలు,తొక్కు,తోలుగుడ్డూ అని ఏం ఆలోచించకుండా చక్కగా రుచిని ఆస్వాదించండేం.... చేసేప్పుడు ఏమన్నా డవుట్లొస్తే ఎంటనే కామెంటెట్టెయ్యండి.....
- మళ్ళా ఓ మాంఛి వంటకంతో కలుసుకుందాం....ఉంటానేం....
8:00 PM | లేబుళ్లు: చారులు, నా మొదటి పనస | 25 Comments
అవును మరి!...నిఝంగా వేదమే!
ఇంకోమాట! ఈ టైటిల్ ని ఎజ్జాట్టుగా కాపీకొట్టటం ఎందుకు జరిగిందనగా, అది మనకు అంతలా నచ్చేయటం ఓ రీజనైతే, ఇంకోటి దీనిమీద రమణగారు పేటెంటు హక్కులు,గట్రా ప్రకటించకపోవటం అన్నమాట! అదిగో, అవిల్రెడీ వంటల బ్లాగులు సూపరు హిట్టుగా నడిపేస్తున్న ఆడలేడీసు తెగకుళ్ళేసుకుంటున్నట్టున్నారు....మరి, పెన్ను పట్టినా,గరిట పట్టినా మాదే కియేటివిటీ మరి..:))...
ఇకపోతే, రమణగారు చెప్పినట్టు ఇది "అపౌరుషేయం" అన్నమాట! అపౌరుషేయం అంటే ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండీ! పురుషుడితో చెయ్యబడే పనిని "పౌరుషేయం" అంటారు.....అపౌరుషేయం అంటే, దానికి ఎజ్జాట్టుగా ఆపోజిట్టన్నమాట! ఆ..ఆ..ఆ...ఆడలేడీసూ.....మరీ అంత సంబరపడిపోకండి....ఇది మీరనుకుంటున్న అర్థం కాదు....అందుకే మరీ ఆవేశపడకుండా కూసింత బుఱ్ఱెట్టి ఆలోసించమనేది......ఇక్కడ ఆపోజిట్టంటే, ఆపోజిట్టు జెండరని కాదు......"పురుషులతో చెయ్యబడనిది, చెప్పబడనిది" అని అర్థమన్నమాట! ఇక్కడ పురుషుడంటే, "మనిషి" అనర్థం...మగాడా,ఆడదా అనే లింగభేదం లేదన్నమాట! మరి దేవతలు చెప్పారా?వాళ్ళల్లో ఆడ,మగ లేరా? అని కొచ్చన్సెయ్యొద్దేం.......నాకు తెలవదన్నమాట!
కాబట్టి, వేదంలో లానే ఇక్కడ కూడా ఉదాత్త,అనుదాత్తాలు పాటించాలన్నమాట! అదే ఈ మధ్యకాలంలో అస్సలు జరగట్లేదు. ఈ స్త్రీలు మాదగ్గరనుంచి లాగేసుకుని ఇలాంటి నియమాలేవీ పాటించకుండా, మా పురుషజాతిని నానా ఇబ్బందులకీ గురి చేస్తున్నారు.....పైగా "నలభీమపాకం" అన్నారుగానీ, ఎక్కడా "ద్రౌపదీపాకం","దమయంతీపాకం" అన్లేదు కదా!కాబట్టి,మాకు తెలిసిందే రెసిపీ, మేం చేసిందే వంట అనే ఈ స్త్రీజాత్యహంకార ధోరణికి నిరసనగా మొదలైందే ఈ "పాకవేదం".....(మరీ ఆవేశంలో భారీ డవిలాగులు కొట్టేసినట్టున్నాను....తూచ్..తూచ్...ఎవరూ ఏమనుకోకండేం....నాకు తెలుసు, మీరు "క్షమయా ధరిత్రు" లని..:)....)....
కాబట్టి, కామ్రేడ్స్! (ఊఁహూఁ! ఈ పిలుపు బొత్తిగా బాలేదు...మన టైటిల్ కి అస్సలు సూటవ్వట్లా! మరేమందాం? డవిరెక్టుగా పిలిచేద్దాం).....అయ్యలారా! అమ్మలారా! ఇన్నాళ్ళూ రుచీ,పచీ లేని వంట తిని బాధపడుతున్నా పురుషపుంగవులారా(బెమ్మీల్లారా!..:)..)! రుచిగా వండాలని ప్రయత్నించి విఫలమవుతున్న స్త్రీ మూర్తులారా! వచ్చెయ్యండి! మా ఈ బ్లాగు పాఠశాల్లో, "పాకవేదం" ఆభ్యసించి, చప్పబడ్డ మీ జిహ్వలకి కూసింత ఊరటనివ్వండి....
ఇక్కడ అందర్లా, "కావల్సిన పదార్థాలు" అని ఓ లిస్టు చెప్పి, తర్వాత "తయారు చేయు విధానం" అని, వాటన్నిటినీ కిందా మీదా పడేసి,కలేసి కుర్మా చెయ్యటంలా చెప్పటం జరగదు......"నేను అక్కడ రెసిపీలోలానే చేశాను, కాని మా అమ్మ చేసిన రుచో లేకపోతే ఫలానా వోటేలోడి కమ్మదనమో రావట్లేదు" అనుకున్నే వాళ్ళకి ఆ "కమ్మదనా"నికి మీరు ఫాలో అవ్వాల్సిన కిటుకులన్నీ చెప్పబడతాయన్నమాట!....ఓకే నా మరి!...ఇంకో మాట! ఇక్కడ ఎవ్వరికీ తెలియని, ఎవరూ నోట్టో పెట్టుకో అలివికాని వంటకాలు మాత్రం ఉండవన్నమాట! అదిగో! అక్కడెవరో ఊపిరి పీల్చుకుంటున్నారు..:).....అలాంటి వాళ్ళకోసమే మరి! మామూలుగా వండే పప్పులు,వీజీగా అయ్యే కూరలు కమ్మగా ఎలా వండుకోవాలో చెప్తామన్నమాట! ఓకే నా.......ఓకే!ఓకే! రేపు ఓ మాంఛి వంటకంతో కలుసుకుందామేం.....బై బై...
5:53 PM | లేబుళ్లు: పరిచయం | 6 Comments
